అనేక అనర్థాలకు కారణమవుతున్న మద్యపానం

Apr 7, 2024 - 18:29
 0  1

పేదరికాన్ని, అనారోగ్యాన్ని మరింత పెంచి మృత్యువాతకు దారి తీసినా అదుపు చేయలేమా?

జాతీయస్థాయిలో మద్యపాన నిషేధం పై  ఏకాభిప్రాయాన్ని సాధించడం  కేంద్రం బాధ్యత కాదా?

 --- వడ్డేపల్లి మల్లేశం 

రోగ నిరోధక శక్తిని క్షీణింప చేసి  కాలేయము, క్లోమము, మెదడు, నాడీ వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థలపై దుష్ప్రభావం చూపుతున్న  మద్యపానం పైన  ప్రజల్లోనూ పాలకుల్లోనూ  ఇప్పటికీ సోయి రాకపోవడం  పరిణామాలను గుర్తించకపోవడం  నిజంగా బాధ్యతలను విస్మరించడమే.  గుండెపోటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతున్న  మద్యపానం వలన  దానికి బానిసలు అయిన వారు సమాజంలో  అవమానించబడుతున్నా  క్షణిక మానసిక ఉల్లాసం  తృప్తి కోసం  మద్యపానాన్ని  అలవాటుగా  చట్టబద్ధమైన హక్కుగా భావించే జనం ఇప్పటికీ ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం.

    దీనివల్ల ఒ నగూరుతున్న అనేక అనర్థాలు  శారీరక మానసిక  ఆరోగ్యాలను దెబ్బతీయడమే కాకుండా  ప్రజా జీవితానికి సంబంధించిన ఇతర వ్యవస్థలకు కూడా సవాలుగా నిలుస్తున్న వేళ  రోడ్డు ప్రమాదాలు,  అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, గృహహింస,  కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతో పాటు  యజమాని దాని కాటుకు బలి కావడంతో అనేక కుటుంబాలు వీధిన పడ్డ దౌర్భాగ్య పరిస్థితులను కూడా మనం చూడవచ్చు.  అయినప్పటికీ ప్రజలలో మార్పు రాలేదు  సమాజ పరిణామాన్ని ఘటనలను  ప్రజల సామాజిక  జీవించే హక్కును  బంగపరుస్తున్న మద్యపానం పట్ల ప్రభుత్వాలు కూడా బాధ్యతగా వ్యవహరించక  బరితెగించి ఆదాయం కోసం పనిచేస్తున్న కారణంగా   ఈ పరిణామాలు మరింతగా చోటు చేసుకుంటున్నాయి.

కొన్ని గణాంకాలను , రెచ్చగొడుతున్న కారణాలను పరిశీలిస్తే  :-

ప్రపంచవ్యాప్తంగా  మద్యానికి బానిసైన ప్రజా జీవితాన్ని పరిశీలించినప్పుడు  15 నుండి 19 ఏళ్ల మధ్య 27 శాతం యువత  మద్యం కోరల్లో చిక్కి శల్యం అయిపోతున్నట్లు అవగతం అవుతున్నది.  ప్రపంచ మద్యం మార్కెట్లో భారతదేశ  మూడో స్థానాన్ని  నిలబెట్టుకుంటే  2019 కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం 10 నుండి 70 ఏళ్ల మధ్య వయసులో ప్రతి ఏడుగురులో 1 మద్యాన్ని సేవిస్తున్నట్టుగా తెలుస్తున్నది.  ఇక మందు తాగే అలవాటున్న ప్రతి 5గురు పురుషుల్లో  1 పూర్తిగా మత్తుకు బానిసగా మారిపోయినట్లు  వి0 టే ఆందోళనకరమే కదా ! ఇక  మద్యానికి బానిస కావడానికి గల కారణాలను పరిశీలించినప్పుడు  కొంత ఆర్థికంగా బలపడడం,  జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పులు, అనుకరణ, నాగరికత సంస్కృతి ముసుగులో  కొట్టుమిట్టాడుతున్న వింత పోకడలు,  నగరీకరణ,  సామాజిక మాధ్యమాలు,  వ్యాపార ప్రకటనలు కూడా  మరింతగా మద్యపానం వైపు  ప్రజలను బానిసలుగా చేయడానికి కారణం అవుతున్నాయి.

     గతంలో మద్యపానానికి అలవాటు పడే సగటు వయసు 19 ఏళ్లు ఉంటే  ప్రస్తుతం 13 ఏళ్ల  వయస్సు వాడే మద్యానికి అలవాటు పడి  చిన్న వయస్సులోనే వృద్దు లైనవారిని చూసినప్పుడు పాలకుల యొక్క బాధ్యత  రాహిత్యం మనకు అర్థం అవుతున్నది.  బహుళ జాతి సంస్థల  వ్యాపార ప్రకటనలు,  సినిమా హీరోలు ఇతర క్రీడాకారులతోని  ప్రకటనలు,  మరింతగా రెచ్చగొడుతున్న విషయాన్ని కాదనలేము.  అదే సందర్భంలో గ్రామీణ పేదరికం  కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా  మద్యానికి అలవాటు పడినవారు  ఆర్థిక పరిస్థితి సహకరించని సందర్భంలో  నకిలీ, కల్తీ మద్యాలకు అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్న వారిని కూడా మనం ఎక్కువగా చూడవచ్చు.  అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా  మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా భావించే వాణిజ్య ధోరణి కారణంగా  కూడా దీని నిషేధానికి  అనేక అవాంతరాలు ఉన్నట్లు తెలుస్తున్నది.  తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆదాయం 10,000 కోట్లు కాగా  పదేళ్ల తర్వాత ప్రస్తుతము  45 వేల కోట్లకు చేరినట్లు  ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తుంటే  ఆదాయం పెరగవచ్చు కానీ ఆ ముసుగులో  చిక్కిపోయిన జీవితాలు,  వీధిపాలైన కుటుంబాలు,  అనారోగ్యం పేరు న చేసిన ఖర్చు   ఇప్పటికీ ప్రజలను ఆలోచింప చేయకపోతే ఎలా?  బుద్ధి జీవులు, మేధావులు,  సామాజిక రంగ నిపుణులు, బాధ్యతగల వారు  మద్యపానం యొక్క ప్రభావాన్ని విస్తృతంగా అవగాహన చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

        1960 ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రంలో తొలిసారిగా మధ్య నిషేధాన్ని ప్రారంభించినప్పటికీ   ఆ తర్వాత మూడు నాలుగు రాష్ట్రాలు మినహాయిస్తే దేశంలో అంతటా కూడా మద్యం ఏరులై పారుతున్న  గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, కొనసాగుతున్న బిజెపి ప్రభుత్వం కానీ ఏనాడు కూడా మధ్య నిషేధం ఆలోచన , మద్యం యొక్క పరిణామాలు,  సామాజిక బాధ్యతను గుర్తించని కారణంగా  కుటుంబాలు రోజురోజుకు పేదరికంలోకి నెట్టివేయబడుతూ వీధిపాలవుతున్న పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని  ఖండించాల్సిన అవసరం  బాధ్యతగల  సమాజం పైన ఎంతగానో ఉన్నది.  ప్రధాని రాష్ట్రమైన గుజరాత్లో తొలిసారిగా నిషేధం విధించినప్పటికీ  దానిని ఆదర్శంగా చూపి దేశవ్యాప్తంగా నిషేధానికి  కృషి జరిగినట్లయితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  సమావేశం ఏర్పరచి సమాలోచన చేయవలసిన బాధ్యత  కేంద్ర ప్రభుత్వానికి ప్రధానికి లేదా?  కొన్ని రాష్ట్రాలలో నిషేధించి మరికొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న కారణంగా అక్రమ రవాణా వల్ల  చోటు చేసుకుంటున్నా పరిణామాలను ప్రేక్షకులుగా చూ డవలసి వస్తుంది.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి-  పౌర సమాజం బాధ్యత  పాలకుల కర్తవ్యాలు:-

