వ్యవస్థ కోసం చేసిన కొందరి పోరాటాలు,త్యాగాలు, సామాజిక బాధ్యతను గుర్తించకపోతే మనం మనుషులమేనా?

Jan 3, 2025 - 14:42
Jan 3, 2025 - 16:01
 0  2

వ్యవస్థ కోసం చేసిన కొందరి పోరాటాలు,త్యాగాలు, సామాజిక బాధ్యతను గుర్తించకపోతే మనం మనుషులమేనా?భూమ్యాకాశాలకున్నంత  అంతరాలు కొనసాగుతున్నా పట్టనట్లున్నజనం  పోరాట వారసత్వo కొనసాగించకపోతే  భవిష్యత్తు మరింత అంధకారమే!

వడ్డేపల్లి మల్లేశం
30...10...2024
సమాజంలోని ఆటుపోట్లను అంతరాలను ఏమి పట్టించుకోకుండా  పుట్టెడు ఉన్నవాడు తట్టెడు ఉన్నవానికి ఏడ్చినట్లు  ఉచితంగా ఇతరుల సొమ్ము కోసం  ఆశపడే కొందరు  సామాన్యుల నుండి  ఏ రకంగా నైనా ప్రజల మూలుగలను పీల్చి లబ్ధి పొందాలని  బృహత్  ప్రణాళిక వేసి విజయవంతంగా  కొనసాగిస్తున్న పెట్టుబడిదారీ పారిశ్రామికవేత్తలు పాలకుల  వరకు  ఎంతసేపు  పరాయి సొమ్ముకు ఎగబడి  పీడించడమే. విచిత్రమైన విషయం ఏమిటంటే  పెట్టుబడి దారి భూస్వామ్య  పారిశ్రామికవేత్తలు  ఏ రకంగాను  సామాన్యులు కార్మికులు, రైతులు చేతివృత్తుల వాళ్ళు  బీద ఆఫీస్ కి జనం కోసం ఆరాటపడరు కావచ్చు కానీ  అదే వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు కూడా  ఈ వ్యవస్థ కోసం ఆరాటపడి తమ మానప్రాణాలను వదిలిపెట్టి  పోరాటాల్లో  రాటు తేలి  చరిత్రలో మిగిలిపోయిన వాళ్ళ గురించి కనీసం ఆలోచించకపోవడం  అత్యంత విడ్డూరం.  తెలంగాణ సాయుధ పోరాటం, స్వతంత్ర పోరాటం, శ్రీకాకుల,నక్సల్బరి పోరాటాల      వంటి అనేక సందర్భాలలో  భూస్వాములు పెట్టుబడిదారి వర్గం నుండి వచ్చినటువంటి అత్యంత సంపన్నులు కూడా  తమ ఆస్తిపాస్తులను వదిలి  సామాన్య ప్రజలకు కట్టబెట్టి అవసరమైతే తల్లిదండ్రులను ధిక్కరించి కుటుంబానికి దూరంగా  ఉద్యమంలో పనిచేసిన వాళ్లను మనం చూడవచ్చు.  అందుకే స్పృహ, చింతన,  సామాజిక బాధ్యత,  మానవీయ కోణంలో ఆలోచించే మంచి మనసు మాత్రమే ప్రధానం  అలాంటి వ్యవస్థను కోరుకునే సందర్భంలో  నాయకత్వం వహించి,  సమూహల  నిర్మించి ఉద్యమకారులు పోరాట వీరులను  సమన్వయపరిచి  కుటుంబాలకు దూరంగా  సమానత్వ సాధన కోసం పేద  వర్గానికి రక్షణగా  దోపిడి వర్గాన్ని తుద ముట్టించే పోరులో  నాటినుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు  వాటి తీరుతెన్నులను కనీసం రేఖామాత్రంగానైనా  గుర్తించకపోవడం అంటే నిజంగా మనకు  సోయి  లేనట్లే కదా!  మనం మనుషులం ఎలా అవుతాం?  మన బోటి సామాన్యుల గురించి  పట్టించుకున్న వాళ్ళ గురించే తెలుసుకోలేని  నీచమైన మనస్తత్వం ఉన్నవాళ్లు  ఇప్పటికైనా  తలవంచి వాళ్లను స్మరించి నివాళి అర్పిస్తేనే పోరాటచరిత్రకు   నిజమైన కృతజ్ఞత అవుతుంది .స్వేచ్ఛ, స్వాతంత్రం, మనుగడ,  కోరుకున్న సమాజం, ఆత్మరక్షణ వంటి అనేక సందర్భాలలో  స్వావలంబన కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన అశేష  ప్రజానీకం  నిర్వహించిన విశేషమైన పోరు బాటల్లో  ఎప్పుడైనా సామాన్యులే సమిదలైనారు.  