అవును నిజమే!  మనుషుల మెదళ్లను మరింత లోతుగా దున్నా లి

Mar 19, 2024 - 15:59
 0  1

సంఘసంస్కరణతో సామాజిక వికాసం  జరగాలంటే  ముందు మనుషులుగా మారాలి.

ఈ సమాజం మారదు అని అందరూ విమర్శించే వాళ్లే........  

అందుకే మనతోనే ప్రారంభిద్దాం రండి! కదలిరండి !

--వడ్డేపల్లి మల్లేశం.

2000 సంవత్సరాలకు పూర్వమే గౌతమ బుద్ధుడు  మనుషులందరూ సమానమేనని  నిర్దేశించే బౌద్ధ మతాన్ని స్థాపించి విస్తృత ప్రచారం  కొనసాగించినప్పటికీ  ఆ భావజాలాన్ని పునికి పుచ్చుకోకుండా నిర్లక్ష్యంతో సంఘ వ్యతిరేక శక్తులుగా ఎదుగుతున్న కారణంగా  ప్రస్తుతము సమాజం   క్రమక్రమంగా ప్రమాదంలోకి నెట్టివేయబడడాన్ని మనం గమనించవచ్చు.  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారం కరువైనది,  డబ్బు, మతం, అధికారం, కులం రాజ్యమేలుతున్న కారణంగా  అంతరాలు అసమానతలు వివక్ష దోపిడీ మరింతగా పెరిగిపోయిన  ఈ క్రమంలో  అధికారం కులం  కలవాళ్లు ఆధిపత్య ధోరణితో  సకల సంపదల మీద తమదే అధికారం అని శాసించే దుర్నీతికి ఎగబడుతున్నారు.  ఆ కారణంగానే అంతరాలు అసమానతలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి.  పర్యవసానంగా  అనేక సామాజిక రుగ్మతలు విభిన్న మనస్తత్వాలు  సమాజాన్ని నిట్టనిలువు నా చీల్చ డంతో వ్యతిరేక అనుకూల శక్తులు  రాజ్యమేలుతూ సమాజం బ్రష్టు పట్టిపోతున్నది . ఈ క్రమంలోనే అంబేద్కర్  ఓటు హక్కును సాధించిపెట్టి  "యజమానులుగా మారండి బానిస మనస్తత్వం నుండి బయటపడాలి" అని నిర్దేశించినప్పటికీ  ప్రజలు ఓటర్లు ఇంకా మారడం లేదు పైగా  అనుచరులుగా  భజనపరులుగా మిగిలిపోతున్నారు అనేది మనలను ఆందోళనకు గురి చేస్తున్న సమస్య . నలుగురు కలిసిన ప్రతిచోట ఈ సమాజం మారదు, మంచి మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ ఆచరించేది ఎవరు అని విమర్శించడమే కానీ  ఆ పని మనతోనే ప్రారంభిద్దాం అనే సోయి లేకపోవడం  మన బాధ్యథా రాహిత్యం,  గర్వం ,అహంకారం,  విశాల దృక్పథం లేకపోవడం కాదా!  "సమాజంలో ఎదిగిన వాళ్ల చరిత్రను అధ్యయనం చేయాల్సిందే కానీ అదే సందర్భంలో మనకంటూ ఒక చరిత్రను నిర్మాణం చేసుకోవాలి "  అని హెచ్చరిక చేసిన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాటలు  ఆచరించిన నాడు  మరింత నైతికత  సామాజిక బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో  మన చరిత్రను విస్మరిస్తూ చరిత్ర హీనులుగా మిగిలిపోవడాన్ని మనకు మనమే సమీక్షించుకోకపోతే ఎలా ? ఎన్నో నైపుణ్యాలు, మరెoతో వాగ్ధాటి,  విషయ పరిజ్ఞానము, భావజాల సంపద,  సాంకేతిక పరిజ్ఞానం , చారిత్రక నేపథ్యం, విషయ విశ్లేషణ వంటి అపూర్వ  మేధో సంపద ఉన్న వాళ్ళైనా  స్వార్థం ముసుగులో కుటుంబ బంధాలకు పరిమితమై సామాజిక చింతనకు దూరమై  ఎదుగుదలకు వ్యక్తిగత విలువను ఆపాదించి  ఈ సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టుతున్నది నిజం కాదా?  ప్రశ్నించేవాళ్లు, ప్రతిఘటించేవాళ్లు, ఆలోచించేవాళ్లు, ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు  కొద్దిమంది ఉంటే.... ఆ ఎదుగుతున్న సమాజాన్ని  మరింత సంక్షోభంలోకి గంద రగోళంలోకి నెట్టే కులము, మతము, భాషా, ప్రాంతము, స్వార్ధము , అనైతికత కారణంగా  ఈ సమాజం మనకు ఒక గందరగోళంగా కనిపిస్తున్నది. అందుకే కాబోలు ఈ సమాజం మారదు ఈ దేశం మారదు అని ఒక నిర్ణయానికి వస్తున్నాము .
  
