క్రికెట్ అభిమానులతో జనసంద్రమైన ముంబై  

Jul 13, 2024 - 22:39
 0  5

.అరేబియా సముద్రపు ఒడ్డున తొక్కిసలాట జరిగితే....?  

జగత్ విజేతలకు  ఘన స్వాగతం పేరున   ఆర్భాటాలు నజరాణాలు  కోట్ల రూపాయలు కొందరికే పంచితే ఎలా?

.శాస్త్రీయ పరిశోధనలు , అన్వేషణలకు  ఈ స్థాయిలో గుర్తింపు ఉండదు ఎందుకు?

---  వడ్డేపల్లి మల్లేశం
జాతీయ అవసరాలలో  క్రీడలు ఒక భాగం  అయితే క్రీడల్లో గెలుపొందడం   ద్వారా అంతర్జాతీయ కీర్తిని  గడించడం అనే పేరుతో  ఆటలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం  కొనసాగుతున్న ప్రక్రియ.  గెలిచిన విజేతలకు  కోట్ల రూపాయలు ప్రభుత్వాలు  క్రీడా సంస్థలు  రాష్ట్ర ప్రభుత్వాలు  ఇవ్వడాన్ని మనం గతంలో చూసి ఉన్నాం  వ్యక్తిగత  విజేతలకు కూడా  కోట్ల విలువైన భూములు కోట్ల రూపాయలు ఉద్యోగాలు  ఇవ్వడాన్ని గనక గమనిస్తే  ఈ దేశంలో క్రీడలకు ఉన్న ప్రాధాన్యత మిగతా ఏ రంగాలకు లేదని తెలిసిపోతున్నది . శాస్త్ర సాంకేతిక రంగాలలో  విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి  పరిశోధనలు అధ్యయనం ద్వారా సంవత్సరాల తరబడిగా కృషిచేసి  కొత్త అన్వేషణలు ఆవిష్కరణలకు జీవం పోసిన శాస్త్రవేత్తల కృషిని  కనీసం మాట మాత్రం గా కూడా గుర్తించిన దాఖలాలు కనిపించవు.  అదేవిధంగా  అట్టడుగు వర్గాలు హక్కులు కోల్పోయినటువంటి పేదలు ఆదివాసీలు  అణగారిన వర్గాల కోసం తమ జీవితాలను ధారబోసి హక్కుల నేతలుగా ఉద్యమించి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి  పోరాటాలు నిర్వహించినప్పటికీ  ఏ లాంటి గుర్తింపు రాకపోగా ప్రభుత్వాలు వీరిని అణచివేసి నిర్బంధించి దశాబ్దాల తరబడిగా జైల్లో వేస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం  .రచయితలు కళాకారులు మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు  ఆయా రంగాలలో  అధునాతన  పరిశోధనలు గావించి కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్న సందర్భంలో కూడా  మాట మాత్రంగా కూడా ప్రచారం లేకపోగా ప్రభుత్వాలు యొక్క కృషి ప్రోత్సాహం  కొరవడిన సందర్భాలను గమనిస్తే  సామాజికత , ఆర్థిక అభివృద్ధి,  సమ సమాజ స్థాపన, అంతరాలు లేని వ్యవస్థ వైపుగా జరుగుతున్న కృషిని ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. కానీ ఏ సామాజికతలేని  ఆర్థిక అసమానతలు లేదా పేదరిక నిర్మూలన వంటి ఎలాంటి  ప్రాతిపదిక లేనటువంటి కేవలం గెలుపే లక్ష్యంగా కొనసాగుతున్న క్రీడలు  అందులో కొద్ది మంది  పాల్గొనడం ద్వారా లభించినటువంటి  విజయాన్ని  ఆసరా చేసుకొని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం  కొంత విచిత్రంగా అనిపించక తప్పదు  .
      టి20    2024  ప్రపంచ విజేతగా న్యూయార్కులో జరిగినటువంటి  ఫైనల్ పోటీలో భారత్ గెలుపొంది  దక్షిణాఫ్రికా ను ఓడించి  17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రపంచకప్ ను స్వాధీనం చేసుకోవడం  ఒక సందర్భం. అయితే  అదే మొత్తం జీవితం లేదా భారతదేశ  అవసరాలను తీర్చే ఏకైక సాధనం అనే రీతిలో  కీర్తించడం మాత్రం  మిగతా అంశాలను చిన్నచూపు చూడడమే అవుతుంది . ఇప్పటికీ క్రీడలు  సమానత్వాన్ని,  సోదర భావాన్ని,  పోటీ తత్వాన్ని పెంచుతాయని, శారీరక  వ్యాయామానికి   దోహదం చేస్తాయని గొప్ప పేరు  ఉండనే ఉన్నది . 