జన సమూహాల గాయం...!!

Apr 2, 2024 - 22:10
 0  14
జన సమూహాల గాయం...!!

ఏ అడవిదారుల్లో పాటలు అల్లాడో, ఏ కొండకోనల ప్రజలకి పాఠాలు నేర్పాడో, ఎవరి తరతమభావంతో మనసు చివుక్కుమని వెను దిరిగాడో, అతని లోపలా వెలుపలా ఎడతెగని పోరాటాలెన్ని చేశాడో కాని, కలేకూరి ప్రసాద్ 1996లో హైదరాబాద్‌లోని మమ్మల్ని వెతుకుతూ వచ్చాడు. అప్పటికి మేము ఇంటిలో ఇమడలేక, బతుకుతెరువు ఉద్యోగంలో సమాధాన పడలేక, ఉద్యమంతో పరిపూర్తిగా తెంపుకోలేక సతమతమవుతున్నాం. బహుశా తను కూడ అదే సందిగ్ధస్థితిలో ఉన్నాడను కొంటాను. అప్పుడప్పుడే వెలువడిన ‘ఆకుపచ్చలోయ’ కవిత్వ సంపుటంతో పరిచయం పెంచుకొన్నాడు. ‘అతడూ ఆమె మేమూ’ దీర్ఘకవితని గుండెకు హత్తుకొన్నాడు. మా బృందంలోని అందరికీ ఆవశ్యకమైన ఆప్తమిత్రుడయ్యాడు. ఆ తర్వాత మాకు తోడబుట్టిన వాడికంటే ఎక్కువయ్యాడు.

అవును, ఎంతటి కొత్తదనంతో రంజిల్లిన రోజులవి. బ్రతుకుని రొక్కం రూపంలోకి మార్చుకొనే విద్యలు అలవడని కాలమది. తస్సాదియ్యా అన్నీఇన్నీ కలలు కావు. ఆద్యంతం కాంతివంతం, మనోహరం. చేగువేరా అడుగు జాడల్ని అనుసరించే అపూర్వ ఆకాంక్షలవి. శివసాగర్ ‘నల్లాటి సూరీడు’ ఉదయించే అద్భుత క్షణాలవి. సాహిత్యం, సంగీతం, సినిమా, నాటకం, రంగులు, రేఖలు, ఏ పూటకాపూట పాటలే పాటలు. గద్దర్ మీద దాడికి నిరసన, చలపతి విజయవర్ధనం ఉరిశిక్ష రద్దు కోసం ఆందోళన, ‘జిహాద్’ పుస్తకావిష్కరణ పట్ల అభ్యంతరంతో జెండా చెట్టు సభ, తరవ్‌ు ఆవిర్భావం. కేవలం ఘటనల వెంట కొట్టుకుపోవడం కాదు. ప్రతి సంక్షుభిత సామాజిక సందర్భంలోనూ రెక్కలు కట్టుకు వాలడమే.

చూస్తే, అప్పటి ప్రసాద్‌ని చూడాలి. ఎలాగ ఉండేవాడను కొన్నారు? మన కాలం వీరుడి తీరున ఉండేవాడు. సదా అశాంతితో ఉన్నట్టుండి పిడికిలి బిగిస్తుండేవాడు. వింటే, ఆనాటి మాటలు వినాలి. ఏమి మాట్లాడేవాడనుకొన్నారు? నిలువెల్లా ఓ ధిక్కార గొంతుకతో నినదించేవాడు. అర్ధరాత్రి అతిథిలాగ వచ్చేవాడు. ఓ చేతిలో సిగరెట్, మరొక చేత పుస్తకం. సున్నిత హృదయం, సునిశిత మేధ, కట్టుబట్టలు మినహా మరేమీ లేనివాడు, అక్కరలేనివాడు. విస్తృత అధ్యయనం, నిరంతర మధనం. అంతే, ఒక బాలుడివలె నేలమీద కూర్చుని సునాయాసంగా రాసుకుపోయేవాడు. ఒక్కోసారి రాతప్రతుల్ని అక్కడివక్కడే వదిలిపోయేవాడు. ఎక్కడెక్కడో నిలకడ లేని పచార్లు చేసేవాడు. మళ్ళీ ఎప్పుడో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యేవాడు. ఏభయ్యేళ్ళ తన జీవితకాలంలో మూడు దశాబ్దాల ఉద్యమపథంలో కంచికచర్ల నుంచి లక్షింపేట వరకు, నక్సల్బరి నుంచి అస్తిత్వవాద ఉద్యమాల వరకు, ఎస్సీ వర్గీకరణ నుంచి ప్రత్యేక తెలంగాణ నినాదం వరకు, బాబ్రీ మసీదు నుంచి డర్బన్ సదస్సులో ఫిడెల్ కాస్ట్రో సమక్షం వరకు ప్రకాశవంతమైన ప్రయాణం చేశాడు. అదే సమయంలో రచన వ్యాసంగమూ కొనసాగించాడు.

సరే, మేము ఎగరవేసిన భావికాలపు ఊహల రెక్కలు తెగిపోగా, ఒక్కొక్కరం నలుదిక్కులకీ చెల్లాచెదురై పోయాం. అటుపిమ్మట ఒకదాని వెంట ఒక ఆటంకం, అవరోధం. ఆ ఛిన్నాభిన్నపు కాలంలో ఎప్పుడైనా తారసపడినా, ఫోన్‌లో పలకరించుకొన్నా అవన్నీ మొక్కుబడి సమావేశాలు, ముక్తసరి సంభాషణలే. మా ఇంటికొచ్చి కొన్నాళ్ళు ఉండమన్నాను. ఇదిగో వస్తానన్నాడు కాని రాలేదు. పోనీ నన్ను తన దగ్గరికీ రానివ్వలేదు. బహుశా, నాలో ముద్రపడిన ధీరయువక రూపం చెక్కు చెదరకూడదను కొన్నాడు. ఒకనాడు ప్రసాద్ అలక్ష్యం చేసిన రాతప్రతులతో పాటు, ‘వార్త’ సాహిత్యం పేజీ ‘సృష్టి’లో నేను ప్రచురించినవి, ఆదివారం సంచికలో అచ్చయినవి, ఇతర పత్రికల నుంచి సేకరించినవీ అనేక రచనల్ని అతనికి అందజేశాను. అవన్నీ చేతుల్లోకి తీసుకొన్నప్పటి ఆశ్చర్యానందాలను తన చివరి రోజుల లోగొంతుకలో వినగలిగాను. మా స్నేహంలో ప్రసాద్‌ని నేనేమి కోరాను? అతని కవిత్వం పుస్తకంగా ప్రచురిస్తానని మాత్రమే. అమాయకమైన నవ్వుతో తను చనిపోయిన తర్వాత అచ్చువేయమన్నాడు. అంతరంగంలో ఆరని దుఃఖాగ్నితో ఇష్టపూర్వకంగానే రోజుకొకింత హరించిపోయాడు. ఈ పూర్వరంగంలో కవితల సేకరణ ప్రారంభించాను.

నువ్వు ఎంత ఎత్తులో నిలబడితే అంత దూరం నీకు కనిపిస్తుందంటారు. మరి, తన స్వగ్రామం కంచికచర్లలో కోటేశు సజీవ దహన కాండ అనే అమానుషపు పర్వత శిఖరాగ్రం మీంచి ప్రసాద్ ఈ సమాజపు గతిని పరికించాడు. అప్పటికి అతను అయిదేళ్ళ పిల్లవాడు. దళితుడైన కోటేశు (ఆరుకట్ల కోటేశ్వరరావు)ని దొంగతనం చేశాడనే ఆరోపణతో ఆధిపత్య కులస్థులు హతమార్చిన సంఘటన (1968 ఫిబ్రవరి 24) మన వర్ణ, వర్గ వ్యవస్థలోని హింసాత్మక విశ్వరూపాన్ని ఆ లేత కళ్ళకు కట్టినట్టయింది. పెను విషాదం పసి హృదయాన్ని విడవని జ్వరంవలె పట్టుకొంది. అహర్నిశం విస్మృతం కాని నల్ల సీతాకోకచిలుక మాదిరి రెక్కలు కొట్టుకొంది. అందుకనే వెలివాడ ఆంతరిక ప్రేరణనుంచి కాలగమనంలో అతనొక కవిగా; సామాజిక, రాజకీయ కార్యకర్తగా పుట్టుకొచ్చాడు.

