పరాజి తుని గాథ చర్చనీయాంశం అయితే సమర్థుడు అనుకోవడం మూర్ఖత్వమే
పరాజి తుని గాథ చర్చనీయాంశం అయితే సమర్థుడు అనుకోవడం మూర్ఖత్వమే
శిథిలాలను తవ్వకుండా పునాది నిర్మించ లేనట్లే దుష్ట చరిత్రను వల్లించకుండా భవిష్యత్తును నిర్మించలేము.
మేధావులు గుడ్డిగా సమర్థిoచడాన్నీ ఖండించాలి.
---వడ్డేపల్లి మల్లేశం
అబద్దాలను నిరంతరం వల్లె వేస్తే నిజమైనట్లు నిజాలను తొక్కి పెడితే అబద్దాలుగా మారినట్లు మనం అనేక సంఘటనలు సందర్భాలలో చూసి ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి సందీ కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు గడిచిన ప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వము, పాలసీ, అధినేత , నిందలు బెదిరింపులు ఆరోపణల పైననే చర్చ జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మేధావులు మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశం కావలసినదే. కానీ ఓటమిపాలై, ప్రజల ఆగ్రహానికి గురై, అధికారాన్ని కోల్పోయి, బుద్ధి జీవులు మేధావుల స్వచ్ఛంద కృషి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దశలో కూడా గత ప్రభుత్వం గురించి రోజు చర్చించడం అంటే ఎంతో కొంత సమర్థత ఉంటేనే కదా అనే వాదన ఆ మేధావులు వాదించడం అసంబద్ధమే కాదు ఏకపక్షం కూడా. ఈ వాదన ఒకరకంగా ఈ రాష్ట్రంలోని అశేష ప్రజానీకం యొక్క విశ్వాసాన్ని, నమ్మకాలను, ప్రభుత్వం పైన గల ఆకాంక్షలను దారి మళ్లించడమే అవుతుంది. ఓటమిపాలైనప్పటికీ కూడా ప్రతిరోజు ప్రతి వాళ్ళ నోళ్ళల్లో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు సమర్థులు అయితేనే కదా సమర్థత కలిగి గత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన క్రమంలో ప్రజల హృదయాలను చూడగొన్నాడు కనుకనే ప్రజలు ప్రతిపక్షాలు విమర్శకులు ఇప్పటికీ ఆ పార్టీని పార్టీ రాజకీయాలను ప్రస్తావించడం అందుకే నిదర్శనం అని చెప్పడం వాస్తవాలను పక్కదారి పట్టించడమే అవుతుంది. గత ప్రభుత్వ కాలంలో కొందరు ప్రభుత్వ అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళు, కొన్ని ఉన్నత పదవులను అనుభవించిన వాళ్లు, ప్రభుత్వ మద్దతు పొందిన వాళ్లు ఇలాంటి మాటలు అనడంలో సందేహం ఏమీ లేదు. కానీ విజ్ఞత, సమాజం పైన అవగాహన, చొరవ, విస్తృత అధ్యయనంతో కూడి గతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అనేక దఫాలుగా వివిధ స్థాయిలో పనిచేసిన వాళ్లు కూడా 10 ఏళ్లలో తెలంగాణ ఆకాంక్షలు నిజం కాలేదని అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడం టిఆర్ఎస్ పార్టీని మరింతగా సమర్థించడం విజ్ఞత అనిపించుకోదు.
ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ అయినా తన మేనిఫెస్టోను విడుదల చేయడం ద్వారా కొన్ని హామీలు ఇవ్వడం ఈ కాలంలో పరిపాటిగా మారింది. అయితే అతిగా హామీలు ఇచ్చి ఉచితాలు తాయిలాల పేరుతో ప్రజలను వమ్ము చేసే ప్రయత్నం చేయడాన్నీ మాత్రం మేధావులు సహించకూడదు. కానీ ప్రజల విశ్వాసాన్ని కూడా గౌరవించవలసిన పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును ప్రకటించడం ద్వారా ఆ ప్రభుత్వం మెడలు వంచి సేవలను పొందవలసిన అవసరం కూడా ప్రజలు, ప్రజాస్వామి కవాదులు, మేధావుల పైన ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాల పైన శ్వేత పత్రాలు విడుదల చేయడం, ఆర్థిక పరిస్థితుల పైన సభలో చర్చించి కొన్ని నిర్ణయాలకు రావడం అనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క భవిష్యత్తు నిర్ణయానికి చాలా తోడ్పడుతుంది.
ఎవరైనా గత పునాదుల మీద వర్తమానాన్ని భవిష్యత్తును నిర్మించడానికి సిద్ధపడవలసిందే అందుకు ఎలాంటి మినహాయింపు లేదు. అదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని, గతంలో జరిగిన ఆర్థిక అరాచకత్వము, అవినీతి, వివిధ రంగాలలో జరిగినటువంటి వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేయడం తప్పేమీ కాదు. తాము అధికారానికి వచ్చిన నాటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? 5 సంవత్సరాల తర్వాత తాము సాధించిన విజయాలు ఏమిటి? చెప్పదలుచుకున్నప్పుడు ఒక ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి దృక్పథం దృష్టి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తున్నది కానీ ఇప్పటికీ బీఆర్ఎస్ పట్ల వ్యామోహం ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు కొంతమంది మేధావులు రోజు చర్చ జరుగుతున్నప్పుడు టిఆర్ఎస్ పరిపాలన సమర్థవంతంగా ఉన్నట్లే కదా! సమర్థుల గురించే ప్రతిరోజు మాట్లాడుకుంటాము అని నమ్మబల్కే ప్రయత్నం చేయడం ప్రజలను అవమానించడమే .ఇక బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ముఖ్యంగా ఒకరిని మించి మరొకరు అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బెదిరించడం , శాపనార్థాలు పెట్టడం, కూలిపోతుందని కొంటె మాటలు మాట్లాడడం గతంలో ఏనాడు కూడా చూసి ఉండలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఇలాంటి దుష్ట బుద్ధి ఉన్నటువంటి ప్రతిపక్షాలను మనం ఏనాడు కూడా బహుశా చూసి ఉండడం . అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన అతి ఆశలు భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు? అంశాల వారీగా డిమాండ్లను ముందు పెట్టి, గతంలో కోల్పోయినటువంటి విషయాలను సాధించుకునే క్రమంలో, ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లడానికి ప్రస్తుత ప్రభుత్వానికి సమయం ఇవ్వవలసిన అవసరం మాత్రం ప్రతి వ్యక్తి పైన తప్పకుండా ఉన్నది.
గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు కానీ ప్రజాస్వామ్యవాదులు మేధావులు కనీసం నాలుగు సంవత్సరాల వరకు వేచి చూసిన విషయాన్ని కూడా ఈ కుహనా మేధావులు ఆలోచించకపోతే ఎలా? నాలుగు సంవత్సరాల తర్వాత కానీ గమనము గమ్యము ఒకే వైపు లేదని, ఈ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు రావడం ప్రారంభమైన విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ మొదటి దఫలో ఎట్లాగో ప్రభుత్వాన్ని గడిపి గట్టెక్కించి రెండవసారి ఎన్నికల్లో అఖిలపక్షాలతో సమావేశం నిర్వహిస్తామని, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తామని, అనేక వాగ్దానాలు చేసి కూడా తీర్చకుండానే తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగడం చివరిగా ఎన్నికల సమయ0 నాటికి కాలేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి బట్టబయలు కావడం, లక్ష కోట్ల అవినీతికి ముఖ్యమంత్రి పాల్పడ్డాడని, ఆ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు మంత్రులు భూ కబ్జాల పేరున ప్రజాధనాన్ని దోచుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడం, ఆనాటి పీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు విమర్శలు చేయడం మనందరికీ తెలిసిందే.
సమర్థుడైనప్పుడు ప్రజలు చర్చించుకోవడం ఎంత ముఖ్యమో అదే స్థాయిలో అసమర్థుడు, ద్రోహి, దుష్టపాలకుల పరిపాలనను గురించి కూడా చర్చించుకోవడం అనివార్యం అవుతుంది . అవినీతిపరుల గురించి చర్చించినంతమాత్రాన అతన్ని అందరూ సమర్చిథిo చ్చినట్లు ఎలా అవుతుందో పరిశీలించుకోవలసిన అవసరం ఉంది . భారీ ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాలను వెలికి తీస్తేనే కదా కనీసం కొనఊపిరితో ఉన్న మూగజీవులైన బయటపడేది .....అలాగే శిథిలాలను వెలికి తీస్తేనే కదా శాశ్వత మైనటువంటి పక్కా భవనాన్ని నిర్మించేది! ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నప్పుడు గతాన్ని గురించి సమీక్షించుకుంటేనే కదా భవిష్యత్తుకు దారులు వెతికేది వేసేది .
"గత ప్రభుత్వాల గురించిన చర్చ గతాన్ని తవ్వి పోసుకోవడం కోసం మాత్రమే కాదు భవిష్యత్తును నిర్మించే క్రమంలో ప్రస్తుత పాలకులకు కూడా హెచ్చరికగా పనిచేస్తుంది" అని తెలుసుకుంటే మంచిది. గతంలో పాలించిన పాలకుల యొక్క అవినీతి వికృత చేష్టల కారణంగా కొనసాగుతున్నటువంటి తనిఖీలు, దర్యాప్తు, విచారణ, అందులో వెలువడుతున్నటువంటి అధికారుల యొక్క పనితీరు ప్రస్తుత ప్రభుత్వానికి కూడా హెచ్చరికగా గుణపాఠంగా చెంపపెట్టుగా భావించవలసి ఉంటుంది. *"ప్రజలు ఒక ప్రభుత్వాన్ని విమర్శించినంతమాత్రాన ఎన్నుకున్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో నీతివంతమైనది కావలసిన అవసరం లేదు? కానీ కొంత మెరుగైన పరిస్థితులను కల్పించడానికి ప్రజలు ఆకాంక్షించి పట్టం కడతారు.