29 జూన్ 2024 రోజున  న్యూయార్క్ లో జరిగినటువంటి  పోటీలో దక్షిణాఫ్రికా పైన  ఫైనల్ లో విజయం సాధించి ప్రపంచ కప్ సాధించిన విషయాన్ని  ప్రపంచమంతా కొనియాడుతూ ఉంటే ఆ సంబరాలను  దేశం పంచుకునే క్రమంలోపల  ఇతర ఏ అంశాలకు ఇవ్వని ప్రాధాన్యతను ప్రభుత్వాలు యువత ఇవ్వడం అనేది ఆలోచించ దగ్గర పరిణామం . విజయం సాధించిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన భారత క్రికెట్ జట్టు  రోహిత్ శర్మ నాయకత్వంలో ఢిల్లీలో ప్రధానినీ కలిసి  అభినందనలు అందుకున్న తర్వాత  ముంబైకి చేరుకొని  అరేబియా  సముద్రపు  మెరైన్ డ్రైవ్ తీరం వెంట  టీంకు స్వాగతం పలికే క్రమంలో  వేలాదిమంది  పోటీపడి  విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని ఆశించిన క్రమం  ఒక దశలో  తొక్కిస  లాటకు దారి తీస్తే ఎలా? అని  ఊహించవలసిన స్థాయిలో  జనసంద్రం  కిక్కిరిసిపోవడాన్ని గమనిస్తే  బాధ కూడా కలగక మానదు.  సంతోషం ఎప్పుడూ మన సొంతం కాదు  ప్రకృతి ముందు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మనదేశంలో కాదు ప్రపంచంలో అనేక సందర్భాలలో  కిక్కిరిసి  జన సందోహము మధ్యన  వేలాది ప్రాణులు  గాలిలో కలిసిన వైనాన్ని గమనిస్తే ఇలాంటి  దుస్సాహసాలకు పూనుకోవడం  కొంత ఆక్షేపనీయమే ! జరగకూడనిది ఏదైనా జరిగితే..  ఉత్సాహంలో ఉరకలేస్తే...  ప్రాణాలు పక్కనే ఉన్న సముద్రంలో కలిస్తే  దానికి ఎవరు బాధ్యులు  క్రీడలను ప్రోత్సహించిన ప్రభుత్వమా? లేక కళా క్రీడాకారులా?  గెలుపుకు బాధ్యులైన భారత  క్రికెట్ టీమా? అని ప్రశ్నించుకోవలసిన పరిస్థితి ఉండేది.  పరిమిత సంఖ్యలోనే అవకాశం ఉన్నటువంటి వాంఖేడి స్టేడియంలో  ఉత్సాహము ఉరకలేస్తున్న సందర్భంలో  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 125 కోట్ల నజరానా  తో క్రికెట్ టీం ను సత్కరించడం  ఇంత పెద్ద మొత్తంలో  బహుకరించడం కూడా ఆలోచించదగ్గ విషయం  ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి  టి20 24  ప్రపంచ విజేతకు  93.51 కోట్ల  నగదును ప్రకటించడం  పరిశీలించదగినది.
      17 సంవత్సరాల క్రితం సాధించి  ఇన్నేళ్లుగా నిరంతరం ఓటమిపాలై  ఈసారి ప్రపంచకప్ ను గెలిచి  విజేతగా నిలవడం అనేది సాంకేతికంగా జరిగినప్పటికీ  దానివల్ల భారతదేశానికి ఏ విషయంలో  ప్రయోజనం ఒనగూరిందో చెప్పగలరా?  గోరంతను కొండంత చేసే  ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది  అంతే స్థాయిలో యువత అభిమానుల్లో  కూడా  ఉన్న ఈ ఉత్సాహాన్ని దేశాభివృద్ధి,  ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు, ఉత్పత్తిలో భాగస్వాములు కావడం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని  కాపాడే విషయంలో కూడా  కనబరిస్తే బాగుంటుంది.  యాంత్రికంగా కొనసాగుతున్న ఇలాంటి  ఉత్సాహకరమైనటువంటి యాత్రలు,  లేదా ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు, సినీతారల సందడి ,నవ్వులాటగా మారితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది .అందుకే ప్రభుత్వం ఇలాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా  పరిమిత  పద్ధతిలో కొనసాగించే విధంగా  నిబంధనలు  సవరించాలి .