ఆనాడు దిగంబర కవులు తమ మూడవ కవిత్వ సంపుటం (1968) కోటేశుకే అంకితమిచ్చారు. ‘ఈ దేశంలో/ ఈ ఇరవయ్యేళ్ళ స్వాతంత్య్రంలో/భయంకరంగా విజృంభించిన/కులమత దురహం కారానికి/ధనమదంతో యథేచ్ఛగా/ ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటున్న గూండాయిజానికి,/ సినిమా రొంపిలో ఈదులాడుతూన్న/యువతరం బలహీనతకి,/స్తోత్ర పాఠాల కుడితిలో పడిపోయిన/పత్రికాలోకం పడుపు జీవనానికి,/అతీత జీవనంతో తప్పించుకు బతుకుతున్న/మేధావుల అనాసక్తతకి,/ నాయకుల ఊసరవెల్లి ఆదర్శాలకి, పదవీ వ్యాపారాలకి/నేటి ఈ ‘కుష్ఠు వ్యవస్థ’కి క్రూరంగా బలైన ‘కంచికచర్ల’ కోటేశు స్మృతిలో’ అని వారు పేర్కొన్నారు. ఆ కులోన్మాదపు ఘటన ఈ దేశంలో మొదటిది కాదు చిట్టచివరిది అంతకంటే కాదు. కిలవేన్మణి, కారంచేడు, నీరుకొండ, చుండూరు, లక్షింపేటలనేకమే తప్ప ఈనాటికీ అంతూ దరీ లేదు. కనుకనే ప్రసాద్ సృజనలో ఆద్యంతం దళిత, బహుజనుల దీనరోదన, ఆగ్రహప్రకటనలని అభివ్యక్తీకరించాడు. విప్లవ, దళితోద్యమాల ప్రవాహపు ఉరవడిలో పడి కొన్నేళ్ళపాటు కొట్టుకుపోయాడు. నీళ్ళింకిన రాళ్ళమయ కాలం ఒడ్డున ప్రేక్షకుడిగానే మిగిలిపోయాడు.

ప్రసాద్ తొలినాటి కవిత ‘మేం అరుస్తూనే వుంటాం’ అరుణతార, 1987 ఏప్రిల్, మే సంచికలో ‘కోటేశు’ కలం పేరుతో అచ్చయింది. దీనిలో కవి తమ ఎట్టి, మట్టి బ్రతుకుల మీద అగ్గయి కురవమని సూర్యుడిని అభ్యర్థిస్తాడు. ఈ కవితలో తొలిసారి కారంచేడుని ప్రస్తావించాడు. 1987 చివరికి అతను ‘యువక’ నామధేయుడయ్యాడు. అప్పటికి విరసంలో సభ్యత్వం తీసుకొన్నాడు. కాబట్టి అదే ప్రాపంచిక దృక్పథంతో కొన్ని కవితలు రాశాడు. 1991లో యువక, నవత సంయుక్తంగా ‘భ్రమల వ(వి)లయం’ రాశారు. మండల్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో ప్రతిభ, రిజర్వేషన్ల మధ్య వివాదాన్ని ఉద్దేశించి ‘ప్రతిభా! నీ అసలు పేరు అసమానత్వం’ అన్నారు. ఆ తర్వాత సొంత పేరుతో రాసిన ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ (అరుణతార, 1991 సెప్టెంబర్) దళిత జీవితానుభవపు కొలిమిలో పదునుదేరిన తళత్తళ కవితగా రూపుదిద్దుకొంది.

“త్రేతాయుగంలో నేను శంభూకుణ్ణి / ఇరవై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు / నా జన్మస్థలం కిలవేన్మణి, కారంచేడు, నీరుకొండ / ఇప్పుడు కరుడుకట్టిన భూస్వామ్య క్రౌర్యం / నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చబొడిసిన పేరు చుండూరు / ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం / ఇప్పుడు ప్రతి గుండే ఒక చుండూరు, రగిలే రాచపుండూరు / నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని / తరతరాలుగా స్వతంత్రదేశంలో అస్వతంత్రుణ్ణి / అవమానాలకూ, అత్యాచారాలకూ, / మానభంగాలకూ, చిత్రహింసలకు గురై / పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాణ్ణి / ధనమదాంధ కులోన్మత్తుల రాజ్యంలో / బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాణ్ణి / బతికేందుకు పదే పదే చస్తున్నవాణ్ణి / నన్ను బాధితుడని పిలువకండి / నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి!” అని ముక్తకంఠంతో చాటింపు వేశాడు. ప్రతి సభలో తన ప్రసంగానికి నాందీగీతం మల్లే ఈ కవితని ప్రసాద్ నోరారా వినిపించేవాడు. ముమ్మాటికీ ఇది ఈ నేల మీద దళితుల ‘ఆత్మ కవిత’ అంటాను.

