రచన ఏ ప్రక్రియలో ఉన్నా రచయిత ప్రతిభను చాటుకోవడానికి మాత్రం కాదు
సమాజాన్ని చైతన్యం చేసే క్రమంలో సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకోవడానికే.
వ్యవస్థ యొక్క హితాన్ని కోరడమే సాహిత్య లక్ష్యం లక్షణం కూడా.
అందుకు భిన్నమైన సాహిత్యాన్ని, రచయితలను గుర్తించాల్సిన పని లేదు.
---- వడ్డేపల్లి మల్లేశం
సమాజం యొక్క హితాన్ని కోరేదే సాహిత్యం అని నిర్వచించుకున్నాము కానీ కాలానుగుణంగా అందుకు తోడుగా హితాన్నీ సాధించిపెట్టే క్రమంలో సాహిత్యము రచయితలు కూడా ఉద్యమాలు చేయటం నేటి అవసరంగా గుర్తించాలి. అలాంటి పరిస్థితుల్లో సాహిత్యాన్ని ఏ ప్రక్రియలో సృష్టించిన కవులు రచయితలు చేసే కార్యం తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి మాత్రం కాదు అని సమాజం గుర్తించాలి. అవకాశవాద రాజకీయాల మాదిరిగా అవకాశవాద సాహిత్యం, తిరోగమన సాహిత్యం, వ్యవస్థను మందగమనంలో కొనసాగించే సాహిత్యం, అంతేకాదు వ్యవస్థను మరింత అంధకారం లోకి నెట్టే సాహిత్యం కూడా అందుబాటులోకి వస్తున్నట్లు దానిని తృణీకరించవలసిన అవసరం ఉన్నదని భాషా శాస్త్రవేత్తలు, పండితులు, విమర్శకులు, ఉద్యమకారులు, ప్రజాస్వామిక వాదులు హెచ్చరిస్తున్న విషయాన్ని కూడా సమాజం సుదీర్ఘంగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. విద్యకు ఏ రకంగా నైతే సమాజ మార్పుకు ఉపయోగపడే లక్ష్యాలు ఎంచుకున్నామో అదే మాదిరి సాహిత్యానికి కూడా విస్తృత లక్ష్యాలు ఉన్నాయి అనే విషయాన్ని సాహిత్యకారులు గమనించాలి. అలాంటప్పుడు లక్ష్యాలకు భిన్నంగా సృష్టించే ఏ సాహిత్యం కూడా నిలబడదని వ్యవస్థ మార్పుకు దోహదపడదని హెచ్చరించవలసిన అవసరం కూడా మన అందరి పైన ఉన్నది . సమాజాన్ని నిశితంగా పరిశీలించడం, అసమానతలు అంతరాలను నిర్మూలించే ప్రయత్నంలో కష్టాలు కన్నీళ్లు కొంతమందికి మాత్రమే పరిమితం కావడం అవి శాశ్వతంగా మిగిలిపోవడాన్ని ఎండగట్టవలసిన అవసరం సాహిత్యకారులకు ఉన్నది. ప్రస్తుతము కొనసాగుతున్నటువంటి అనేక సామాజిక రుగ్మతలకు కారణాలను మూలాలను అన్వేషించి పాలకులకు ప్రజాస్వామ్య వాదులకు ఉద్యమకారులకు విప్పి చెప్పడం ద్వారా మరింత ఉన్నతమైన స్థితిలోకి ప్రస్తుత సమాజాన్ని చేర్చవలసిన బాధ్యత కూడా సాహిత్యానిదే. .లక్ష్యాలకు, ఆదర్శాలకు, సమాజం మనుగడకు భిన్నంగా నడుచుకునే రచయితలు కవులు కళాకారులను సమాజం చీత్కరిస్తుందని గ్ర హించవలసిన అవసరం ఉన్నది. ఈ క్రమంలో రచనలు చేసే వాళ్లే కాకుండా సామాజిక ఉద్యమకారులు, వక్తలు, కళాకారులు, తట్టి లేపే పోరాట వీరులు, సామాజిక వేత్తలు ,హక్కుల కార్యకర్తలు కూడా సాహిత్య రంగంలోని వాళ్లు గానే గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన అందరి లక్ష్యం ఒక్కటే కనుక .
కఠిన పదాలను భారీగా ఉపయోగించడం, దీర్ఘ సమాసాలు చందస్సును విరివిగా వాడడం, బావ కవిత్వానికి మాత్రమే పరిమితమై భౌతిక వాదాన్ని పక్కన పెట్టడం, పాఠకులకు తెలియని స్థాయిలో రచనలు కొనసాగించడం దానినే సాహిత్యం యొక్క పదునుగా భావించే రచయితలు కూడా లేకపోలేదు. తోటి కవులు రచయితలకే అందని స్థాయిలో చేసిన రచనలను మామూలు స్థాయిలో విద్యాభ్యాసం చేసిన పాఠకులు ఏ రకంగా అవగాహన చేసుకుంటారు? ముందుగా ఆ రచయితలు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది . అందుకే రచయితల యొక్క ప్రతిభను, పెద్దరికం, డాంబికాన్ని, హోదాను పక్కనపెట్టి పాఠకులు సమాజంలోని భిన్న వర్గాల స్థాయిని గుర్తించి సాహిత్యం ప్రజల్లోకి వెళ్లే విధంగా కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. దానికి భిన్నంగా రాసేవాళ్లను రచయితలుగా గుర్తించవలసిన అవసరం లేదు .
సామాజిక బాధ్యతగా సాహిత్యాన్ని సృష్టించాలి:-
************
సమాజంలోని భిన్న వర్గాలు వారికి కేటాయించబడిన వృత్తి ధర్మాన్ని పాటించి సమాజ ప్రగతికి దోహదం చేస్తున్నట్లే సాహిత్య రంగంలో పనిచేస్తున్నటువంటి కవులు కళాకారులు మేధావులు వక్తలు సామాజిక కార్యకర్తలు పెద్దరికం కోసం కాకుండా తమ పరిశీలన, ప్రతిభా, పరిజ్ఞానాన్ని సా మాజక స్పృహను పెంచే క్రమములో చైతన్యాన్ని తీసుకురావడానికి సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ బాధ్యతకు వేతనం గాని సౌకర్యాలు కానీ ప్రజలు పాలకుల పరంగా కల్పించబడవు. అయితే కొన్ని సందర్భాలలో ఆయా రచయితల యొక్క పుస్తకాలను ప్రచురించడానికి, పురస్కారాలను అందించడానికి, ప్రతిభను గుర్తించడానికి ప్రభుత్వ పక్షాన ఆర్థిక సహకారం అవార్డుల ప్రధానo వంటివి జరుగుతున్నాయి. అయినా రచయితలు వాటికి మాత్రమే ఆశించక తమ వృత్తి తో పాటు సాహిత్య రచనను ప్రవృత్తిగా స్వీకరించి బాధ్య తగా గుర్తించి స్వచ్ఛందంగా పని చేయవలసి ఉంటుంది. నిరంతర తపన, ఆరాటం, పరిశీలన, పరిశోధన, భిన్న వర్గాలతో చర్చలు, ప్రశ్నలు జవాబులు, సామాన్యుల నుండి అసామాన్యుల వరకు కూడా మేధో మధనం జరిగినప్పుడు అందుకు తోడుగా ఆధునిక ప్రాచీన అన్ని రకాల సాహిత్యాలను అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు పరిష్కారాలను రచయితలు తమ రచనల ద్వారా ఇవ్వగలరు. అది వ్యాసం ,కవిత, గేయం, కావ్యం, కథ ,నవల వంటి అనేక రూపాలలో వారికి నచ్చిన ప్రక్రియలో నైపుణ్యాన్ని బట్టి మార్గాలను గమ్యాన్ని సమాజానికి అందించవలసి ఉంటుంది .
మొక్కుబడి సాహిత్యం, లక్ష్యంలేని, సామాజిక రుగ్మతలకు పరిష్కారం చూపలేని సాహిత్యాన్ని సమాజం నిరాకరిస్తుంది అనే స్పృహ రచయితలకు ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో "ప్రజల ఆకాంక్షలు ఆశయాలు ప్రభుత్వాలు సమాజం ద్వారా కోరుతున్నటువంటి పరిష్కారాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా చైతన్యానికి పాలకుల లోపాలను ఎత్తి చూపడం ద్వారా పాలనలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టడం రచయితల ముందున్న తక్షణ కర్తవ్యం. దీనికి ప్రత్యేక సిలబస్, నిబంధనలు అంటూ ఏవి ఉండవు. ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని, చేరుకోవలసిన గమ్యాన్ని దృష్టిలో ఉంచుకొని , మన ఆలోచన సరళి పరిశీలన మానసిక నిబద్ధతను జోడించి సమాజానికి హితాన్ని సమకూర్చవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంలో పెట్టుబడి దారి భూస్వామ్య వర్గాలు, నేర ప్రవృత్తి గల అక్రమార్కులు, పారిశ్రామికవేత్తలకు తొత్తులుగా వ్యవహరించి ప్రజా సంక్షేమాన్ని మరిచే ప్రభుత్వాలు కూడా రచయితలకు ఆటంకాలుగా పరిణమించే అవకాశం లేకపోలేదు. అందుకే సూచనలు సలహాలతో అందించే సాహిత్యం వ్యవస్థను మార్చదు అని తేలిన సందర్భంలో ఒక్క అడుగు ముందుకు వేసి రచయితలు కూడా ప్రజా ఉద్యమాలతో మమేకమై అవసరమైన చోట ప్రశ్నించి ప్రతిఘ టించడం ద్వారా తమ పరిధిని విస్తరించుకోవలసిన అవసరం ఉంది. ఇది రచయితల యొక్క పట్టుదల నిబద్ధత సామాజి స్పృహ పై ఆధారపడి ఉంటుంది." అందుకు రచయితలు కవులు కళాకారులు సిద్ధంగా ఉండాల్సినటువంటి అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాలగమనముతో పాటు రచయితలు కూడా తమ పరిధిని విస్తరించుకున్నప్పుడు మాత్రమే సాహిత్యం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సమాజం అంతరాలు అసమానతలు లేని మరింత మెరుగైన స్థితికి చేరుకుంటుంది, ఆ వైపుగా రచయితలు ఉద్యమ స్ఫూర్తితో పని చేయవలసిన అవసరం ఉంది,. కేవలం ఇంటికి పరిమితమై, క్షేత్ర స్థాయికి అనుబంధం లేకుండా, ఆలోచనను మాత్రమే అక్షరబద్దం చేస్తే వ్యవస్థ మారదు అని తెలుసుకుంటే మంచిది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ) జీ