బీసీ వాదం బలపడడానికి వేదికైనా ఎమ్మెల్సీ ఎన్నికలు.*

Mar 8, 2025 - 11:21
 0  5

బీసీ వాదం బలపడడానికి వేదికైనా ఎమ్మెల్సీ ఎన్నికలు.* రాజకీయ పార్టీల పునాదులను పెకిలించే భూకంపాలు *సామాజిక న్యాయం ఎండమావి కాకూడదు.* ఓట్ల బలం ఉన్నప్పుడు సీట్లు మావి అని నిరూపించాలి.*

********************************

---వడ్డేపల్లి మల్లేశం 9014206412 

---24...02...2025***************

వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానానికి, కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ స్థానానికి అటు ఉపాధ్యాయుల ఇటు పట్టభద్రుల ఎన్నిక ప్రచారం ప్రసంగాలపర్వం ఉపాధ్యాయులను పట్టభద్రులతో పాటు సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులను విద్యార్థులను కూడా ఆలోచింపచేసినది. గతంలో పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికలు ఇతర ఏ వర్గానికి కూడా అంతగా తెలిసేవి కాదు కానీ ఇటీవల రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ మేరకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఇస్తామని అందుకు సంబంధించి కులగనన చేసి బిల్లు అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు జరిగిన కుల గణన పైన పెను దుమారం చెలరేగినది. బయటికి ప్రకటించకపోయినప్పటికీ 2014లో కెసిఆర్ నిర్వహించిన ఒకరోజు సర్వేలో బీసీలు 51% గా నమోదైతే ప్రస్తుత ప్రభుత్వ నిర్వహించిన సర్వేలో 46% మాత్రమే బీసీలు ఉన్నట్లు లెక్క తేలడం అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. బీసీ మేధావుల సంఘం బీసీ సంక్షేమ సంఘాలు ఇతర మేధావులు పార్టీలకతీతంగా రాజకీయ పక్షాల నాయకులు విశ్లేషకులు ఈ లెక్కలు తప్పుల తడక అని, చేసిన సర్వేలో లోపాలు ఉన్నాయని, తిరిగి నిర్వహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జనంలో పెద్ద ప్రచారం చెలరేగడానికి కారణమైంది. ఇదే సందర్భంలో మూడు స్థానాలకు సంబంధించి ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితా ఆ సందర్భంగా జరిగినటువంటి ప్రచార కార్యక్రమాలు బిసి సంక్షేమ సంఘం తీసుకున్నటువంటి కొన్ని అనుకూలమైన నిర్ణయాల వలన ముఖ్యంగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ స్థానానికి పట్టభద్రుల సమరంలో ఓసి బిసి వర్గాల మధ్యన చలరే గుతున్నటువంటి ప్రచ్చన్న యుద్ధం కూడా బీసీ వాదాన్ని సవాల్గా తీసుకోవడానికి కారణమైనది.

      ఒకవైపు విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డిగారు పట్టబదృల స్థానానికి, మల్క కొమురయ్యగారు ఉపాధ్యాయ స్థానానికి పోటీలో ఉండడం ప్రభుత్వ విద్యా ఉపాధ్యాయ రంగాలకు తీరని ద్రోహం జరుగుతుందని ఆగ్రహం ఒకవైపు ఉంటే మరొకవైపు బీసీ వర్గానికి చెందినప్పటికీ మల్క కొమురయ్య ఉపాధ్యాయ స్థానానికి పోటీలో నిలవ డాన్ని పెట్టుబడిదారీ వర్గానికి ప్రతినిధిగా ప్రజలు అంగీకరించే స్థితిలో లేకపోవడం కూడా ఆలోచించాలి. అంటే బీసీ వాదం బలపడుతూనే పెట్టుబడిదారీ విధానాన్ని ప్రైవేట్ రంగాన్ని బీసీలు అనుమతించరు, ప్రభుత్వ రంగంలోనే విద్య వైద్యము సామాజిక న్యాయము అన్ని రకాల వ్యవస్థలు కొనసాగాలని కోరుకుంటున్నారు అనడానికి ఈ ఆలోచన నిదర్శనంగా భావించాలి..బీసీ మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిరంజీవి గారు అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు సంయుక్త ప్రకటన ద్వారా మూడు స్థానాలలో నిలబడుతున్నటువంటి బీసీ అభ్యర్థులకు తమ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా బహిరంగ ప్రకటన చేసి ఉన్నారు. అదే సందర్భంలో అక్కడ ఇంకా మిగిలిపోయినటువంటి బీసీ కార్యకర్తలు లేదా అభ్యర్థులు ఉంటే మిగతా ప్రాధాన్యత ఓట్లను వారికి కూడా వేయడం ద్వారా ఓటర్లు తమ యొక్క చాకచక్యాన్ని సమయస్ఫూర్తిని చాటుకోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా బీసీ వాదాన్ని మరింత ముమ్మరం చేయడానికి ఓసీలను ఓడించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇప్పటికే రాష్ట్ర శాసనసభ శాసనమండలిలో ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి రెడ్డిలు రావులు ఎక్కువ సంఖ్యలో కొనసాగుతున్న సందర్భంలో ముఖ్యంగా కాంగ్రెస్ బిజెపి లాంటి పార్టీలు బీసీలను కాదని ఆధిపత్య కులాలకే అభ్యర్థిత్వం కేటాయించడం బీసీ వర్గాలకు తీరని ద్రోహం కాగా దీనిని సవాలుగా తీ సుకున్నటువంటి అభ్యర్థులు ఉద్యోగులు, బీసీ వర్గాలు, బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని సైతం ఆలోచింప చేసే విధంగా తమ శక్తియుక్తులను ధారబోసి బీసీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మరొక్కవైపు బీసీ అభ్యర్థులలో డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఉపాధ్యాయ రంగంలో వై అశోక్ కుమార్ ముత్తారం నరసింహస్వామి వంటి బీసీ వాదులు ఉద్యమ నేపథ్యం కలిగి సమస్యల మీద అవగాహనతో పాటు ప్రతి ఉత్తర్వును వివరించగలిగిన సత్తా ఉన్న వాళ్లను ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వ రంగంలో విద్యను కాపాడుకోవడానికి, విద్యారంగానికి హెచ్చు నిధులను కేటాయించడానికి, కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వాలను ఒత్తిడి చేయడానికి, నిరుద్యోగ యువతకు కొలువుల కొట్లాటకు వీలుంటుంది. పెట్టుబడుదారి వర్గాలను ఎన్నుకుంటే వాళ్లు ప్రభుత్వ రంగ బలోపేతం కోసం కృషి చేస్తారా ?ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారిని పోటీలో దించినదో అర్థం కావడం లేదు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వ్యవస్థ 60 శాతం ఆక్రమించి ప్రభుత్వ రంగం కునా రిల్లిపోయిన దయనీయస్థితిలో ప్రైవేటు వ్యవస్థను మొత్తం కూలదోసి ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించే విధంగా వివక్షతకు తావులేని పద్ధతిలో ఉండాల్సిన నాణ్యమైన ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలకు ఈ చర్య పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నది. మరొకవైపు బీసీ వర్గాలు అంటే పేదవాళ్ళని, డబ్బు లేనందున వాళ్లకు టిక్కెట్టు ఇవ్వలేదని, టికెట్ ఇచ్చిన గెలవలేరని, అందుకోసమే తమ కులాలకు చెందిన వాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తే గెలుస్తున్నారని నమ్మలికే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అంటే సంపన్నులు పెత్తందారీ వర్గాలు భూస్వాములకే నా ఈ రాజ్యాన్ని పాలించే హక్కు? మేమెంతో మాకు అంత అనే నేపథ్యంలో బీసీ వాదులు పోరాటం చేస్తున్నారు తమకు ఉన్నటువంటి మేధో పరిజ్ఞానంతో సామాజిక అవగాహన ప్రభుత్వ రంగం పైన బాధ్యతతో ఒక్కొక్కరూ తమ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సామాజిక సేవకు తరలివస్తున్నారు అందులో ప్రసన్న హరికృష్ణ ఒకరు కాదా!

      జనాభాలో ఆయా సామాజిక వర్గాలకు వారి వాటా మేరకు అన్ని రంగాల్లోనూ న్యాయం దక్కాలి ప్రధానంగా రాజ్యాధికారం అనే అంశంలో బీసీలకు వాటా దక్కకుండా ఉంటే ఆధిపత్య వర్గాలు మరెo తో కాలం స్వారీ చేయడానికి వెనుకాడవు.

 ఎందుకంటే వాళ్లకు సామాజిక న్యాయం చేయాలి అనే సోయి ఉండదు. ఉదాహరణకు 2.4 శాతం ఉన్నటువంటి రెడ్డి వర్గానికి ఈ రాష్ట్రంలో 43 మంది శాసనసభ్యులు ఉన్నారు అయినప్పటికీ శాసనమండలిలో కూడా వదిలిపెట్టకుండా అదే వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇచ్చి బీసీల ఆగ్రహానికి గురైన విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం ఉందా.

రాజ్యాంగంలో రాసుకున్నటువంటి సామాజిక న్యాయం ఎండమావి కాకూడదు. డబ్బుకు సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించగలిగితే మేధస్సు, అవగాహన, సామాజిక చింతన అంశాల్లో పోటీ కొనసాగినట్లయితే కచ్చితంగా బీసీ వర్గాలు ముందు వరుసలో ఉంటారనడంలో ఆశ్చర్యం లేదు. ఆ వైపుగా ఎన్నికల సంఘం కూడా తగిన మార్పులు నిబంధనలు రూపొందించాలి అదే సందర్భంలో మెజారిటీ 60 శాతం ఉన్న బీసీ వర్గాలు ఓట్లను తమ అభ్యర్థులకే వేసుకోవడం ద్వారా నిరంతరం ఆధిపత్యం చలాయించడానికి సిద్ధంగా ఉన్నటువంటి అగ్రవర్ణాల కుట్రలను చేదిస్తే భవిష్యత్తు అంతా బీసీలదే. రాజ్యాధికారాన్ని అనుభవించడానికి, వాటాను తమ వర్గాలకు అందించడానికి కాంక్ష ఉండాలి. కాంక్ష, ఆత్మాభిమానం ముందు డబ్బు ఓడిపోవాల్సిందే. అందుకే ప్రసన్న హరికృష్ణ, వై అశోక్ కుమార్, ముత్తారం నరసింహస్వామి వంటి వాళ్లందరూ ఆత్మగౌరవంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు. ఈ ఎన్నికల ద్వారానైనా బిసి ప్రజానీకం మేధావులు బుద్ధి జీవులు ఓటర్లు పట్టబదృలు ఉపాధ్యాయులు తమ బాధ్యతను గుర్తించి తప్పిదాలను సవరించుకొని 60 శాతం గా ఉన్న మెజారిటీ వర్గందే రాజ్యమని రుజువు చేయాల్సిన అవసరం ఉంది.అందుకు వేదికైన ఎమ్మెల్సీ ఎన్నికలు నిజంగా మనలను ఒకటి చేయడం సర్వదా అభినందనీయం.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333