తొలినాళ్ళ నుంచి అతని కవిత్వం గాఢతని గడించుకొంది. 1990వ దశకంలో ఉత్తమోత్తమ కవిత్వం సృజించాడు. ఆ దశలోనే కవిగా గొప్ప వికాసంతో వెలుగొందాడు. ‘అంటరాని ప్రేమ’, ‘సొరాజ్జెం’, ‘18 డిసెంబర్ 1996’, ‘విలాస్ గోగ్రే’ వంటి రచనల్లోని సంవేదన, ‘బహుశా మనది ఒక దేశం’లోని ఆర్ద్రత, ‘హృదయ చాలనవ్‌ు’లోని అంతర్ముఖత, ‘నువ్వే నేను/తెలం‘గానం’లోని స్పష్టత, ‘కోబలి’లోని కోపోద్రిక్తత, ‘అవిశ్వాసం’లోని అధిక్షేపం, ‘బాబా! అంబేద్కరా’ మొదలుకొని ‘ముఖచిత్రం’ వరకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎడల ప్రాణప్రదమైన భావనతో వెరసి తెలుగు కవిత్వంలో ‘మంటల మానవుడి’ మల్లే రగులుకొన్నాడు. దళిత కవిత్వంలో రీతి వైవిధ్యం చూపాడు. భాషాపరంగా మహా జాగరూకతతో ఉన్నాడు. పదాలను తూర్పార బట్టాడు. మిలమిలమనే పరిభాషను ఏర్పరచుకొన్నాడు. అక్కడక్కడా బైబిల్ వాక్యాల్ని విమర్శనాత్మకంగా జోడించాడు. ఇక మార్గాంతరం లేక పిస్తోలును లోడ్ చేసినంత వడివడిగా కవితని నిర్మించుకొచ్చాడు. విశిష్టమైన సృజనాత్మకశక్తితో ‘హిందూ సామ్రాజ్యవాదం’ మీదికి సాటిలేని గురికాడిగా నిలిచాడు.

స్వతంత్ర రచనతో పాటు ఏకకాలాన అనుసృజనలో కూడ కృషి చేశాడు. 1997నుంచి 2009 మధ్య హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, ప్రజాశక్తి బుక్‌హౌస్ కోసం విరివిగా అనువదించాడు. (ప్రసాద్ స్వతంత్ర, అనువాద పుస్తకాల జాబితాని ఆఖరి పుటల్లో జత చేశాను). వివిధ భాషల మేలిమి కవితలు కొన్ని తర్జుమా చేశాడు. ప్రధానంగా విరసం కాలంలో బెంగాలీ, రష్యన్ కవితల్ని, దళితోద్యమంలో మరాఠీ దళిత కవుల్ని తెలుగులోకి తెచ్చాడు. దేశదేశాల విప్లవ కవులు, దళిత పాంథర్స్ వల్ల అమితంగా ప్రభావితమయ్యాడు. అతని అభిమాన కవులైన ఖలీల్ జిబ్రాన్, పాబ్లో నెరూడాల కవిత్వంలో తన కోసం నిత్యం గాలించుకొనే వాడు. ఆఖరికి “దళిత సాహిత్యోద్యమంలో ఒకడిగా చేరే అవకాశం తనకు కలిగింది” అని విధేయతతో ప్రకటించుకొన్నాడు. ఈ సందర్భంలోనే గద్దర్ వ్యాఖ్య గుర్తుకొస్తున్నది. “ఒక మనిషిగా గుర్తించబడని మనిషి గురించి రాసిన కవిత్వాన్ని దళిత కవిత్వమని ఎట్లా అంటారు మీరు? అది మెన్నత కవిత్వమవుతుంది. కలేకూరి దళిత కవి కాదు, మహాకవి” (హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో కలేకూరి ప్రసాద్ సంస్మరణ సభ నాటి ఆయన ప్రసంగం నుంచి; దళిత్ కెమెరా). ఇటువంటి మాటే నావ్‌ుదేవ్ ధసాల్ కూడ అన్నాడు.I do not differentiate between political poetry and non-political poetry. (Namdeo on Namdeo)

