తొక్కిసలాటలు కొనసాగాల్సిందేనా ?
దారుణ విషాదాలకు అంతం లేకపోతే ఎలా?* గతంలో ఎన్నో జరిగిన తీసుకున్న చర్యలు లేని కారణంగా ఇవి సర్వసాధారణమైపోయినవి .* అంధ విశ్వాసాలకు వ్యతిరేఖంగా ప్రజలు, కఠిన చర్యలకు పాలకులు సిద్ధపడనంతవరకు కథలుగా చెప్పుకోవాల్సిందే .!
**********
---వడ్డేపల్లి మల్లేశం
స్వాములు బాబాలు బైరాగులు మాంత్రికులు భగవంతుని ప్రతినిధుల మని చెప్పుకునే మోసగాళ్ల కారణంగా ఈ దేశంలో జరిగినన్ని గోరాలు నేరాలు బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు. అంతేకాదు వందలాదిమంది ఆ అంధ విశ్వాసాల మోజులో జరుగుతున్న తొక్కిసలాటలో చనిపోయిన విషయాన్ని గమనిస్తే ప్రయోజనాలు ఎవరికి జరుగుతున్నాయి? ప్రభుత్వాలు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి? ఆలోచించవలసిన సీరియస్ నెస్ ఎక్కువ కనబడుతున్నది . 2005లో మహారాష్ట్రలోని మందరా దేవి గుడి దగ్గర తొక్కిసలాటలో 340 మంది పైగా చనిపోయారు . 2008లో రాజస్థాన్లో చాముండా దేవి ఆలయం వద్ద 250 మంది తొక్కిసలాటకు బలైనారు . హిమాచల్ ప్రదేశ్ లోని నైనా దేవి గుడి వద్ద 162 మంది దుర్మరణం పాలు కాగా 1954లో జరిగిన తొలి కుంభమేళాలో అలహాబాద్ లో జరిగిన దుర్ఘటనలో 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం గుండెల్ని పిండి చేసే విషాదం కాక మరేమిటి? .ఇవి కొన్ని మాత్రమే..... పరిశీలించదగ్గ విషయం ఏమిటంటే భారతదేశంలో జరుగుతున్న ఇలాంటి తొక్కేసలాటలో 100 కు 79 ధార్మిక సమ్మేళనాలు దేవాలయాలు తీర్థయాత్రలలో, విశ్వాసాలు గుడ్డి నమ్మకాలతో జరుగుతున్నట్టు 2013లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ పత్రికలో ప్రచురణ ద్వారా తెలుస్తున్నది. 2014లోనే జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ జన సమర్థము గల ప్రాంతాలలో జరిగే ప్రమాదాలను నివారించడానికి మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ వాటిని కచ్చితంగా అమలు చేయకపోవడం, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారిని అదుపు చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల కారణంగా ఇవి నిరంతరం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నధీ.
హత్రాస్ సంఘటనను పరిశీలిస్తే:-
******* జూలై 2 2024 మంగళవారం రోజున ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ సమీపంలోనీ పూల్రాయ్ వద్ద జరిగిన సత్సంగ్ తొక్కి సలాటలో 121 నిండు ప్రాణాలు బలి కాగా వందలాదిమంది గాయపడినట్లుగా తెలుస్తున్నది .80 వేల మందికి మాత్రమే ఏర్పాట్లు ఉంటే రెండున్నర లక్షలకు పైగా జనం గుమగూ డినప్పుడు పరిసర ప్రాంతాలంతా బురదమయం అయినప్పుడు పాద ధూళితో మంచినీళ్లతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పుకున్నటువంటి బోలె బాబా సత్సంగ్ విషాదాంతం కాక మారేమవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎట్టా జిల్లా వాసి అయిన సూరజ్ పాల్ 28 ఏళ్ల క్రితం పోలీసు పనిచేసి మంత్ర తంత్రాలు లైంగిక నేరాల కారణంగా ఉద్యోగం నుండి సస్పెండ్ అయి సాకారు విశ్వ హరిగా పేరు మార్చుకొని స్వయం ప్రకటిత దేవునిగా మారి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా అనేకమంది లక్షల భక్తులను తయారు చేసుకొని నేరాలకు పాల్పడుతున్నట్లు తెలు స్తుంటే బాబా పైన అనేక కేసులు ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ మాజీ డిజిపి తెలియజేయడం కోస మెరుపు .