ఎన్నికల ప్రచారానికి మార్గదర్శకాలు సరే !

Mar 30, 2024 - 23:30
 0  1

 రాజకీయ పార్టీల అకృత్యాలను అడ్డుకోవడానికి చర్యలేవి ?

నిబంధనలు తుంగలో తొక్కి అవినీతికి పాల్పడి  కోట్లాది రూపాయల ధనాన్ని  అడ్డగోలుగా ఖర్చు చేసినా  పట్టించుకోరేందుకు.?

 అసెంబ్లీకి 40 లక్షలు లోక్సభకు95 లక్షల నిబంధన  మొక్కుబడి మాత్రమేనా.?

---వడ్డేపల్లి మల్లేశం

త్వరలో జరగనున్న 18వ లోకసభ తో పాటు  నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్  16 మార్చి 2024 నాడు వెలువడిన నేపథ్యంలో  కేంద్ర ఎన్నికల సంఘం  ఎన్నికల ప్రచారానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేస్తూ  కులం మతం పేరుతో ఓటు అడగరాదని  కులమత తత్వాన్ని  రెచ్చగొట్టకూడదని హెచ్చరిక చేయడం జరిగింది
44 రోజులపాటు  ఏడు విడతలుగా  19 ఏప్రిల్ నుండి జూన్ 1 వరకు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి  సుదీర్ఘ  ఎన్నికల కసరత్తును  ప్రకటించిన నేపథ్యంలో  రోడ్ షోలలో పటాకులు కాల్చవద్దని  అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని  కాన్వాయ్ లో పది వాహనాల కంటే మించి ఉండకూడదని  ఖచ్చితమైన నిబంధనలు జారీ చేయడం గమనార్హం.  రోడ్డు షోలను సెలవు రోజుల్లో నిర్వహించడమే కాకుండా  రాత్రి పొద్దుపోయే వరకు కాకుండా  ఇతర సమయాల్లో ర్యాలీలు నిర్వహించడంతోపాటు,  దవాఖానలు బ్లడ్ బ్యాంకులు ట్రామా  కేర్ సెంటర్ల దగ్గర రోడ్ షో  నిర్వహించవద్దని,  రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయకుండా వాహనాలు వెళ్లేందుకు  అనుమతించాలని , రోడ్ షోలలో ఎంతమంది పాల్గొంటున్నారు అనేది ముందుగానే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని  ఆదేశాలు జారీ చేసినట్లు పత్రికా ప్రకటనల ద్వారా తెలుస్తున్నది.  ఒక బైక్ మీద ఒక జెండాను మాత్రమే పెట్టుకోవాలని జెండా సైజు కూడా ఒక అడుగు -- అర అడుగు మాత్రమే ఉండాలని జండా కర్ర మూడు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు అని  నిర్దేశించింది . గరిష్టంగా బ్యానర్ సైజు 6 -- నాలుగు అడుగులు మాత్రమే ఉండే విధంగా  చర్యలు తీసుకోవడంతో పాటు  పాఠశాల విద్యకు ఆటంకం కలగకుండా పాఠశాలలు కళాశాలలో సభలు సమావేశాలు నిర్వహించవద్దని  ఒకవేళ నిర్వహిస్తే ఆ పాఠశాలల నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి  అని హెచ్చరించడం జరిగింది.  ఇక దేవాలయాలు చర్చిలు, మసీదులు, గురుద్వారాలు  వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించడానికి వీలులేదని ఆదేశించింది.  వ్యక్తిగత దూషణలు విమర్శలతో పాటు  అభ్యంతరకర మెసేజ్లను  ఓటర్లకు పంపి ప్రలోభ పెట్టకూడదని కూడా  ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక తాత్కాలికంగా ప్రారంభించే పార్టీ కార్యాలయాలు కూడా పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల  పైబడి దూరంలో ఉండాలని హెచ్చరించడం గమనార్హం.  ఈ నిబంధనలన్నీ  రాజకీయ పార్టీలకు  వర్తింప చేస్తూ కఠిన  ఆదేశాలు ప్రకటించినట్లు కనిపించినప్పటికీ  ఎన్నికల క్రమములో
 నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ  అంతకుమించి ఎన్నికల వ్యయ పరిమితిని దాటి కోట్ల రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు చేసినప్పటికీ  ఎన్నికల సంఘం చూసి చూడనట్లు వ్యవహరించడమే ఆందోళన కలిగిస్తున్న విషయం . సక్రమమైన ఎన్నికల నిర్వహణ లేని కారణంగా  మరొకవైపు ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నది అని  విమర్శ  వెల్లువెత్తుతున్న తరుణంలో  అధికార పార్టీకి వత్తాసు పలికిందని ఆరోపణలు సర్వత్రా వినబడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం యొక్క  సమర్థత  ప్రశ్నార్ధకం కావడాన్ని  గమనించవచ్చు .
      ఇక ఎన్నికల  సందర్భంగా ఖర్చు చేసే డబ్బు ఒక అకౌంట్ నుంచి లక్ష రూపాయలు డిపాజిట్ చేసిన విత్ డ్రా చేసిన ఆ వివరాలను  ఎన్నికల సంఘానికి అందించాలని బ్యాంకులకు సంఘం సూచించింది.  ఒక అకౌంట్ నుంచి అనేక బ్యాంకు అకౌంట్లకు డబ్బులు జమ చేసిన  అభ్యర్థి లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా లక్ష రూపాయల కంటే ఎక్కువగా నగదు డ్రా చేసి ఉంటే ఆ సమాచారాన్ని కూడా అందించాలని  కేంద్ర ఎన్నికల సంఘం  19 మార్చ్ 2024 నాడు బ్యాంకులను కోరినట్లు తెలుస్తుంది .
      నిబంధనలు కఠిన తరం  సరే ...... ఎన్నికల్లో అవినీతి మాటేమిటి  ?
********
ఇప్పటికే  లోక్సభలో 83 శాతం మంది రాజ్యసభలో 36 శాతం మంది చట్టసభల సభ్యులు నేర చరిత్ర కలిగిన వాళ్లున్నారని గణాంకాలు చెబుతుంటే  ఆ సభ్యులు ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేస్తారో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటప్పుడు 17వ లోక్సభ  ముగిసి 18వ లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  నేర చరిత్ర లేకుండా  ప్రజలకు సేవ చేయగలిగే నిబద్ధత కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవడానికి సంబంధించి  ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందుతాయి . ఎన్నికల్లో  పరిమితిని మించి డబ్బు విచ్చలవిడిగా కుమ్మరించి  ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటు అనేక అవినీతి పద్ధతుల్లో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా  ఎన్నికల సంఘం ఎక్కడ కూడా అడ్డుకున్న దాఖలా ఇంతవరకు కనిపించలేదు . అరకొరగా ఎన్నికల సమయంలో కార్లలో  డబ్బు, బంగారము,, ఆభరణములు  పట్టుకోవడమే తప్ప  అభ్యర్థులు మించి చేసిన ఖర్చు పైన ఎక్కడ కొరడా జులిపించిన దాఖల అంతగా కనిపించకపోవడం బాధాకరం.  అదే సందర్భంలో ఎన్నికల సంఘం యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించకపోవడం, నేరచరిత్ర ఉన్నవాళ్లను అభ్యర్థులుగా  ప్రతిపాదించడం,  స్వప్రయోజనాలకు రాజకీయ పార్టీలు ఎంతకైనా తెగించడంతో  పరిమిత అధికారాల  చక్రబంధంలో ఉన్న ఎన్నికల సంఘం  అరాచకాలు అక్రమాలు దురాగతాలను  సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నది . ఈ సమయంలో ఎన్నికల సంఘం ఉన్న చట్టాలతో పాటు  కావలసినటువంటి చట్టాల కోసం కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు సిఫారసు చేయడంతో పాటు 1990- 96 మధ్యకాలంలో ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న టిఎన్  శె షన్ గారి యొక్క చొరవ,  తీసుకున్న కఠిన చర్యలను ఒక్కసారి మనాణం చేసుకుంటే మంచిది.  అంతేకాకుండా  వ్యయ పరిమితి మించిన అభ్యర్థుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి , డబ్బులు కుమ్మరించినట్లు  ప్రజలకు ఓటర్లకు ఎరచూపినట్లు దొరికిన ఆధారాలతో వెంటనే  అభ్యర్థుల యొక్క అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి.  అలాగే ఆ రాజకీయ పార్టీకి తగిన ఆదేశాలు  జారీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి . సామాన్యులు కూడా ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలలోకి రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల వ్యయపరిమితిని భారీగా తగ్గించి  నామమాత్రపు ప్రచారం  ఆర్భాటాలకు అవకాశం లేనటువంటి విధంగా  నియంత్రణ విధించగలిగితే  పేదవాడు కూడా ఈ దేశాన్ని పరిపాలించగలడు అని రుజువు చేయవచ్చు.  ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్న సందర్భాలు ప్రత్యక్షంగా చూసినప్పటికీ మందలించకపోవడం, చర్యలు తీసుకోకపోవడం,  చూసి చూడనట్లు వ్యవహరించడం  వంటి లోపాలను స్పష్టంగా గమనించవచ్చు . అభ్యర్థులను ప్రతిపాదించే సమయంలో  నేర చరిత్ర ఉంటే  అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం  తగు ఏర్పాట్లు చేసినట్లయితే  చట్టసభల్లోకి  నిర్దోషులైన సేవా తత్పరులు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది.  ఎన్నికల ప్రచారానికి సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించినట్లయితే  కొంతైనా మెరుగైన పరిస్థితులను చూడవచ్చు. కులం మతం పేరుతో  రాజకీయ పార్టీలు ప్రత్యేక సమావేశాలను పెట్టి ఓట్లు అడుగుతున్నప్పటికీ  అడ్డుకున్న దాఖలాలు లేవు.   ప్రార్థన స్థలాలను కూడా  ప్రచారానికి వాడుకున్న సందర్భాలు  కోకోల్లలు.  మొక్కుబడి మార్గదర్శకాలు కాదు
రాజకీయ పార్టీల స్వార్థపర అకృత్యాలకు అడ్డుకట్ట వేయడమే ప్రధానం కావాలి.  అక్కడ అధికార ప్రతిపక్షాలతో సహా ఎవ్వరికి రాజీ పడకుండా స్వయం ప్రతిపత్తితో  పనిచేసి  దోషులను శిక్షించడం  ప్రధానము కావాలి . గతంలో తెలంగాణ రాష్ట్రం హుజరాబాద్ ఉపఎన్నికలో   అధికార పార్టీ వాళ్లు తమకు  డబ్బులు ఇవ్వలేదని బహిరంగంగా వీధుల్లో నిరసన తెలిపినప్పటికీ  ఎన్నికల సంఘం అడ్డుకోకపోవడం,  స్పందించకపోవడం,  రాజకీయ పార్టీలు ఇంటింటికి  చేసిన ఖర్చును  అంచనా వేయకుండా  మొక్కుబడిగా నిర్లిప్తంగా వ్యవహరించిన   తీరు మనందరికీ తెలిసిందే.  అన్ని రాజకీయ పార్టీలు కూడా సమర్థవంతమైన ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ఎన్నికల నిర్వహణ కీలకమని అంగీకరించి  ఎన్నికల సంఘానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని కాపాడే క్రమంలో  మరిన్ని కఠిన చట్టాలను పార్లమెంట్ ద్వారా  ఆమోదించినప్పుడు మాత్రమే  ఎన్నికల సంఘం  పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించగలదు . ఆ వైపుగా అన్ని వర్గాలలో చైతన్యం  సామాజిక బాధ్యత  చోటు చేసుకోవాలని మనసారా కోరుకుందాo .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333