      శాస్త్ర సాంకేతిక, విద్య,  సామాజిక సేవా రంగాలు,  వైద్యం,  తత్వ, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రాలలో అత్యున్నత స్థాయిలో పరిశోధనలు గావించి  దేశ మౌలిక స్థితిని మార్చగలిగినటువంటి సిద్ధాంతాలను రూపకల్పన చేసిన విషయాలను ప్రభుత్వాలు  ప్రజలందరికీ తెలిసే విధంగా  పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. కానీ  అలాంటి వాటిని  రహస్యంగా ఉంచి కనీసం  ఆ రంగాలలో కృషి చేసిన వారిని అభినందించడం మరిచి  కేవలం క్రికెట్  హాకీ  ప్రపంచ కప్ పోటీలు  సందర్భంలో ఆకాశానికి ఎత్తడం నిధులను కోట్ల రూపాయల్లో ఖర్చు చేయడం నజరాణాలు ప్రకటించడం  అంటే శాస్త్ర సాంకేతిక సామాజిక రంగాల పట్ల చిన్నచూపు చూడడమే అవుతుంది . యువత ప్రజాస్వామ్య వాదులు మేధావులు, విద్యావంతులు కూడా  ఈ విషయాలను ఆలోచించి  భారతదేశ అభివృద్ధి కోసం, అంతరాలు లేని సమాజ ఆవిర్భావం కోసం,  సంపదను పెంచి ప్రజలందరికీ సమానంగా పంచడానికి,  ఉత్పత్తిని పెంచడం ద్వారా  ఆదాయాలను  పెంచి మానవాభివృద్ధిని సాధించే క్రమములో పేదరిక నిర్మూలన  ఆశయంగా పనిచేయగలిగిన వ్యవస్థ కోసం పాకులాడటం నేడు ప్రత్యామ్నాయ ఆలోచనగా  యువత  పెట్టుకోవలసిన అవసరం ఉన్నది . కేవలం ఆటలు  సినిమా రంగం  వంటి వాటి పట్ల  అత్యంత అభిమానాన్ని ప్రదర్శించడం వలన దేశ అభివృద్ధికి పెద్దగా ప్రయోజనం చేకూరేది ఏమీ లేదు.  ఈ సద్విమర్శ  క్రీడాకారంగాన్ని క్రీడాకారులను కొంత  ఆవేదనకు గురి చేసినప్పటికీ  ఈ వ్యాసరచన యొక్క ఉద్దేశం  అంతకుమించినటువంటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక నేపథ్యం ఉన్నటువంటి రంగాలను విస్మరించడం జరుగుతున్నది వీటికి లేని ప్రచారాన్ని గౌరవాన్ని  క్రీడలకు ఇవ్వడం భావ్యం కాదేమో ఆలోచించమని . జన సందోహం చూస్తుంటే ఆశ్చర్యపడినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటిస్తే కిక్కిరిసిన రోడ్ల పైన రాత్రి కూడా  ప్రజలు ప్రేమను కురిపించినారని కోచ్ రాహుల్ ద్రావిడు ప్రకటించడం  అతి సంతోషంలో ప్రమాదాలు కూడా ఉంటాయని  ఆలోచిస్తే మంచిదేమో!  కోట్ల రూపాయలను ప్రకటించడం కాదు  అభినందించడం ప్రోత్సహించడం వారు చేస్తున్న వృత్తికి సంబంధించి  అవకాశాలను కల్పించడం పదోన్నతిని ఇవ్వడం ద్వారా  ప్రభుత్వం సహకరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండబోధు.  ఎందుకంటే ఈ దేశంలో కోటానుకోట్ల మంది  వలస కార్మికులుగా వీదుల్లో పని చేసుకుని బ్రతికే  చిరు వ్యాపారులుగా  నిలువ నీడ లేక  పిడికెడు మెతుకులకు అల్లాడుతున్నటువంటి  దారిద్రరేఖ దిగువన జీవిస్తూ మానవాభివృద్ధికి దూరంగా వెలివేయబడ్డ  పేద వర్గాల గురించి ఆలోచించకుండా  ఉన్నోడి కడుపు నింపడమే గొప్ప అని అనుకుంటే  అది ప్రభుత్వాలకు పాలకులకు ప్రమాదం . ఇప్పటికైనా ఆలోచించాలి పాలకులకు సామాన్య ప్రజలే ముఖ్యమని.  జూలై రెండవ తేదీన ఉత్తరప్రదేశ్లోని హత్రాసులో  ఆధ్యాత్మిక గురువు బోలే బాబా  పాల్గొన్న సత్సంగంలో  తొక్కిస్తాలాట జరిగి 121 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే  ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు  ఇలాంటి  మారన కాండలు భారతదేశంలో  కో కోల్లి లుగా జరిగి వేలాదిమంది  తొ క్కిసలాటలలో ప్రా ణాలు కోల్పోయినారనీ  తెలిసి కూడా అలాంటి  దుస్సాహసాలకు పాల్పడడం మంచిదా ? క్రీడాకారులు, ప్రభుత్వాలు,యువత క్రీడాభిమానులు, ఆలోచించాలి  ప్రమాదాలు జరగక ముందే జాగ్రత్త పడాలి .దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333