ఆధ్యాత్మిక సంస్థలు, మత చిహ్నాలు ప్రజా జీవితానికి ఆటంకం కాకూడదు కదా
రహదారులు, జనావాస ప్రాంతాలకు అవరోధంగా ఉంటే
పరిష్కరించుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలది.
సహకరించవలసిన సామాజిక బాధ్యత పరమత సహ
నం కలిగిన ప్రజలది, మత పెద్దలది.
--వడ్డేపల్లి మల్లేశం
ఆయా ప్రజా సమూహాలకు సమ్మతమైన జీవన వి దానమే మతం . "మతం అంటే మానవత్వం కులం అంటే మంచితనం "అని కవులు కళాకారులు మేధావులు తత్వవేత్తలు ఏనాడో నిర్వచించి దారి చూపిన విషయం తెలుసు .కానీ దానికి బదులుగా మత తత్వాన్ని పెంచి పోషించే దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న కారణంగా మత ఘర్షణలకు ఆస్కారం ఏర్పడుతున్నది. నిజంగా ఈ పరిస్థితులకు కారణం దానిని సొమ్ము చేసుకోవాలని ఆశించే రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు అని చెప్పక తప్పదు. అసలు భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ జీవన విధానం అని రాజ్యాంగం నొక్కి చెబుతున్నప్పటికీ ఆవేశాలను రెచ్చగొట్టి, ప్రలోభాలను కల్పించి, ప్రయోజనాలను పొందడం కోసం కొన్ని వర్గాలు ఘర్షణ పూరిత వాతావరణంలో హింస మార్గాన్ని అవలంబించడాన్ని మనం కల్లారా చూడవచ్చు . ఇలాంటి సందర్భాలలో ఆయా మతాలకు సంబంధించినటువంటి ప్రార్థన స్థలాలు, నిర్మాణాలు చిహ్నాలు, ఆనవాళ్లు నిర్మించుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు .ఎందుకంటే ఒక మతాన్ని మరొక మతం సహించాలి, గౌరవించాలి , సహకరించాలి.
చరిత్రలోకి వెళితే కాకతీయులు,రాజవంశాలు, అక్బర్ మొగల్ చక్రవర్తుల కాలంలో కూడా పరమత సహనాన్ని మనం చూడవచ్చు. అంతేకాదు ఆనాటి రాజులు హిందూ స్త్రీలను హిందూ రాజులు ముస్లిమ్స్ స్త్రీలను పెళ్లాడి తమ పరమత సహనాన్ని చాటిన సందర్భాలను కూడా గమనించినప్పుడు ప్రస్తుతం కొన్ని వర్గాలు అనుసరిస్తున్న హింస పూరిత విధానం కావాలని చేస్తున్న కుట్రగా రాజకీయాలకు ప్రయోజనం కలిగించే వేదికగా మాత్రమే భావించవలసి ఉంటుంది .ఈ తరుణంలో ఆయా మత సిద్ధాంతాలను అనుసరిస్తున్న వాళ్లు మత ప్రార్థన విధానాలను ఆధ్యాత్మిక భావజాలాన్ని అనుసరిస్తున్న వాళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. "వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం కానీ పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నించవచ్చు" అదే మాదిరిగా ఇంటికి వ్యక్తిగతానికి సంబంధించినంత వరకు ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకునే ఆస్కారం లేదు కానీ పబ్లిక్ లో నిర్మించే దేవాలయాలు మత కేంద్రాలు ప్రార్థన మందిరాలు ఆధ్యాత్మిక చిహ్నాలు ప్రజా జీవితానికి జనావాసాలకు రహదారులకు రాకపోకలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు కదా !
వ్యక్తి వికాసం సంఘ ప్రయోజనం ముఖ్యం _ మతం ముసుగులో కట్టుబాట్లు నిర్బంధాలు ఇబ్బంది కరం :-
ఎవరి మతం వారికి గౌరవం ప్రేమ అభిమానం అందులో ఏ లాంటి భేషజాలకు తావు లేదు. అదే సందర్భంలో విశాల హృదయంతో ఆలోచించే భావజాలం కలిగి ఉంటే పరమత సహనాన్ని పాటించడం ద్వారా మానవతా విలువలను పెంపొందించడం కూడా మతాల యొక్క అంతిమ లక్ష్యం కావాలి . ఆ వైపుగా దృష్టి సారించవలసిన అవసరం మత సంస్థలు మత పెద్దల పైన ఉన్నది . కానీ ప్రస్తుతం మనం ఒక రాష్ట్రానికి ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక ప్రాంతాలను పరిశీలించిన సందర్భంలో జనావాసాల మధ్యన రహదారులకు ఇబ్బందికరంగా ప్రజా జీవితానికి ఆటంకముగా ఉన్న దేవాలయాలు, మత కేంద్రాలు, చిహ్నలను మనం చూడవచ్చు . అప్పుడప్పుడు మత ఘర్షణలు జరిగిన సందర్భంలో పోలీసు మిలిటరీ ఆ ప్రాంతంలో కవాతు నిర్వహించి ప్రజల్లో భరోసా కల్పించినట్లే వివిధ మత పెద్దల తో శాంతి సంఘాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో పర్యటించి సామరస్య వాతావరణం కల్పించిన సందర్భాలను కూడా మనం గమనించవచ్చు.
ఆ రకమైనటువంటి విశాల ప్రాపంచిక దృక్పథం ఇవాళ అన్ని మతాలకు ఉండవలసిన అవసరం ఉంది .ఒక రహదారి, ఒక ప్రాంతము, ప్రజలు జీవించే ప్రదేశము, జనం కిక్కిరిసి ఉండే స్థలాలు , అనివార్యమైన పరిస్థితుల్లో జన సమీకరణ తప్పని ప్రాంతాలలో కూడా మతం పేరుతో నిర్మాణాలను మనం చూడవచ్చు. ఏ మతానికి సంబంధించినదైన ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు ప్రజా జీవితానికి ఆటంకపరిస్తే ఇబ్బంది. చట్టం ముందు అందరూ సమానులే అన్నట్లు భారతదేశంలో అన్ని మతాలు సమానమే రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక తత్వం ప్రకారం ప్రభుత్వానికి ఒక మతం అంటూ లేకపోగా అన్ని మతాలను సమానంగా చూడవలసిన బాధ్యత కూడా పాలకుల పైన ఉంటుంది అనేది నగ్న సత్యం . అలాంటి పరిస్థితులలో అల్పసంఖ్యాకులు అధిక సంఖ్యకులు అనే తేడా లేకుండా ప్రజల విశ్వాసాలు నమ్మకాలను గౌరవించే దృష్టితో ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వ ఆలోచనకు ప్రజా జీవితానికి భంగము కాని రీతిలో మత సంస్థలు చర్యలు చేపట్టినట్లయితే పరస్పరం ఈ సంఘర్షణను వివాదాస్పదమైనటువంటి స్థలాలను గుర్తించడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించి సున్నితమైన మత అభిప్రాయాలకు భంగం కలగని రీతిలో స్థానిక ప్రజలు అన్ని మతాల పెద్దలు సామాజికవేత్తలు ప్రాపంచిక దృక్పథం కలిగినటువంటి వర్గాలతో కమిటీలను ఏర్పాటు చేసి చర్చించడం ద్వారా విశాల ప్రాతిపదిక పైన పరిష్కారాలను వెతకాల్సిన అవసరంవుంది
నడిరోడ్డు పైన నిర్మాణాలు, వాహనాలు పోకుండా ఇబ్బందికరంగా ఉన్నపరిస్థితులు ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు కిక్కిరిసిన అలాంటి ప్రదేశాలలో విద్యుత్ ఇతర సమస్యల కారణంగా జరుగుతున్నటువంటి మారణహోమాలను ముందే పసిగట్టి అవి జరగకుండా ప్రజలు ఎవరైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా ప్రమాదాలకు గురికాకుండా ఘర్షణలకు తావు లేకుండా హింసకు చోటు లేకుండా విధానాల ద్వారా పరిష్కారాలను అభివృద్ధిని ఆకాంక్షించే కోణంలో ఆలోచించడం అన్ని మతాలకు, అందరికి ఉండవలసిన సామాజిక బాధ్యత. .ఒక మతం గురించి మరొక మతం ప్రస్తావించినదని, మత తత్వాన్ని ప్రదర్శించినారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సబబు కాదని మరొక మతం వాళ్లు ప్రకటనలు చేయడం దాన్ని రాజకీయ పార్టీలు ఆసరాగా చేసుకుని జోక్యం చేసుకోవడం కాకుండా ఇరువర్గాలను సంబంధిత వర్గాలను సంప్రదించి శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించడం ప్రభుత్వ విధానం కావాలి.
పంతాలు పట్టింపులకు పోయి సమస్యను పెద్దగా చేస్తే దాని పరిణామం అందరూ అనుభవించవలసివస్తుంది. స్వతంత్ర భారతదేశంలో లౌకిక రాజ్యంలో ఈ రకమైన ఘర్షణలు మనకు అవసరమా? రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులు అధికారాలను సాధించుకునే క్రమంలో ఎవరి దారి వారిదే ఆయా వర్గాలు తమ హక్కుల రక్షణ కోసం వర్గ ప్రయోజనం కోసం పోరాడితే తప్పులేదు కానీ మతం ముసుగులో కొనసాగే ఏ చర్య కూడా సరైనది కాదు, ప్రభుత్వం అనుమతించకూడదు. ఆయా మతాలు అటువైపుగా ఆలోచన చేయకూడదు. అనునిత్యం పల్లెటూర్ల నుండి పట్టణాల వరకు మనం పరిశీలించి చూసినట్లయితే రోడ్లు, మార్కెట్లు, జనావాస ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, దేవాలయాలు మత కేంద్రాల దగ్గర అనేక ఇబ్బందికర పరిస్థితులను మనం కల్లారా చూడవచ్చు.
నాకేమిటి అనే ధోరణి కాకుండా ఇది అందరికీ సంబంధించిన సమస్య దృష్టికి తీసుకుపోవడం పరిష్కారాన్ని వెతకడం చర్చించడం సంప్రదింపులు చేయడం మనిషి కనీస బాధ్యత అనే ఆలోచన ఉన్ననాడు ఇది కొద్దిమంది సమస్య రెండు వర్గాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు అది ప్రజలందరి సమస్య అవుతుంది . ప్రజలందరి సమస్య అయినప్పుడు సులభంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది . ఆ వైపుగా ప్రాంతాలు రాష్ట్రాలకు అతీతంగా తమ తమ ప్రదేశాలలో విశాల హృదయంలో దృష్టి సారించి పరిశీలించడం ద్వారా దృష్టికి వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి నిర్మాణాలు లేదా భావజాలాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం ప్రజా సమూహంలో చర్చించడం ద్వారా పరిష్కారాలను వెతకాలి .ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే చేసే పని కాదు అలా అని ప్రజలు మాత్రమే పరిష్కరించుకోలేరు. ప్రజలు ప్రజాస్వామ్యవాదులు సామాజికవేత్తల సహకారంతో ప్రభుత్వాలు ఆ వైపుగా దృష్టి సారిస్తే కలతలు కన్నీళ్లు ఘర్షణ లేని మత సమైక్యత భారతదేశంలో సాధ్యమవుతుంది అనాదిగా అలాంటి సందర్భాలను మనం చూసి ఉన్నాము.
(వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు (చౌటపల్లి) హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)