బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత. 

Feb 18, 2026 - 20:11
 0  1
బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత. 

 జోగులాంబ గద్వాల 18 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల బాల్య వివాహాలు నిర్మూలించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, సంబంధిత శాఖల అధికారులేకాక ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పిలుపునిచ్చారు. 

జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సౌజన్యంతో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జస్ట్ రైట్స్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన కల్పించేందుకు బాల్య వివాహ ముక్త్ భారత్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా రూపొందించిన రథయాత్ర వాహానాన్ని బుధవారం ఐడిఓసి ఆవరణలో జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి. ఎం. సంతోష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినప్పటికీ  అక్కడక్కడ బాల్యవివాహాలు జరుగుతుండడం బాధాకరమన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు, కేటీ దొడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని నిర్మూలించేందుకు ప్రజలందరూ సామాజిక బాధ్యతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలకు సన్నాహాలు చేస్తుంటే ముందుగానే తెలుసుకొని ఆపివేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. అమ్మాయిలకు 18 ఏళ్లలోపే పెళ్లి చేయడం వలన వారి చదువు మధ్యలోనే ఆగిపోతుందని, ఆరోగ్యపరంగానూ ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం వలన తల్లితోపాటు శిశువు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఫలితంగా రెండు, మూడు తరాలు వివిధ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల్లో పాలుపంచుకునే వారందరికీ చట్టపరంగా వివిధ శిక్షలు వేయడం జరుగుతుందని ప్రజలకు పూర్తిస్థాయిలో అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. పౌరులందరూ బాల్యవివాహాల నిర్మూలనను సామాజిక బాధ్యతగా భావించి ప్రభుత్వానికి సహకరించాలని పేర్కొన్నారు. 2030వ సంవత్సరం నాటికి దేశంలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు  అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, బాల్య వివాహ ముక్త్ భారత్ ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందేశం ప్రతి మండలానికి, గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి చేరేలా సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం బాల్యవివాహాల నిర్మూలనపై ముద్రించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి విడుదల చేశారు. బాల్య వివాహాలు లేని భారతదేశము నినాదంతో రూపొందించిన సిగ్నేచర్ క్యాంపెయిన్ బోర్డుపై కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు తమ సంతకాలు చేశారు. అలాగే బాల్యవివాహాల నిర్మూలన ప్రతిజ్ఞను చేయించారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్, డిడబ్ల్యుఓ సునంద, డీఈవో విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, డీసీపీఓ నరసింహ, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, జస్ట్ రైట్స్ సమన్వయకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 
..................................................

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333