      మనుషుల మెదళ్లను  మరింత లోతుగా  దున్నాలి:-

  విప్లవకారులు,  సామాజికవేత్తలు,  మార్క్సిస్టులు,  చివరికి  మానవతా కోణంలో ఆలోచించేవాళ్లు  కోరేది ఒక్కటే అసమానతలు అంతరాలు లేని వ్యవస్థ,  సంపద కేంద్రీకృతం కాకూడదు,  పెట్టుబడి దారి విధానం రాజ్యమేలకుండా దేశంలో ఉన్న సంపద ప్రజలందరికీ చెందాలి అని.  ఇదే విషయాన్ని స్వామి వివేకానంద ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ " సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం  మరోచోట సంపద లేకపోవడం వంటి  పరిస్థితులను ప్రస్తావించి  ఈ దేశంలో మనుషులే కాదు  జీవరాషితో  సహా కుక్క కూడా కనీసం ఉపవాసం ఉండి ఆకలితో మాడిపోవడానికి వీలు లేదు" అని శాసించనంత గా  ఆశించినాడు అంటే  ఆ తప్పులను చేస్తూ  సమాజ వికృత పోకడలకు కారణమవుతున్న వాళ్ళం మనలో ఉంటే సిగ్గుతో తలవంచుకోవాలి.  మన ప్రవర్తనను  మార్చుకోవాలి,  తప్పులను అంగీకరించి,  సంఘసంస్కరణ వైపుగా ప్రక్షాళన కొనసాగించాలి.  ఇదే సందర్భాన్ని ప్రస్తావించి సామాజిక రుగ్మతలను రూపుమాపే క్రమంలో
ప్రముఖ అంబేద్కరిస్టు సామాజికవేత్త  కత్తి పద్మారావు గారు చేసిన ఒక సూచన , పిలుపు, లేదా హెచ్చరిక  ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పరిస్థితులను మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆశించడంలో తప్పులేదు. " ఈ క్లిష్ట పరిస్థితులలో  సామాజిక పరివర్తనను సాధించి మరింత ఉన్నతమైన సమాజాన్ని నెలకొల్పు కోవడం కోసం  భూములతో పాటు  మనుషుల మెదళ్లను  మరింతగా దున్నాలి* అని  దశాబ్దం క్రితమే ఇచ్చిన పిలుపు  మానవ సంస్కరణను , సంఘ సంస్కరణను,  సామాజిక పరిణతిని,  విలువలు ఆచరణ పట్ల రావలసినటువంటి ఆకాంక్షలను  తెలియచేస్తున్నది.
_ తోటి మనిషిని సాటి మనిషిగా చూడని కారణంగా  అసూయ ద్వేషాలు అంతరాలు పెరిగిపోతున్నాయి  ఈ అవలక్షణాలన్నిటిని  కూకటి వేళ్ళతో పెకిలించాలి.
-- ఎదుగుదల అంటే తన కుటుంబం, తన ఆస్తిపాస్తులు,  తన సంసారంలోని సభ్యులందరూ ఆర్థికంగా  సంపాదించగలిగితే చాలు అనుకునే మూర్ఖపు ఆలోచనల నుండి బయటపడి  ఎదుగుదల అంటే తమ చదువు కోసం ప్రజాధనాన్ని ప్రభుత్వం ఉపయోగించిన దానికి ప్రతిఫలంగా సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత అని గుర్తించేలా చేయాలి .
-- కుల మతాల కుళ్ళు తో  సాంకేతిక పరిజ్ఞానాన్ని, హేతుబద్ధతను ,  సామాజిక చింతనను, తాత్విక పరిజ్ఞానాన్ని  చీకట్లోకి నెట్టే  దుర్మార్గపు చర్యలకు కళ్లెం వేయాలి.  అలాంటి వ్యక్తులను, శక్తులను,   సామాజిక వ్యతిరేక భావజాలాన్ని  ఎక్కడికక్కడ ప్రతిఘ టించే విధంగా  చైతన్యాన్ని నింపాలి  విస్తృత ప్రచారం కొనసాగించాలి.
--  వాస్తవాలను  మాట్లాడడానికి, ప్రశ్నించడానికి, ఎత్తిచూపడానికి, ప్రతిఘటించడానికి, నిలదీయడానికి,  తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించడానికి  చాలామంది వెనుకాడుతూ  మొహమాటo ముసుగులో స్వార్థ ప్రయోజనాల కోసం,  మెప్పు కోసం  రాజీ పడితే సమాజానికి తీరని ద్రోహం జరుగుతుంది . అలాంటి వాళ్ళు తమను మార్చుకోవాలి లేకుంటే  ప్రజా చైతన్యమే మార్చాలి.
---  కుటుంబ బంధాలు బలంగా ఉన్న భారతదేశంలో  ఆర్థిక వ్యవస్థ కొంత పటిష్టంగా  ఉండడానికి అదే కారణం అని  పొదుపు చర్యలు సామాజిక సంబంధాలు  క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని నమ్మినప్పటికీ  మానవ సంబంధాలను విచ్చినం చేసే  మార్కెట్ మాయాజాలo ,పబ్బులు, ఈవెంట్లు, మద్యం మత్తు పదార్థాల  దుర్వి నియోగం కారణంగా మనుషులు రాక్షసులుగా మారి  తమ బాధ్యత నుండి తప్పుకుంటున్నారు.  కర్తవ్యాన్ని విస్మరిస్తూ  ప్రజా కంటకులుగా మారుతున్నారు. ఇది నిజంగా కావాలని మనకు మనం చేసుకుంటున్న అపరాధం కాదా?  ఈ నేరాన్ని ఈ అపశృతిని తప్పించడానికి ప్రభుత్వం పూనుకోకపోవడం నిజంగా బాధ్యతారాహిత్యంమే కదా !

దుష్టశక్తులను అణచివేయాలి"-

హేతుబద్ధత శాస్త్రీయత  కార్యకారణ సంబంధం పైన  సోషల్ మీడియాలో కొన్ని విషయాలను ప్రస్తావించినప్పుడు  వాటిని అడ్డుకోవాలని ,ఆ భావజాలాన్ని అవమానించాలని ,శాస్త్రీయత పెరగకుండా చూడాలని కరుడుగట్టినటువంటి మూర్ఖపు ఆలోచన కలిగిన వాళ్లు  ప్రతిఘటించడం  అవమానించడంతోపాటు  వ్యక్తులపైన  పరోక్ష దాడికి పాల్పడినంతగా  హెచ్చరికలు చేయడం  కూడా సామాజిక ఉన్నతికి పెద్ద అవరోధం. ముందు దీనిని పరిష్కరించాలి , సామూహికంగా సమాజ చైతన్యంతో ఉక్కు పాదంతో అణచివేయాలి.  ఈ విషయంలో అవకాశవాద ప్రభుత్వాలు ఏ రకంగానూ మనకు సహకరించవు కానీ అభ్యుదయ భావజాలంతో  సమాజాన్ని మరింత ఉన్నత స్థితికి నడిపించాలని కోరుకునే మనమే మన ప్రవర్తనను మార్చుకొని మనల మనం ప్రక్షాళన చేసుకుని మానవతా విలువలను  ప్రతిష్టించే క్రమంలోపల  కృషి చేయవలసి ఉంటుంది.  విద్యా వo తులు మాత్రమే ఈ పని చేస్తారని  ఈ దేశంలో నమ్మకం లేదు.  కార్మిక కర్షక లోకాలలో  ఎంతోమంది హక్కుల రక్షణ కోసం త మ జీవితాలను పణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు,  అట్లాగే కొంతమంది మేధావులు బుద్ధి జీవులు చరిత్రకారులు సామాజికవేత్తలు  తమ జీవితాలను ప్రజల కోసమే వెచ్చించిన వాళ్ళు ఉన్నారు.  కానీ విద్యావంతుల ముసుగులో  ఈ సమాజానికి ద్రోహం చేస్తున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా  మనం ఆశించిన స్థాయిలో మార్పును ,పరిణామాన్ని , సామాజిక ప్రతిఫలాన్ని  అందుకోవడం లేదు.  "అందుకోసమే మనుషుల మెదళ్లను నిరంతరం దున్నాలి " మరింతగా లోతుగా దున్నితే  భూమి గుల్ల భారీ  నీరు ఎరువులు పుష్కలంగా లభించి  మొక్కకు స్థాన బలాన్ని సమకూర్చి  పంటలు భారీగా పడినట్టు  మనుషుల మెదళ్లను కూడా  నిరంతరము  చర్చిస్తూ, ప్రతిఘటిస్తూ,  ఆలోచింపచేస్తూ దునినట్లయితే  తన తప్పును తాను తెలుసుకునే అవకాశం  సమాజ ఉద్ధరణకు ఒక కార్యకర్తగా ఎదిగే సందర్భం  ఉంటుంది అనే ఆశ ఆకాంక్ష  కత్తి పద్మారావు గారి  పిలుపు ద్వారా సాధించవచ్చునేమో!  కష్టపడకుండా,  ఆలోచించకుండా,  ఆచరణకు పూనుకోకుండా  పొడి మాటలతో  ఇతరుల మీద నెట్టే ప్రయత్నం  చాలా మూర్ఖత్వం.  ఆశావాదులుగా సమాజం ఉన్నతికి పాటుపడుదాం రండి కదలిరండి!  స్వార్థాన్ని వదిలి, లక్ష్యాన్ని  భుజానికి ఎత్తుకొని  అభ్యుదయ వాదులు కొంతమంది అయినా ఆలోచించకపోతే ఎలా ?
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రక్షితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333