తెలంగాణ శాసనమండలి ఎన్నికలు ఫలితాలు

Mar 9, 2025 - 23:26
 0  2

తెలంగాణ శాసనమండలి ఎన్నికలు ఫలితాలు.* ఓటింగ్ విధానము మరింత బలపడవలసిన బీసీ వాదం.* రాజకీయ పార్టీల ధోరణులు ప్రజల ఆకాంక్షలు .*

*************************************

--వడ్డేపల్లి మల్లేశం 9014206412 

---05...03...2025*********************

ప్రత్యక్షంగా తమ ముఖం తమకు కనపడని మాదిరిగా తమ గొప్పతనాన్ని తామే ప్రశంసించుకుంటే సరిపోదు. తోటి రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు అఖిలపక్షాలు, ప్రజాస్వామ్య సంస్థలతోపాటు ప్రజలు నిర్ణయించవలసి ఉంటుంది. అందుకే ఎన్నికలు ఓట్ల విధానం ద్వారా ఆ ప్రక్రియను కొనసాగించడం ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రధాన అంశంగా కనిపిస్తున్నది. ఈ మేరకు ఇటీవలి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికలు గతం కంటే భిన్నంగా సామాన్య జనాన్ని కూడా ఆలోచింపచేసినవి గతంలో పట్టబద్దులు ఉపాధ్యాయుల ఎన్నికలు చాలామంది పట్టబద్దులకు విద్యావంతులకే తెలిసేవి కావు కానీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, రోజురోజుకు విద్యారంగంలో వస్తున్న మార్పుల కారణంగా పట్టబదృ లుగా మారుతున్న నేపథ్యంలో ఓట్లను నమోదు చేసుకోవడం వలన కూడా చైతన్య స్థాయిని మనం అంచనా వేయవలసి ఉంటుంది. అయితే ఆ చైతన్యం ఏ రకమైన మార్పుకు దోహదపడిందో అంచనా వేయవలసిన అవసరం కూడా అదే స్థాయిలో ఉంది. మౌలికమైన అంశం ఏమిటంటే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ స్థానాలకు సంబంధించి పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నిక, వరంగల్ ఖమ్మం నల్లగొండ స్థానానికి సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక అంటే మూడు స్థానాలకు జరిగినటువంటి ఓటింగ్ ప్రక్రియ నిరంతరం ఆలోచింపచేసేదిగా అంతేకాదు ఉత్కంఠ భరితంగా సాగినది అనడంలో సందేహం లేదు. పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల మధ్యన ఊహించని స్థాయిలో పోటీ తత్వం మంచిదే కానీ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల అభ్యర్థి యొక్క బాధ్యతలు కర్తవ్యాలు శాసనమండలిలో నిర్వహించవలసిన పాత్రలను కూడా నిర్ణయించకుండా ఆలోచించకుండా గుడ్డిగా తమ అందరం కూడా అర్హులమే అని పోటీ చేయడం కూడా సమంజసము కాదు. అలాంటి ప్రక్రియ ఈ సందర్భంగా జరిగిందని మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఉపాధ్యాయ స్థానానికి పోటీ చేయవలసినటువంటి అభ్యర్థులను కనుక పరిశీలిస్తే ఉపాధ్యాయులు కాని వాళ్ళు, ప్రైవేటు విద్యాసంస్థల అధిపతులు, రియల్ ఎస్టేట్లో పని చేస్తున్నటువంటి కొద్ది మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ ఉద్యమము ఉపాధ్యాయ సమస్యలు ఉపాధ్యాయ జీవితంతో సంబంధం లేని వాళ్ళు పోటీ చేస్తే వాళ్లను కూడా గెలిపించుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించడం అందులో బీజేపీ ముందు వరుసలో ఉండడాన్ని మనమంతా ఆలోచించాలి. అదే సందర్భంలో పార్టీల యొక్క ప్రమేయం లేకుండా ఉపాధ్యాయ ఉద్యమ నేపథ్యంలో తమ జీవితాంతం పనిచేసినటువంటి వాళ్ళు ముఖ్యంగా వై అశోక్ కుమార్ నర్సిరెడ్డి లాంటి వాళ్లు పోటీలో కొనసాగి నర్సిరెడ్డి లాంటి వాళ్లు గతంలో కొంత ఉపాధ్యాయ ఉద్యమానికి చేదోడు వాదోడుగా పనిచేసినటువంటి నేపథ్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడం పెట్టుబడి దారి భూస్వామ్య వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు గెలవడం కొంత ఆందోళన కలిగించే అంశమే .

