సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామన్ గౌడ్

May 17, 2026 - 20:03
 0  15
సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామన్ గౌడ్

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై రామన్ గౌడ్ 

17-05-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిధిలో ఫోక్సో, సైబర్ క్రైమ్‌, బాల్య వివాహాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఎస్సై రామన్ గౌడ్

ప్రజల భద్రత మా బాధ్యత.. సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి” అని చిన్నంబావి మండల ఎస్సై రామన్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో వివిధ గ్రామాల వారికి పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, బాలికల రక్షణ కోసం అమలులో ఉన్న ఫోక్సో చట్టం గురించి వివరించారు. చిన్నారులపై వేధింపులు, దాడులు, అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బాధితులకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.ఇటీవల రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఫోన్ కాల్స్‌, లింకులు, సోషల్ మీడియా సందేశాల ద్వారా మోసగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు.ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, అలాంటి ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వినియోగించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వివిధ గ్రామాలవారు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State