అదే సందర్భంలో భవిష్యత్తును విస్మరించి ప్రజలకు ద్రోహం చేస్తే గత పాలకులకు పట్టిన గతి మీకు పడుతుందని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా హెచ్చరిస్తారు". చరిత్ర ద్వారా నేర్చుకునే ఈ సత్యం గత ప్రభుత్వాలను పార్టీలను విమర్శించడానికి చర్చించడానికి ప్రజల నోళ్లలో నానడానికి కారణం అని తెలుసుకోవడం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాము కనుక టిఆర్ఎస్ గొప్పది అని చౌకబారు ప్రచారాలు చేసే వ్యక్తులు ఎవరైనాఅభివృద్ధిని ,అభ్యుదయాన్ని ,ప్రజాస్వామ్య విలువలను కోరుకోనట్లే. అదే సందర్భంలో స్పష్టమైన వైఖరితో మంచిని చెడును నిస్పాక్షంగా చూడగలిగి, పార్టీకి అనుబంధం కాదు ప్రజలకు అనుబంధం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తాం అనే ఆలోచన కవులు కళాకారులు రచయితలు మేధావులకు ఉండవలసిన అవసరం కూడా చాలా ఉన్నది. పార్టీలు మారినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ తరఫున మాట్లాడడానికి మాత్రమే మేధావులు సిద్ధపడితే ప్రజల చేతిలో వంచించబడతారు జాగ్రత్త! దాని పర్యవసానమే తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలను కూడా మెప్పించే క్రమంలో తమ జీవితాలను పణంగా పెట్టినటువంటి అనేకమంది బుద్ధి జీవులు మేధావులు రాజకీయ సామాజిక విశ్లేషకులు నేడు తెలంగాణ తెచ్చిన పార్టీ టిఆర్ఎస్ అనే ముసుగులో కొట్టుకుపోవడాన్ని చూస్తే
సమాజము సిగ్గుపడవలసి వస్తున్నది.
ఇది ప్రస్తుత వ్యవస్థకు మంచిది కాదు ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఏర్పాటు చేసిన సభలో కొంతమంది విప్లవకారులు మేధావులు స్పష్టమైన వైఖరిని అవలంబించి గత ప్రభుత్వాన్ని విమర్శించడంతోపాటు నేటి ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. నిజమైనటువంటి విమర్శ ఆ రకంగా ఉండాలి పాలకులు, పార్టీలు, వ్యక్తులు స్నేహమని వారి కోసం మద్దతు పలికే విధానం లోపభూయిష్టం. ఇప్పటివరకు స్పష్టమైన విధానాన్ని ప్రకటించకుండా, ఒక ప్రభుత్వాన్ని అంచనా వేయలేము అనే వాదన ఇటీవల ప్రొఫెసర్ కాసిం గారు వ్యక్తం చేయడాన్నీ ప్రభుత్వం ఒక పాఠం గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఉచితాలు గ్యారెంటీ ల పేరుతోనే తమ పరిపాలనను కొలవడానికి ప్రయత్నిస్తే అది నిజం కాదు అదే సందర్భంలో పెన్షన్లు వేతనాలు పంపిణీ చేయడం మాత్రమే పరిపాలన అనుకుంటే అంతకుమించిన ద్రోహం, మోసం, ప్రలోభం ఇంకొకటి ఉండదు. గత ప్రభుత్వం కూడా ప్రజలకు పంపిణీ చేసే ఉచిత పథకాలను చూసి తమ ప్రభుత్వం గొప్పగా సాగుతుందని చెప్పుకునేది.
"అందుకే పరిపాలన అంటే అభివృద్ధి, సంక్షేమం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి అప్పుల ఊబి నుండి బయటపడేయడం, అసమానతలు అంతరాలను తగ్గించి సమ సమాజాన్ని స్థాపించే దిశగా వ్యవస్థను కొనసాగించడం ,". ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలి టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఈ రకమైన దృష్టి లేనందుకు తన లోపాలను సమీక్షించుకుని ముందుకు వెళ్లాలి . ఈ సమదృష్టి ఉన్నప్పుడు మాత్రమే మేధావులను ప్రజలు ఆదరిస్తారు లేకుంటే ఒక పార్టీకి వత్తాసు పలికే వాళ్ళు గానే మిగిలిపోతారు జాగ్రత్త !
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)