       పట్టభద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ద్వారా ప్రజలు ఆశిస్తున్నది ఏమిటి?

******************************

  పట్టభద్రుల శాసనమండలి ప్రతినిధి ద్వారా ప్రజలు నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశాలను పరిష్కరించడం, స్పష్టమైన యువజన విధానాన్ని ప్రకటింపజేసే విధంగా కృషి చేయడం, నిరుద్యోగులకు విద్యావంతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం, పే పరు లీకేజీలతోపాటు ప్రభుత్వాల ధమననీతిని ఖండించడం, హామీ ఇచ్చి నెరవేర్చని నిరుద్యోగ భృతి పైన పోరాటం, నాణ్యమైన విద్యను కొనసాగించేలా ఒత్తిడి చేయడం, యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి సామాజిక అసాంఘిక కార్యక్రమాలను రద్దు చేయించడం, ముఖ్యంగా మద్యం మత్తు రకమైనటువంటి పానీయాలు క్లబ్బులు పబ్బులను నిర్మూలించడం, విద్యను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి ప్రైవేటు వ్యవస్థను కూలదోయడం వంటి బాధ్యతలు నిర్వహించవలసిన అవసరం ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికైన వాళ్లు అందుకు అర్హులా? లేదా? అని ఆలోచించుకోవడం పట్టభద్రుల యొక్క బాధ్యత.

       ఇక ఉపాధ్యాయ శాసనమండలి స్థానానికి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ చట్టపరంగా ఎవరైనా పోటీ చేయవచ్చు అనే నిబంధన ఉండవచ్చు కానీ మౌలికంగా ఉపాధ్యాయుల సమస్యలు విద్యారంగ పరిరక్షణ గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు ఏ రకంగా అర్హులవుతారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి భూస్వాములు పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా పారిశ్రామికవేత్తలను నిలబెట్టడంలో రాజకీయ పార్టీలు పోటీ పడడం అంటే నిజంగా సిగ్గుచేటు కాదా? అనుభవము లేని, అర్హత లేని, అవకాశం లేని వాళ్ళు ఏ రకంగా ఉపాధ్యాయుల సమస్యల కోసం, విద్యారంగ పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగంలో విద్యను కాపాడడం కోసం, ప్రభుత్వ రంగ విద్య కోసం హెచ్చు బడ్జెట్లో కేటాయించడం, ప్రైవేట్ రంగాలను పాఠశాలలు కళాశాలలను నిర్మూలించి మొత్తం యావత్తు విద్య ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి పూనుకుంటారా? అందుకు తమకు ఉన్నటువంటి విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తారా అది సాధ్యమేనా? అది ఆశించి రాజకీయ పార్టీలు లేదా అధికార పార్టీ ఈ అభ్యర్థులను పోటీకి నిలిపిందా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ఉపాధ్యాయులు పట్టభద్రులు తాము ఓటు వేసే క్రమము ఎలాంటి అభ్యర్థి కావాలనే కనీసం అయినటువంటి అవగాహన లేకుండా ఎన్నుకున్నారని భావించవచ్చా? ఒకవైపు పట్టభద్రుల ఎన్నికల్లో 28,686 ఓట్లు చెల్ల లేదని నిందిస్తూ ఉంటే ఉపాధ్యాయులకు సంబంధించి ఒక్కొక్క స్థానంలో సుమారు 1000 ఓట్లు చెల్లకుండా పోయినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. నల్లగొండ వరంగల్ ఖమ్మం స్థానానికి సంబంధించిఒక ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి అభ్యర్థి ఎన్నిక అయితే పోరాట రంగాలతో అంతగా సంబంధం లేని వాళ్ళు అని అక్కడ కొందరు విమర్శిస్తున్నారు. అదే రకంగా చాలా ఆలస్యంగా కరీంనగర్ పట్టబదృ ల స్థానానికి రిజల్ట్ ప్రకటించిన సందర్భంలో మూడు రోజుల తర్వాత ఫలితం వెలువడడం అది కూడా అసంపూర్తిగానే నిర్ణయించడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నప్పటికీ ప్రజాక్షేత్రంలో లేని వాళ్ళు, ప్రజలతో మమేకం కాని వాళ్ళు, పట్టభద్రుల యువత నిరుద్యోగుల సమస్యల పైన అవగాహన లేకుండానే కేవలం బిజెపి పార్టీ కనుసన్నల్లో గెలిచినటువంటి అంజిరెడ్డి గారు ఏ రకంగా పట్టబద్ధుల ప్రయోజనాలకు ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడానికి తోడ్పడతారు వేచి చూడవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇక ఉపాధ్యాయుల స్థానానికి బిజెపి బలపరిచిన మల్క కొమురయ్య గారు ఉపాధ్యాయ ఉద్యమంతో సంబంధం లేకుండా కేవలం ప్రైవేట్ విద్యాసంస్థలను పాలిస్తూ బిజెపి పార్టీ ఇచ్చిన అవకాశం మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలవడాన్ని మనం అభినందిస్తాం కానీ ఉపాధ్యాయ ఉద్యమం ఉపాధ్యాయ రంగ సమస్యలు ప్రభుత్వ రంగంలో విద్య వంటి అనేక మైనటువంటి అంశాల పైన ఏ రకంగా పోరాడుతారు? తాను ప్రైవేటు రంగానికి చెందివుండి ప్రైవేట్ రంగాన్ని కూలదోయాలని ప్రభుత్వం పైన పోరాటం చేయగలరా? ఇది సాధ్యమేనా? ఇది బిజెపి ఏ రకంగా సమర్ధించుకుంటుందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఈ రెండు ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా బిజెపి సమర్థించుకోవడంతో పాటు రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని పాలించే సత్తా బిజెపికి ఉన్నదని సమర్థించుకోవడం అంటే అది సరిపోదు. కేవలం పట్టబద్రులు ఉపాధ్యాయులు వేసిన ఓట్ల ద్వారా రెండు స్థానాలు గెలిచినంత మాత్రాన ఇది నిజమైనటువంటి ప్రజాభిప్రాయానికి మచ్చుతునక అని నిర్ణయించడానికి వీలు లేదు. అదే సందర్భంలో ఎన్నికల్లో డబ్బు, రాజకీయ ప్రాబల్యం, ఆధిపత్య వర్గాల తోడ్పాటు కూడా ప్రధాన పాత్ర పోషించినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది.

      బీసీ వాదం ఏమైనట్లు

******--*--*********-6***

వరంగల్ ఖమ్మం నల్లగొండ తో పాటు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ స్థానాలకు సంబంధించి మూడు ఎన్నికల సందర్భంగా బీసీ సంఘాలు బీసీ వాదాన్ని బలంగా వినిపించినటువంటి ఇతర ప్రజాసంఘాలు అఖిలపక్షాలు కూడా బీసీ వాదాన్ని బలంగా ఓటర్లలోకి ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చాలా చోట్ల ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం కూడా జరిగింది. కానీ నిజంగా చెప్పాలంటే ఓటర్లు అందరు కూడా చాలా మంది బీసీ వర్గానికి చెందినప్పటికీ తాము ఎన్నుకున్నది మాత్రం ఒక్క మల్కా కొమురయ్య గారు తప్ప మిగతా రెండు స్థానాలకు సంబంధించిన ప్రతినిధులు ఆధిపత్య కులాలకు చెందిన వాళ్లే. బీసీ వాదం ఎంత ముఖ్యమైనదో ప్రభుత్వ రంగాన్ని కాపాడడానికి ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార రంగంలో పనిచేస్తున్న వాళ్లను తృణీకరించడం కూడా అంతే ముఖ్యం. ఆ రకంగా బీసీ వాదాన్ని మనం భవిష్యత్తు లోపల కూడా పదిల పరుచుకున్నప్పుడు మాత్రమే విమర్శలకు తావు లేకుండా ఉంటుంది. అర్హులు పోరాట వీరులు, ఉద్యమ నాయకులు సమర్ధులైనటువంటి వాళ్ళు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోటీలో ఉన్నప్పటికీ బీసీ సంఘాలు విద్యా వ్యాపారవేత్తకు మద్దతు ప్రకటించి బిజెపికి పట్టం కట్టడం కూడా అసమంజసం. ఆ తప్పును సవరించుకోవాల్సిన అవసరం కూడా భవిష్యత్తులో చాలా ఉన్నది. ఇలాంటి తప్పిదాల కారణంగా అటు ఎంచుకో తగని రాజకీయ పార్టీని సమర్థించడం, పెట్టుబడిదారి వర్గాన్ని పెంచి పోషించి మద్దతివ్వడం రెండూ కూడా బీసీ సంఘాలు చేసినటువంటి తప్పిదాలుగా ఈ ఎన్నికల్లో మనం భావించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. బీసీ సంఘాలకు ప్రభుత్వ రంగం మీద, ప్రభుత్వ విద్యా పరిరక్షణ మీద, విద్యకు హెచ్చు నిధులు కేటాయించడం మీద, కామన్ స్కూలు పైన బాధ్యత లేకుండా అవగాహన లేకుండా ప్రకటించడం కూడా సమంజసం కాదు అని ఎన్నికల ద్వారా బీసీ సంఘాలు గుర్తించవలసిన అవసరం చాలా ఉన్నది.

