మాతృత్వానికి వాయు కాలుష్యం అవరోధం అంటున్న శాస్త్రవేత్తలు
సంతానలేమి తో బాధపడుతున్న వారు వాయు కాలుష్యానికి దూరంగా ఉండడం శ్రేయస్కరం.* ముందు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ గందరగోళం నుండి బయటపడడం కీలకం .*
************
---వడ్డేపల్లి మల్లేశం 9014206412
---05...06...2025****----***
"మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అమ్మ అని పించుకొనుటే స్త్రీ మూర్తికి గౌరవం " అని ఆడ జన్మ ఔన్నత్యము గురించి సినీ రచయిత వర్ణించిన అంశం నిజంగా చాలా గొప్ప విషయం. ఇప్పటికీ ఆ అవకాశానికి నోచుకోని వాళ్ళు కారణాలు ఏవైనా సమాజంలో వివక్షతకు గురి కావడమే కాకుండా త ల్లడిల్లుతున్న మహిళా మణులను ఎందరినో చూడవచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం గా వాయు కాలుష్యం రోజురోజుకు ఎక్కువ అవుతున్న కారణంగా సంతానలేమి సమస్య ప్రధానంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మహిళలు ఈ ప్రమాదము నుండి బయటపడడానికి కృషి చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. తల్లి కావాలని, పిల్లలకు జన్మనివ్వాలని, తన కలల రూపంగా వారిని తీర్చిదిద్దాలని ఆశించే తల్లి ఆలోచనలకు విఘాతము కలిగిస్తున్నటువంటి వాయు కాలుష్యం గురించి అవగాహన చేసుకోవడం, దాని ఉధృతిని ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా దాని నుండి బయటపడడానికి, చిన్నారులకు జన్మనివ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపుగా మహిళలతో పాటు సమాజం యావత్తు దృష్టి సారించవలసినటువంటి అవసరం ఎంతగానో వుంది. కొన్ని పరిశోధనల ప్రకారంగా ప్రతి 6 జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తన అధ్యయనంలో వెల్లడి చేసింది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆలస్యంగా జరుగుతున్నటువంటి పెళ్లిళ్లు, కొన్ని ప్రభావాలకు గురవుతున్నటువంటి జన్యువులు హార్మోన్లు, శరీర నిర్మాణంలోని అపసవ్యాలు, పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యం సంతానలేమిటి కారణమని ఆ పరిశీలనలో వెల్లడైనట్లు తెలుస్తున్నది. వాయు కాలుష్యం వలన అందులోని హానికర కర్బన రసాయనాలు ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద హార్మోన్ల పైన తీవ్రంగా ప్రభావం చూపడం వల్లనే సంతాన లేమి అనే సమస్య ఎదురు కావడం జీవన పోరాటంగా మారడాన్ని మనం ఎంతో మంది జీవితాలలో స్పష్టంగా గమనించవచ్చు.
వాయు కాలుష్యం ఏరకంగా కారణమవుతున్నది?
*************
ముఖ్యంగా పట్టణాలలో ట్రాఫిక్ మధ్యన దుమ్ము ధూళి తో పాటు అనేక వాహనాల పొగ మధ్యన చిక్కుకునే మహిళల లోపల సంతాన సాఫల్యత రేటు తక్కువగా ఉన్నట్లు, వాయు కాలుష్యమే అందుకు కారణమని బ్రిటిష్ మెడికల్ జనరల్ పేర్కొన్నది. వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో నివసించే మహిళల లోపల సంతానలేమి ఎక్కువగా ఉందని ఫార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన అధ్యయనములో వెల్లడైనట్లుగా తెలుస్తున్నది. వాయు కాలుష్యానికి కారకాలైనటువంటి సల్ఫర్ డయాక్సైడ్,నైట్రో జెన్ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, బార లోహాలు, హైడ్రో కార్బన్ల వంటి హానికారకాలు మహిళల్లో సంతానోత్పత్తి హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తున్నాయని దానితో నెలసరి క్రమం తప్పి పీసీఓడీ వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా ఈ కాలుష్య కారకాల వలన సంతానోత్పత్తిలో కీలకమైన అండాశయాల పనితీరు దెబ్బతిని, హార్మోన్స్ ప్రభావితమై, అండాల నాణ్యత నిల్వలు తగ్గిపోయి గర్భం దాల్చడం కష్టమవుతున్నట్లు ఒక్కొక్కసారి అసాధ్యమవుతున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నట్లు మనం గమనించవచ్చు.
గర్భిణులపై ప్రభావం గైనకాలజిస్ట్ విశ్లేషణ :-
***********
వాయు కాలుష్యం వళ్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ కొన్ని ప్రయత్నాలు చికిత్సలు ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా గర్భము దాల్చినప్పటికీ వాయు కాలుష్యం కారణంగా సీసం పాదరసం వంటి కారకాల వల్ల నెలలు నిండకముందే ప్రసవించే వారి సంఖ్య పెరగడంతో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవడం, తక్కువ బరువుతో పుట్టడం, దీర్ఘకాలంలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తినడం జరుగుతున్నట్లుగా తద్వారా బీపీకి కారణం అవుతున్నట్లు వైద్య నిపుణురాలు గైనకాలజిస్ట్ డాక్టర్ అనగాని మంజుల గారి విశ్లేషణ మహిళా సోదరీమణులకు ఎంతో తోడ్పడుతుంది. కాలుష్య కారకాల వలన నవజాత శిశువుల ఆకస్మిక మరణాలు పెరగడంతో పాటు పురుగుమందులు ఫ్యాక్టరీల నుండి వెలువడే రసాణాలతో రొమ్ము అండాశ క్యాన్సర్లు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదని వాయు కాలుష్యాన్ని అంతం చేయడమే పరిష్కారమని వారి పరిశీలన ద్వారా తెలుస్తున్నది .
వాయు గండం నుండి మాతృత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని సలహాలు :*
************
నిపుణులు అందిస్తున్న కొన్ని సలహాలు ముందు జాగ్రత్తలను పాటించడం ద్వారా కొంతవరకైనా మాతృత్వానికి అవరోధంగా మారిన వాయుగండం నుండి బయటపడి సంతాన భాగ్యాన్ని పొందడానికి అవకాశముంది.
- రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలి అనివార్యమైతే మాస్కు ధరించాలి.
-- కాలుష్యం మధ్యన అనివార్యంగా ఉండవలసి వచ్చినప్పుడు ఇంటి చుట్టూ లోపల ఆక్సిజన్ ను ఎక్కువగా విడుదల చేసే తులసి, స్నేక్ ప్లాంట్, లిల్లీ, స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కలు పెంచుకోవడం అవసరం. వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడంతో పాటు సెంటెడ్ క్యాండిల్స్ వాడకం తగ్గించాలి.
-- ఆరోగ్యకరమైన జీవనశైలి, పచ్చదనం ఉన్న వాతావరణంలో నివసించడం, సమతుల ఆహారంతో పాటు వ్యాయామం చేయడం కీలకము .
--వివాహాలు చేసుకోవడం పిల్లల కనడం 30 సంవత్సరాల లోపే జరగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30 దాటిన వాళ్ళ పైన వాయు కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నందున ముందుగానే జాగ్రత్త పడటం చాలా అవసరం.
శాస్త్రీయ పరిశోధనల పైన దృష్టి సారించి, అవగాహన పెంచుకొని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న వైద్య చికిత్సలను పాటిస్తూనే జీవనశైలిని మార్చుకోవడం ద్వారా కూడా వాయు కాలుష్యం నుండి బయటపడి మెరుగైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అది అంతా మన ఉల్లాసం,ఉత్సాహం, స్వయం నిర్ణయం, సంతోషం పైన ఆధారపడి ఉంటుంది.(మహిళాశోదరీమణులకు శుభాకాంక్షలతో అంకితం )
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)