ఇప్పటికీ సరైన దారులు లేక  ఆగమై పోతున్న వాళ్ళు ఎందరో

Apr 18, 2024 - 20:31
Jun 27, 2024 - 20:42
 0  9
ఇప్పటికీ సరైన దారులు లేక  ఆగమై పోతున్న వాళ్ళు ఎందరో

పట్టణ ప్రాంతాలపై చేస్తున్న భారీ ఖర్చు  తో పోల్చుకుంటే  ఈ వివక్షత అంత మంచిది కాదు.

దేశాభివృద్ధిలో గ్రామాల కీలక పాత్ర  నిజం కాదా ?


---వడ్డేపల్లి మల్లేశం

దేశాభివృద్ధికి పల్లె  సీమలే పట్టుకొమ్మలని , గ్రామీణ ప్రాంత అభివృద్ధి కీలకమని  రాజకీయ నాయకుల నుండి సామాన్యుల వరకూ అందరూ  వల్లె వేస్తూ ఉంటారు . స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ  గ్రామ సీమల అభివృద్ధి  ద్వారా  నే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మి  ఆ వైపుగా  తన కృషిని ప్రచారాన్ని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు  కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే  తన అభిమతం అని ప్రకటించినప్పటికీ ఆ వైపుగా ఎలాంటి కృషి జరగలేదు.  ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ  తెలంగాణ రాష్ట్రంలో కూడా  ప్రభుత్వాలు  రైతును రైతు బాధలను రైతు కష్టాలను  వల్లే వేయకుండా ఉండడం లేదు. కానీ వారి ప్రయోజనాల కోసం పనిచేసిన దాఖలాలు అంతగా కనిపించడం లేదు  .చివరికి కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు, చేనేత కార్మికులు , వృత్తి పనివాళ్ళు,  రైతులు,  పేద వర్గాలు కూడా విద్య వైద్యం సామాజిక న్యాయం గృహ వసతి వంటి సౌకర్యాలకు  నోచుకో నీ పేద జనం  తమ ఆదాయంలో 70__80 శాతం పైగా ఈ రంగాలకే ఖర్చు చేస్తూ ఉంటే  రోజురోజుకు కుటుంబాలు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాన్ని మన  అందరము గమనించి ఉన్నాము .

 ఈ పరిస్థితులు ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్ల పరిస్థితి మరింత అద్వాన్నం అని చెప్పక తప్పదు.  వైద్యశాలలు లేక  ప్రైవేటు ఆసుపత్రులకు  త ప్ప మార్గములేని పరిస్థితిలో  సిబ్బంది లేదనో లేక డబ్బులు లేకనో  రోగులు  గర్భవతులు  ఇతర సీరియస్ గా ఉన్నటువంటి పేషెంట్లు  ఎందరో జీవితాలు గాలిలో కలిసిపోతూనే ఉన్నాయి.  రహదారులు బాగాలేక,   వర్షాకాలంలో వాగులను దాటలేక,  అటవీ ప్రాంతము గుండా బయలుదేరి  తమ అవసరాలను తీర్చుకోవడానికి చిన్న గ్రామాలు పట్టణాలకు వెళ్లడానికి  నానాయాతనలు పడుతున్న తీరు గమనించదగినది.  ఇప్పటికీ కొన్ని అటవీక గ్రామాలు  ఏ జిల్లా పరిధికి  వస్తాయో తెలియని దయనియస్థితి, అంతేకాదు  తాము ఎవరిని సంప్రదించాలి, ఏ ఆసుపత్రిలో  చికిత్స చేయించుకోవాలి?,  

 అక్కడికి చేరుకోవాలంటే మార్గం ఏమిటి? అనే విషయాలు కూడా  తెలియని అభాగ్యులు ఉన్నటువంటి ఈ భారతదేశం  77 సంవత్సరాల స్వతంత్ర సంబరాల తర్వాత కూడా  కనీస అవసరాలకు నోచుకోక రాజ్యాంగ పలాలు దక్కక  ఓటర్లుగా మాత్రమే మిగిలిపోతూ బానిస జీవితం గడుపుతున్నటువంటి అభాగ్యులకు  ఏ ప్రభుత్వాలు కూడా అండగా నిలబడిన దాఖలాలు లేవు.  ఇది అత్యంత శోచనీయమే కాదు రాజ్యాంగ ద్రోహం కూడా.  ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని వారి అభ్యున్నతికి సంక్షేమానికి పనిచేయకుండా ప్రభుత్వాలు  కాలయాపన చేస్తూ  ఐదేళ్ల వరకు తిరిగి వారి ముఖం చూడకుండా  వారి దౌర్భాగ్య పరిస్థితులను గమనించకుండా ఉంటున్నటువంటి పాలకులను  ఆ ప్రజలే తరిమికొట్టే రోజు వస్తుంది. కానీ ప్రజల యొక్క  అచేతనత్వం , నిరక్షరాస్యత, అనారోగ్యము, పేదరికం వంటి కారణాల వలన  పాలకులను ప్రశ్నించడానికి ఇప్పటికి కూడా సిద్ధంగా లేకపోవడం వల్లనే  పాలకులు బ్రతికి బట్ట కట్టడానికి  అవకాశం ఏర్పడుతున్నది.

కొన్ని ఆనవాళ్లు పరిశీలిస్తే:-

ఇప్పటికీ కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేసి  తమ నిత్యావసరాలు కొనుగోలు చేయడం కానీ  రేషన్ సరుకులు తెచ్చుకోవడం కానీ    తప్పడం లేదు.  ముఖ్యంగా వర్షాకాల సమయంలో వాగులు, వంకలు ఉన్నటువంటి చోట్ల పక్కా రోడ్లు లేకపోవడం  వాగును దాటడం మినహా గత్యంతరం లేని పరిస్థితిలో  గర్భవతిగా ఉండి లేదా ఇతరత్రా సీరియస్ గా ఉన్నటువంటి పేషెంట్లను వైద్యశాలల్లో చూపించాలంటే  మంచాలు, డోలీలు వంటి ఇతర సౌకర్యాలను కల్పించుకొని  నలుగురు వాగు గుండ మోస్తూ ప్రయాణించి  తీరా దవాఖానకు చేర్చే లోపే కొందరి ప్రాణాలు పోయిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు.  గ్రామీణ ఆటవిక ప్రాంతాలకు సంబంధించినటువంటి అశేష పేద ప్రజానీకం  జనాభాలో భాగమవుతున్నారే కానీ ఈ దేశ సంపదను అనుభవించడంలో కానీ, రాజ్యాంగ పలాలను పొందడం లోపల కానీ, సౌకర్యాలను  ఉపయోగించుకోవడంలో కానీ వారికి ఎలాంటి అవకాశాలను పాలకవర్గాలు కల్పించడం లేదు . ఇప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాలలో తమ వ్యవసాయ బావులకు భూములకు  వెళ్లడానికి  సరైన దారులు లేక పిల్ల బాటలు,  చెత్తాచెదారం , గుబురు లాంటి చెట్ల నుండి  ధైర్యం చేసి ప్రయాణం చేయవలసి వస్తున్నది.

 ఆ క్రమంలో  చీడపురుగులు, పాములు, తేళ్లు, ఇతరత్రా అడవి మృగాల  బారిన రైతులు కార్మికులు ఇతర కాలినడక వాళ్ళు  పడక తప్పడం లేదు . రైతులకు సహకరిస్తేనే  పంటలు పండించి ఈ దేశ ప్రజలకు  తిండి  పెట్టేవాళ్లు అనే సోయి కూడా లేకుండా  వాళ్లు ఎంత కష్టపడి  పంటలు పండిస్తున్నారు? ఎంత దూరం ప్రయాణించి  వ్యవసాయం చేస్తున్నారు? ఎలాంటి దుస్థితి లోపల  ప్రయాణం చేస్తున్నారో తెలుసుకున్న దాఖలా ఏనాడు కూడా పాలకవర్గాల అనుభవంలో లేదు. పైగా  ఆ కఠోర ప్రాంతాలను  కేవలం ఎన్నికల సమయంలో సందర్శిస్తే తిరిగి మళ్లీ ఎన్నికల వరకు ముఖం చూడనటువంటి  దుర్మార్గపు ఆనవాలు  ఈ దేశంలో అంతం కావాలి.  అవసరాలను పక్కాగా తెలుసుకోగలిగే పాలకవర్గాలు యంత్రాంగం  ఉద్యోగులు స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో  ఎక్కడికక్కడ తగు ఏర్పాట్లు చేయడం ద్వారా కంప్యూటర్ యుగంలో కూడా రాతియుగం కంటే అత్యంత దీనంగా  బ్రతుకుతున్నటువంటి పేద వర్గాల గ్రామీణ ప్రాంత అగచాట్లను దూరం చేయవలసిన అవసరం మనందరికీ లేదా?  ఉత్పత్తిలో భాగస్వాములై  పంటలు పండించి మన కడుపు నింపుతున్న అన్నదాతలు కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు  కష్టపడుతుంటే మాత్రం మనం కనీసం అయ్యో! అని అనలేకపోతున్నామంటే  మనకు కనీసమైన అవగాహన, సోయి, జ్ఞానము, బాధ్యత ఈ వ్యవస్థ పట్ల పేద గ్రామీణ ప్రాంతాల పట్ల లేనట్లే కదా !

