విద్రోహుల నుండి రక్షించబడాలంటే కొత్త ప్రభుత్వానికి నైతిక మద్దతు అందించాలి
ప్రాంతీయుడు ద్రోహం చేస్తే పాతర పెట్టాలన్న కాలోజి మాట బి ఆర్ ఎస్ కు సూటిగా సరిపోతుంది .
అయితే ద్రోహాన్ని, ఆదిపత్యాన్ని ఏ ప్రభుత్వంలోనూ అంగీకరించే ప్రసక్తి లేదు.
ప్రజాస్వామిక విలువలను విస్మరిస్తే టిఆర్ఎస్ లాగా ఎవరి ఉనికి అయినా గల్లంతే.
---వడ్డేపల్లి మల్లేశం
ఒక కుటుంబాన్ని లేదా ఇంటిని దాడుల నుండి, అవమానాల నుండి, అనవసర ఆరోపణల నుండి రక్షించుకొని భద్రంగా ఆత్మగౌరవంతో జీవించడం ఎంత ముఖ్యమో ఒక ప్రభుత్వ హయాంలో అందులో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మనుగడ సాగిస్తున్న సందర్భంగా ఆకతాయిల, విద్రోహుల , అక్రమాలకు పాల్పడిన గత ప్రభుత్వాల విమర్శలు బెదిరింపులు లేనిపోని అరాచకాల నుండి రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. సరిగ్గా ఆ పరిస్థితి ఇవ్వాళ తెలంగాణ కొత్త ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాలుగా మనం భావించాలి. పరిపాలనను బాధ్యతగా, కర్తవ్యం గా, ప్రజల కోణంలో నిబద్ధతగా నిర్వహించే సేవగా భావించవలసిన సందర్భంలో అధికార దాహంతో ఆధిపత్యాన్ని ప్రదర్శించి అక్రమార్జనకు పాల్పడి ప్రజల ఆగ్రహానికి గురై అసంతృప్తితో గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారానికి దూరంగా నెట్టివేస్తే ఆ అక్కసు కొత్త ప్రభుత్వం పైన తీర్చుకోవడానికి చేస్తున్న పన్నాగాల నడ్డుకొని స్థిరమైన ప్రభుత్వాన్ని ఆశించి ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని కోరుకునే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు ఉద్యమకారులు తప్పనిసరిగా కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అయితే అంతే స్థాయిలో ప్రభుత్వం యొక్క గమనాన్ని, ఎంచుకున్న లక్ష్యాలను, ప్రజల ఆకాంక్షలకు ఇస్తున్న ప్రాధాన్యతలను, గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రజా కోణంలో తీసుకుంటున్న నిర్ణయాలను కూడా గమనించి దారి తప్పకుండా చూడవలసిన బాధ్యత కూడా మన అందరి పైన ఉంటుంది .
2014లో తెలంగాణ ఏర్పడిన సందర్భంలో ప్రజల ఆకాంక్షలు నిజం చేసుకోవాలని అతి ఉత్సాహంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ మద్దతు ఇవ్వడం జరిగింది . కానీ రెండవసారి 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రజాభిప్రాయానికి భిన్నంగాజరిగిన టిఆర్ఎస్ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు భిన్నాభిప్రాయాలతో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ప్రదర్శించినప్పటికీ రెండవసారి కూడా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడాన్నీ మనం గమనించి ఉన్నాం. ధర్నా చౌక్ ను ఎత్తివేయడం, అఖిలపక్షాలతో ఏనాడు సమావేశం నిర్వహించకపోవడం, చట్టసభల్లో ఏకపక్షంగా వ్యవహరించడం, అధికారం తమదే శాశ్వతం అని అనేక సందర్భాల్లో చట్టసభల్లో ప్రకటించడం, ఇచ్చిన హామీలకు చేసిన వాగ్దానాలకు భిన్నంగా ప్రకృతి గుట్టల విధ్వంసం విద్యా వైద్య రంగాలను విస్మరించడం వంటి చర్యల కారణంగా టిఆర్ఎస్ క్రమంగా ప్రజలకు దూరమైనది. నాలుగేళ్ల తర్వాత 2018 ప్రాంతంలో మేధావులు ప్రజాసంఘాల నుండి ప్రభుత్వం యొక్క గమ్యాన్ని గమనాన్ని ప్రశ్నించడం ప్రారంభమైంది . కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కొన్ని వర్గాల నుండి వచ్చిన ప్రతిపాదన మేరకు నాలుగు సంవత్సరాలకు పైగా ప్రశ్నించకుండా మద్దతిచ్చి ప్రోత్సహించినప్పటికీ ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి పరిపాలించడం ప్రారంభమై క్రమంగా ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది . గత రెండు సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా దేశవ్యాప్త జాతీయ పార్టీగా మార్పిడి చేసి జాతీయస్థాయిలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి పన్నిన కుట్ర తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని పార్టీ పేరులోనే కోల్పోయిందనే ఆగ్రహాన్ని పార్టీ చవి చూడవలసి వచ్చింది.
అధికార మార్పిడి - టిఆర్ఎస్ ఆగడాలు -కొత్త ప్రభుత్వం పై బెదిరింపులు :-
క్రమంగా ప్రజల కోణంలో బిఆర్ఎస్ పార్టీ భూ కబ్జాలు, అక్రమ దందాలకు , ప్రభుత్వ భూముల అమ్మకం వంటి స్వప్రయోజనాలకు పాల్పడి తన అస్తిత్వాన్ని కోల్పోయి అరాచక పార్టీగా మిగిలిపోయింది. ఇక తొలినాళ్లలో ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నప్పటికీ అధికారానికి వచ్చిన తొలి రోజుననే టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని ప్రకటించడాన్నీ బట్ట సాంప్రదాయ విధానాలనే కొనసాగిస్తుందని మనకు ఆనాడే అర్థమయిపోయింది . ప్రాజెక్టులు, నిర్మాణాలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల పేరుతో అతి తక్కువ కాలంలో నాణ్యత లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమార్కులకు కట్టబెట్టి అవినీతి ప్రభుత్వంగా మిగిలిపోయిన సందర్భంగా కేవలం కాలేశ్వరం ప్రాజెక్టులోనే 70 వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రధాన ఆరోపణ టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్న వేళ మేధావుల ఆగ్రహం, ప్రజల అసంతృప్తి , టిఆర్ఎస్ పార్టీ ఆదిపత్యం అహంకారం అన్నింటి కారణంగా 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది . అనుత్పాదక రంగాలపైన భారీ ఖర్చు చేయడం పెట్టుబడిదారులు భూస్వాములకు ప్రజాధనాన్ని అప్పనంగా రైతుబంధు ఇతర రూపాల్లో కట్టబెట్టడంతో సుమారు 30 నుండి 40 వేల కోట్ల అదనపు అవినీతి జరిగినట్లు మేధావులు ప్రకటిస్తూ ఉంటే కలిసి వచ్చిన అవకాశం, కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఉత్సాహం ,మేధావుల ప్రోత్సాహం , రాష్ట్రాన్ని విద్రోహుల నుండి కాపాడుకోవాలని దృఢ సంకల్పం కారణంగా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు అడ్డుకోలేకపోవడంతో అధికారంలోకి రావడం సులభం అయ్యింది . ఈ నేపథ్యాన్ని సందర్భాన్ని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించడం చాలా అవసరం. తెలంగాణ రాష్ట్రం కేవలం టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వల్లనే వచ్చిందని అనేకసార్లు ప్రకటించుకోవడం జరిగింది కానీ కోట్లాదిమంది ప్రజల యొక్క పోరాట భాగస్వామ్యం, వేలాది ఆత్మ బలిదానాలు, లక్షలాది ఉద్యమకారుల యొక్క చొరవ కారణంగా వచ్చిందని వాస్తవాన్ని కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ విస్మరించిన కారణంగానే బుద్ధి జీవులు మేధావులు ప్రజాసంఘాలు టిఆర్ఎస్ పార్టీని పాతర పెట్టాలని, ఓడించాలని ఎన్నికల సమయంలో పిలిపివ్వడంని ప్రత్యేకంగా గమనించాలి.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని వర్గాల నుండి నైతిక మద్దతు ఎందుకు అవసరమంటే అక్రమార్కుల 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీయడంతో అప్పుల పాలైన విషయం మనందరికీ తెలుసు. ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకుండా ఎన్నికల్లో గెలవడానికి ఉచి తాలను ఆయుధంగా ఎంచుకొని పరిపాలనను పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి టిఆర్ఎస్ ప్రభుత్వ ధోరణి విచారకరం. ఆ కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్వేత పత్రాల పేరుతో టిఆర్ఎస్ పార్టీ యొక్క దమననీతిని చట్టసభల లోపల బయట ఎండగట్టి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితిని ప్రజల ముందు ఉంచడం జరిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం గట్టెక్కడానికి, ప్రజలకు సుపరిపాలన అందించడానికి, ,మిగిలిపోయిన ప్రజా ఆకాంక్షల నెరవేర్చడానికి, ప్రజాస్వామ్య బద్దంగా పాలనను అందించడానికి , శ్వేత పత్రాలు పరస్పర పోరాటం ఆరోపణలు మాత్రమే సరిపోవు. పైగా టిఆర్ఎస్ పార్టీ ఓటమిని అంగీకరించక వైఫల్యాలను సమీక్షిస్తున్న పేరుతో కాంగ్రెస్ పార్టీ పైన బెదిరింపులకు మొరటుగా నిందలకు పాల్పడడాన్ని ఇప్పటికీ అన్ని వర్గాల వారు అడ్డుకుంటూనే ఉన్నారు . ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని, ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, రైతుబంధు ఎందుకు వేయడం లేదని ప్రతిరోజు బదనాo చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అక్కస్ తీసుకోవడంతో పాలన సరిగా జరగకుండా ఘర్షణ వాతావరణం నెలకొంటున్నది. కొన్నిచోట్ల వేదికల పైననే మంత్రులను టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిందించడం కూడా ప్రభుత్వ గౌరవానికి ఇబ్బందికరంగా మారింది . 7 లక్షల కోట్ల అప్పుచేసి ఈ రాష్ట్రాన్ని ప్రజలను ఉద్ధరించినట్టుగా ఇంతకాలం నమ్మించిన టిఆర్ఎస్ పార్టీ శ్వేత పత్రం ద్వారా బయటపడడంతో తట్టుకోలేని పరిస్థితిలో ఎదురు దాడికి పాల్పడుతున్న సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ యొక్క విద్రోహాన్ని సమాజం యావత్తు ముక్తకంఠముతో ఖండించాలి . కాంగ్రెస్ పార్టీకి నైతిక మద్దతు ప్రకటిస్తూనే ఇచ్చిన హామీలు వాగ్దానాలను రాష్ట్రంలో మిగిలిన పనులను ప్రణాళిక బద్ధం గా కొనసాగించడానికి నైతిక మద్దతు ఇవ్వవలసిన అవసరం మనందరి పైన ఉన్నది .ప్రభుత్వాన్ని గంధర గోళానికి గురిచేసి విఫలమైంది అని ఆడిపోసుకోవడానికి ఎదురు చూస్తున్న టిఆర్ఎస్ పార్టీ యొక్క వక్రబుద్ధిని ఎండగట్టాలంటే ప్రాంతీయుడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెట్టాలి అన్న కాళోజి పిలుపుమేరకు బి ఆర్ ఎస్ పార్టీని ఎగిసిపడుతున్న నాయకులకు తగిన శాస్తి చేయవలసిన అవసరం ఉన్నది .ఆ బాధ్యత ప్రజలు ప్రజాసంఘాలు, మేధావులు ప్రాధాన్యతగా తీసుకుంటే రాబోయే ఐదేళ్లలో పరిపాలన వక్రమార్గంలో కొనసాగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది .అందుకోసమైనా ప్రభుత్వానికి మనం మద్దతివ్వడం కనీస ధర్మం.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇవ్వడం కాదు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవలసిన అంశాలను డిమాండ్ల రూపంలో ప్రభుత్వం ముందు పెట్టడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించి పాలనలో ప్రజలను భాగస్వాములను చేయగలిగినప్పుడు మాత్రమే నిజమైన ఫలితాలను చూడగలము. అయితే విద్రోహం, ఆధిపత్యం , ప్రజా ఆస్తుల విధ్వంసం, ప్రభుత్వ భూములు ఇతర ఆస్తుల అమ్మకాలు వంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభు????త్వం పాల్పడిన కూడా ఊరుకునే సమస్య రాజీ పడే ప్రసక్తే ఉండదు అని చెప్పడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాస్వామి క విలువలను పరిరక్షిస్తామని, మానవ హక్కులను కాపాడుతామని, అక్రమ కేసులను ఎత్తివేస్తామని, ప్రజలు తమ హక్కుల కోసం న్యాయబద్ధంగా చేసే ఉద్యమాలను అంగీకరిస్తామని తెలియజేసిన విషయాన్ని పునాదిగా ప్రభుత్వం మరింత లోతుగా సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించే దిశగా కొనసాగడానికి తగిన వాతావరణం కల్పించడం మన కనీస కర్తవ్యం కూడా. తొమ్మిదిన్నర ఏళ్లలో చేయనటువంటి పనులను నెల రెండు నెలలోనే ఎందుకు చేయలేదు, హామీలను అమలు చేయడం లేదని విమర్శించి బెదిరించడం ఆ పార్టీ యొక్క చౌకబారు రాజకీయానికి ప్రథీ కగా చూడాలి. ఇంకా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలని, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల ముందు పెట్టాలని టిఆర్ఎస్ ఆశపడడం అంటే మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె కావాలని ఆశించినట్లుగానే భావించవలసి ఉంటుంది. బాధ్యతలు నిర్వహించకుండా హక్కులు సాధించలేనట్లే ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమై నిర్జీవమైనటువంటి బిఆర్ఎస్ పార్టీ బెదిరింపులు విమర్శల ద్వారా ప్రభుత్వాన్ని భయపెట్టాలని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లను సాధించాలని ఊహించుకోవడం అత్యాశే అవుతుంది. ప్రజలు ఏ పార్టీ యొక్క విధానాలు ఏమిటో ఇప్పటికే అర్థం చేసుకున్నారు . మాయ మాటలతో అసమానతలను అంతరాలను మరింత పెంచి పోషించే విధంగా భూస్వాములు పెట్టుబడిదారులకు జేబులు నింపి రాజ్యాంగాన్ని ఖూనీ చేసి కుటుంబ పార్టీగా ముద్రపడి అక్రమ సంపాదనలో అనేక అవినీతి కేసులలో ఇరుక్కున్న విషయాన్ని మనం గమనించవచ్చు. రాబోయే కాలంలో గత ప్రభుత్వ అవినీతిపైన అంచలవారీగా విచారణ జరిపించడానికి ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రజలు ప్రజాస్వామ్యవాదులు చేస్తున్న డిమాండ్ టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలకు నిదర్శనం .అందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది ఆ స్పృహ లేకుండా వేరే దారి లేని పరిస్థితిలో ప్రభుత్వం పైన దాడికి పూనుకోవడం సంస్కార రాహిత్యమే కాదు చట్టబద్ధంగాను కేసుల్లో ఇరుక్కునే అవకాశం జైలుకు పోయే ప్రమాదం గత వైఫల్యాలకు బాధ్యత వహించి కటకటాల్లో ఊచలు లెక్కబెట్టవలసిన సందర్భం రావచ్చునని బిజెపి కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న హెచ్చరికలను గమనించి ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా మసులుకోవడం అవసరం . చట్టం తన పని తాను చేసుకోపోతుంది , నేరం రుజువైతే శిక్ష పడుతుంది , అక్రమ సంపాదనను తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయడంతో పాటు లూటీని గత ప్రభుత్వ దోపిడీని పూర్తిగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ వైపుగా నిర్లక్ష్యం వహించి టిఆర్ఎస్ పైన సానుభూతి చూపి వెతక వైఖరి అవలంబిస్తే రాబోయే పరిణామాలకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని అనేక రాజకీయ పార్టీలతో పాటు ప్రజాస్వామ్యవాదులు ఉద్యమకారులు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అందుకే కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం, సమయం ఇద్దాం, ఆలోచనలను ప్రజా కోణంలో పంచుకుందాం .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్ (చౌటుపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)