భారత ప్రథమ సామాజిక సంస్కర్త, బహుజన సామాజిక ఉద్యమ నేత తత్వవేత్త జ్యోతిరావు పూలే.

చరిత్ర తెలుసుకుందాం జీవితాలను మలుచుకుందాం

Apr 18, 2024 - 20:13
Jun 27, 2024 - 20:49
 0  8
భారత ప్రథమ సామాజిక సంస్కర్త, బహుజన సామాజిక ఉద్యమ నేత తత్వవేత్త జ్యోతిరావు పూలే.

(-11.4.24జయంతి ప్రత్యేకవ్యాసం)

మహనీయుల  మహితోక్తులను,  జీవిత చరిత్రను, కార్యాచరణను,  సిద్ధాంత అవగాహనను, తాత్విక పునాదులను,  సంఘ సంస్కరణ అభిలాషను,  సాహిత్య సామాజిక  జీవన  స్ఫూర్తిని వారసత్వంగా తీసుకొని  సమకాలీన సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు  సమస్యలకు పరిష్కారాలను వెతకడానికి  సామాజిక అధ్యయనం పరిశీలన ప్రతి వ్యక్తికి తప్పనిసరి.  ఆ కోణంలో  చరిత్రను అధ్యయనం చేసి , మనకంటూ ఒక చరిత్రను నిర్మించి , భవిష్యత్తు తరాలకు  గత వారసత్వాలను అందించడానికి  సంధి కాలంలో పనిచేసే కార్యకర్తలుగా ప్రతి వ్యక్తి ఎదిగిన నాడు  ప్రస్తుతము కంటే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు.  గత చరిత్రలో జరిగిన ద్రోహాలు,  నేరాలు , దోపిడిని సమీక్షించుకొని  చరిత్రలో తారసపడిన మహనీయుల  ఉద్యమ శక్తి, కార్య ఆచరణను   భవిష్యత్తుకు అందించడానికి    చరిత్ర అధ్యయనం  అపారమైన శక్తిని ఇస్తుంది.

ఈ పరంపరలో  అసమాన  అంతరాల దొంతరతో కూడుకున్న వ్యవస్థ నిర్మాణానికి  కారణాలను అన్వేషించి  బహుజన దృక్పథంతో  అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారాన్ని సాధించి పెట్టడానికి తోడ్పడేది  జ్యోతిరావు పూలే సిద్ధాంత ప్రాతిపదిక . ఆనాటి సమకాలీన పరిస్థితుల్లో ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవించిన సమస్యలు,  చేసిన పోరాటాలు, ఆంగ్లయ ప్రభుత్వంతో చేసిన ప్రాతినిధ్యాలు,  సత్యశోధకు సమాజ్ ద్వారా సామాజిక చైతన్యానికి విద్యా  అభివృద్ధికి చేసిన కృషిని  వారి జయంతి వర్ధంతుల సందర్భంగానైనా   తెలుసుకోవడం  ఈ దేశ పౌరుల తక్షణ కర్తవ్యం.  మెజారిటీ ప్రజలు రాజ్యాధికారానికి దూరంగా విసిరివేయబడి  దోపిడీ పీడన వంచనకు గురవుతున్న  నాటి రోజులతో పాటు నేటి రోజుల్లో కూడా  రాజ్యాంగ పలాలు  అందని ద్రాక్షగా మిగిలిపోయిన వేల ఐక్య కార్యాచరణకు మించిన ఆయుధం మరొకటి లేదు . అందుకు పూలే జీవితాన్ని,  పూలేను తన గురువుగా  ప్రకటించుకున్న అంబేద్కర్ ఆశయాలను ,పోరాటాన్ని  నేటి పరిస్థితులకు అన్వయించుకోవడం   బహుజనుల ముందున్న  తక్షణ కర్తవ్యం .

