అవును సీఎం గారన్నట్లు  విద్యారంగాన్ని రాజకీయ కోణంలో ఆలోచించినoతకాలం ప్రక్షాళన జరగదు.

Mar 30, 2025 - 20:32
 0  6

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి  ఆలోచన నుండి విప్లవాత్మక  నమూనా మొగ్గ తొడగాలి.

దేశంలోనే తెలంగాణ అధమ స్థానంలో ఉండడం  సిగ్గుచేటు.*  పూర్తిగా ప్రక్షాళన చేసి  విద్యను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తే ప్రజలు అభినందిస్తారు.

---  వడ్డేపల్లి మల్లేశం


ప్రతి రాష్ట్రంలోనూ చట్టసభల్లో ముఖ్యంగా కౌన్సిల్లో  విద్యారంగము, నిరుద్యోగులు,  ప్రభుత్వ విద్యలో నాణ్యత , ఉచిత విద్య,  ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన ముఖ్యంగా  పట్టభద్రుల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు  పూర్తి అవగాహనతో ప్రభుత్వాన్ని ఒప్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ  ఎన్నికైన సభ్యులే ప్రైవేట్ విద్యా రంగానికి చెంది ఉండి  తమ కళాశాలలు  విశ్వవిద్యాలయాలను  ప్రైవేట్ రంగంలో పెంచి పోషించడానికి  ప్రభుత్వo ను  ఒప్పించినప్పుడు  ఈ సభ్యులు ఏ రకంగా ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్య కోసం డిమాండ్ చేయగలుగుతారు?  అలాంటి సభ్యులను ఎన్నుకోవడం ఉపాధ్యాయ పట్టభద్ర ఓటర్ల యొక్క అవివేకం.  ఇటీవల ఫిబ్రవరిలో జరిగినటువంటి  కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో   ఎంపికైన వాళ్లు  ఒకరు పెట్టుబడి దారి పారిశ్రామికవేత్త అయితే మరొకరు ప్రైవేటు విద్యారంగ సంస్థలకు అధిపతి.  అలాంటి వాళ్లు   కౌన్సిల్లో ఉన్నప్పుడు  ఉచిత నాణ్యమైన విద్య అందుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ  శాసనమండలిలో విద్యాపద్ధుల పైన  చర్చలో 26 మార్చి 2025 రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు  విద్యా రంగాన్ని రాజకీయ కోణంలో చూసినంత కాలం అభివృద్ధిని సాధించలేమని చేసిన  వ్యాఖ్య సమున్నతమైనది.  విద్యారంగ పరిపుష్టి కోసం ఐఏఎస్ అధికారి గౌరవ ఆకునూరు మురళి గారి సారధ్యంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసి తగిన నివేదికను అందుకుంటున్నట్లు  ఆ మేరకు విప్లవాత్మకమైన చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని హామీ ఇవ్వడం చాలా గర్వకారణం. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ   వెనుకబడి ఉన్నదని  చేసిన ప్రకటన ఆందోళనకరమైనది. అయినప్పటికీ అది వాస్తవం కూడా.  ఐదు సంవత్సరాల క్రితం  మొత్తం 60 లక్షల మంది పాఠశాల స్థాయి విద్యార్థులకు గాను 30 లక్షల మంది ప్రభుత్వ 30 లక్షల మంది ప్రైవేటు రంగంలో విద్యను అభ్యసిస్తూ ఉంటే  ప్రస్తుతం ఆ సంఖ్య  ప్రభుత్వ రంగంలో 24 లక్షలకు దిగజారినట్లు తెలుస్తూ ఉంటే  నిజంగా రాష్ట్రంలో విద్య అధమ స్థానంలో ఉన్నదనడంలో ఆశ్చర్యం ఏమున్నది?

 విద్యా కమిషన్ విప్లవాత్మక చర్యలకు సిఫారసు చేయాలి 

తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి విద్యా కమిషన్ విప్లవాత్మక చర్యలకు పూనుకున్నప్పుడు మాత్రమే విద్యారంగం ప్రభుత్వ స్థాయిలో  కొంతవరకైనా  నిలదొక్కుకుంటుంది.  1995- 2000 ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో 17% ఉన్నటువంటి విద్యారంగ బడ్జెట్  తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 11% గా ఉంటే  టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 6 శాతం మాత్రమే నిధులను కేటాయిస్తే  25- 26 సంవత్సరానికి  ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.57% మాత్రమే కేటాయిస్తే ఏ రకంగా విద్యా పరిపుష్టి అవుతుందో పాలకులకు తెలియాలి.  పిండి లేకుండా రొట్టెను చేయలేము అలాగే విద్యారంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకుండా  నాణ్యమైన విద్యను ఆశించలేము. మరొక్కవైపు ప్రైవేట్ రంగంలో పోటీ వ్యవస్థ కొనసాగుతూ ఉంటే  రెండు యాజమాన్యాల స్థాయిలో విద్య కొనసాగినప్పుడు  ప్రజలు గంధర  గోళానికి గురికావడం సహజం. ఆ నేపథ్యంలోనే అనేకమంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కూడా ప్రైవేట్ రంగం మీద లేనిపోని భ్రమలు పెంచుకొని ప్రభుత్వ రంగాన్ని కూలదోస్తున్న తరుణంలో  పూర్తిస్థాయిలో కారణాలు వెతికి పరిశీలించకుండా కేవలం పై పైన మాత్రమే మాట్లాడితే  తెలంగాణతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా విద్య బాగుపడదు.  పేద వర్గాలకు ఉచిత నాణ్యమైన విద్య అందదు. ప్రస్తుత విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూరు మురళి గారు గతంలో విద్యారంగం పైన చేసిన అనేక ప్రసంగాల సమయంలో  ప్రైవేట్ రంగాన్ని మొత్తం నిర్మూలించినప్పుడు మాత్రమే ప్రభుత్వ విద్యారంగం బాగుపడుతుందని అప్పుడు మాత్రమే ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉంటుందని అదే నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని  తెలియజేసిన విషయాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది.  ప్రస్తుతం ఆకునూరు మురళి గారు తమ నివేదికను సమర్పించే సందర్భంలో ఈ అంశాలను పొందుపరచడంతో పాటు మొదటి దశలో పాఠశాల స్థాయి వరకు కేవలం ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించే విధంగా రాజకీయపరమైనటువంటి ఎలాంటి ఒత్తిడికి  ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి, మంత్రి  వర్గం ఆమోదించే విధంగా  సిఫారసులు చేయాలి. కౌన్సిల్ తో సహా రెండు సభల్లోనూ ప్రభుత్వం పైన ఒత్తి  చేయడం చాలా అవసరం ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కావలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ తో సహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కొఠారి కమిషన్ సూచన మేరకు తన బడ్జెట్లో 10 శాతాన్ని కేటాయించినప్పుడు దేశవ్యాప్తంగా మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించడానికి అవకాశం ఉంటుంది.
       విద్యారంగం పైన పద్దుల చర్చ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు రాష్ట్రంలో విద్య పట్ల పూర్తి విశ్వాసంతో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ  అదే సందర్భంలో మొదటి దశలో పాఠశాల స్థాయి వరకైనా పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసా  కొనసాగించడానికి సిద్ధపడి ప్రైవేటు యాజమాన్యాలను ప్రభుత్వ రంగంలో  విలీనం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే  విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ రాష్ట్రంలో బీజాలు పడతాయి అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. అది అతిశయోక్తి కూడా కాదు.  దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు మరుగుదొడ్లు లేని కారణంగా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు చురకలాంటించిన తీరు మనకు తెలియదా? ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రజలందరి పిల్లలు విద్యార్జన  చేయాలంటే కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క మౌలిక సౌకర్యాలను మెరుగుపరచవలసిన అవసరం ఉన్నది అందుకు కొటారి సూచించినట్లుగా 30% బడ్జెట్ కేటాయిస్తేనే  ఆ స్థాయికి చేరుకోగలం.ఆ వైపుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ప్రభుత్వానికి  పట్టుదల ఉండాల్సిన అవసరం ఉంది. రెండు యాజమాన్యాల వలన ప్రైవేట్ రంగంలో విద్యను అభ్యసించలేక పిల్లలను పంపించలేక అప్పుల పాలై అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి గ్రామీణ పట్టణ పేద వర్గాల బాధలను నివృత్తి చేయాలంటే విద్యా రంగాల్లో ప్రభుత్వం రాజ్యాంగపరమైన బాధ్యతను పూర్తిగా నిర్వహించాలంటే  ప్రైవేటు రంగాన్ని మొత్తానికి మూసివేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం అది కూడా కొఠారి సూచించినట్లుగా కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. కానీ కులాల వారిగా పాఠశాలలను నడిపించడం అంటే అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది.
             గౌరవ విద్య కమిషనర్ గారికి  ప్రజలు చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే  విద్యారంగానికి బడ్జెట్ ను కనీసం 25% గా నిర్ధారించడం,  కామన్ స్కూల్ విధానానికి ఒత్తిడి చేయడం,  ప్రైవేటు రంగాన్ని మొత్తానికి నిర్మూలించే విధంగా  సూచన చేయడం,  ఫీజుల జులుము నుండి  పేద వర్గాలను విముక్తి చేయడం,  స్వేచ్ఛగా స్వతంత్రంగా నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి ప్రభుత్వాలు  బహిరంగ ప్రకటన చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యే విప్లవాత్మక చర్య భారతదేశంలో  ఆదర్శం కావాలి. ముఖ్యమంత్రి గారు రాజకీయ కోణంలో ఆలోచిస్తే విద్యను పరిపుష్టి చేయలేమని అన్నారు కనుక విద్యారంగాన్ని ఈ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే నిబద్ధతగా పనిచేయడానికి సిద్ధపడితే తప్పకుండా ప్రైవేట్ రంగాన్ని తొలి దశలో  పాఠశాల స్థాయి వరకు  ప్రభుత్వ రంగంలో విలీనం చేసుకొని  రాబోయే కాలంలో  విశ్వవిద్యాలయ స్థాయి ఉన్నత విద్య వరకు కూడా నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి  కంకణ  ము కట్టుకుంటే అంతకుమించి ప్రజలకు జరిగే మేలు ఏమీ ఉండదు. ప్రజలు ఉచితాలు తాయిలాలను  ఇకముందు కోరుకోరు ఉచితాలు ప్రలోభాలు వాగ్దానాలను  మేనిఫెస్టోలో పెట్టడం కానీ ప్రభుత్వం ఆకర్షణ పథకాలను  ప్రకటించడం కానీ ఉండదు. అదే సందర్భంలో ప్రతిపక్షాలు ఇలాంటి చౌకబారు డిమాండ్ల ద్వారా ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఆస్కారం ఉండదు. ఉచిత విద్య వైద్యం ప్రజల జీవిత హక్కు ఆ హక్కును కాలరాసే అధికారం ఏ ప్రభుత్వాలకు లేదు. రాజ్యాంగబద్ధమైన ఈ హక్కులను కాపాడుకోవడానికి భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరమవుతాయని తెలుసుకుంటే మంచిది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కూడా విద్యా  వైద్యాన్ని ఉచితంగా నాణ్యమైన స్థాయిలో ప్రజలకు అందించాలని చేసిన హెచ్చరిక పాలకులకు గుణపాఠం కావాలని మనసారా కోరుకుందాం.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333