దొంగ నాటకం తో దొరికన మహిళ..దొంగే దొంగ అన్నట్లు అయిపోయింది
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఓ అమ్మాయి ఆడిన దొంగతనం డ్రామా కలకలం రేపింది. తాను వాష్ రూంలో ఉన్న సమయంలో ఇంట్లోకి దొంగలు దూరారని.. ఇంట్లో ఉన్న వస్తువులను చిందర వందరగా పడేసి అల్మారాలో ఉన్న బంగారం, వెండి నగలతో పాటు నగదును కూడా ఎత్తుకెళ్లారంటూ.. ఓ యువతి కేకలు వేసింది. ఆ అమ్మాయి అరుపులు కేకలు విని.. స్థానికులు పరుగుపరుగున వచ్చి.. ఏమైందని అడిగితే ఈ స్టోరీ చెప్పింది. పట్టపగలే దొంగలు ఇలా ఎగబడితే కష్టమని.. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు
పోలీసులు అడిగినా, మీడియా వాళ్లు అడిగినా సేమ్ స్టోరీనే చెప్పుకొచ్చింది. ఇద్దరు దొంగలు వచ్చారని.. తాను వాష్ రూంలో నుంచి వచ్చేసరికి.. పారిపోయారని.. వాళ్ల ముఖాలకు మంకీ క్యాప్‌లున్నాయంటూ మంచి నమ్మెబుల్ కథ చెప్పుకొచ్చింది. అయితే.. అసలే ఎండాకాలం.. అందులోనూ మిట్టమధ్యాహ్నం.. మంకీ క్యాపులు పెట్టుకుని దొంగతనం చేశారంటేనే.. పోలీసులకు ఎక్కడో అనుమానం తలెత్తింది. అమ్మాయిని తమదైన శైలిలో అడగటంతో.. దెబ్బకు దడుచుకుని.. అసలు విషయం బయటపెట్టింది.
దొంగలెవరూ రాలేదని.. అసలు దొంగ తానేనని ఒప్పుకుంది. అయితే.. ఆ డ్రామా ఎందుకాడాల్సి వచ్చిందని అడిగితే.. దిమ్మతిరిగే నిజం చెప్పింది. ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడిన పాప.. అందులో 25 వేలకు పైగా డబ్బు పోగొట్టుకున్నానని.. ఈ విషయం తెలిస్తే అమ్మానాన్న కొడతారని భయపడి ఈ దొంగతనం డ్రామా ఆడినట్టు.. పోలీసుల ముందు అసలు విషయం చెప్పింది. అది విని పోలీసులతో సహా స్థానికులంతా అవాక్కయ్యారు.