పుట్టుక  .-- ఎదుగుదల--  ఆయనపై చూపిన ప్రభావాలు :-

కూరగాయలు అమ్మే కుటుంబంలో పుట్టినప్పటికీ కాలక్రమేనా ఫీీష్వల  పరిపాలన కాలంలో పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు ఫూలే గా  మార్పు చెందినట్లు  చరిత్ర ద్వారా తెలుస్తున్నది. .సంవత్సరంలోపే తల్లి చనిపోవడం, ఏడు సంవత్సరాల వయస్సులో పూలే మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించడానికి వెళ్లినప్పటికీ  కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మధ్యలో చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా  ఉండేవాడు. కనుక  చదువును కొనసాగించలేకపోయినప్పటికీ చదువు పట్ల ఉన్నటువంటి ఆసక్తి  కారణంగా  ప్రతిరోజు రాత్రి లాంతరు ముందు కూర్చొని   చదువుకునేవాడు.  అతని శ్రద్ధను గమనించిన ఒక ముస్లిం టీచర్ ఇంటి ప్రక్కనే ఉండే క్రైస్తవ పెద్దమనిషి జ్యోతిరావు తండ్రిని ఒప్పించి  చదువుకు పంపించే విధంగా  ప్రోత్సహించారు.

  1841లో పూణేలోని స్టాటిస్ మిషన్ నడుపుతున్న పాఠశాలలో  చేర్పించి విద్యను కొనసాగేలా చూశారు  .సమవయస్కులు పెద్దల సహచర్యంతో చిన్ననాడే ప్రాథమిక హక్కుల  సూత్రాల పైన జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా చిన్ననాటి నుండి శివాజీ అంటే అభిమానం ఎక్కువ కావడం వల్ల  శివాజీ తో పాటు జార్జ్ వాషింగ్టన్ల చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల  దేశభక్తి త్యాగశీలత అలవాటు పడడంతో పాటు థామస్ రచించిన మానవ హక్కుల పుస్తకం అతని ఆలోచనలను మరింతగా ప్రభావితం చేసినట్టు తెలుస్తుంది.
     ఆలోచించే మనస్తత్వం ఉంటే ప్రపంచాన్ని అయినా శాసించవచ్చు . అధ్యయనము పరిశీలన ప్రధాన లక్షణాలుగా ఉన్న కారణంగా అమెరికా స్వాతంత్ర పోరాటం అతన్ని ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువైన స్వేచ్ఛ, సమానత్వం,  ప్రేమ అనురాగం, నైతిక విలువల పట్ల  ఆలోచింపజేయడంతోపాటు  ఆ అనుభవాల నుండి వచ్చిన  రచనలే  గులాం గిరి, పూనే సత్యశోధక్ సమాజ్ నివేదిక,  తృతీయ రత్న, చత్రపతి శివాజీ,  బ్రాహ్మణ పంతోజి వంటి ముఖ్యమైన  రచనలు తన కలం నుండి వెలువడినవి.  13 ఏళ్ల వయసులో జ్యోతిరావు కి 9 సంవత్సరాల సావిత్రిబాయి  తో పెళ్లి అయినది  ఒక దశ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత తిరిగి తన కుటుంబ వ్యాపారమైన పూల అమ్మకాన్ని ప్రారంభించి  కొనసాగించినప్పటికీ నిరంతరం  సమాజంలో నెలకొన్న అసమానతలు అతనిని  ప్రశాంతంగా ఉండనిచ్చేవి కావు. అది  నిజమైన సామాజిక కార్యకర్తల యొక్క లక్షణం.

స్నేహితుని ఇంట అవమానంతో బ్రాహ్మణ ఆధితత్యం పై  పోరాటం:-

    1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహ సందర్భంగా  మాలి కులానికి చెందిన పూలే  కుల వివక్షత కారణంగా అవమానానికి గురైనాడు.  స్నేహం ముందు కులాలు ఓడిపోయిన  నేపథ్యంలో ఇకముందు  కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని,  బ్రాహ్మణులను వారి  ఆధిపత్యాన్ని  వ్యతిరేకిస్తూ,  ఆనాటి పరిస్థితుల్లో జ్ఞాన సంపదకు విద్యార్థులకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకించాడు.  .అంతేకాకుండా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్య ప్రజానీకాన్ని అట్టడుగు వర్గాలను ప్రోత్సహించి  అంతటితో ఊరుకోకుండా  ఆకాశంలో సగం అని పిలువబడే స్త్రీల అభివృద్ధి కోసం  కృషి చేస్తూ అందులో భాగంగా స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని  నిర్మోహమాటంగా ప్రకటించాడు.

  విద్యావంతులు కావడం వల్లనే  సమాజంలో వివక్షతను అంతం చేయవచ్చునని  ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపి  చదువు నేర్పించడం కాకుండా 1848లో  తొలిసారి పాఠశాలను ఏర్పరచి అందులో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం ద్వారా  తన నిబద్ధతను చాటుకున్నప్పటికీ  అంటరాని వారికి కూడా బోధించవలసి రావడంతో ఉపాధ్యాయులు ఎవరు ముందుకు రాకపోవడంతో తన భార్య సావిత్రి సహాయముతో పిల్లలకు పాఠాలు బోధించేలాగా  తాను కూడా కృషిచేసి  అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఉపాధ్యాయుల కొరతతో, సంఘములో వివక్షతతో  పాఠశాలను కొంతకాలము  నిర్వహించలేక మూసివేసినప్పటికీ  తనలాంటి భావజాలం కలిగిన గోవిందు  వాల్వేకర్ల సహాయంతో పాఠశాలను పున ప్రారంభించి  51- 52 లో మరో రెండు పాఠశాలలు స్థాపించడం ద్వారా  ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్య నిర్లక్ష్యం చేయడాన్ని పూలే విమర్శించసాగాడు. 
  
ఆనాటి సామాజిక  స్థితిగతులు

బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగే ఆరోజుల్లో ముసలివారికి పెళ్లి చేయడం వల్ల చిన్నతనంలోనే వితంతులయ్యేవాళ్లు  వారిని మళ్లీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించని కారణంగా  పూలే  వితంతు పునర్వివాహాలకు శ్రీకారం చుట్టి  సమాజాన్ని ఒప్పించడం ద్వారా చైతన్యం తీసుకువచ్చాడు.  అదే క్రమంలో వితంతువులకు వివాహాలు జరిపించి  వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచి  అలాంటి వాళ్లకు 1864 "బాల హత్య ప్రతిబంధక గృహ" పేరుతో  రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది  .ఈ కేంద్రంలోనే 1872లో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి పూలే దత్తత తీసుకొని  తదనంతరం 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని స్థాపించి  సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టి  శూద్రులను బ్రాహ్మణ చర నుండి కాపాడటమే ఈ ఉద్యమ లక్ష్యమని  సవాలు విసిరిన సామాజిక సంస్కర్త జ్యోతిబాపూలే.

సంఘ సంస్కరణకు సంబంధించిన కార్యాచరణ:-

తాను స్థాపించిన పాఠశాలలు,  మహిళా కేంద్రాలతో పాటు  సత్యశోధకు సమాజ్ లో కూడా కుల మత లింగ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించి  శాస్త్రీయ అవగాహనకు తోడుగా వేదాలను పవిత్రంగా భావించడాన్ని పూలే వ్యతిరేకించాడు. విగ్రహారాధనను ఖండించాడు.  సభ్యులకు ఆ అవగాహనను నేర్పించినాడు.  ఈ క్రమంలో 1891లో ప్రచురించిన" సార్వజనిత ధర్మ పుస్తక్" మత సాంఘిక విషయాల పైన పూలే అభిప్రాయాలను  స్పష్టం చేసే కరదీపికగా భావించవచ్చు  .స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షతను పూలే విమర్శించడంతోపాటు సమానత్వం ,స్వేచ్ఛ, ఐకమత్యం,  ఉద్యమ శక్తి  ప్రధానంగా  ప్రదర్శించడం ద్వారా  సమ సమాజాన్ని కాంక్షించి  1853లో వితంతు మహిళల అనాధ శిశువు ల  కోసం సేవాసదనాన్ని కూడా ప్రారంభించి  అనితర సాధ్యమని రుజువు చేసుకున్నాడు.

