హైడ్రా ఏర్పాటు లక్ష్యాన్ని మరింత విస్తృత పరచాలి
అక్రమ నిర్మాణాలు తొలగించడం తో పాటు స్వాధీనం
చేసుకున్న భూమిని పేదలకు పంచాలి.
కబ్జాదారుల కటకటాలకు పంపి జరిమానా విధించాలి.
హైడ్రా చర్యలకు సమాజం మద్దతు ప్రకటించాలి.
--- వడ్డేపల్లి మల్లేశం
దేశవ్యాప్తంగా అక్రమార్కుల ఆగడాలకు అంతే లేకుండా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూ ఆక్రమణలపై ఉక్కు పాదం మోపడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ హైడ్రా . ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు, నాళాలు పార్కులలో అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ఫామ్ హౌస్ ల పేరుతో ఇంతకాలం దశాబ్దాల తరబడిగా కులుకుతూ జీవించిన సంపన్న వర్గాల నిర్మాణాలను కుప్పకూల్చడమే ధ్యేయంగా పని చేయడం అభినందనీయం. సంపన్న వర్గాలతో పెట్టుకోవడం అంటే మాటలేమీ కాదు కానీ అందుకు తగినట్లుగా ఈ సంస్థకు కమిషనర్ గా నియమించబడిన రంగనాథ్ సుమారు 3,500 మంది సిబ్బంది, పోలీసులు ఇతర అన్ని రకాల దల సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధిగా అమలు చేయడం పెత్తందారులకు బడా భూస్వామ్య పారిశ్రామికవేత్తలకు సంపన్నులకు బాధ కలిగించవచ్చు కానీ పేద వర్గాలకు ప్రజాస్వామ్య వాదులకు అసమానతలు అంతరాలు లేని దోపిడీ పీడన కానరాని వ్యవస్థ ఏర్పాటును ఆకాంక్షించే వాళ్లకు మాత్రం ఇంత కాలానికైనా ఈ వ్యవస్థ ఏర్పడినందుకు సంతోషమే. దీని పూర్తి రూపం "హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్" .ముఖ్యమంత్రి ఆలోచన నుండి రూపుదిద్దుకున్నట్లు చెప్పబడుతున్నప్పటికీ ప్రభుత్వం, మంత్రివర్గం యొక్క ఉమ్మడి ఆలోచన మేరకే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్పడాన్ని స్వాగతించాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి చైర్మన్గా కొనసాగే ఈ వ్యవస్థలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు డిజిపి చీఫ్ సెక్రటరీ హెచ్ఎండిఏ కమిషనర్ సభ్యులుగా ఉంటారని తెలుస్తున్నది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేసే విషయంలో మాత్రం కమిషనర్ కి పూర్తి బాధ్యతలతో పాటు అధికారాన్ని కట్టబెట్టినట్లుగా ఆచరణలో మనకు తెలుస్తున్నది. .గతంలో ఉన్నటువంటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిలో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ అది ప్రారంభ దశలోనే ఆగిపోయినట్టు తెలుస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను పాత వ్యవస్థతో జతపరచి సమగ్రంగా రూపొందించడం అంటే బలమైనటువంటి ఆధారాలతో పాటు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను అందుకునే డిమాండ్ ను సాధించడమే పనిగా పెట్టుకున్నట్లుగా తెలుస్తున్నది .
హైడ్రా పని విధానం పైన ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన మంత్రులు శాసనసభ్యులు నాయకులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన ఏ 0తటి వాళ్ళయినా అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి చట్టానికి వ్యతిరేకమైన నిర్మాణాలను తొలగించడంలో రాజీ పడే ప్రసక్తి లేదని , ఇందులో రాజకీయాలు కానీ కక్షపూరిత చర్యలు కానీ ఉండవని, ఇది కేవలం ప్రజా ప్రయోజనం రీత్యా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి మాత్రమే గతంలో విస్మరించబడినటువంటి బాధ్యతలను తిరిగి కొనసాగించడం ద్వారా చెరువులు కుంటలను జలవనలను రక్షించడమే దీని యొక్క ఉద్దేశమని చెప్పడాన్ని మరింత విస్తృతంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అక్రమ నిర్మాణాలు అని కూల్చివేతతో స్వాధీనం చేసుకుంటున్న భూములను వీలైన మేరకు వరదలు విపత్తులకు అవకాశం లేని చోట్ల ఆ మిగులు భూమిని పేద వర్గాల గృహవసతీ కోసం కేటాయించడం ద్వారా మరింత మెరుగైనటువంటి పరిస్థితులను చేరుకోవడానికి హైదరాబాదు నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల అవకాశాన్ని సుగమం చేయడానికి ఎంతో వీలుంటుంది. గత ప్రభుత్వ హయాములో దాదాపుగా క్రింది స్థాయి నుండి మంత్రుల వరకు కూడా శాసనసభ్యులు పార్టీ నాయకులంతా భూ ఆక్రమణలకు పాల్పడినట్లు భూ కబ్జాల ద్వారా ప్రభుత్వ భూములతో పాటు పేద వర్గాల భూములను అక్రమంగా ఆక్రమించుకొని దురాగతాలకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా హైడ్రా తన పరిధిని క్షేత్రస్థాయికి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం ద్వారా అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఎకరాల కొద్ది అందుబాటులోకి రాగలిగే మిగులు భూములను పేద వర్గాల గృహ వ్యవసాయ అవసరాలకు కేటాయించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వము భూ వసతిని కల్పించడంలో గతంలో పాలించిన పాలకులకు భిన్నమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లు అవుతుంది. ఈ సంస్థ కమిషనర్ రంగనాథ్ గారు తన సిబ్బందిని రహస్యంగా పంపించి దృష్టికి వచ్చిన ఫిర్యాదులు, అందినటువంటి భూ కబ్జావివరాలపై పరిశీలన జరిపించిన తర్వాత రహాస్యంగా ఆ ప్రాంతాలకు వెళ్లి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి అడ్డువచ్చినటువంటి శాసనసభ్యులతో పాటు అవసరమైతే మంత్రులను కూడా అరెస్టు చేయడానికి వెనుకాడకుండా దృడ నిర్ణయం తీసుకున్న విధానాన్ని స్వాగతించడం అభినందించడం మనందరి బాధ్యత కూడా. అవినీతిపైన ఉక్కు పాదం మోపాలని తరచుగా అంటూ ఉంటామే కానీ అలాంటి సన్నివేశాలను గతంలో చూసిన సందర్భం చాలా తక్కువ. ప్రస్తుతము ముఖ్యంగా హైదరాబాదులోనూ ఇతర ప్రాంతాల లోపల కూడా భారీగా ధరలు పెరిగినటువంటి భూ సమస్య చాలా పెద్దది దానిని అక్రమంగా ఆక్రమించుకోవడం ద్వారా కోటీశ్వరులు కావడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో కొంతమందిని బెదిరించడం, దాడులు చేయడం ద్వారా ఆక్రమించుకున్నట్లు కూడా సమాచారం ఉన్నది. ఈ ప్రభుత్వంకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని హైడ్రా పనితీరును వేగవంతం చేయడంతో పాటు విధానపరమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా భూవసతి కల్పించడానికి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ లక్ష్యం మరింత విస్తృతం అవుతుంది. ప్రభుత్వానికి ప్రజల అండదండలు పుష్కలంగా ఉంటాయి చరిత్రలో ఆదర్శ ప్రభుత్వం గా మిగిలిపోయే అవకాశం కూడా లేకపోలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటుచేసిన ఈ నూతన వ్యవస్థ హైడ్రా గత జూన్ 2024 నుండి 25 ఆగస్టు 2024 వరకు సుమారు 127 కూల్చివేతలను కొనసాగించి 43.9 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించినట్లు కమిషనర్ రంగనాథ్ గారు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం చాలా హర్షనీయం. అధికారిగా ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆస్తులను రక్షించే సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు పాలకపక్షాలు అధికారుల నుండి ఎన్ని ఒత్తిడిలు వచ్చినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో చేస్తున్న కృషిని అందరం స్వాగతించడంతోపాటు మన మద్దతు కొనసాగించినప్పుడు మాత్రమే ఈ అవినీతి భూతాన్ని ఆక్రమణల దురాగతాలను అంతం చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పేద వర్గాలకు ఆ భూములను పంచడం ద్వారా కొంతవరకైనా పేదరిక నిర్మూలనకు అవకాశం ఉంటుంది . ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ద్వారా అందినట్లుగా భావించబడుతున్న కోటానుకోట్ల రూపాయలను ఎన్నికల సంఘం పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ డబ్బును ఎవరికి ఇచ్చింది ఎక్కడ పంపిణీ చేసింది ఎవరికి స్వాధీనం చేసిన విషయం మాత్రం ఎవరికీ తెలియదు .అదే మాదిరిగా హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటి ఈ భూములను ఏ లక్ష్యం కోసం వినియోగించదల్చుకున్నారు? ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినప్పుడు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేత కార్యక్రమానికి ప్రజల అండదండలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్గా భావించబడుతున్న జన్వాడ ఫామ్ హౌస్ ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తో పాటు అనేకమంది ప్రముఖులకు ప్రతిపక్ష నాయకులకు ఎంఐఎం నాయకులకు చెందినటువంటి నిర్మాణాలను కూడా కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు మరికొన్ని నిర్మాణాలను తొలగించడానికి ప్రణాళిక వేసినట్టుగా సోషల్ మీడియా ఇతర పత్రిక సమాచారం ద్వారా తెలుస్తున్నది . అలాగే సినిమా హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాళ్లు కూడా కూల్చివేసినటువంటి సమాచారాన్ని నిన్న మొన్న మనము గమనిస్తూనే ఉన్నాము. పెట్టుబడిదారీ విధానాన్ని, భూస్వామ్య సంస్కృతిని, పారిశ్రామికవేత్తల ఆధిపత్యాన్ని కొనసాగనిస్తే మరింత పేదరికం పెరుగుతుంది. కనుక పేదరిక నిర్మూలన తో పాటు కొంతవరకైనా సమానత్వాన్ని సాధించదానికి ఈ పెత్తందారి వ్యవస్థను కోలదోసే క్రమంలో ప్రజా ఉద్యమాలతో పాటు ప్రభుత్వ చర్యలు, ప్రజల అండదండలు, హైడ్రా సాసోపేత కూల్చివేతలు చాలా అవసరం . ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని, గ్రామస్థాయి వరకు కూడా విస్తరించాలని, అక్రమ భూ ఆక్రమణల నిగ్గు తేల్చి మిగులు భూమిగా గుర్తించి ప్రజాప్రయోజన కార్యక్రమాలకు వినియోగిస్తారని, ఆ వైపుగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. హైడ్రా చేస్తున్నటువంటి సాహసోపీతమైనటువంటి పోరాటం న్యాయస్థానానికి కూడా సరైన రీతిలో సమాధానం ఇస్తూ కొనసాగిస్తున్నటువంటి కూల్చివేతల పర్వం విజయవంతం అవుతుందని కోరుకుందాం, కావాలని మనసారా ఆశిద్దాం.! ఇo దుకు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు అఖిలపక్షాలు కూడా మద్దతు ఇచ్చినప్పుడు మాత్రమే అవినీతిని కట్టడి చేయడానికి నీతివంతమైన పాలన అందించడానికి అవకాశం ఉంటుంది .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)