అయినా  యుద్ధం యొక్క లక్ష్యం శాంతి అని  శాంతియుత సామరస్యాన్ని సాధించడానికి  ఆటంకాలుగా ఉన్నటువంటి అంతరాలు అసమానతలు దోపిడీ పీడన వంచనను  తుదముట్టించాలని  అణువణువు నా కొనసాగుతున్న ప్రయత్నాలు నాటి నుండి నేటి వరకు  పోరాట రూపాలలో విస్తృతంగా కొనసాగుతున్న  ఇప్పటికీ  మెజారిటీ ప్రజానీకం ఏ ఒక్కనాడు కూడా ఇది మా సమస్య మా కోసమే అని  ఆలోచించకపోవడం సిగ్గుచేటు.  నిరక్షరాశులై,  కాయకష్టం చేసుకుని, రెక్కడితే   కానీ డొక్కాడని నిరుపేదలు,   గత్యంతరం లేని వ్యక్తులకు తీరిక, ఆలోచించే ఓపిక లేదు అంటే కొంత అర్థం ఉంటుంది. కానీ  విద్యావంతులై, సంపన్నులై, మధ్యతరగతి వ్యక్తులై,  దోపిడీ పీడనను కళ్ళారా చూస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఉన్న వాళ్లను ఏమనాలి?  మన నేరాలు ఘోరాలు తప్పిదాలను  పెడ దొరనులను   సమీక్షించుకోకపోతే  ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది.  అసమానతలు అంతరాలు అలాగే కొనసాగుతాయి  భూమి ఆకాశాలకు ఉన్నంత  వ్యత్యాసం నిరంతరం కొనసాగవలసిందేనా?  ప్రకృతిలో ఉన్న సంపద ఏ ఒక్కరి సొత్తు కాదని తెలిసినప్పటికీ  ఎందుకు కొద్దిమందికే  నిలియంగా మారుతున్నది?  పాలకుల యొక్క తప్పిదాల వల్ల సంపద కొద్దిమంది చేతుల్లో నిక్షిప్తమైపోతున్నది.  రోషం, పౌరుషం,  కోపం, ప్రశ్నించే తత్వం లేకుండా మౌనంగా  సిగ్గుతో తలవంచుకొని బ్రతకడం  నిజంగా ఒక బ్రతుకేనా?
అంతమైపోతున్నది అంతా యువతే  మరికొందరు మార్గ నిర్దేశకులు:- భారతదేశానికి పరిమితమై మాట్లాడుకున్నా  రాజ్యాంగంలోని  అధికరణం 21 ప్రకారంగా ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవంతో  స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో  దేశ సంపదను అనుభవిస్తూ జీవించే హక్కు ఉన్నది.  కానీ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో పాలకులే ప్రజల జీవించే హక్కులను కాలరాస్తూ  రాజ్యాంగానికి వక్ర భాష్యం చెప్పి పాలనను నిర్వీర్యం చేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఆశయాన్ని విధ్వంసం చేసే కుట్ర  గత 77 సంవత్సరాలుగా ఈ దేశంలో కొనసాగింది. కొనసాగుతున్నది కూడా. " పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప" అని ఉద్యమ సంస్థలు నినదీస్తూ హెచ్చరిస్తూ  ఉద్యమాలను నిర్మిస్తూ ఉంటే  రాజ్యాంగబద్ధంగా తమకు రావలసినటువంటి హక్కులు ఫలాలు  వాటా కోసం  ప్రజాస్వామ్య పద్ధతిలో యుద్ధం చేస్తున్న వారిపై  అక్రమ కేసులు  బనాయించి  చిత్రవద కు  గురి చేస్తున్నది మనం కల్లారా చూడడం లేదా?  కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను  వాస్తవాలుగా ప్రజలకు అందించే క్రమములో  నిజాయితీపక్షం వహించినందుకు జర్నలిస్టులు, కళాకారులు, మేధావులు, సంపాదకులు, రచయితలు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలకార్యకర్తలు   ఎంతోమందిని ఈ రాజ్యం  పెట్టుబడుదారి వ్యవస్థ పొట్టన  పెట్టుకున్న విషయం మనకు తెలువనిది కాదు.  వీళ్లంతా   చేసిన పోరాటం వాళ్ల కుటుంబాల కోసం కానే కాదు మరి  ఎందుకు శిక్ష అనుభవించినారు?