పొగాకుపై యుద్ధాన్ని ముమ్మరం చేయాలి.*
డబ్ల్యూహెచ్వో ప్రకటనను ప్రపంచ దేశాలు ఆచరిస్తేనే కోట్లాది మృత్యువాతను ఆపగలం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం మొక్కుబడి కాకూడదు . ప్రమాదమని
తెలిసి అలవాటు మానకపోవడం మూర్ఖత్వంకాదా?
**********************************----
---వడ్డేపల్లి మల్లేశం 90142 06412
---10...09....2025*****************
అనారోగ్యానికి హేతువు అని తెలిసినా పొగాకుతో తయారై న చుట్టలు బీడీలు సిగరెట్ల తో పాటు ఇతర నమిలి మింగే పదార్థాలను వినియోగించడం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అంతే స్థాయిలో మృత్యువాత పడే సంఖ్య కూడా భారీగా పెరగడాన్ని ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఆలోచించకపోతే విషపరిణామాలను భవిష్యత్తులో అనుభవించక తప్పదు. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకు పైగా ప్రజలు పొగాకు వల్ల మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తుంది ఇది చాలా భయంకరమైనటువంటి మానవ వనరులకు నష్టం జరిగే ప్రక్రియ. కేవలం ఒక దేశానికి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనది కాకపోయినప్పటికీ ఆయా దేశాలలోని ప్రజల యొక్క చైతన్యం, వినియోగం పట్ల వ్యతిరేకత, పాలకుల యొక్క ప్రజా దృక్పథం పైన ఈ వ్యతిరేక ఫలితాలు ఆధారపడి ఉంటాయి. పొగాకు వలన జరుగుతున్నటువంటి అనర్ధాలను విష ఫలితాలను ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి సాధ్యమైనంత వరకు ప్రజలను ఆ వైపు నుండి మరల్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరం మే 31వ తేదీన అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం 1988నుండీ జరుగుతున్నది. అయినప్పటికీ ఇది కేవలం మొక్కుబడిగా మాత్రమే నిర్వహించుకోవడం వల్ల ఫలితాలు ఆశాజనకంగా లేవు.
బీడీలు చుట్టలు సిగరెట్ల తయారీ కర్మాగారాలలో కోట్లాదిమంది పనిచేస్తున్న కార్మికుల యొక్క ఉపాధిగా దీనిని చూడడం వల్ల ఇది సామాజిక సమస్యగా కాకుండా బతుకుదె రువు సమస్యగా మారిపోతున్నది .ఈ అవగాహన నుండి బయట పడ్డప్పుడు మాత్రమే పొగాకు విష ప్రయోగానికి బలికాకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. పొగాకు పంట పైన ఆధారపడినటువంటి లక్షలాది ప్రజలు వ్యవసాయదారులు తమ బతుకుదె రువుగా కాకుండా ఇది ప్రజలకు చేస్తున్న ద్రో హంగా ఆలోచించినప్పుడు మాత్రమే దీని నుండి విముక్తి లభిస్తుంది. మొత్తం మీద పాలకులు కూడా పొగాకు పంట యొక్క సాగును వినియోగాన్ని ఇతర ఉత్పత్తు లను నిర్దాక్షిణ్యంగా రద్దు చేసినప్పుడు మాత్రమే ఫలితాలను ఊహించిన దానికంటే మెరుగుగా మనం చూడగలము. ఇతర పంటలవైపు రైతుల దృష్టి సారించడం వారికి ఆర్థిక భరోసా కల్పించడం కూడా ముఖ్యమే. ఈ పొగాకు ఉత్పత్తుల కారణంగా చిన్న వయసు నుండి మధ్య వయస్సు వృద్ధుల వరకు ఎంతో మంది యువత కూడా కుటుంబాలకు దూరమై అనేక సంసారాలు వీధిన పడుతుంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం నిజంగా విచారకరం. ఇటీవల కాలంలో కొన్ని దేశాలలో అవినీతి, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యల పైన ప్రజలు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాలను నిర్వహిస్తున్న విషయాన్ని గమనించినప్పుడు భారతదేశంతో సహా ప్రపంచంలోని పొగాకు ఉత్పత్తి వాడకము అమలవుతున్న దేశాలలో కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు వెల్లువేత్త వలసిన అవసరం ఉన్నది.