బోలె బాబా సన్నిధిలో రాజకీయ నాయకులు ఐఏఎస్ ఐపీఎస్ తో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా సేద తీరుతున్నారంటే ఈ దేశ పాలనాదక్షత ఏపాటిదొ అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లు అంధ విశ్వాసాలను కలిగి ఉన్నారంటే ఇక సామాజిక విష రుగ్మతలను పెంచి పోషించడమే కదా ! "ప్రజల ఆలోచనలు, ఆశలు, ఆశయాలను, భయాలను, అందవిశ్వాసాలను, పెట్టుబడిని, అందాన్ని ఆధ్యాత్మిక ముసుగులో ఉపయోగించుకొని అరాచకాలకు పాల్పడుతున్నటువంటి రాటు దేలిన కేటుగాళ్లకు ఈ దేశంలో కొరత లేదు గుర్మీత్ సింగ్ , ఆశారాం బాపు, రాంపాల్, సూరా బాబా వంటి అనేకమంది బాబాలు తమ ఆశ్రమాలలో హత్యలు అత్యాచారాలు మోసాల తోపాటు భూ కబ్జాలకు పాల్పడుతున్న విషయాన్ని గమనించినప్పుడు ఇది కేవలం ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయమే కాదు, కొందరి అండ చూసుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్న దీని వెనుక ఉన్న గుట్టు రట్టు చేయవలసిన అవసరం చాలా ఉన్నది .పరిధికి మించిన జన సమీకరణ వల్ల 121 మంది అమాయక భక్తులు ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు చనిపోవడం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారాలు, ప్రకటించడం సి ట్ దర్యాప్తుకు ఆదేశించడం , న్యాయ విచారణకు పూనుకోవడం జరిగింది కానీ అది కాదు. ఇలాంటి ఘటనలకు దారితీస్తున్న కారణాలను దాని వెనుక దాగి ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ కోణాలను పరిశీలించకుండా ప్రజలను గుడ్డి విశ్వాసాల వైపు పురికొల్పే కొన్ని మత సంస్థలు రాజకీయ పార్టీల కారణంగా కూడా ఇలాంటి దుష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయనీ నిగ్గుతేల్చాలి. తో క్కి సలాట జరిగి చాలామంది చనిపోయిన తర్వాత ఆ సందర్భంలో అక్కడి నుండి పారిపోయిన బోలే బాబా తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి ఎంతటి విచారణకైనా సహకరిస్తానని తన న్యాయవాది ద్వారా ప్రకటించడంతోపాటు ఈ దుర్ఘటన వెనుక అసాంఘిక శక్తుల కుట్ర ఉన్నదని నమ్మబలికే ప్రయత్నం చేస్తుంటే ఇక పాలకులు ఎందుకు పోలీసు వ్యవస్థ మరెందుకు? .2020 జనవరిలో షాజహాన్ పూర్ లో ఈయన సత్సంగంలోనే ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న సందర్భంలో మంటలు చెలరేగి తొక్కి సలాట జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో అగ్నిమాపక యంత్రాలు రావడంతో ప్రమాదం తప్పించి కానీ ఆత్రాస్ సంఘటనకు సంబంధించి ప్రవేశ ద్వారాలు కూడా సరిగా లేనటువంటి ఇరుకైన ప్రదేశంలో నిర్వహించిన ఈ సత్సంగములో తగిన ఏర్పాట్లు గాని ముందు జాగ్రత్తలు గానీ లేకపోవడాన్ని కూడా మనం గమనించాలి .అసలు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతించడమే పెద్ద నేరం ఆ నేరస్తులను కాపాడ డమే ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం. తన పాద దూలిని తీసుకువెళ్లి సమస్యలు ఆందోళనలు బాధల్లో ఉన్నవారికి రాస్తే అన్ని చక్కబడతాయని అమాయకుల బలహీనతతో తాను ఇచ్చే జలం సర్వరోగ నివారిణి అని ప్రచారం చేసుకోవడం ప్రజలు సంవత్సరాల తరబడిగా ఆ విశ్వాసంలో అనుకరించడం ఆ పాద దూళి కోసమే ఎగబడిన సందర్భంలో ఈ దుర్ఘటన జరగడం అంతులేని విషాద గాథ గాక మరేమిటి ?