       ఇక గణాంకాల గురించి

****---------**

  ముఖ్యంగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ స్థానానికి సంబంధించి పట్టభద్రుల ఎన్నిక మూడవ మార్చి 2025న మొదలుకుంటే ఐదవ మార్చినాడు రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగింది. ఉత్కంఠపూరితంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో నిబంధన మేరకు ఎన్నిక అభ్యర్థికి 1,11672 ఓట్లు రావలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి గారికి 98,637 ఓట్లు రాగానే ఎంపికైనట్లు ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పడాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో రెండవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి 93 531 ఓట్లు వచ్చినప్పటికీ నిర్ధారించిన ఓట్లకు చేరుకోలేదు కనుక మూడవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాలని కాంగ్రెస్ అభ్యర్థి చేసిన సూచనను ఎన్నికల సంఘం ఆమోదించకుండా నిర్ధారిత ఓట్లు చేరుకోకుండానే బిజెపి అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడం ఒక సందేహంగా మిగిలిపోవడం కూడా విచారించదగినదే. ఇక రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన క్రమములో 53 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయిన తర్వాత అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను పరిశీలించినప్పుడు బిజెపి అభ్యర్థికి 78,635 కాంగ్రెస్ అభ్యర్థికి 73,644 బీఎస్పీ బలపరిచినటువంటి స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారికి 63,404 ఓట్లు రావడాన్ని గమనిస్తే ఈ పోటీ ముఖ్యంగా డబ్బు కులం రాజకీయ అండ కొన్ని రకాల ప్రలోభాలు మధ్యన జరిగినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే చాలామంది విశ్లేషకులు స్వతంత్రంగా పోటీలో నిలబడి ఒక రూపాయి ఖర్చు చేయకుండా 63, 044 ఓట్లు సాధించిన ప్రసన్న హరికృష్ణది నైతిక విజయమని ప్రశంసించడాన్ని కూడా మనం ఆలోచించాలి? అదే సందర్భంలో విలువలు విజ్ఞానము సమర్థత ప్రతిభ విద్యారంగం పైన అవగాహన లేనటువంటి వాళ్ళు ఏదో కారణం వల్ల గెలిచిన పెద్దగా చట్టసభల్లో ఒరగబెట్టేది ఏమీ ఉండదని కూడా పట్టభద్రులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఉపాధ్యాయులు తెలుసుకుంటే రాబోయే కాలంలో ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండే ఆస్కారం ఉంటుంది.

      ఎన్నికల ఫలితాలు ప్రకటించబడి గెలుపొందిన అభ్యర్థుల సాక్షిగా యధాతత స్థితిని మాత్రమే నిజమైన రాజకీయమని ప్రజల గెలుపు అని ఆలోచించడం మూర్ఖత్వం. వాస్తవంగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు అధికారపక్షం ఏ రకమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నది, ప్రజల యొక్క అభిప్రాయం ప్రభుత్వ రంగం పైన ఏమున్నది, అధికార పార్టీని ఓడించడానికి ఒకవైపు బిజెపి ఏ రకంగా చాప కింద నీరు లాగా ప్రవేశిస్తున్నది, బిజెపి విధానం ఏ రకంగా ఉంటుంది అనే అంశాల పైన ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఆలోచించి ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని తద్వారా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి తమ శక్తి యుక్తులను వినియోగించవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తూ పోరాటం చేస్తూ దానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీ గాని ఏ ప్రభుత్వ పెద్దలనైనా ప్రతిఘ టించడానికి ప్రజలు ప్రజాస్థానిక వాదులు సిద్ధంగా లేకపోతే భవిష్యత్తు మరింత అంధకారమే అవుతుంది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333