డబ్లు హెచ్ ఓ కృషి మొక్కుబడి కాకూడదు
****************************************
1988 నుండి డబ్లు హెచ్ ఓ పొగాకు వ్యతిరేక ది నాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నప్పటికీ దాని సాగు, వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్నదే కానీ తగ్గిన దాఖలాలు లేవు. కారణంగా కోట్లాదిమంది అలవాటు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దుస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాల మధ్యన అంగీకారాన్ని అమలు చేయడం ద్వారా ఆయా దేశాలలో నిబద్ధతను సాధించడానికి పొగాకును రద్దు చేయడానికి అవకాశం ఉంటుందని చేసిన ప్రయత్నంలో భాగంగా డబ్ల్యూహెచ్ఓ" ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్" అంశం పైన ఒప్పందము కుదిరినట్లుగా తెలుస్తున్నది. పాలకుల నిబద్ధత, డబ్ల్యూహెచ్ఓ ఒత్తిడి, ఆయా దేశాలలోని ప్రజల నిరసనలు వ్యతిరేకత ఏదైతేనేమి పొగాకు వినియోగాన్ని భారీగా తగ్గించడానికి జరుగుతున్న కృషిని మనం ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉన్నది. 2007లో ప్రారంభమైనటువంటి ఈ ఈ ఒప్పందం మేరకు 2024 మధ్యన ప్రపంచంలోని దేశాలు ఏరకంగా చర్యలు తీసుకున్నది నియంత్రణకు ఆసక్తి కనపరిచిన విషయాన్ని కొన్ని గణాంకాల ద్వారా పరిశీలించవలసిన అవసరం ఉన్నది.
డబ్ల్యూహెచ్ఓ రిపోర్టు ఆన్ గ్లోబల్ టొబాకో ఎపిడే మిక్ 2025 ప్రకారంగా ఈ ఒప్పందం ప్రారంభమైన 2007లో 120 కోట్ల జనాభా కల 44 దేశాలు పొగాకు నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంటే ప్రతి ఏటా ఈ చర్యలు తీసుకున్న దేశాల సంఖ్య జనాభా పెరుగుతూ పెరుగుతూ 2024లో 610 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం కలిగి ఉన్న 155 దేశాలు పొగాకు నియంత్రణకు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. "ఒకవైపు పొగాకు కారణంగా చనిపోతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ డబ్ల్యూహెచ్ఓ నియమ నిబంధనల మేరకు ఆయా ప్రపంచ దేశాల యొక్క కృషిని కూడా మనం కొంత స్వాగతించవలసిన అవసరం ఉన్నది. ఈ కృషిని మరింత ముమ్మరం చేసినప్పుడు మాత్రమే మృత్యువాత పడుతున్న సంఖ్యను ఘనంగా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఆయా దేశాల యొక్క వ్యవసాయ పాలసీ నిబంధనలను మార్చడంతో పాటు పొగాకు ఉత్పత్తుల పైన ఆధారపడినటువంటి ప్రజల జీవనశైలిలో మార్పులు తీసుకురావడానికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కృషి చేసినప్పుడు మాత్రమే ఈ దుస్థితి నుండి ప్రపంచ దేశాలు బయటపడడానికి కోట్లాదిమంది దుర్బర అనారోగ్య పరిస్థితులు మృత్యువాత నుండి విముక్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా టీబి క్యాన్సర్ ఇతర అనేక భయంకరమైనటువంటి రోగాల బారిన పడుతున్న వాళ్లతో పాటు ఏకాయకి మృత్యు ఒడిలోకి చేరుతున్న వాళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ ఉంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం సాధించిన దానికి ఫలితం ఏమున్నది? రోగాలు కనిపెడుతున్నాం ఆ రోగాలకు తగిన స్థాయిలో ఔషధాలు ఇతర పరికరాలు కనిపెడుతున్నాము కానీ మనిషిని మృత్యు ఒడిలోకి చేరువ కాకుండా కాపాడగలిగే కొన్ని కీలకమైన నిర్ణయాలు లేదా చర్యలను అమలు చేయడంలో వెనుకబడిపోవడం, అశ్రద్ధ చేయడం, ప్రైవేట్ రంగంలో, లాభాపేక్షతో ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు వంత పాడుతున్న కారణంగా కూడా ఈ దుస్థితి నుండి మనం గట్టె క్కలేకపోతున్నట్లుగా గ్రహించినప్పుడు మాత్రమే పొగాకు మహమ్మారి నుండి మన మనల మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది". ఇది బతుకుదెరువు సమస్య కాదు సామాజిక ఆరోగ్య కుటుంబ సంరక్షణకు సంబంధించిన అంశంగా భావించినప్పుడు మాత్రమే పరిష్కారం లభిస్తుంది.వినియోగదారులు తమ పట్ల శ్రద్ద చూపకుంటే కూడా ఫలితం 0 అని తేలుసుకోవడం అవసరం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )