విశ్వ జ్యోతి పాఠశాలలో ఆదర్శ కార్యక్రమం

Mar 9, 2026 - 19:26
Mar 9, 2026 - 19:51
 0  0
విశ్వ జ్యోతి పాఠశాలలో ఆదర్శ కార్యక్రమం

విశ్వ జ్యోతి పాఠశాలలో ఆదర్శ కార్యక్రమం

మహిళా దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు.

తెలంగాణ వార్త , (నుగూరు)వెంకటాపురం, మార్చి 8: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ విశ్వ జ్యోతి స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయినీలు, 50 మంది మహిళ వితంతువులకి, చీరలు, హాస్పిటల్ లో,రోగుల కి పండ్లు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో బెస్తగూడెం, బీసీ మర్రిగూడెం, నెలారుపేట, వెంకటాపురం, చొక్కాల, వి ఆర్ కే పురం గ్రామాలలోని పలువురు, వృద్ధులకి, వితంతువులకు, చీరలు అందజేశారు. అనంతరం వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వారికి ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా విశ్వ జ్యోతి స్కూలు ప్రిన్సిపాల్ ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, తమ పాఠశాలలోని ఉపాధ్యాయులు సమాజంలో సాటి మహిళలకు సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకి గౌరవం, సమాన హక్కులు, ప్రోత్సాహం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా ప్రధాన శక్తిగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.

ఈ సేవా కార్యక్రమాలపై స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా, సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్న విశ్వ జ్యోతి స్కూల్ యాజమాన్యానికి, వారి సిబ్బందికి ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. స్కూల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.

విద్యాభివృద్ధి మరియు సామాజిక బాధ్యతను ముందుంచుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ విశ్వ జ్యోతి స్కూల్ నిజంగా ఆదర్శ విద్యాసంస్థగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామకృష్ణ ఉపాధ్యాయ సిబ్బంది థామస్,రాధిక, దుర్గాపూర్ణిమ, మాధురి , సంయుక్త, కళ్యాణి, మనోజ్ఞ , లలిత, శరణ్య, శ్రావణి, మధుప్రియ, స్రవంతి ఉపాధ్యాయేతర సిబ్బంది వినోద్, సాయి, ముత్యావతి, రవి పేరెంట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్