ఎస్సీల సంక్షేమం, అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
ఎస్సీలకు అందుతున్న పథకాలపై శాఖలవారీగా నివేదిక సమర్పించాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : జిల్లాలో షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ని మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో అలంపూర్ శాసనసభ్యులు విజయుడుతో కలిసి షెడ్యూల్డ్ కులాల స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ వినియోగంపై జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధితో పాటు వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన నిధులను అర్హులైన ఎస్సీ కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరేలా సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఎస్సీ లబ్ధిదారుల వివరాలను శాఖల వారీగా సేకరించి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ పరిధిలో ఎస్సీల అభివృద్ధికి కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ప్రతి శాఖకు మంజూరైన నిధులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎస్సీ వర్గాల వారికి అవసరమైన సదుపాయాలను గుర్తించి, అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని చెప్పారు. జిల్లాకు మంజూరైన నిధులను సకాలంలో నిబంధనల మేరకు వినియోగించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అలంపూర్ శాసనసభ్యులు విజయుడు మాట్లాడుతూ అలంపూర్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎస్సీల అభివృద్ధి నిధులతో గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్,
నర్సింగరావు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నాగరాజు, డీయంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, ఉద్యాన శాఖ అధికారి రాజ్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద, సీపీఓ పాపయ్య, పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వర్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, డిఆర్డిఓ ముషాయిదా బేగం, మిషన్ భగీరథ ఇంట్రా అధికారి పరమేశ్వరి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.