లబ్ డబ్... లబ్ డబ్...!! *ఉత్కంఠ...ఉద్వేగం... ఉపశమనం...!*

Feb 12, 2026 - 22:10
Feb 12, 2026 - 22:11
 0  18
లబ్ డబ్...  లబ్ డబ్...!!  *ఉత్కంఠ...ఉద్వేగం... ఉపశమనం...!*
లబ్ డబ్...  లబ్ డబ్...!!  *ఉత్కంఠ...ఉద్వేగం... ఉపశమనం...!*

*లబ్ డబ్... లబ్ డబ్...!!*

*ఉత్కంఠ...ఉద్వేగం... ఉపశమనం...!*

 ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు..!

*ఫలితాల కోసం *ఎదురుచూపులు.*విజయం వరిస్తే*

*మారేనా రూపు రేఖలు.!!*

*విజయంతో వెలిగే ముఖాలు ఏవో...! ఓటమితో ఏడ్చే ముఖాలు ఏవో...!*

*విజయం చేకూర్చాలంటూ ఇష్ట దైవాలకు ప్రార్ధనలు*

*✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్*

తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో ఎన్నికల సమరం ముగిశాక అసలైన తుది ఘట్టం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుండడంతో ఎన్నికల్లో విజయ వరిస్తే వెలిగే ముఖాలు, ఓటమి చెందితే బాధతో ఏడ్చే ముఖాలు తేట తెల్లం కానున్నాయి. ఇన్నాళ్లుగా తాము పడ్డ శ్రమ ఏమవుతుందోనని ఉత్కంఠగా, ఉద్వేగంగా అందరూ ఎదురుచూస్తున్నారు. చివరికి విజయమో, వీర స్వర్గమో తెలుసుకొని ఉపశమనం పొందనున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించెదరు అన్న విధంగా లబ్ డబ్ అంటూ గుండెలు చేతిలో పట్టుకొని బిక్కుబిక్కు అంటున్నారు. విజయం ఎలాగైనా సాధిస్తామని పోటీ చేసిన చాలా తక్కువమంది అభ్యర్థులు మాత్రమే ధీమాతో ఉండగా ఎక్కువ శాతం మంది అభ్యర్థులు ఓడుతామా, గెలుస్తామా ఊడుతామా, ఉంటామా అన్న డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు తోడుగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా తమ తమ పార్టీ అభ్యర్థులు గెలవాలని గత రెండు రోజులుగా ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేయడమే కాకుండా విజయం సాధిస్తే ఆయా మత ఆచారాల ప్రకారం దేవుళ్లకు మొక్కులు మొక్కుకున్నారు. తమ తమ ఇష్టదైవాలను ప్రార్థించుకొని విజయాన్ని చేకూర్చాల్సిందిగా వేడుకుంటున్నారు. మొత్తానికి గెలిచి చేతి రేఖలను మార్చుకొని జీవితపు రేఖలను సరిజేసుకుని రాజకీయ జీవితపు రూపు రేఖలు మార్చుకొనున్నారు. తమ తమ పార్టీల తరఫున విజయం సాధించి భవిష్యత్తు రాజకీయ జీవితాన్ని ప్రారంభించనున్నారు.

*రాజకీయ జీవితానికి పునాదులు పడేది నేడు* 

కొత్తగా పోటీలో ఉన్న అభ్యర్థులు విజయం సాధిస్తే తమ రాజకీయ ఆరం గ్రేటం కు శుక్రవారం పునాది వేసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులుగా సమాజానికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని ఆనందపడుతున్నారు.

ఇంతకు ముందు నుంచి రాజకీయ అనుభవం ఉండి ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు కూడా మరింతగా ప్రజలకు సేవ చేయడానికి, తద్వారా రాజకీయ రంగంలో ఉన్నత పదవులను రాబోయే భవిష్యత్ కాలంలో అధిరోహించడానికి ఈ ఎన్నికలను ఒక మెట్టుగా భావిస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేయడానికి గాను ఆర్థికంగా కూడా చాలా ఖర్చు కావడంతో ఆర్థిక వనరులను కూడా సమకూర్చుకోవడం కోసం రాజకీయ ఎత్తుగడలను అందిపుచ్చుకోనున్నారు.

*మొదలైన క్యాంపు రాజకీయాలు*

ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుండగా ఇప్పటికే పలు ప్రాంతాలలో పార్టీల వారు పోటీ చేసిన అభ్యర్థులను రహస్య ప్రాంతాలలో ఏర్పాటుచేసిన క్యాంపులకు తరలించారు. గెలిచిన అభ్యర్థులను అవతల పార్టీల వారు ఎగరేసుకుపోకుండా పకడ్బందీ వ్యూహంతో ప్రత్యేక స్థావరాలకు తరలించారు. చైర్మన్ రేసులో ఉన్నవారు ఒకవేళ తమకు తక్కువ స్థానాలు వస్తే, ఎలాగైనా చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి, తమకు మద్దతు ఇవ్వడానికి అవతల పార్టీ వ్యక్తులను కొనుగోలు చేసి అయినా, బలవంతంగా నైనా, కిడ్నాప్ చేసి అయినా పట్టుకువచ్చి పదవులు పొందటానికి అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. క్యాంపు రాజకీయాలతో పార్టీలన్నీ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థులకు గిరాకీ బాగా ఉండే అవకాశం ఉండనుంది. అందుకే అన్ని పార్టీలు వారు కూడా గెలిచిన తమ తమ అభ్యర్థులు తమ చేజారకుండా అవతల పార్టీకి వెళ్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.

*ఓడితే మిగిలేది అప్పులే... జీవితమంతా తప్పని తిప్పలే...!!* 

ఎన్నికలలో ఎక్కువ శాతం మంది అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో తమ శాయ శక్తులకు మించి ఖర్చు పెట్టారు. ప్రత్యర్థులను దెబ్బతీయటానికి ఎత్తులకు పై ఎత్తులే కాకుండా ఓట్లను కొనుగోలు చేయడానికి డబ్బులను తమ దగ్గర లేనప్పటికీ అప్పు తెచ్చి అయినా, భూములు, ఇండ్లు, తాకట్టు పెట్టి అయినా డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఎన్నికల్లో తమ సత్తా చూపడానికి తమ దగ్గర ఉన్న డబ్బులకు తోడుగా అదనంగా లక్షలాది రూపాయలు తీసుకొచ్చి ఖర్చుపెట్టారు. విజయం సాధిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అన్న సంతృప్తితో ఖర్చుకు వెనకాడ లేదు. రాజకీయంగా భవిష్యత్తు ఉండటమే కాదు సమాజంలో గెలిచిన వారికి ఒక హోదాతో కూడిన గొప్పతనం కూడా వర్తిస్తుంది అన్న నమ్మకంతో ఎన్నికల ఖర్చుకు వెనక్కు తగ్గేదేలే అంటూ ఎన్నికల ప్రచారంలో మంచినీళ్లలా ఖర్చు పెడుతూ డబ్బులను వెదజల్లారు. అయితే ఎన్ని రకాలుగా విజయం కోసం శ్రమించిన విజయం దక్కకపోతే ఓటమిపాలైతే ఎలా అన్న సందిగ్ధ పరిస్థితుల్లో కొందరు ఆలోచనలో పడ్డారు. ఓటమిపాలైతే చేసిన అప్పులు ఎలా తీరుతాయో అని దిగాలు చెందుతున్నారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డ అనంతరం విజయం సాధించిన వారు సంబ్రమాల్లో, విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటుంటే ఓటమి చెందిన వారు హీనంగా, దీనంగా, దిగాలుగా, బిక్క మొహాలు వేసుకొని ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్లినప్పటికీ ఓటమి ఎలా జరిగిందని పోస్టుమార్టం చేసుకున్న కళ్ళ ముందు మిగిలే లక్షలాది అప్పుల రూపాయలు ఎలా తిరిగి చెల్లించాలో అర్థం కాక అనేకమంది అభ్యర్థులు కలలు పట్టుకు కూర్చునే స్థితి, పరిస్థితి తప్పదు కదా మరి. ఏదో ఏమైనా శుక్రవారం మధ్యాహ్నం వరకల్లా విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో స్పష్టం కానుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333