విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

Jun 23, 2026 - 16:39
 0  1
విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

నానో యూరియా, డీఏపీలపై దృష్టి  సారించాలి.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన విత్తన మేళాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

మంగళవారం ఐజ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఏడు రకాల వరి వంగడాలను మాత్రమే సాగు చేయాలని సూచించినందున రైతులు మంచి డిమాండ్ ఉన్న వీటినే సాగు చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి లభ్యత తక్కువగా ఉండే గ్రామాల్లో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు కందులు, వేరుసెనగ, కూరగాయలు, తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. రైతులు నానో యూరియా, డిఏపి వినియోగించేలా డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న పంటను రికార్డ్ స్థాయిలో పండించారని, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సేకరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ మండలాల వారీగా యూరియా యాప్ ను ప్రారంభించారు. పలువురు రైతులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కందుల విత్తనాలను పంపిణీ చేశారు. డీలర్లు ఏర్పాటు చేసిన విత్తనాలు, ఎరువుల స్టాల్స్ ను పరిశీలించి నిబంధనల ప్రకారం రైతులకు విక్రయించాలనీ సూచించారు. 

అనంతరం కలెక్టర్ సమీపంలోనీ జెడ్పిహెచ్ఎస్ ను సందర్శించారు. మన ఊరు మనబడి ద్వారా పాఠశాలలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల గురించి అడిగారు. పాఠశాల విద్యార్థి రవిచంద్ర ఈనెల 24న హైదరాబాద్లో నిర్వహించనున్న మోడల్ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ కార్యక్రమానికి ఎంపికైనందున పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఐజ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే సాదా బైనమా, భూభారతి, తదితర దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, ఐజ పిఎసిఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, ఆత్మ అధికారి జగ్గు నాయక్, ఎంఏఓ జనార్ధన్, తహసిల్దార్ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర రావు, ఏఈఓ లు, ఇతర అధికారులు, ఆదర్శ రైతులు, తదితరులు పాల్గొన్నారు. 
..............................................................
జారీ చేయువారు: డీపీఆర్ఓ/జోగులాంబ గద్వాల జిల్లా.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333