నేను ఆశించినంత సమగ్రంగా కవితల్ని సమీకరించలేక పోయాను. స్వీయ కవితలు 33, అనువాద కవితలు 17 మాత్రమే సంపాదించగలిగాను. మొదటినుంచీ అతని కవిత్వసంపుటం ప్రచురణలో జరిగిన తీవ్రమైన జాప్యాన్ని బట్టి ఈ విధంగా పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాను. ఈ కవితల్ని ప్రధానంగా అరుణతార, ఆంధ్రజ్యోతి, వార్త, ఏకలవ్య, బహుజన కెరటాలు పత్రికల నుంచి; చలపతి విజయవర్ధనం, కావడి కుండలు, నువ్వే లేకపోతే, దారులేసిన అక్షరాలు సంకనాల నుంచి తీసుకొన్నాను. ఇంచుమించుగా అన్ని కవితలకి వాటి ప్రథమ ప్రచురణనే ఆధారం చేసుకొన్నాను. గట్టున కూర్చున్నవాడు విప్లవ/దళిత కవినని వీరమద్దెల వాయించే కాలంలో, నిండా మునిగితేలిన కవి, కార్యకర్త కవితల తొలిప్రచురణ వివరణలివ్వడం అవసరంగా భావించాను.

1984 నుంచి 2012 మధ్య కాలంలో ప్రసాద్ రచన వ్యాసంగం కొనసాగింది. అదే అనుక్రమంలో కవితల్ని పొందుపరిచాను. మా సంయుక్త కవిత FIRST ROAD TO POETS LODGE కి చోటు కల్పించాను. అతని పాటల్ని జనం హృదయగతం చేసుకొన్న రీతిలోనే వచన కవిత్వపాదాల్ని కూడ అనేక మంది కంఠస్థం చేశారు. అలానే కొన్ని కవితల్ని పలుమార్లు పునర్ముద్రించారు. ప్రస్తుతం సాహిత్య వ్యాసాలు, పాటల తేనెతుట్టె జోలికి వెళ్ళలేదు. కాని ప్రసాద్ పాటల్ని జనబాహుళ్యంలో మారుమోగించిన గాయకులు నూకతోటి బాబూరావు, డప్పు ప్రకాష్, చంద్రశ్రీలను ఈ సమయంలో కృతజ్ఞత పూర్వకంగా గుర్తుచేసుకొం టున్నాను.

ఒక ఇంటర్వూలో ప్రసాద్ తన కవితల గురించి మాట్లాడుతూ “కాలానికి నిలబడగలిగే శక్తి ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు” అన్నాడు. అసలు ఏ రచనైనా కాలానికి నిలవడమంటే ఏమిటి? సత్యసంధతతో తరతరంగా చదువరి హృదయంలో కలరవం కావడమో, కలకలం రేపడమో కదా! గాలికి కొట్టుకుపోవడానికి అతనెన్నడూ సాహిత్యేతర ప్రయోజనాల కోసం రాసింది లేదు. ఆనాటి కోటేశు నుంచి ఇటీవలి రోహిత్ వేముల, ప్రణయ్ పెరుమాళ్ళ వరకు లెక్కకు మిక్కిలిగా బలితీసుకొన్న ఈ దేశపు రాచపుండుకి అతని రచనొక కత్తిగాటు వంటిది. దురా‘గతమే’ పునరావృతమవుతోన్న వర్తమానంలో ఈ కవిత్వం ప్రాసంగికత గురించి ప్రత్యేకంగా చర్చించనక్కర లేదు. I shall return to this Bengal అన్న జీవనానందదాసు లాగ ‘మళ్ళొక్కసారి మీ నగరానికి నడిచివస్తా’నని కవి ఓ కవితలో వాగ్దానం చేశాడు.

“కులం కులానికీ తలారుల్ని సృష్టించి

నువు పొందిన నిశ్చింతల విశ్రాంతిని

గద్దనై ఎగరేసుకుపోతాను

మండుతున్న గుండెలయల్ని

నీ పొదరిళ్ళకు తగిలించి

నీ నిదుర దీపాన్ని ఆర్పేసిపోతాను

నల్లదేహాలను నిరసన జెండాలుగా ఎగరేసి

గాయాల దిగంబరత్వంతో

మీ స్వర్ణోత్సవ వేదికల మీదికి నడిచివస్తాను” అని

తర్జనితో హెచ్చరించి వెళ్ళాడు. అతని ఉజ్వలమైన ప్రాణస్పందనలు నేటికి ‘అంటరాని ప్రేమ’ సంపుటం రూపమెత్తి మన చేతులకి అందివచ్చింది. ఇదొక దహనకేతనమై కలేకూరి ప్రసాద్/యువక లేని ఖాళీని పూరిస్తోంది.

 నేడు అంటరాని ప్రేమ 

(కలేకూరి ప్రసాద్ కవిత్వం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333