కవిత శాపనార్థాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 03: బీఆర్ఎస్ పార్టీ తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై కల్వకుంట్ల కవిత బుధవారం మీడియా ఎదుట స్పందించారు. కలికాలం, కర్మ సిద్ధాంతమంటూ ఆమె ఈ సందర్భంగా వేదాంతంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తాను దాదాపు 20 ఏళ్ల పాటు సేవా చేశానని ఈ సందర్భంగా కవిత గుర్తు చేసుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావులే పార్టీ కోసం పని చేశారా? తాను పని చేయాలేదా? అంటూ బీఆర్ఎస్ అగ్రనేతను ఆమె సూటిగా ప్రశ్నించారు. అయితే తనపై పుకార్లు చేసిన వారు.. చేయించిన వారు అంతకుఅంత అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు.
తాను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతానని స్పష్టం చేశారు. ఏదీ ఏమైనా తన ప్రాణం పోయినా కేసీఆర్‌కు మాత్రం అన్యాయం జరగనివ్వనని ఆమె కుండ బద్దలు కొట్టారు. తనపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా? అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలను కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా అడిగారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కేసీఆర్‌కు తాను కుమార్తెగా జన్మించానని చెప్పారు. అలాంటి కేసీఆర్‌ను, ఆయన పార్టీని తాను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటానని ఆమె పేర్కొన్నారు.