కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బీసీలకే కేటాయించాలి

Jan 28, 2026 - 19:57
 0  2
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బీసీలకే కేటాయించాలి

తిరుమలగిరి 26 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట (డిసిసి) జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రామ్ ప్రభు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే, జిల్లాలో మెజార్టీ ప్రజలైన బీసీలు సూర్యాపేట జిల్లా నుండి చట్ట సభలలో ప్రజాప్రతినిధులుగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకరావడం కోసం బడుగు బలహీన వర్గాలు, పార్టీ బాధ్యతలను భుజాలపైన వేసుకొని, రక్తాన్ని చెమటగా మార్చుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విశేషంగా కృషి చేశారని అన్నారు. 2023 సాధారణ ఎన్నికల్లో బిసి లకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం ఇవ్వలేదని, కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో కాంగ్రెస్ జిల్లా కమిటీ లో సగభాగం బీసీలకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకొని సామాజిక న్యాయాన్ని పాటించాలని కోరారు.  రాష్ట్రంలోని 33 జిల్లాలో మెజార్టీలుగా ఉన్న బీసీలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా మంత్రివర్యులు ఆలోచన చేసుకుని బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. లేకపోతే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి