ప్రభుత్వ ఉపాధ్యాయులారా వందనం!

Mar 30, 2024 - 23:33
 0  10

 కొంతమంది కలుపు మొక్కలతో  ఉపాధ్యాయ లోకానికి అప్రతిష్ట రానీయకండి.

వృత్తినిబద్ధత సామాజిక బాధ్యత" మన నినాదాన్ని మర్చిపోయారా ?

సామాజిక మార్పుకు, ప్రజా ఉద్యమాలకు  ఉపాధ్యాయ సంఘాల కృషిని గుర్తు తెచ్చుకుంటే మంచిది.

---- వడ్డేపల్లి మల్లేశం


విద్య యొక్క ప్రాథమిక దీర్ఘకాలిక లక్ష్యాలను గుర్తించి గౌరవించి సమాజాన్ని మెప్పించి ఆ లక్ష సాధనలో భావి భారత పౌరులైన ముందున్న విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులది. "విద్యకై రమ్ము విశ్వ సేవకై పొ మ్ము" అని పాఠశాలల పైన కనిపించే సూక్తులను అర్థం చేసుకోవడం కూడా అవసరం  .ఉపాధ్యాయ లోకం నుండే సమాజంలోని అనేక భిన్న రంగాలకు ఎంతోమంది  రావడం వలన ఆరంగాలు రాజకీయాలు, పోలీసు వ్యవస్థ, అధికారులు, శాస్త్రవేత్తలు, ఇతర అన్ని విభాగాలు గుర్తింపు పొందిన విషయాన్ని గమనించినప్పుడు ఉపాధ్యాయులకు ఆయా రంగాలపైన ఎంత పట్టు బాధ్యత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పటికి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి గౌరవం ఇతర ఏ వర్గాలను లేకపోవడాన్నీ గమనించవచ్చు .జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిపిన సర్వేలలో కూడా మొదటి స్థానంలో ఉపాధ్యాయులు ఉండడాన్ని గమనిస్తే  ప్రభుత్వ ఉపాధ్యాయులు హక్కులకు కలబడుతూనే బాధ్యతలకు నిలబడాల్సిన అవసరం ఉన్నది .అదే సందర్భంలో  వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యత మా నినాదమని లక్ష్యమని ఉపాధ్యాయ లోకం అనేక ఉపాధ్యాయ సంఘాలు గర్వంగా చెప్పుకోవడాన్ని సమాజం స్వాగతించాల్సిన అవసరం కూడా ఉన్నది. అయితే కొంతమంది ఉపాధ్యాయు ల కారణంగా మొత్తం ఉపాధ్యాయ లోకానికి అప్రతిష్ట రావడాన్నీ సహించకూడదు. అదే సందర్భంలో  నిబద్ధతతో పనిచేస్తూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి అనేక నూతన పరికల్పనలకు కృషి చేస్తున్న ఉపాధ్యాయ లోకాన్ని కూడా మనం ప్రభుత్వ రంగంలో చూడవచ్చు. కాబట్టి ప్రైవేటు పనులు, ఆదాయ మార్గాలు, చిట్టీలు, ఇతర రియల్ ఎస్టేట్ దందాల జోలికి పోయి తమ వృత్తి నిబద్ధతను తుంగలో తొక్కి మొత్తం ఉపాధ్యాయ లోకానికి తల వంపులు తెచ్చే పని చేయడం మానుకుంటే మంచిది. లేకుంటే అదే ప్రధానవృత్తి అనుకుంటే రాజీనామా చేసి   వెళ్లడం ద్వారా కొద్దిమంది కలుపు మొక్కల వల్ల మొత్తం విద్యారంగానికి ఉపాధ్యాయ లోకానికి వస్తున్న అప్రతిష్టకు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది  .
    అడ్డదారులు తొక్కడం అవసరమా?  :-
*********
ఉపాధ్యాయునిగా శాస్త్రవేత్తగా ఎదిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉపాధ్యాయ వృత్తిని చివరి వరకు కొనసాగించడానికి కారణం ఉపాధ్యాయ వృత్తి,పాత్ర పట్ల గౌరవం అని తెలుసుకోవాలి నేటితరం. అలాగే మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తినుండే రాజకీయాలకు వచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాకుండా అనేకమంది ఉపాధ్యాయులుగా పనిచేసిన వాళ్ళు విప్లవోద్యమాలలోనూ, సామాజిక రంగాలలో, సాహిత్య సేవా రంగాల్లో ఉత్కృష్ట స్థాయికి చేరుకున్న విషయాన్ని గమనించినప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి సమాజం పట్ల అవగాహన అధికంగా ఉంటుందనేది దీని సారాంశం. ఈ వాస్తవాన్ని, అంతరార్తాన్ని నేటి ఉపాధ్యాయ లోకం గ్రహించకుండా కొద్దిమంది దొడ్డిదారిన వ్యవహరిస్తూ వృత్తికి ఆటంకం కల్పిస్తూ ఎగనామం పెడుతూ  సంపాదన పైన దృష్టి సారించినప్పుడు అది పత్రిక రంగం ద్వారా మీడియాకు ఎక్కడం వల్ల ఉపాధ్యాయ లోకం తలవంచుకునే పరిస్థితి వస్తున్నది. ఇది నిజం కాదా ! చట్టబద్ధంగా తమ హక్కులను సాధించుకునే క్రమంలో వృత్తి నిబద్దతకు కట్టుబడి పనిచేస్తామని అనేక సందర్భాలలో ప్రభుత్వంతో జరిపిన చర్చల సందర్భంలో కూడా హామీ ఇచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘాల ప్రతిష్ట ఏం కావాలి ?జనం సాక్షి పత్రిక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో జరిపిన సర్వే ప్రకారంగా 25 నుండి 30 శాతం మంది ఉపాధ్యాయులు తమ స్థానంలో ఎవరినో పెట్టి లేదా అధికారులతో మెయింటైన్ చేస్తూ వృత్తికి అన్యాయం చేస్తున్నట్లు పాఠశాలలకు ఎగనామం పెడుతున్నట్టు పత్రికా కథనాలు రావడాన్నీ మనం గమనిస్తే  ఎప్పుడైతే ప్రజలు సమాజము ఉపాధ్యాయ లోకం పైన ప్రభుత్వ పాఠశాల పైన విశ్వాసం కోల్పోతుందో విద్యా వ్యవస్థ కూడా పక్కదారి పట్టి అవకాశం ఉంటుంది అనీ తెలుసుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర విద్యారంగంలో 51 శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలలు ఆక్రమిస్తే 49 శాతం మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో విద్య పిల్లలకు అందుతున్నది. ఈ అసమానతను  లోపాన్ని సవరించడం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కేరళ ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై ప్రైవేటు పాఠశాలల నుండి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు  వస్తున్న క్రమములో ఇలాంటి ఆరోపణలు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో రావడాన్నీ సహించకూడదు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ సభ్యులకు సీరియస్గా హెచ్చరికలు చేయడం ద్వారా గత స్ఫూర్తిని, సామాజిక చింతనను తమ సభలు సమావేశాలు ద్వారా హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది .అయితే ఇప్పటికీ కొన్ని అభ్యుదయ భావజాలంతో పనిచేస్తున్న సంఘాలు తమ మహాసభల్లో సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకొని పనిచేస్తుంటే A P T F  అధ్వర్యంలో 1990 ప్రాంతంలో  పేదరికం,ఆకలి  చావులు, ఆత్మహత్యలు, కల్తీ మందులు, వ్యవసాయ  సంక్షోభం వంటి అంశాల పైన కార్యక్రమాలు తీసుకున్న సందర్భాన్ని  గమనిస్తే ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యమం ఉపాధ్యాయ లోకం కొంత దారి తప్పుతున్నదా అని సందేహం రాక మానదు. అయితే గత వైభవాన్ని గతంలో చేసిన ఉపాధ్యాయ సంఘాల కృషిని మననం చేసుకోవడం ద్వారా ప్రేరణ పొంది సామాజిక బాధ్యతను మరింత భుజానికి ఎత్తుకొని ఇలాంటి ఆరోపణలు ఉపాధ్యాయ లోకం మీద రాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. ఉపాధ్యాయ లోకం పైన సమాజానికి ఎంత విశ్వాసం ఉందో అదే స్థాయిలో అక్కడక్కడ  ఉపాధ్యాయుల పైన దుష్ప్రచారం కూడా లేకపోలేదు.
       ఉపాధ్యాయులారా వందనం! పరువును కాపాడుకుందాం!
***********
సమాజాన్ని శాసించి సక్రమ మార్గంలో పయనించడానికి రాజకీయ నాయకులను కూడా హెచ్చరించగలిగిన స్థాయిలో ఉద్యమాలు లేవదీసి ప్రజా ఉద్యమాలలో మమేకమై పనిచేసినటువంటి ఘనత ఉపాధ్యాయులది .,ఉపాధ్యాయ సంఘాలది. తెలంగాణ ఉద్యమముతో పాటు స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ, అనేక ప్రజా ఉద్యమాలలోను ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించిన విషయాన్ని మనం విస్మరించకూడదు. ఈ చరిత్రను ఆధారం చేసుకుని మన వృత్తి నిబద్ధతను చా టే క్రమంలోపల తప్పుడు విధానాలకు పాల్పడుతున్న కొద్ది శాతం ఉపాధ్యాయులను సరైనదారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా కొంత ఉన్నది.  అధికారుల అండతో అవినీతి మార్గంలో పయనిస్తున్నటువంటి కొద్ది మంది ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలి  కానీ ఉపాధ్యాయ లోకానికి ఈ అప్ప్రతిష్టను అంటగడితే ఉపాధ్యాయులు కూడా  సహించరు అని ప్రభుత్వం కూడా గుర్తించాలి. అదే సందర్భంలో పర్యవేక్షణ అధికారుల లోపం జిల్లా విద్యాశాఖ అధికారుల ఖాళీలు అనేక కారణాల వల్ల కూడా ఇలాంటి తప్పుడు పనులకు ఆస్కారం అవుతున్నది. కనుక ప్రభుత్వం వెంటనే డిఇఓ ఎంఈఓ ఇతర పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయడం ద్వారా పటిష్టమైన నిఘా వేసి ఉంచి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అదే సందర్భంలో ఉపాధ్యాయుల యొక్క సేవలను సమయస్ఫూర్తిగా వినియోగించుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులు ప్రభుత్వం పైన  ఉన్నది. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు మరింత చొరవ చూపితే సంతోషం. అందుకే మరొక మారు ఉపాధ్యాయులారా! వందనాలు !
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333