కొన్ని చర్యలు చేపట్టాలి  :-

ఏ ప్రాంతము రాష్ట్రము అనే తేడా లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత  దుస్థితి నుండి బయట పడేయాలంటే  ప్రస్తుతం సింగల్ రోడ్లుగా ఉన్న వాటిని డబుల్ రోడ్లుగా మార్చాలి, రోడ్లు లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలకు సింగలు రోడ్లను వెంటనే  నిర్మించాలి,  దారి లేకుండా  చెట్లు పొదలు, వృక్షాల మధ్య నుండి వెళుతున్నటువంటి చోట్ల దారులను ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలి.  రహదారులకు  పక్కల ముళ్ళ చెట్లు,  గుబురు, వృక్షాల కారణంగా దారి సరిగా కనబడకుండా అనేక ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో  రహదారి స్పష్టంగా కనపడే విధంగా చెట్లను నరికివేసి  రోడ్లను చక్కగా ఏర్పాటు చేయడం  గ్రామీణ ప్రాంతా అభివృద్ధిలో కీలకమని పాలకవర్గాలు తమ బాధ్యతను గుర్తించాలి.  నదులు చెరువులు, వాగులు, వంకలు ఉన్నచోట్ల కచ్చితంగా  వంతెనలు నిర్మించి  అత్యవసర పరిస్థితులలో అగచాటుకు గురికాకుండా పేద గ్రామీణ ప్రజలను రక్షించాలి.  వ్యవసాయదారులు ప్రధానంగా  విస్తృతంగా  కలిసి పనిచేసే చోట మైదాన ప్రాంతాలకు  రహదారులను  ఏర్పాటుచేసి విస్తరింప చేయడం ద్వారా  రైతులు కార్మికులను అనేక ప్రమాదాల నుండి కాపాడవలసిన బాధ్యత కూడా పాలకవర్గాలపై ఉన్నది .

 ప్రభుత్వాలకు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా  తాము చెల్లించే పనుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుతున్నప్పటికీ  పాలకులు పట్టణాలను మాత్రమే పరిమితం చేసి  పట్న ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేసే క్రమంలో  చూపిన ప్రాధాన్యతను పల్లె ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో చూపకపోవడం  గర్హనీయం.  గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఈ దేశ సంపదలో భాగస్వాములై ఉత్పత్తిలో తమ వంతును ఉదాత్తంగా నిర్వహిస్తూ  దేశ ప్రజలందరికీ తిండి పెడుతూ  సంపాదన సృష్టిస్తున్నప్పటికీ తమ సంపదను పెంచుకోవడంలో మాత్రం పాలకవర్గాల వివక్షత  కారణంగా గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ పేదరికంలోనే కొట్టుమిట్టాడాన్ని మనం గమనించవచ్చు.  15% జనాభా దారిద్ర రేఖ దిగువన ఉంటే  దేశంలో సుమారు 15 కోట్లకు పైగా వలస జీవులు ఉపాధిని వెతుక్కుంటూ దేశమంతా సంచరిస్తూ అనేక ప్రమాదాలకు గురవుతూ  మధ్యలోనే తనువు చాలిస్తున్న విషయాలను కూడా పాలకులు గమనించకపోతే ఎలా?

 ఇన్ని రకాల వాస్తవాలను బుద్ధి జీవులు మేధావులు ఆలోచన పరు లు కూడా  ఏనాడు ఆలోచించక తమ కుటుంబం వరకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి దుష్ట దుర్నీతిని ఎండ కట్టాల్సిన అవసరం కూడా మన అందరి పైన ఉన్నది.  సమాజము సిగ్గుతో తలవంచుకోవలసిన దుస్థితిలో ఇప్పటికీ ఉన్నటువంటి అనేక గ్రామీణ ఆదివాసి గిరిజన ప్రాంతాల స్థితిగతులపై  వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యయనం పరిశీలన జరిపించి  ఆ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం  తీసుకోవలసిన చర్యలను ముమ్మరం చేసినప్పుడు మాత్రమే పాలకులకు ఓటు అడిగే హక్కు ఉంటుంది. లేకుంటే ప్రజల ఆగ్రహం   చవి చూడక తప్పదు ఏనాడైనా అని  ప్రభుత్వాలు గుర్తించడం చారిత్రక అవసరం.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333