బాణామతి చేతబడి పేరుతో కొందరి పైన వస్తున్న ఆరోపణల కారణంగా సజీవ దహనం చేయడం ఒక అంశమైతే ధనరాశులను దేవాలయాలు ఇతరత్రా శిథిలావస్థలో ఉన్న ప్రాంతాలలో దాగి ఉన్న సంపదను దోచుకోవడానికి పసివాళ్లను బలి ఇవ్వడం వంటి దుర్మార్గపు చర్యలకు కూడా పాల్పడుతూ మానవాచీత శక్తుల ప్రమేయం రాజ్యమేలుతున్న కారణంగా ఇలాంటి దౌర్భాగ్యకర సంఘటనలు జరుగుతున్నట్లు మనం ముగింపుకు రావలసిన అవసరం చాలా ఉన్నది. ఇందులో సామాజిక ఆర్థిక కోణంతో పాటు శాస్త్రీయ విలువలను పెంపొందించకపోవడం, చైతన్యం లేకపోవడం, స్వార్థ ప్రయోజనాలకు ఎంతటికైనా పాకులాడడం ప్రధానంగా కనపడుతున్నటువంటి లోపాలు . గుడ్డి విశ్వాసాలు, ఆ ముసుగులో జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు, తొక్కిసలాటలో జరుగుతున్నటువంటి మారణకాండ, ప్రజల చైతన్యానికి ఆటంకమవుతున్నటువంటి ధోరణులు కారణంగా సామాజిక వ్యవస్థ యొక్క ఎదుగుదల కృషించిపోయే ప్రమాదం ఉన్నది రాజ్యాంగంలోని మౌలిక విలువలను పరిరక్షించుకోవడానికి సాధించుకోవడానికి హక్కులను పొందడానికి సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం న్యాయం వంటి విలువలను సమాజం నిండా విస్తరింప చేయాలంటే ప్రశ్న, ప్రతిఘటన , దోపిడిని వ్యతిరేకించడం ,పీడనను నిరోధించడం, పాలకుల యొక్క బాధ్యతలను గుర్తింప చేయడం చాలా అవసరం . విద్యా బోధనలో మరింత శాస్త్రీయమైన వైఖరిని పెంపొందించడంతోపాటు
ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో దారిద్రరేఖ దిగువ నగల వారిని పైకి తేవడం, పేదరికం నుండి విముక్తి చేయడం, సంపదను జాతీయం చేయడం, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడడం వంటి చర్యలు కూడా ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఆలోచనను కలిగించడానికి మూడవిశ్వాసాల నుండి బయటపడడానికి కర్తవ్యాన్ని తగిన స్థాయిలో నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో పాలకులు పోలీసు వ్యవస్థ ప్రధానంగా సామాజిక రంగంలో ఉన్నటువంటి వాళ్లు కూడా తమ బాధ్యతలను గుర్తించి అంద విశ్వాసాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందుండి పాలకుల యొక్క లోపాలను ఎత్తి చూపడం ద్వారా తప్పులను సవరించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది . గతంలో జరిగిన సంఘటనలతో పాటు ప్రస్తుత సంఘటనలో 121 మంది మృత్యువాత పడినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నామాత్రంగా ప్రకటించడంతోనే సరిపెట్టుకుంటే కుదరదు అలాంటి వారి గుట్టు రట్టు చేసి ఇలాంటి సత్సంగాలు జరగకుండా చూడాలి. ప్రజల విశ్వాసాలను మరింత ఆసరా చేసుకుంటున్నా ఇలాంటి బాబాలను కటకటాల్లోకి నెట్టాలి ప్రజా జీవితంలో ఇలాంటి మాయాన్ని మచ్చలు జరగకుండా చూస్తే మంచిది లేకుంటే ప్రజలు ఇలాంటి విశ్వాసాల ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంటారు .ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి . అనాధలుగా అభాగ్యులుగా ప్రాణాలు వదలవలసిందేనా? అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు?
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )