సాంప్రదాయ రాఖీ పండుగను చరిత్రకే పరిమితం చేద్దామా?
మానవ సంబంధాల బలో పేతానికి మానవీయ కోణంలో ఆలోచిద్దామా?* కథ గానే చూడకుండా జీవితానికి వర్తింపచేసుకుందాం
విచ్ఛిన్నమవుతున్న జీవితాలకు హెచ్చరిక చేద్దాం .*
**************
---వడ్డే పల్లె మల్లేషము 9014206412
---09....08....2025*********
ప్రజలు సాంప్రదాయ బద్దంగా జరుపుకునే ప్రతి పండుగకు చారిత్రక పౌరాణిక ఆధ్యాత్మిక మూలాలను జోడించి చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఆయా కాలాలలో ఉన్నటువంటి చరిత్ర సంస్కృతి మానవ సంబంధాలు ఆలోచనను బట్టి ఈ అభిప్రాయాలు విశ్వాసాలు ఏర్పడతాయి. అయితే మానవ అవసరాలను మానవీయ కోణాన్ని ప్రేమానురాగాలను ప్రతిపలించే ధోరణిలో తప్పకుండా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ వైపుగా ప్రతి పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని విప్పి చెప్పుకోవడం ఆ వైపుగా దృష్టి సారించడం రచయితలు విశ్లేషకుల ప్రధాన బాధ్యత. పౌరాణిక ఇతిహాసిక నేపథ్యం ఏది ఉన్నప్పటికీ ఆధునిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడం కాకుండా మరింత బలోపేతం చేసే దిశగా గతంతో వర్తమానాన్ని మిళితం చేయడం అవసరం. ఆ వైపుగా రాఖీ పౌర్ణమి యొక్క నేపథ్యాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అన్న తమ్ముళ్లు అక్కచెల్లెళ్ల మధ్యన తమ ఆత్మీయతను పంచుకోవడానికి రాఖీ లేదా రక్షాబంధన్ పేరుతో ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి అని పిలువబడే శ్రావణ పౌర్ణమి రోజున రాఖీలు కట్టుకోవడం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రక్రియ. రాఖీ అంటే అది ఒక రక్షణని అన్నా లేదా తమ్మునికి అక్క లేదా చెల్లె రాఖీని కట్టి తన అన్నయ్య లేదా తమ్ముడు ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని కోరుకోవడం ప్రాతిపదికగా ఈ పండుగ జరుగుతున్నప్పటికీ దీని వెనుక ఈ రక్షాబంధన్ ఏవిధంగా ప్రారంభమైనదని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చరిత్రలోకి వెళ్లాల్సిందే కానీ అది మాత్రమే పండుగకు గీటురాయి కాదు. అక్క చెల్లెల్లు అన్నదమ్ములతోపాటు కుటుంబ సభ్యుల బంధాన్ని మరింత ఉన్నతీకరించే దిశగా ఈ పండుగను మానవీయ కోణంలో విస్తరించడమే మన ముందున్న కర్తవ్యం గా ప్రతి ఒక్కరు భావించిన నాడు యాంత్రికంగానే కాకుండా నిజజీవితంలోనూ కుటుంబ బంధాల బలోపేతానికి ఈ పండుగ ఎంతగానో తోడ్పడుతుంది అనడంలో సందేహం లేదు.
పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతల రాజు అయిన దేవేంద్రుడు ఓడిపోయి తన సైన్యంతో అమరావతిలో తలదాచుకున్నాడని భర్త నిస్సహాయతను చూసిన అతని భార్య ఇంద్రాణి రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేసే ప్రమాదం ఉన్నదని గమనించి భర్తను తిరిగి యుద్ధ భూమికి పంపేందుకు ఆరోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులతోపాటు మిగతా వాళ్లను పూజించి భర్త చేతికి రక్షణ కట్టిందని ఆ ఆత్మస్థైర్యముతో యుద్ధంలో గెలిచిన ఇంద్రుడు తన ఆధిపత్యాన్ని తిరిగి పొందడంతో తన భర్త రక్షణకు ఉపయోగపడినటువంటి రక్ష రాఖీ పండుగగా మారిందని పురాణాలు చెబుతున్నట్లు కథనం.
