మహిళల భద్రతే షి టీమ్ లక్ష్యం
విద్యార్థులు సెల్ఫోన్, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తాం
జోగులాంబ గద్వాల17 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల.:- మహిళల భద్రతే షి టీమ్ లక్ష్యమని, మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి అండగా షి టీమ్ అందుబాటులో ఉంటుందని షి టీమ్ సభ్యులు అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు షి టీమ్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షి టీమ్ మాట్లాడుతూ మహిళల పట్ల ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించ కూడదని, అలా చేస్తే వారికి చట్టంలో కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. మహిళలకు అండగా షి టీం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందని, ఏ సమస్య వచ్చిన స్థానిక పోలీసులకు గాని షీ టీం అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు . విద్యార్థి దశ నుండే కష్టంతో కాకుండా ఇష్టపడి చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులు దురాలవాట్లకు దూరంగా ఉండాలని డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని అంతేకాకుండా సెల్ఫోన్ కు ఎంత దూరంగా ఉంటే అంత భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు. సెల్ఫోన్ వాడకం ద్వారా మంచి ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా చెడు ఉంటుందని కాబట్టి సెల్ఫోన్ అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మీకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ తల్లిదండ్రులకు కానీ, మీ గురువులకు లేదా స్థానిక పోలీసులకు, షీ టీం సభ్యులకు తెలపాలని వారు అన్నారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే షీ టీం నెంబర్ 8712670312 కు కాల్ చేసి సమాచారం అందిస్తే వేధించే వారి భరతం పడతామని మరియు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్పగా ఉంచుతామని షీ టీం సభ్యులు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మహేంద్ర, షీ టీం సభ్యులు శేషన్న,దివ్యవాణి,హనుమంతు, లోకేశ్వరి మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.