మహిళల రక్షణకు షీ టీమ్స్ నిరంతర సేవలు వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలి
ఆకతాయిలపై ప్రత్యేక నిఘా – జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్.
మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిల వలన గానీ, ఇతర రకాల వేధింపుల వలన గానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఎలాంటి భయం లేకుండా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు తెలిపారు. మహిళల రక్షణ కోసం జిల్లాలో షీ టీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు అందిన వెంటనే నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో వేధింపులు, బాలికలపై లైంగిక వేధింపులు వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వెంటనే షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఆగష్టు నెలలో షీ టీమ్స్ ద్వారా 10 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలు, యువతులు, బాలికలకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఆగస్టు నెలలో 16 పెట్టి కేసులు నమోదు
జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్‌కు 02 ఫిర్యాదులు అందగా, వాటిపై చర్యలు తీసుకోవడమైనది. మరియు 16 పెట్టి కేసులు కూడా నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
అలాగే 85 హాట్‌స్పాట్‌లపై నిఘా ఏర్పాటు చేసి, 15 మంది పోకిరీలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో 17 కౌన్సెలింగ్‌లు నిర్వహించినట్లు తెలిపారు.
మహిళలు, యువతులు, బాలికలను వేధించే వారిపై షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతున్నాయని, ఎవరైనా మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
నేరుగా పోలీసులను సంప్రదించలేని వారు 8712670312 ఫోన్ నంబర్‌కు లేదా డయల్ 112కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
ఒంటరిగా ప్రయాణించే మహిళలు T-SAFE యాప్‌ను వినియోగించుకోవాలని, ప్రయాణ సమయంలో భద్రతకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.
“మహిళల భద్రతకు గద్వాల్ పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. మహిళలను వేధించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు” అని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు తెలిపారు.
....పి.ఆర్.ఓ.
జిల్లా పోలీస్ కార్యాలయం,
జోగుళాంబ గద్వాల్ జిల్లా.