సమాజం నుండి వ్యక్తులను వేరు చేసే ధోరణిని ఖండించాలి.

Sep 17, 2025 - 08:21
 0  9

ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం, స్వార్థ చింతనకు పరిమితం చేయడమే ఈ కుట్రలోని అంతరార్థం.* వ్యక్తి సామా0జిక చింతనకు దూరమైతే సమాజం నిట్ట నిలువునా చీలిపోతుంది.*

***********-********************---***--*

--01....03....2025********-**-*---********

అంతరాలు అసమానతలు వివక్షత లేని సమాజాన్ని ఆశిస్తున్న తరుణంలో ఆ లక్ష్యానికి భిన్నమైనటువంటి పరిస్థితులు సమాజంలో చోటు చేసుకున్నప్పుడు కొంతమంది కావాలని స్వార్థపూరితంగా ఆలోచించి వ్యవస్థను బ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దానిని ప్రణాళిక బద్ధంగా అడ్డుకోకపోతే దుష్ పరిణామాలు సమాజంలో చోటు చేసుకుంటాయి. ఐదారు దశాబ్దాలకు పూర్వం మనిషి యొక్క ఆలోచన ధోరణి, జీవన విధానము, ఆహార పద్ధతులు, వ్యవసాయ సాగు లోని మెలకువలను గమనించినప్పుడు ప్రకృతి ధర్మానికి అనుకూలంగా సామాజిక చింతనతో ఊరు వాడ కష్ట సుఖాలు కన్నీళ్లలో కూడా కలిసి జీవించిన సందర్భాలను గమనిస్తే ప్రస్తుత జీవన గమనంతో పోల్చుకున్నప్పుడు మన లోపాలను స్పష్టంగా గుర్తించవచ్చు. సమాజం నుండి వ్యక్తిని వేరు చేసే ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతున్న విషయాన్ని గనుక మనం అర్థం చేసుకుంటే మనము అనే భావన నుండి నేను అనే వ్యక్తిగత స్వార్థ చింతన వైపు మనిషిని పయనింపజేసే కుట్ర ఈ దుస్థితికి కారణం అవుతున్నది. "నీవు బాగా చదువుకుంటే కలెక్టర్ అవుతావు, పెద్ద భవనాన్ని నిర్మించుకుంటావు, పట్టణాలలో జీవించవచ్చు, నీకు మంచి సంబంధం దొరుకుతుంది,కోట రూపాయల కట్నం వస్తుంది, ఎవరితో సంబంధం లేకుండా హాయిగా జీవించవచ్చు, గ్రామాలలో జీవిస్తే అందరితో కలిసిపోవడం ఇక్కడి వాతావరణంకి మాత్రమే పరిమితమౌ తావు" అంటూ వ్యక్తిని సమాజం నుండి వేరు చేసే వ్యక్తులు కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించనటువంటి ఆ పిల్లలు లేదా యువత తోడుగా వాళ్ల తల్లిదండ్రులు కూడా చదువు ర్యాంకులు మార్కులు, జీవితమంతా చదు వే అనే భ్రమలోకి వెళ్లిపోవడంతో పాటు తల్లిదండ్రులు బలవంతం చేసి వాళ్లను సుదూరంగా ఉంచే ప్రయత్నం చేయడం కూడా చివరికి అనుబంధానికి నోచుకోనటువంటి పరిస్థితి ఏర్పడడం కూడా విషపరిణామంగా భావించవచ్చు. తల్లిదండ్రి అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు అయినటువంటి అమ్మ తాతల తోని కనీస సంబంధమే గగనమైనప్పుడు ఇక మిగతా సమాజంతోని సంబంధం ఎలా సాధ్యమవుతుంది? వ్యక్తి ఎదగడానికి చదువు అవసరమే కానీ చదువు కోసం ప్రజలను వ్యక్తులను దూరం చేసుకోవడం ఒక దౌర్భాగ్యకరమైనటువంటి నూతన పోకడగా మనం గుర్తించకపోతే రాబోయే తరాలు మరింత ఒంటరితనంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. సంఘజీవనం అనేది లేని పరిస్థితి ఏర్పడితే ఆ ప్రమాదాన్ని ఊహించలేము.

   సంఘ జీవితం ఆత్మస్థైర్యాన్ని సామాజిక చింతనను ప్రోత్సహిస్తుంది :-

***---------****-------****************

"మనిషి సంఘజీవి అని ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ అంటాడు అంటే సంఘానికి భిన్నంగా ఒంటరిగా జీవించడానికి అసలు ఆస్కారమే లేదు. కానీ ఆ సాంఘిక తత్వాన్ని ధిక్కరించి వ్యక్తులలోని బలహీనతను ఆసరాగా చేసుకుని కొంతమంది సంఘo నుండి దూరంగా పారిపోయేలా చేయడం తగదు. అది సామాజిక బాధ్యతను నిరాకరించడమే అవుతుంది. సంఘ భావనను కలిగి ఉంటే ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యం బలపడుతుంది.అంతే కాదు సమాజం యొక్క మద్దతు కూడా లభిస్తుంది. ఒంటరితనానికి గురైనటువంటి వాళ్ళు మానసికంగా కూడా ఆందోళన గురయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ సమాజంలో కలిసిపోతే ఆనందంగా ఉల్లాసంగా ఉండడానికి సామాజిక చింతనను ప్రతిభావంతంగా ఆచరించ డానికి ఆస్కారం ఉంటుంది. ఆ సామాజిక చింతన సామాజిక మార్పుకు సమ సమాజ నిర్మాణానికి జరిగే కృషికి దోహదపడుతుంది అనడంలో సందేహం లేదు."

" వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం" అని ప్రముఖ విప్లవ రచయిత శ్రీ శ్రీ అంటాడు. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశం పట్ల స్పందించడం చర్చించడం కలిసి పోవడం దానికి పరిష్కారాలను వెతికే క్రమంలో మనిషి సంఘజీవిగా రూపుదిద్దుకోవాల్సిందే అని దీని అర్థం కూడా. అందుకే పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అనె అధికారం లేదా అర్హత ప్రజలకు ఎట్లా వచ్చింది అంటే ప్రతి వ్యక్తి సంఘజీవిగా ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది.ఆ బాధ్యతల్లో విఫలమైనప్పుడు ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల వ్యక్తులు గాని ఎవరినైనా ప్రజలు ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది అని దీని అర్థం. 

    సామాజిక చింతన చిన్ననాటి నుండి అలవాటు చేయాలి :-

********************

ప్రతి మనిషి కూడా శిక్షణ పొందేది కుటుంబం పాఠశాల సమాజం మూడు చోట్ల నిర్వహించబడే అనేక కార్యకలాపాలతో పాటు తమ తమ సహచరులు లేదా సమవయస్కుల ద్వారా కూడా నిరంతరం ఏదో ఒక రకమైన అభ్యసనం కొనసాగుతూనే ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ కాలానుగుణంగా కూడా తన అవగాహనలో పరిపక్వత చోటు చేసుకుంటుంది. ఈ అన్ని రకాల పరిణామాలను పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇంటి దగ్గర తల్లిదండ్రులు గమనిస్తూ ఉన్నప్పుడు వారిని సక్రమ మార్గంలో తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఆ నిఘా గనక లో పిస్తే కొంతమంది సంఘవిద్రోహశక్తుల శక్తి పెరిగితే దాని విష పరిణామాలుగా ఈనాడు మనం ఎన్నో అనుభవాలను చవిచూస్తున్నాం. మద్యం మత్తుకు ఇతర మత్తు పదార్థాలకు డ్రగ్స్ కు బానిసలైపోయి తమ బాధ్యతలను విస్మరించి తల్లిదండ్రులను కూడా నిరాకరించి చివరికి కుటుంబాలతోని సంబంధాలు కూడా తెగ తెoపులు చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి కొందరు జారుకుంటున్నారు. తద్వారా తమ సామాజిక బాధ్యత నిర్వహించలేక పోవడమే కాకుండా దేశ ఉత్పత్తిలో, ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతం చేసే క్రమంలో తన పాత్ర లేకపోవడం కూడా క్రమంగా ప్రజాస్వామ్యం విచ్ఛిన్నం కావడానికి సమాజం నిట్టనిలువు నా చీ లిపోవడానికి కారణాలు. 

     ఈ పె డ దొరణులను మనం సమాజంలో చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరముంది. అందుకే ప్రముఖ అంబేద్క రిస్ట్ కత్తి పద్మారావు గారు " ఇవాళ దున్నాల్సింది భూములను మాత్రమే కాదు మూర్ఖపు ఆలోచనలతో సంఘవిద్ర శక్తులుగా మారుతూ సంఘము నుండి దూరంగా వెలివే యబడ్డ ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తుల మెదళ్లను కూడా" అని హెచ్చరించిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. "మార్క్స్ అన్నట్లుగా మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే అనే నాటి వాస్తవాన్ని మారుతున్న కాలగమనంలో మన ఆలోచన సరళితో సామాజిక చింతను బలోపేతం చేయడం ద్వారా కొంతవరకైనా నేటి సమాజానికి అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మానవీయ కోణంలో ఆలోచించడం, మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కృషిని కొనసాగించడం ద్వారా మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదు మానవీయ కోణంలో ఆలోచించగలిగే సమాజం గురించి పట్టించుకునే నూతన విలువలతో కూడు కున్నటువంటి సంబంధాలుగా పునర్ నిర్వచించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రతి పనికి డబ్బుతో ముడి పెట్టడం, తోటి మనిషిని సాటి మనిషిగా చూడకపోవడం, కష్టసుఖాలలో అవసరాలలో మానవతా దృక్పథాన్ని కాకుండా డబ్బుని ప్రధానంగా చేసుకోవడం వంటి లక్షణాలను కూడా ఈ సమాజం నుండి వెలివేయవలసినటువంటి అవసరం చాలా ఉన్నది ."ఇప్పటికే సమాజం ఆ వైపుగా పరిణామ0 చెందుతున్న నేపథ్యంలో నేటి విద్యార్థులు యువతలో ముఖ్యంగా ఈ సామాజిక చింతనను పెంచడం ద్వారా మానవీయ ఆలోచనలను పంచడం ద్వారా ఒక సమున్నతమైనటువంటి సమాజాన్ని, అంతరాలు వివక్షత లేనటువంటి ఉన్నత విలువలతో కూడుకున్నటువంటి స్థాయికి చేరుకోవడానికి అందరం పూనుకోవాలి.రాజకీయ పార్టీల యొక్క దుందుడు కు చర్యలు, పెట్టుబడిదారీ కార్పొరేట్ వ్యవస్థ యొక్క కుట్రలు కుతంత్రాలు అవినీతిని ఎండగట్టే క్రమంలో కూడా సామాన్య జనం ఒక్కటి కావలసినటువంటి అవసరం చాలా ఉన్నది.ఆ రకంగా నైనా సమాజాన్ని చీలిపోకుండా చూసుకోవలసిన బాధ్యత మన అందరి పైన ఉన్నది. " ముఖ్యంగా పాలకులు ఎప్పుడూ కూడా ప్రజలను వేరు చేయడానికి ప్రయత్నిస్తారు కానీ బుద్ధి జీవులు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు సమాజాన్ని ఒక కట్టెల మోపుగా బంధించి ఐక్యతను చాటుకోవాల్సినటువంటి అవసరముంది. సంఘము నుండి కొంతమంది మనుషులను దూరం చేయడం ద్వారా విచ్ఛిన్నం చేసే కుట్రలను చే దించడం మనందరి కర్తవ్యం. ఆ వైపుగా దృష్టి సాధిద్దాం."

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333