న్యాయవ్యవస్థను సాకుగా చూపి నేర వ్యవస్థలోని డొల్లతనం కారణంగా దశాబ్దాల తరబడి విచారణ ఖైదీలు గా  అనధికారికంగా శిక్షించబడుతూ  అసువులు బాసిన వాల్లెందరో. ఇటీవల  మనకు దూరమైన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా  అనారోగ్యం అంటే  రాజ్యం చేసిన  హింస కాక మరేమిటి? అంత ఎందుకు తెలంగాణ కోసం  గజ్జ కట్టి పాడినందుకు  ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో  ప్రజా గాయకుడు గద్దర్ పై సాగిన కాల్పుల దమనకాండ  ఆ తర్వాత అనారోగ్యంతో  అసువులు బాయడంవరవరరావులాంటివాళ్ళ ఎందరినో హింసించడం  అంటే  ప్రజా పోరాటాన్ని  ప్రజా ఆగ్రహాన్ని  వంచించడమే కదా? ఓకే  బిందువు పైన పరస్పర శక్తులు పని చేసినప్పుడు  బలాన్ని ఎక్కువగా ప్రదర్శించిన వైపు విజయం వరిస్తుంది  ప్రస్తుతం జరుగుతున్నది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సాగుతున్న పోరాటం.   ఈ వర్గ సంఘర్షణ గురించి  ప్రపంచవ్యాప్తంగానూ భారతదేశంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ  వివిధ సందర్భాలలో సంఘర్షణను నివారించే సామరస్యాన్ని సమకూర్చి ప్రకృతి వనరులు  జాతి సంపదను ప్రజలందరికీ సమానంగా పంచడం కోసం సాగినటువంటి చర్చలు సంభాషణలు  చిత్తశుద్ధి ఉంటే కదా విజయవంతం అయ్యేది? "ఉత్పత్తిలో భాగస్వాములై  సంపదను  పెంచే వాళ్లంతా సాధారణ ప్రజలే కానీ  అనుభవించే హక్కు మాత్రం వాళ్లకు లేకుండా పోయింది. " ఒక అంచనా ప్రకారం గా ఈ దేశంలో 5 నుండి 10 శాతం బడ్జెట్ కూడా  90 శాతం ఉన్న  సామాన్య ప్రజానీకానికి  సమకూరడం లేదంటే  అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసుకోవచ్చు. ఇంత  నష్టాన్ని చవిచూచినా,  అవమానాలు  పీడనకు గురైన,  రావలసిన స్థాయిలో ప్రజల్లో  పోరాట స్పృహ  ప్రతిఘటన  ప్రశ్నించే ధోరణి బలపడడం లేదు.  రాజీ పడే ధోరణి,  దాటవేసే తత్వం వల్ల  నేటి తరం ముఖ్యం  పోరాట వారసత్వాన్ని భవిష్యత్తుకు అందించకపోతే  నిరసన వ్యక్తం చేసి నిగ్గు  తేల్చకపోతే  రాబోయే కాలంలో  ప్రజల బతుకులు మరింత అంధకారంలోకి నెట్టి వేయబడే ప్రమాదo   ఉన్నది.  "హక్కుల కోసం పోరాటం తప్పేమీ కాదని రాజ్యాంగం చెబుతుంటే  అభ్యుదయ భావజాలం కలిగి ఉండడం నేరం కాదు అని న్యాయవ్యవస్థ నొక్కి చెప్పినప్పటికీ  తమ ఉనికి కోసం ప్రజలు చేస్తున్న పోరాటాలను  నిర్బంధముతో అణచివేయడం  కేసులు  హత్యలను  సమర్ధించుకోవడానికి కట్టు కథలు అల్లి  ప్రభుత్వాలు ఈ మధ్యన  కొన్ని సంఘటనల్లో  అభాసుపాలైన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు". బలమైన ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే అక్కడి ప్రభుత్వం విజయవంతమైనట్లు  ప్రశ్నించి,  ప్రతిఘటించి, హక్కుల కోసం పోరాడి  రాజ్యాంగ పలాలను  దేశ సంపదను ప్రజలందరికీ సమానంగా పంచే క్రమంలో సాగుతున్న పోరాటాల వల్ల  మేలే కానీ కీడు జరగదు."చెట్టు చిగురించడం ఎంత సహజమో పీడిత ప్రజలకు పోరాటాలు కూడా అంతే. "  ఈ సహజ న్యాయాన్ని  జీర్ణించుకోలేకనే కదా  దేశంలో ప్రపంచంలో  జరుగుతున్న మారణకాండ.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333