  సంఘసంస్కరణ విషయంలో  .1868లో తన ఇంటి దగ్గర ఉన్న స్నానాల తొట్టి వద్ద  స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అవకాశం ఇచ్చి  అస్పృశతా నివారణలో తన కార్యాచరణను ప్రకటించడమే కాదు  తోటి మనిషిని సాటి మనిషిగా చూడాలనే సందేశాన్ని  నినాద రూపంలో కాదు ఆచరణ రూపంలో అందించిన  బహుజన తత్వవేత్త పూలే  .1869 లో "పౌరోహిత్యం యొక్క బండారం" పుస్తక రచన చేయడంతో పాటు  1877లో సత్యశోధకు సమాజం తరఫున" దీనబంధు" వార పత్రిక ప్రారంభించి  తన అభిప్రాయాలు సిద్ధాంతాలు మౌలిక అంశాలను పత్రిక ద్వారా ప్రజలకు అందించే ప్రయత్నం చేశాడు . ఈ క్రమంలోనే 1880లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు లోకండేతో కలిసి  రైతులను కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించి  కొనసాగింపుగా 1873లో  నాటి బానిస  జీవితాల పైన "గులాం గిరి" అనే పుస్తకాన్ని ప్రచురించి  చరిత్రకెక్కిన చరిత్రకారుడు .

 సాహిత్య సాంస్కృతిక రంగాలలో మరింత కృషి

   గులా0గిరి పుస్తకంలో బ్రాహ్మణ అమానుష సూత్రాలను ,శూద్రులు అతిశూద్రులపై బ్రాహ్మణుల  ఆధిపత్య నిరంకుశ  వైఖరిని పూలే  ప్రయోగాత్మకంగా పరిశీలించి  పరిష్కారంగా సహపంక్తి భోజనాలకు సంసిద్ధతను ప్రకటించి    కార్యశీలిగా నిలిచాడు  .1883లో "సేద్యగాడి చర్నాకోల" పుస్తక రచన పూర్తి చేసి 
బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించి  అదే క్రమంలో 1885లో "సత్య సారాంశం"  ప్రచురించడంతోపాటు  అదే సందర్భంలో రాసిన "వార్నింగ్"  (హెచ్చరిక()  కరదీపికలో ప్రార్థన సమాజము బ్రహ్మ సమాజము తదితర బ్రాహ్మణీయ సంస్థల మీద  తన విమర్శలను ఎక్కువ పెడుతూ  తీవ్రమైన ప్రతిపాదనలు చేయడం జరిగింది.  ఇక 1891లో రచించిన "సార్వజనిక్ సత్య ధర్మ" పుస్తకము  మరణానంతరము ప్రచురించబడినప్పటికీ  ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థ  దుర్మార్గ స్వభావాన్ని  దుయ్యబట్టిన తీరు  నాటి దుస్థితిని తెలియజేస్తుందని అనేకమంది  బహుజన రచయితలు మేధావులు  చేసిన ప్రకటన లేదా హెచ్చరిక నేటి సమాజానికి చాలా తోడ్పడుతుంది. అందుకే వారి  రచనలను ఆశాంతము చదివితే కానీ  నేటి సమాజాన్ని అర్థం చేసుకోలేము .సమాధానాలను వెతుక్కోలేము  .వివిధ రంగాలలో చేసిన కృషికి గాను మహారాష్ట్రకు చెందిన సామాజికవేత్త "vittalrao కృష్ణాజి" ఫూలేకు గౌరవప్రదంగా "మహాత్మా"బిరుదును ప్రధానం చేసినట్లు తెలుస్తున్నది.

మద్యపానం ధూమపానం సామాజిక రుగ్మతలపై సమరభేరి  మ్రోగిించిన పూలే  మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ  నాటి  మున్సిపాలిటీ అధ్యక్షునికి 1888లో  మద్యం షాపులను మూసి వేయవలసిందిగా ఉత్తరం రాశాడు  సుమారుగా 140 సంవత్సరాల క్రితం.  ఆయన  రాసిన సార్వజనిక్ సత్య ధర్మ పుస్తకములో  కుటుంబ సృష్టి నియమాలు, కుటుంబ సంబంధాల గురించి  ప్రస్తావిస్తూ ప్రపంచమే  ఒక కుటుంబం గా  జీవించగలిగే సార్వజనీన  సమాజాన్ని ఆకాంక్షించాడు.  ఆర్యుల కాలంలో ప్రవేశించిన  నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ  పూలే కాలంలో  జడలు విప్పిన నేపథ్యాన్ని,  కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి   దార్శనికుడిగా పేరుగాంచిన పూలే  దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని కోరుకొని  ఆయన ఆలోచనలకు విశ్లేషణకు  వివక్షతల పైన ఆయన చేసిన తిరుగుబాటుకు  దర్పణంగా "గులాంగిరి" పుస్తకాన్ని చూడవచ్చు.  "దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్త నాళాల వంటి వాళ్ళు" అని చెప్పిన పూలే  అగ్రకులాల వారి బానిసలుగా బతుకుతున్న కింది కులాల వారిలో తమ బానిసత్వం పట్ల ఆయన  చైతన్యం రగిలించి  సామాజిక ప్రజాస్వామ్యం సాధించడం ద్వారా  సర్వ అనర్థాలకు అడ్డుకట్ట వేయవచ్చునని  సందేశాన్ని ఇచ్చిన  జ్యోతిబాపూలేను  ఆయన మరణానంతరం (1891) జన్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  తన గురువుగా ప్రకటించుకొని ఫూలే మార్గంలో  వ్యవస్థను ప్రశ్నించి  సామాజిక అసమానతలకు  చెక్కు   పెట్టి పూలే సంస్కరణకు  తొలి కార్యకర్తగా అంబేద్కర్  పునాది వేసిన విషయాన్ని మర్చిపోకూడదు.  దక్షిణాఫ్రికా నల్లజాతి  ఉద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారతదేశ  పర్యటనకు  వచ్చిన సందర్భంలో ఆ మహనీయునికి  మహాత్మా పూలే రచించిన గ్రంథం గులా0గి రిని  సమర్పించి అంబేద్కర్  ఆ పుస్తకానికి అంతర్జాతీయ కీర్తిని తెచ్చినట్లు  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  అంట అంటరానితనము కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళాధరణకు కృషి  చేసిన  జ్యోతిబాపూలే  మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని  కాటుగున్ అనే ప్రదేశంలో  చిమ్నా ఫూలే,గోవిందరావు దంపతులకు   11 ఏప్రిల్ 1827 రోజున జన్మించగా  అనారోగ్యముతో  1890  నవంబర్ 28న  చనిపోయినాడు.  ఆయనను గౌతమ బుద్ధుడు తుకారాం అశోకుడు,శివాజీ,థామస్,వాషింగ్టన్   వంటి వారు ప్రభావితం చేసినట్టుగా చరిత్ర ద్వారా తెలుస్తున్నది.  ఆయన ఆశయాలను  ఆచరణలోకి తీసుకెళ్లి, సిద్ధాంతాలను విస్తృత ప్రచారం చేయడమే  ఆయనకు మనం అర్పించగల ఘానమైన నివాళి.

-- వడ్డేపల్లి మల్లేశము 

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333