వై ద్య సౌకర్యాల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు రావాలి
ఉద్యోగులకు ఉన్న అవకాశాలు సామాన్యులకు లేవంటే చిత్రం కాదా?
అరకొర వనరులు, సిబ్బంది,యంత్ర పరికరాలు, చాలీసాలని మందులతో వైద్యరంగం సాగేదెలా?*
**************
-- వడ్డేపల్లి మల్లేశం 9014206412
-- 07....02....2025**********
కోట్ల రూపాయల ఖర్చుతో ఆస్పత్రుల కోసం భవనాలు నిర్మిస్తున్నట్లు పలు పత్రిక ప్రకటనలు, వైద్యం విషయంలో ఎన్ని కోట్ల ఖర్చు అయినా వెనుకాడేది లేదు అంటూ పాలకుల హామీలు, జిల్లాకు ఒక మెడికల్ కళాశాల అంటూ అధికారుల ప్రజా ప్రతినిధుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు, .గ్రామీణ ప్రాంతాలలో దవాఖానలు పట్టణ ప్రాంతాలలో బస్తీ దవాకానల పేరుతో ప్రచారంలో వైద్యరంగం నిరంతరం పత్రికలు టీవీలు ప్రసార మాధ్యమాలలో కథనాలు వినపడుతూ కనపడుతూ ఉంటే సామాన్యుల సంబరాలకు అంతే లేదు. కానీ స్కూల్లు కళాశాలలు హాస్టల్లో ఎలుకలు కొరికిన విద్యార్థుల చికిత్సకు, పాములు కాటు వేసిన వైనానికి, ఫుడ్ poison చికిత్స కు పరిష్కారం లేకపోవడం మందులు లేక ఎంతోమంది మృత్యువాత పడం మనం గమనించవచ్చు. ఇటీవల కాలంలో కుక్కలు పందుల దాడిలో పదుల సంఖ్యలో పిల్లలు మరణించిన విషయం తెలుసు. గాయపడ్డ వాళ్లను కూడా రక్షించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో సర్వసాధారణమైపోయినవి. విచిత్రమైన జబ్బు నయం కావాలంటే కోట్ల రూపాయలు కావాలని, లక్షలాది రూపాయలు అడ్వాన్స్ చెల్లిస్తేనే వైద్యం ప్రారంభిస్తామని ఆసుపత్రి వర్గాలు ప్రకటించినట్లు పేద కుటుంబాలు లక్షలాది రూపాయ లు అప్పుచేసి చెల్లించినారని ఇక సాధ్యం కావడం లేదని దయామయులు సహకరించాలని పత్రికల్లో టీవీలలో ప్రకటనలు సమాంతరంగా మనకు కనపడుతూ వినపడుతూ ప్రజలను ఆలోచింపజేస్తూ ఈ దేశ అయోమయ స్థితిని ఎప్పటికప్పుడు కళ్ళ ముందు ఉంచుతున్న పరిస్థితి మనందరికీ తెలువనిది కాదు.
ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన ఆస్పత్రి, పెద్ద పట్టణంలో ఉన్నటువంటి ప్రాంతీయ వైద్యశాల, రాష్ట్ర రాజధాని లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం లభించనటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. సిటీ స్కాన్ ఎమ్మారై లాంటి పరీక్షలు కావాలని క్రింది స్థాయి డాక్టర్లు సిఫారసు చేసినప్పుడు పెద్ద వైద్యశాలల్లో పరీక్షించరు, క్రింది స్థాయి వైద్యుల సిఫారసులను ఆమోదించరు, ఆ రకమైన పరీక్షలను చేసి ఇవ్వరు, విధి లేని పరిస్థితిలో దుర్భరమైనటువంటి సందిగ్ధ అవస్థ మధ్యన లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు వైద్యశాలలకు వెళ్ళక తప్పడం లేదు అంటే ప్రభుత్వ రంగంలో కోట్ల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రి భవనాలను చూసి సంబరపడడానికేనా వైద్య శాఖను నడిపేది? పట్టణాలలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి కనీస మైనటువంటి రక్త మూత్రమల పరీక్షలను చేయించుకోవడానికి బయట ప్రైవేటు రంగంలో వేలాది రూపాయలు ఖర్చవుతు ఉంటే ప్రభుత్వ రంగంలో బస్తీ ద వాఖానలో ఉచిత పరీక్షలు చేయించుకుందామంటే కనీసం బీపీ మెషిన్ కూడా అందుబాటులో లేకపోవడం, ఉన్నా పని చేయకపోవడం, సిబ్బంది లేకపోవడం వంటి సమస్యలతో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అత్యల్ప పేద కుటుంబాలు వైద్య ఖర్చులకు తమ అల్ప వేతనం మొత్తాన్ని ఖర్చు చేయవలసి రావడం పాలకులకు కనిపించడం లేదా? వచ్చే అరకొర వేతనంలో ఇల్లు కిరాయి, వైద్య ఖర్చులు, పిల్లల చదువులకే లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే కుటుంబం గడవడం కష్టమవుతున్న విషయం ఎందుకు పాలకులు పట్టించుకోరు? ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని చాలెంజిగా తీసుకొని ఎంత ఖర్చైనా పేదవాడి నుండి పెద్దవాడి వరకు ఎవరికైనా ఉచితంగా అందించడానికి సిద్ధమని పాలకులు చెప్పగలరా? లేకుంటే వైద్య ఖర్చులకు ప్రభుత్వం సిద్ధంగా లేదు ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయించమని ప్రజలను కోరిన ఫరవాలేదు కానీ పాలకులు ఏదో ఒకటి తెల్చుకోవలసివుంది. రెండు పడవల పైన ప్రయాణం లాగా ప్రభుత్వ రంగాన్ని నడిపిస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ చాలీచాలని వేతనాలను అందిస్తూ అరకొర సౌకర్యాలతో కొనసాగిస్తే ప్రజలు ప్రశ్నించరు, ఉద్యమించరనే కదా పాలకుల విశ్వాసం?
ఉద్యోగులకు ఉన్న అవకాశం సామాన్యకులకు లేకపోవడం విచిత్రం :-
********
ఉద్యోగులు పెన్షనర్లు పోలీసులు జర్నలిస్టులకు ఎంతో కొంత వేతనముతో పాటు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలున్న వారికోసం గత పది సంవత్సరాల క్రితం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రాలలో వెల్నెస్ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా పూర్తిస్థాయిలో అన్ని రకాల నిపుణులు లేకపోయినప్పటికీ కనీసం ప్రైవేటులో చూపించుకున్నటువంటి చిట్టీలను తీసుకువెళ్తే మందులను ఇవ్వడం కొన్ని రకాల పరీక్షలు చేయడం వరకు అయినా అవకాశం ఉన్నది. అంతో ఇంతో ఆర్థికంగా ఉన్నటువంటి వర్గాలకేమో వెలనెస్ సెంటర్లలో అవకాశం కల్పించి సామాన్యులకు జిల్లా కేంద్రాల లోపల కూడా నాణ్యమైన మందులు ఇవ్వడం లేదంటే పరీక్షలు చేయకపోవడం వలన ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కొన్ని ఎంపిక చేసినటువంటి డెంటల్ ఆసుపత్రులలో ఈ హెచ్ ఎస్ పేరు మీద ఉద్యోగులకు పోలీసులకు జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆమోదం పొంది ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉంటే పేద వాళ్లకు ఆరోగ్యశ్రీ కూడా వర్తింపకపోవడం నిజంగా సిగ్గుచేటు కాదా? పళ్ళు ఊడిపోయి పెట్టించుకోవడానికి లక్షలాది రూపాయలు లేక పేదవాడు గిలగిల కొట్టుకుంటూ ఉంటే ప్రైవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడం అంటే సామాన్యుల పట్ల ఎంత వివక్షత కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అంటే వైద్య విధానం పట్ల ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల పేదవాళ్లు అన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. తమ యావదాస్తిని లేదా ఆదాయాన్ని వైద్య ఖర్చులకే కోల్పోవలసి వస్తున్నది ఇది ప్రభుత్వం దృష్టికి రాకపోతే ఎలా? ఇప్పటికీ జిల్లా కేంద్రాల్లో ఉన్న వెల్నేస్ సెంటర్లను నియోజకవర్గస్థాయికి వర్తింప చేయడంతో పాటు అన్ని వర్గాలకు కూడా నాణ్యమైన మందులు పరీక్షలు అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రిలో నిపుణులను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రచించవలసిన అవసరం ఉంది.స్పష్టమైన వైద్య విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అమలు చేస్తే అది దేశవ్యాప్తంగా ఆదర్శంగా కొనసాగే అవకాశం ఉంటుంది. లేకుంటే అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో కూడా అరకొర సౌకర్యాలు ఉంటే తెలంగాణ ప్రపంచముతో పోటీ పడినట్లు ఎలా అవుతుంది?
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)