  మద్యం విక్రయములో భాగంగా రోజురోజుకు అధికంగా దుకాణాలను పెంచడంతోపాటు బెల్టు షాపులను అపరిమితంగా  అనుమతించడంతో  వివిధ పనులలో నిమగ్నమయ్యేవారు  పలు వృత్తులను కూడా విస్మరించి  తాగుడుకు బానిసలై  ఉత్పత్తికి కూడా ద్రోహం చేస్తున్నారు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.  ఈ పరిణామాలను అంతో ఇంతో ఆలోచించినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ  2010లో ప్రపంచ దేశాలకు సూచన చేస్తూ  మద్యపాన మహమ్మారిని నియంత్రించాలని  ప్రతి వ్యక్తికి ఆరోగ్య సామాజిక భద్రత కలిగించే లక్ష్యంతో ఆయా దేశాలు పనిచేయాలని దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది . ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలిపిచ్చి నంత మాత్రాన ఆయా దేశాల పాలకులకు సోయి ఉంటే కదా అమలు జరిగేది . 13 సంవత్సరాల తర్వాత 2023 మేలో నెలలో నిర్వహించిన సదస్సులో  గత 13 ఏళ్ల  అనుభవాన్ని సమీక్షించిన తర్వాత  అనివార్యమైన పరిస్థితిలో రాబోయే ఏడేళ్లను కలుపుకొని 2030 నాటికి  కట్టడి చేయాలని  కార్యాచరణ ప్రకటించినట్లుగా తెలుస్తున్నది . సమాజానికి జరుగుతున్న నష్టం, వివిధ   సంస్థలపై ప్రభావం, అనారోగ్య పరిస్థితులు,  కుటుంబ ఆర్థిక  సమస్యల  కారణంగా  దేశాల యొక్క ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో ఉంచుకొని  మద్యం అమ్మకాలను క్రమబద్ధీకరించాలని క్రమంగా నిషేధం వైపు కొనసాగాలని  కట్టుదిట్టంగా తీర్మానం చేసినట్టు తెలుస్తుంది .

        అయితే తాగేవారికి అటు పాలకులకు ఉమ్మడిగా ఉండాల్సిన బాధ్యత ఇది . చిన్న వయస్సులో  దాని బారిన పడ్డ కుటుంబాలు అనేకం  .పరిమితం చేయడం ద్వారా, పి న్న వయస్కులకు  నియంత్రించి  అమ్మకాలను క్రమబద్ధీకరించడం ద్వారా,  చట్టాలను కఠినంగా అమలుపరిచి అందుబాటును తగ్గించాలి. అంతేకాదు క్లబ్బులు పబ్బులు, ధాబాలు  పేరుతో  ఎల్లవేళలా అందుబాటులో ఉండే అవకాశాలను  రద్దుచేసి కేవలం దుకాణాలకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా  ప్రజల్లో  మద్యపానం పట్ల క్రమంగా  వ్యతిరేక భావాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.  ఇక మద్యపానం  ద్వారా వచ్చే   ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపడానికి  సిద్ధపడే  పాలకులు  తమ బాధ్యతను గుర్తించి  ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ఆదాయ మార్గాలను సంపద సృష్టించే వైపు దృష్టి సారించాలి.  మద్యం ప్రకటనలో  వివిధ రంగాల వారికి అవకాశం లేకుండా నిషేధించి  దానివల్ల వనగూరే పరిణామాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా  కౌన్సిలింగ్ కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసి  దానికి బదులుగా ప్రత్యామ్నాయ పోషకాహార  కేంద్రాలు  ఆహార పదార్థాలను ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయడం ద్వారా  ప్రజల నిరోధక శక్తిని పెంచడంతోపాటు  ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది.  పేదరికం, నిరుద్యోగము, ఆకలి చావులు, ఆత్మహత్యలు, దోపిడీలు,  పీడన, వంచన, అత్యాచారాలు, లైంగిక వేధింపుల వంటి  సకల సమస్యలను పరిష్కరించాలంటే  సమాజంలో మద్యపాన పరిణామాలను విపత్తులను  లోతుగా  ప్రజల్లోకి తీసుకెళ్లి  ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.  వివిధ కళారూపాలు,  సాంస్కృతిక ప్రదర్శనలు,  టీవీ ప్రసారాలు సినిమాలలో  మద్యాన్ని విక్రయిస్తున్నట్లు తాగుతున్నట్లు  చూపే సన్నివేశాలను వెంటనే నిషేధించి  పలు మీడియాల ద్వారా  అనర్థాలను ఎక్కువగా  ఫోకస్ చేసినట్లయితే  ఈ అనర్థాల నుండి కొంతవరకు రక్షించుకునే అవకాశం ఉంది.  "తను తెగనిజే కత్తి తెగ దు" అన్నట్లు  పాలకులు సామాజిక బాధ్యతగా ఆరోగ్య భారతాన్ని,  సంపన్న దేశాన్ని,  ప్రజలను బుద్ధి జీవులు  జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉన్నప్పుడు  మాత్రమే మద్యపానాన్ని పూర్తిగా కట్టుదిట్టం చేయడానికి క్రమంగా నిషేదానికి అస్కారం ఉంటుంది.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333