ఇక మరొక చారిత్రక వాదన ప్రకారంగా ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ల అనుబంధం గొప్పదని రుజువు చేసే సంఘటన ఇది. శిశుపాలుని శిక్షించే క్రమంలో వాడిన సుదర్శన చక్రం వలన కృష్ణుని చూపుడువేలుకు రక్తం కారుతుండడంతో గమనించిన చెల్లె ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి వేలికి కట్టు కట్టి రక్తస్రావాన్ని ఆపినట్లుగా తెలుస్తుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా నీకు అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు దుశ్శాసనుడి చేతిలో ఆమె వలువలు లాగినప్పుడు వస్త్రాలను అందించి శ్రీకృష్టుడు తన హామీని నిలబెట్టుకున్నట్లు ఇదే అన్నాచెల్లెల అనుబంధం అని చెప్పే ప్రయత్నం మనకు కనిపిస్తున్నది.
క్రీస్తు పూర్వం కు సంబంధించిన చారిత్రక ఆధారం కూడా ఇందుకు ఎంతో దోహదపడుతుంది గ్రీకు యువరాజ్ అయిన అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 326 లో భారతదేశం పైన దండెత్తిన సందర్భంలో ప్రపంచ విజేతగా మిగిలిపోవాలని ఆలోచించి పురుషోత్తముని పైన యుద్ధం ప్రకటిస్తాడు. భారతదేశపు రాజైన అంబి కూడా అలెగ్జాండర్ కు మద్దతు ఇచ్చినప్పటికీ ఆ యుద్ధంలో పురుషోత్తముడు విజయం సాధించినట్లుగా తెలుస్తున్నది. అలెగ్జాండర్ భార్య రో క్సానా యుద్ధ పరిస్థితులను గమనించి పురుషోత్తముడిని తన అన్నలాగా భావించి రాఖీ కట్టి తన భర్త ఆయన అలెగ్జాండర్ ను చంపవద్దని ప్రాణ బిక్ష పెట్టమని కోరినట్లుగా తెలుస్తుంది. ఈ యుద్ధంలో పురుషోత్తముడే గెలిచినప్పటికీ కూడా అలెగ్జాండర్ ను చంపకుండా వదిలిపెట్టడం ఇక్కడ కొసమెరుపు. ఈ సంఘటన రాఖీ పండుగకు మూలమని మరికొందరు చరిత్రకారులు ప్రస్తావించడాన్ని మనం గమనించాలి.ఇలాంటి అనేక కథనాలు వాడుకలో ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో రాఖీ పండుగను రక్షాబంధనమును ఎలా చూడాలి అనే అంశం పైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండవలసిన అవసరం మాత్రం మనందరికి ఉన్నది . మానవ సంబంధాల ఉన్నతికి రక్షాబంధన్ తోడ్పడాలి:-
*********
ఇది కేవలం అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల బంధానికి మాత్రమే పరిమితం కాదని కుటుంబ సభ్యులు మానవ సంబంధాల ఉన్నతికి తోడ్పడే విధంగా ఈ పండుగను విస్తృతపరచవలసిన అవసరం ఉన్నదని అనే అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తోటి మనిషిని సాటి మనిషిగా చూడలేక విసిగి స్వార్థ ప్రయోజనాలకు బలవుతున్నటువంటి సమాజాన్ని ఈ పండుగ ద్వారా నైనా రక్షించుకోవడానికి రాఖీని వేదికగా చేసుకోవడం అత్యాశేమీ కాదు. ఒక సాంప్రదాయం, అలవాటు, ఆచరణ అనేదానికి తప్పకుండా లక్ష్యాలు సిద్ధాంతాలు భవిష్యత్తు కార్యాచరణ తప్పకుండా ఉంటాయి. వీటిని బలంగా విశ్వసించడం ద్వారా నైతిక విలువల పునాదిగా ఆలోచించడం ద్వారా ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉండాలని కోరుకోవడం ద్వారా నిజమైన మనుషులుగా మనం బ్రతుకుదాం.! ఇతరులను బ్రతకనిద్దాం! అనే ఆలోచన నేటి తక్షణ కర్తవ్యం. సంవత్సరాంతం ఏనాడు కూడా కనీసం మాట్లాడుకోవడానికి కలుసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులలో కూడా పండుగ రోజు ఇప్పటికీ ప్రత్యక్షంగా ఆడపిల్లలు తల్లిగారింటికి వచ్చి తల్లిదండ్రులతో పాటు అన్న తమ్ము లను పలకరించి రాఖీ కట్టి ఆశీస్సులు అందించి భోజనం చేసి మనసారా దీవించి వెళ్లిపోవడం ఇప్పటికీ కొనసాగుతున్నది. గమ్మత్తైన విషయం ఏమిటంటే చిలికి చిలికి గాలి వాన మాదిరిగా ఈ ఆచారం ముమ్మరంగా సాగుతున్నది. రాఖీల అమ్మకాలు బస్సు ప్రయాణాలు ఇతర వాహనాల ద్వారా రవాణా కొనసాగడాన్ని గమనించినప్పుడు ఇది కేవలం ఆడంబరంగా మాత్రం మిగలకూడదనేది కొంతమంది వ్యక్తం చేసే సందేశం. అనేక కారణాల రీత్యా కుటుంబాల మధ్యన వివాదాలు తరచుగా కొనసాగుతూ అసూయ ద్వేషాలు ఇతర ఆర్థిక కారణాల రీత్యా కూడా మాట్లాడుకోవడాన్ని పరిమితం చేసుకున్నటువంటి కుటుంబాల సంఖ్య అనేకం. స్వార్థం, అహంకారం, ఈర్ష్య ద్వేషం, చిన్న చూపు,అవమానించే ధోరణి వంటి కారణాల వలన కూడా కుటుంబ, మానవ సంబంధాలకు పగుళ్లు ఏర్పడడానికి గమనించినప్పుడు ఈ పండుగ ఆ పగుళ్లను నింపేదిగా, మనసులను కలిపేదిగా, మానవతా విలువలను పెంచేదిగా, మమతలను పంచేదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని కేవలం యాంత్రికంగా చూడకుండా జీవితంలో ప్రధానమైన భాగం అని ప్రేమానురాగాలు పంచుకోవడానికి వేదికని గుర్తించడం ద్వారా దీనివన్నె తగ్గకుండా నిరంతరం ఈ ప్రేమానురాగాలు కొనసాగేలా చూసుకోవాల్సిన అవసరం అందరి పైన ఉన్నది. ఒక ఇంటి కోడలు మరొక ఇంటికి ఆడబిడ్డ ఎక్కడో ఒక దగ్గర ఆడబిడ్డగా తల్లిదండ్రులను తోబుట్టువులైన అన్నదమ్ములను ఆశ్రయించడం అంతర్భాగం అయినటువంటి ఈ పండుగను సమర్థవంతంగా కొనసాగించడానికి ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. విచ్ఛిన్నమవుతున్న జీవితాలకు రక్షాబంధన్ ద్వారా చెక్ పెట్టడం, విస్తృత భావజాలాన్ని లోతుగా మేలు కోల్పడం, చారిత్రక ఇతిహాస పరంగా ఉన్నటువంటి ఆధారాలను నిజ జీవితానికి విస్తృతంగా అన్వయించుకోవడం ద్వారా ఈ పండుగ యొక్క ప్రయోజనాన్ని ప్రపంచానికే చాటి చెప్పే విధంగా భారతీయులుగా మనం నిలబడదాం. ఆకాంక్షలను వ్యక్తం చేయడం, తమ ఆశీస్సులు అందించడం, మేలు జరగాలని కోరుకోవడం, తమ బంధం మరింత బరోపేతం కావాలని హర్షం వ్యక్తం చేయడమే ఈ పండుగలోని అంతరార్థం. ఆడబిడ్డలకు ఉన్నటువంటి ఈ ఆలోచన ఆకాంక్షల సరలిని అంతే స్థాయిలో అన్నదమ్ములు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఇంటి కోడండ్లు స్వీకరించినప్పుడు మాత్రమే పండుగ లక్ష్యం నెరవేరి మానవ సంబంధాలు మరింత ఉన్నతీకరించబడతాయి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )