విచ్చలవిడి ఓట్ల చౌర్యంపై కాంగ్రెస్ ఆరోపణకు బదులేది?
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి విమర్శ సర్వత్రా చర్చనీయాoశం కావడం ముదావహం.ఎన్నికల సంఘం నిజాయితీని రుజువు చేసుకోవలసిన సమయం ఆసన్నమైనది. ప్రజా మద్దతు కూడగట్టడం కూడా కీలకం .*
**********
--వడ్డేపల్లి మల్లేశం 9014206412
---11....08....2025*****
భారతదేశంలో పరిపాలన సమర్థవంతంగా నిర్వహించడానికి శాసన నిర్మాణ, కార్యనిర్వహక, న్యాయ శాఖలతో పాటు రాజ్యాంగబద్ధమైన సంస్థల యొక్క పాత్ర గణనీయమైనది. ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రాణాధారమైన ఎన్నికల నిర్వహణ ముఖ్యంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తరుణంలో
పాలక ప్రతిపక్షాలు సైతం ఎన్నికల సంఘం యొక్క నిజాయితీని నిబద్ధతను పరిశీలించి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో పాలకపక్షాలే రాజ్యాంగబద్ధ సంస్థలను ముఖ్యంగా సిబిఐ, ఈడి, ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యము చేస్తున్నది అనే ఆరోపణ స్పష్టంగా వినబడుతున్నది. దానికి మరింత ఆజ్యం పోసే విధంగా ఇటీవలి కాలంలో ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర నిర్వహించినట్లు అంతేకాదు ప్రశ్నించిన వాళ్లను అధిగమించే స్థాయిలో సమాచారాన్ని ఇవ్వకుండా నిర్ణీత గడువు తర్వాత ధ్వంసం చేస్తామని చెప్పడం మరింత ఆందోళన కలిగించే అంశం. గత వారం రోజులుగా ఈ అంశం పైన రోజుకు ఒక కథనం వెలబడుతుంటే 7 ఆగస్టు 2025 గురు వారం రోజున లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు బహిరంగ ప్రకటన ద్వారా ఎన్నికల సంఘం పైన నిప్పులు చెరిగిన విషయo ఈనాడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా కలిగి ఉన్నారు అనడంలో సందేహం లేదు.
ఎన్నికల సంఘం బిజెపితో చేతులు కలిపి దేశంలో ఎన్నికలను ప్రభావితం చేస్తున్నదని, ఓటర్ల జాబితాలో విచ్చలవిడిగా నకిలీ ఓటర్లను చేర్చడం అంటే పాలిత బిజెపి పార్టీకి మేలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తే ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించడం గమనార్హం. ఢిల్లీలో ఇందిరా భవన్ లో మీడియాతో గురువారం మాట్లాడిన రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో లోక్సభ స్థానాలలో జరిగినటువంటి అవినీతిని సోదాహరణంగా వివరించడం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. అనూహ్యంగా ఓడిన బెంగళూరు సెంట్రల్ లోకసభ స్థానంపై దృష్టి పెట్టినట్లు ఈ లోక సభ స్థానం పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిర్వహించిన పరిశోధన ద్వారా 6.5 లక్షల ఓట్లు ఉంటే అందులో లక్ష ఓట్లు దొంగ ఓట్లే నని తేలి నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేయడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయితే ఈ లోక్సభ స్థానంలో కేవలం బిజెపి అభ్యర్థి 32,7o 7, మెజా మెజారిటీతో గెలిచిండు కనుక లక్ష ఓట్లు దొంగ ఓట్లు అయినప్పుడు ఈ ఎన్నిక అక్రమమే కదా అని ఆయన వాదన. మహదేవ్ పురా నియోజకవర్గంలో , 11,965 మంది డూప్లికేట్ ఓటర్లను, ఫేక్ లేదా చెల్లుబాటు కానీ చిరునామాతో 40,009 మంది ఓటర్లు నమోదు అయినట్లు, బల్క్ లేదా ఓకే చిరునామాతో 10' 452 మంది, నకిలీ ఫోటోతో 4132 మంది ఓటర్లు ఉన్నారని మరొక 33,692 మంది ఫామ్ 6 ని దుర్యో దుర్వినియోగం చేసి తొలిసారిగా ఓటర్లుగా నమోదు కావడం అంటే ఇదంతా అవినీతిలో భాగమే కదా! అనేది ఆయన వాదన.
రాహుల్ గాంధీ డిమాండ్ ను ప్రభుత్వం ఎన్నికల, సంఘం పరిశీలించాలి:-
********
బాధ్యతాయుతమైన లోక్సభ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ గారు " లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని నేరపూరితంగా మోసం మోసానికి పాల్పడిందని రాజ్యాంగానికి జాతీయ జెండాకు వ్యతిరేకంగా జరిగిన నేరమని ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జ్యోక్యం చేసుకొని అక్రమాలకు పాల్పడిన వారి పైన నకిలీ ఓటర్లను చేర్చడం పైన కఠిన చర్యలు తీసుకోవాలని" ఆయన కోరారు. అదే మాదిరిగా ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా ప్రధానంగా మారింది. తన ఆరోపణలకు ప్రమాణ పత్రం జతపరచాలని ఎన్నికల సంఘం చేసిన సూచనకు సమాధానం ఇస్తూ "తన సంతకంతో చేసిన డిక్లరేషన్ అవసరం లేదని ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల సమక్షంలో బహిరంగంగానే మాట్లాడుతున్నప్పుడు నా మాటలే ప్రమాణంగా తీసుకోవాలని" చేసిన సూచన ఎన్నికల సంఘానికి ప్రభుత్వాలకు కనువిప్పు కావాల్సిన అవసరం చాలా ఉన్నది. నకిలీ ఓ ట్ల ద్వారా ఎన్నికల వ్యవస్థను చోరీ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే కదా! సీసీటీవీ ఫుటేజీ, ఓటర్ల జాబితాలోని సాక్షాలను ఎన్నికల సంఘం భద్రపరచకుండా ఎప్పటికప్పుడు నాశనం చేయడం అంటే తప్పించుకోవడం కాదా! అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులను ప్రశ్నిస్తూ ఈ తప్పులకు భవిష్యత్తులో అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించడం కోసమేరుపు. రాహుల్ గాంధీ గారు ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే "ఇప్పుడున్న ప్రతిపక్షం ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుంది అప్పుడు మేము ఏం చేస్తామో మీరే చూస్తారని అధికారులను మందలించడంతోపాటు గత ఏడాది లోక్సభ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగింది, నరేంద్ర మోడీ 25 లోక్సభ సీట్లు చోరీ చేసి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు, గత ఎన్నికల్లో బిజెపి 25 స్థానాలలో 33 వేల కంటే తక్కువ మెజారిటీతోనే గెలిచింది, మన ఎన్నికలపై ప్రజలకు ఎన్నో సందేహాలు ఉన్నాయి, ప్రజా వ్యతిరేకత అనేది ప్రతి రాజకీయ పార్టీ ఎదుర్కొనే సవాల్ కానీ బిజెపికి ఈ సవాలు ఎదురు కావడం లేదు. పైగా ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ కంటే భిన్నమైన ఫలితాలు రావడంతో పాటు అంచనాలు తప్పుతున్నాయి. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి?ఎన్నికల్లో ఇప్పుడు కొరియోగ్రఫీ జరుగుతుంది" అని రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేయడం పట్ల దేశ ప్రజలు ఆలోచించవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం ప్రజల యొక్క జాగరూ కతపైన ఆధారపడి ఉంటుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించినాడు కనుక.
ఆడ లేక మద్దెల ఓడిపోయింది అన్న సామెత లాగా:-
***********
ఎన్నికల సంఘం తగిన విచారణకు సిద్ధపడాలి అదే సమయంలో ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించడం ద్వారా తన నిజాయితీని చాటుకోవాల్సిన సందర్భం ఇది. కానీ దానికి భిన్నంగా ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, ఆరోపణకు రుజువుగా ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించడం అంటే పక్కదారి పట్టించడమే కదా! మీ ఆరోపణ నిజమని రుజువు చేయగలిగితే ప్రమాణం చేయాలని రాహుల్ గాంధీకి సవాల్ విసరడంతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ లోని రూల్ 2o (3) బి ప్రకారం ప్రమాణ పత్రం పై సంతకం చేయాలని కాదంటే ఆధారాలు లేని ఆరోపణలకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొనడం పైన కూడా ప్రజలు దృష్టి సారించాలి. ఇక ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బిజెపి నాయకత్వంలోని మంత్రులు కొందరు భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద కుట్రకు పాల్పడుతుందని రాజ్యాంగబద్ధ సంస్థ ఆయన ఎన్నికల సంఘం పైన దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లుగా ప్రకటించడం అంటే నిజంగా ఈ సమస్యను పూర్తిస్థాయిలో సమగ్ర విచారణకు ఆదేశిస్తే తప్ప పరిష్కారం దొరకదు అనిపిస్తున్నది.ఇదే సందర్భంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఉద్యమాన్ని కూడా మరింత తీవ్రతరం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే పూర్తిస్థాయి విచారణ సాధ్యం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )