ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మీద బి ఆర్ ఎస్ బెదిరింపులు ఏంది ?

ఏ అర్హతతో పార్లమెంటు ఎన్నికల్లో ఓటేయాలని అడుగుతున్నారు ?
పదేళ్లలో హామీలు అమలు చేయని బారాసాకు విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది?
టిఆర్ఎస్కు ఎందుకు ఓటేయకూడదో ఎంత ద్రోహం చేసిందో ఒక్కసారి గమనిద్దాం !
---వడ్డేపల్లి మల్లేశం
"ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల పట్ల అప్రమత్తులై ఉండాలి" అంటాడు అరిస్టాటిల్ . అంటే హామీలు ఇవ్వడం తీయటి మాటలు మాట్లాడడం కోటి దండాలు పెట్టడం అవసరమైతే కాళ్లు పట్టుకున్నప్పటికీ ప్రజలను ఓటర్లను సందర్భం వచ్చినప్పుడు బానిసలుగా చూస్తారని యాచకులుగా మార్చుతారని అరిస్టాటిల్ మాటలోని అంతరాఫ్తాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. ఒక ప్రభుత్వం యొక్క పనితీరును అంచనా వేయడానికి కనీసం ఐదు సంవత్సరాలు అవసరముంటుంది .
ఆరోహణ అవరోహణలు, గత ప్రాలకుల యొక్క వైఫల్యాలు , బడ్జెట్ పరిస్థితులు, ప్రజల యొక్క సహకారం, ప్రతిపక్షాల యొక్క అండదండలు వంటివి ఒక ప్రభుత్వం విజయవంతం కావడానికి ప్రధానంగా దోహదపడే అంశాలు. 2014 నుండి 2023 నవంబర్ వరకు అధికారంలో కొనసాగిన టిఆర్ఎస్ పార్టీ ప్రజలు మేధావులు బుద్ధి జీవుల అండదండలతో పాటు ప్రతిపక్షాల యొక్క సహకారం వల్లనే ఆమాత్రమైన నెట్టుకు రాగలిగిందని గుర్తించాలి. నాలుగు సంవత్సరాల వరకు ప్రతిపక్షాలతో సహా బుద్ధి జీవులు మేధావులు కవులు కళాకారులు ఎవరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు . ఎందుకంటే కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రం సమస్యల సుడిగుండంలో ఉంటుంది కనుక అవకాశం ఇవ్వాలి, గడువు కల్పించాలి అనే సంస్కారం ఆనాటి ప్రతిపక్షాలకు మేధావులకు ఉన్నది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో గత నాలుగు మాసాల క్రితం అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు ఎప్పుడూ అమలు చేస్తారని కల్లబొల్లి కబుర్లతో ప్రతిపక్షాలకు వేరే ప్రత్యామ్నాయము లేక, వైఫల్యాలు ఓటమిని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని బెదిరించడానికి పూనుకున్నప్పుడు రాష్ట్రంలోని ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఒక అంచనాకు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు స్థిరంగా కొనసాగితేనే ప్రభుత్వ పథకాలు అమలు కావడం, సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా కొనసాగడం, ప్రజల ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంటుంది అని ప్రజలు గుర్తించాలి. ఆ రకమైనటువంటి పరిపాలన గత పదేళ్లలో గత ప్రభుత్వం అందించని కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని విస్తృతంగా ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రచారం చేయాలి . అంతేకాదు గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఇచ్చిన హామీలను ఏ రకంగా అమలు చేయలేదో తెలుసుకోవలసిన అవసరం కూడా ఉన్నది. పదేళ్లలో అమలు చేయనటువంటి గత బిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు మాసాల్లోనే కాంగ్రెస్ను అమలు చేయాలని డిమాండ్ చేయడం అంటే అర్థం లేని విమర్శ. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి ఉండవచ్చు, ఆవేశం గెలుపు లక్ష్యంతో గడువు విధించవచ్చు, కానీ గత ప్రభుత్వం యొక్క వైఫల్యం కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెట్టుకు రావడమే గగనమైనప్పుడు ఉద్యోగుల వేతనాలు నెలసరి అప్పులను చెల్లించడమే థీ ప్పలైనప్పుడు ఏ రకంగా హామీలు గ్యారంటీలు నెరవేరుస్తుంది అనే ఇంగిత జ్ఞానం ప్రతిపక్షాలకు ఉండాలి. ఇదే సందర్భంలో బుద్ధి జీవులు మేధావులు ప్రభుత్వ పక్షాన నిలబడి విమర్శించే ప్రతిపక్షాలను ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీని తరిమికొట్టవలసిన అవసరం ఆసన్నమైనది . ఈ నేపథ్యంలో 2014లో అధికారానికి రాకముందు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు పదేళ్లలో ఏ మేరకు అమలు చేసినది? అమలు చేయకుండా హామీలకు మాత్రమే పరిమితమై ప్రజలకు ద్రోహం తలపెట్టిన విషయాల పైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే హామీలు ఏమిటి ? అమలు చేయనివి ఏమిటి ?అనే జాబితాను చర్చించుకోవడం, చర్చించడం పదేళ్లలో అమలు చేయని పార్టీకి ప్రస్తుతం విమర్శించే హక్కు లేదని కరాకండిగా ప్రజా జీవితము నుండి ఎన్నికల్లో ఓట్లను నిరాకరించడం ద్వారా తరిమికొట్టవలసిన అవసరం ఆసన్నమైనది.
ఇచ్చి తప్పిన హామీలు :
--దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధానమైన హామీ ఇచ్చి అధికార దాహంతో తానే పీఠం మీద కూర్చొని దళిత జాతికి రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేసిన విషయం విస్తృతంగా ప్రచారం చేయాలి.
---- 2018 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని అఖిలపక్షాలతో చర్చిస్తామని కీలక నిర్ణయాల సందర్భంలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి గెలుపొంది ఏనాడు కూడా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించలేదు ఇది హామీ ద్రోహం కాదా !
---రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 3o 16 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని 2018 ప్రాంతంలో అసెంబ్లీలో ప్రకటించి బడ్జెట్లో కేటాయించినట్లు చూపినప్పటికీ యువతకు మొండి చేయి చూపడం నిజంకాదా?
--- దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ఇస్తామని హామీ ఇచ్చి అధికారానికి వచ్చి ఎక్కడ భూమిని పంపిణీ చేయలేదు పైగా ఇస్తామని హామీ ఇవ్వలేదని ఇవ్వడానికి భూమి లేదని తప్పుడు మాటలు మాట్లాడి దళితులను మోసం చేసింది నిజం కాదా!
- డబల్బెడ్ రూం ఇండ్ల హామీ బూటకమే కదా!
--అధికారానికి రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమాలు టీవీ సంస్కృతి ఉపయోగిస్తున్నటువంటి భాష పై ఘాటుగా విమర్శించి అధికారానికి రాగానే వాటిని సంస్కరిస్తామని మాట ఇచ్చి పదేళ్లలో ఆ వైపుగా కన్నెత్తి కూడా చూడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మాదిరే కొనసాగుతుంటే ఇక టిఆర్ఎస్ చేసిన సంస్కరణ ఏమిటో సమాధానం చెప్పుకోవాలి.
--- రాష్ట్రంలో ప్రకృతి గుట్టల విధ్వంసం ఇదేచ్ఛగా కొనసాగడాన్ని ఉమ్మడి రాష్ట్రంలో గర్జించిన టిఆర్ఎస్ దాని అధినేత కేసిఆర్ అధికారానికి రాగానే అడ్డుకుంటామని హామీ ఇచ్చి ఆ తర్వాత గుట్టలు ప్రకృతి విధ్వంసంలో పార్టీ నాయకులు మంత్రివర్గ సహచరులే వాటాదారులైనప్పుడు ఇచ్చిన హామీ బుట్ట దాఖలైనట్లే కదా!
---- నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం అనే ఆకాంక్షల పేరుతో అధికారానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నీళ్ల పేరుతో ప్రాజెక్టుల నిర్మాణంలో చేసిన గోల్మాల్ అవినీతి స్వప్రయోజనాలకు ప్రాజెక్టులను వాడుకున్న తీరు అందరికీ తెలిసిందే. రైతుబంధు పేరుతో భూస్వాములకు రాష్ట్ర సంపాదన దోసి పెట్టిన తీరు నిధుల దుర్వినియోగానికి పరాకాష్ట కాదా? ఇక నియామకాలకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం చేసి పేపర్ లీకేజీలను ప్రోత్సహించి అభాష్పాలైన విషయం తెలిసిందే కదా ?
--- ఇక ఆత్మగౌరవం అంటారా శాసనసభ్యులు మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలవడానికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగింది . శాసనసభ్యులు మంత్రులు కలెక్టర్లతో సహా అనేకమంది అధికారులు కూడా ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసినారంటే ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే కదా !
--- విభజన హామీలలో ముఖ్యమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం మెడలు వంచి సాధిస్తామని హామీ ఇచ్చి నిత్యం కేంద్రంతో ఘర్షనే తప్ప సాధించినది ఏమీ లేకపోగా కేంద్రముతో సత్సంబంధాలను కోల్పోయినది నిజం కాదా !
--లక్ష రూపాయల రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాలల్లో చివరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం మొక్కుబడిగా ప్రారంభించడం ఏ విలువల కోసం?
అన్నింట నిర్వీర్యమైన పాలన
---ఉమ్మడి రాష్ట్రంలో 17% 2014లో 11% విద్యకు నిధులు కేటాయిస్తే రాష్ట్రo ఏర్పడిన తర్వాత 6 శాతంతోనే సర్దుకుపోవడం అంటే విద్యను అద్వాన్న స్థితిలోకి నెట్టినట్లే. సుమారు 10 ఏళ్లలో విద్యారంగం పైన మొక్కుబడి తప్ప ఏనాడు కూడా సమీక్ష చేయని సందర్భం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగడం బాధాకరం.
--- 6000 పాఠశాలను మూసివేసి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించి 60 లక్షల లో 30 లక్షల పైచిలుకు విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకి వెళ్తున్నారంటే అది పదేళ్ల పాలనలోని వైఫల్యమే.
--- వైద్యం పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతే ప్రభుత్వ వైద్య సంస్థలు నామమాత్రంగా మిగిలిపోయి ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ప్రజల పేదరికం మరింత పెరిగింది .
--- పేద వర్గాలకు ఇవ్వవలసిన రైతుబంధు భూస్వాములకు, పండించని లక్షల ఎకరాల భూములకు కట్టబెట్టి ప్రజాసంపదను దోపిడీ చేసింది నిజం కాదా!
-- అభివృద్ధి పేరుతో పక్కాభవనాలను కూల్చివేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వాటర్ ట్యాంకులు దేవాలయాలు చివరికి సచివాలయం కాలేశ్వరం ప్రాజెక్టుతో సహా అన్ని కాలువలు నిర్మాణాలలో అవినీతి రాజ్యమేలింది . ఇందుకు పరాకాష్టగా ఇటీవల భూపాలపల్లి దగ్గర నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడమే .
---- పదేళ్లలో సుమారు 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప ఏనాడు కూడా రైతులను పరామర్శించి కుటుంబాలకు భరోసా కల్పించినది లేదు.
పైగా గత పదేళ్లలో వర్షాలు వరుసగా కురవడంతోనే పంటలు పండినాయి తప్ప ప్రాజెక్టుల వల్ల కాదని అనేక అధ్యయనాలు కూడా వెల్లడిస్తుంటే ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టు తోనే లక్షల ఎకరాలకు నీరు అందించినామని ప్రకటించడం హాస్యాస్పదమే కదా ? పిల్లర్లు కుంగిపోయి మేడిగడ్డ ప్రాజెక్టు విఫలమైతే ఇప్పటికీ గత ప్రభుత్వ అధినేత బాధ్యతను ప్రకటించకపోవడం నేరమే కదా!
-- ఇక దళిత బంధు పేరుతో కొద్దిమందికి మాత్రమే అమలు చేసిన ఆ పథకం కోటీశ్వరులకు కూడా కట్టబెట్టడంలోనే దాని డొల్లతనం దాగి ఉంది . 10 లక్షల మంజూరు కోసం స్థానిక శాసనసభ్యులు సుమారు మూడు లక్షల దాకా అవినీతికి పాల్పడినట్లు స్వయంగా ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన విషయాన్ని విస్మరిస్తే ఎలా? ఇదంతా గత ప్రభుత్వ లోపం కాదా !
నిరుద్యోగం పెరిగిపోయింది పేదరికం తాండవిస్తున్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వీర్యమై యువత పెడదారి పట్టడానికి ప్రధాన కారణమైన బారాసా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవలసిన అవసరం కూడా ఉన్నది. పదేళ్లలో ప్రధానమైనటువంటి హామీలను అమలు చేయకపోగా అవినీతి ఏకపక్షం కొనసాగి రాష్ట్రం అప్పులపాలై వేలాది రైతులు కూలీలు పేదవాళ్ల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అర్హత ఎక్కడిది? ఓట్ల కోసం వచ్చిన బిఆర్ఎస్ నాయకులను ఈ హామీలు ప్రశ్నలను వేసి ఉక్కిరిబిక్కిరి చేసి మీ లోపాలను అంగీకరించాలని ఒత్తిడి చేసి చివరికి ఓటు ద్వారా నిరాకరించడం పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా ఓడించడం వల్ల మాత్రమే పదేళ్లుగా ఆ పార్టీ చేసిన ద్రోహానికి తగిన శిక్ష వేసినట్లు లెక్క. అది ప్రజల పైన ప్రజాస్వామ్య వాదుల పైన రాష్ట్ర ఓటర్ల పైన ప్రధానంగా ఉన్నది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మొత్తంలో వినియోగించుకోవడం ద్వారా ప్రజల మనసులను గెలవాలి ఇచ్చిన హామీలకు నిలబడాలి అంతటితోనే సరిపుచ్చకుండా సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేసి నూతన పరిపాలన అందించాలి. తద్వారా టిఆర్ఎస్ బిజెపి పార్టీల వికృత, అపరిపక్వ విమర్శలు బెదిరింపులకు చెక్ పెట్టాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )