ప్రపంచం నివ్వెరపోయే పాలన అని అద్వాన్న పరి పాలనతో పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రాంత పరువు తీస్తిరి.

Apr 5, 2024 - 14:35
 0  2

 బంగారు తెలంగాణ అని పెద్ద మాటలు మాట్లాడి  బదనాం    చేస్తిరి .

హామీల వర్షం కురిపించి  ప్రజల ఆత్మగౌరవాన్ని  తాకట్టుపెట్టి  రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీస్తిరి.

ఇక నమ్మేది ఎవరు?  మౌనంగా ఉండడమే మేలు .

-- వడ్డేపల్లి మల్లేశం 

ప్రపంచంలోనే ఏ ప్రాంతంలో లేనటువంటి నినాదాలు , ప్రచారాలు,  సొంత పొగడ్తలు,  కొత్త చరిత్ర నిర్మాతలుగా  ఆడంబరాళ్లకే పరిమితమై పరిపాలనలో  శూన్యమైన పరిస్థితిని  ప్రపంచ చరిత్రను తిరగవేస్తే అది పదేళ్ల తెలంగాణ  తొలి ప్రభుత్వంలో మనకు కనిపిస్తుంది  .సామాన్య ప్రజా జీవితానికి , ప్రజల ఆకాంక్షలకు , జీవన గమనానికి  సంబంధము లేనటువంటి  పదాన్ని ఉపయోగించి బంగారు తెలంగాణ అంటూ  పొగడ్తల కిరీటాన్ని అమర్చి  తెలంగాణ సెంటిమెంట్ ను జతచేసి  సుమారు 8 సంవత్సరాల పాటు పరిపాలన  భ్రమల్లో కొనసాగడానికి  కారణమైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం  గత కొన్నేళ్లుగా తెలంగాణ అనే పదాన్ని తీసివేసి పార్టీని మార్చి  ఉద్యమ ఆశయానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశాన్ని  పక్కకు నెట్టిన పరిస్థితి మన అందరికీ తెలుసు . అధికారకాంక్షతో  తెలంగాణకే పరిమితం కాకుండా దేశాన్ని పరిపాలించాలనే అత్యాశతో

గూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీ యడానికి పాకులాడినట్టుగా  ఆ తర్వాత ఏర్పడినటువంటి బారాస పార్టీ  కొన్ని ప్రాంతీయ పార్టీలతో జతకట్టినప్పటికీ  నిజస్వరూపము తెలిసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు క్రమంగా జారుకోవడాన్ని మనం గమనించవచ్చు . మాటలకే పరిమితమై,  ఆచరణకు దూరమై , కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సంబంధించిన ఆకాంక్షలను అమలు చేయడంలో విఫలమై,  ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి B R S అనే  వంకతో ఏర్పడిన పరిస్థితులను  రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరూ గమనించినారు కనుకనే  ఆ పార్టీకి నేటి  దుర్భర పరిస్థితులు దాపురించినవి  .తెలంగాణ రాష్ట్ర సాధనకు   సుమారు 60 ఏళ్ల పాటు సాగిన పోరాటంలో  వేలాదిమంది అమరులైనారు . ఆ కృషిని  సా కారం చేయడానికి నాయకత్వ బాధ్యత వహించిన  ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్,మరికొందరు కన్నుమూశారు . వీరు ఎవరినీ కాదని తెలంగాణ జాతిపిత అని కేసిఆర్ కు నామకరణము చేసుకొని ఆ పార్టీ నాయకులు ఆకాశానికి ఎత్తడం ఎంతవరకు సమంజసం మనమందరం అర్థం చేసుకోవాలి.  కుటుంబ పాలన, దొరల పాలన, గడీల పాలన  అంటూ గత ఐదారు సంవత్సరాలుగా  పలు విమర్శలు వచ్చిన  పార్టీ నాయకత్వం ఒక్కనాడు కూడా సమీక్ష చేసుకోలేదు . దాని పర్యవసానమే నేడు పార్టీని వీడి కార్యకర్తలు నాయకులు  ఇతర పార్టీలలో చేరడానికి ఉత్సుకథ చూపేది.  2023 నవంబర్లో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా  కేసీఆర్ ప్రజలు గెలవాలి అంటూ నినదించి  ఆచరణలో మాత్రం  తను తన పార్టీ గెలుపు కోసమే ప్రయత్నం చేయడం ,అధికారాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి కూపములో కూరుకుపోవడాన్ని మనం వరుసగా చూడవచ్చు.  ఇటీవల ఫోన్ టాపింగ్ , ఆవుల పంపకము, గొర్రెల పo పకం, చేపల పo పకం  వంటి అన్ని అంశాలలో కూడా కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు వరుస కథనాలు వస్తుంటే  కనీసమైన స్పందన లేకుండా చేసిన నేరాన్ని అంగీకరించకుండా ఏర్పడిన ప్రభుత్వాన్ని శాపనార్థాలతో  కటువుగా మాట్లాడుతున్నారంటేనే ఆ పార్టీకి నూ కలు చెల్లినట్లు లెక్క .

ప్రపంచంనివ్వెర పోయే స్థాయిలో పాలన:-

  టిఆర్ఎస్ అధికారానికి వచ్చే ముందు ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తామని,  బంగారు తెలంగాణగా చేస్తామని,  ప్రజల ఆకాంక్షలైన నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవాన్ని పరిరక్షిస్తామని గొప్పగా చెప్పుకున్నా  ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోవడం  ఆ పార్టీ ప్రభుత్వం యొక్క  డొల్లతరమే .  హామీలను సుమారు దశాబ్దము లోపల కూడా అమలు చేయని ఆ పార్టీ  అధికారానికి వచ్చిన కాంగ్రెస్ను  రెండు రోజుల్లోనే ప్రశ్నించడం అంటే సిగ్గుచేటు.  బి ఆర్ ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఉండవచ్చు,  100 రోజుల లోపల అమలు చేస్తామని ఆశ చూపించవచ్చు,  .తొందరపాటు నిర్ణయాలతో ప్రజలలో  గెలవాలని ప్రజల విశ్వాసాన్ని చూర గొనాలని ఆశించవచ్చు.  కానీ 10 ఏళ్లలో అమలు చేయలేని   మీకు 100 రోజుల లోపలనే వందల కొద్ది విమర్శలు బెదిరింపులు  చేసే హక్కు  ఎక్కడిది?   బాధ్యతలను నిర్వహించని మీకు ప్రశ్నించే అధికారం ఎక్కడిది  ముఖ్యమంత్రిని దళితుల్ని చేస్తానని ఇచ్చిన హామీకి ఇప్పటివరకు సమాధానం లేకపోగా దళిత జాతిని అవమానపరిచిన మీ కు  ఎన్ని శిక్షలు వేసినా తక్కువే  .ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు  ఉపాధి కల్పనకు సంబంధించిన విషయంలో  సబ్ ప్లాన్ నిధులను  మంజూరు చేయకుండా ఆ వర్గాలను అవమానపరిచి  నిర్లక్ష్యం చేసి  కొద్ది ఉన్నత వర్గాల మెప్పు కోసం ప్రయత్నం చేసింది వాస్తవం కాదా?  పంటలు పండించే రైతులకు కష్టకాలంలో అప్పుల్లో ఉన్నటువంటి  అన్నదాతలకు సాయం కోసం ఉద్దేశించిన రైతుబంధు  గుట్టలు చెట్లు, పుట్టలు అడవులు, ఇళ్ల స్థలాలకు ఇచ్చి  నేరం రుజువై  కోర్టులో కేసు  ఎదుర్కొంటున్న విషయం నిజం కాదా?  ఇప్పటికైనా అన్యాక్రాంతమైనటువంటి అక్రమ సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయించడానికి  నైతిక బాధ్యత తీసుకుంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది.  అవును హామీలు అమలు చేయని మీపాలన చూసి ప్రపంచం ఆశ్చర్యపోతున్నది.

అప్పుల కుప్ప తెలంగాణ రాష్ట్రం  :-

అన్నింటిలో  పార్టీ అధినేత  స్వయంగా పాల్గొని  సంబంధిత నిపుణుల ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం వల్ల  కాలేశ్వరం ప్రాజెక్టు  కుప్పకూలిపోతున్నదని  నిపుణులు మేధావులు రాజకీయ పక్షాలు  హెచ్చరిస్తుంటే కూడా  తమ నేరాన్ని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా?  ప్రాజెక్టు నిర్మాణానికి  వేల కోట్ల రూపాయలు అప్పులు తేవడంతో పాటు  విద్యుత్   సంస్థలకు బకాయితోపాటు  ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి వివిధ పనుల కింద చెల్లించవలసిన బిల్లులే 64 వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్లు మేధావులు హెచ్చరిస్తుంటే , ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి కూడా  పేదరికం నిర్మూలించలేదు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచలేదు, ఉద్యోగాలు ఇచ్చింది కూడా లేదు  ఇదేనా మీ పరిపాలన .? అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రి పైన కూడా విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు  నాటి పీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిపై లక్ష కోట్ల అవినీతికి పాల్పడినట్లు చేసిన ఆరోపణ  పైన తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.  కుటుంబ పరిపాలన అనే విషయాన్ని  రాష్ట్రమంతా గమనించిన సందర్భంలో  అవినీతిలో ఆ కుటుంబానికి ఉన్నటువంటి భాగస్వామ్యాన్ని  కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కూడా స్వయంగా  రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చేసిన విమర్శను ఎందుకు  రుజువు చేయడం లేదు.  ప్రధాని కేంద్ర ప్రభుత్వ హోదాలో రాష్ట్రంపై ఆనాడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని  ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు  .ఉద్యమ పార్టీ అని గొప్పగా చెప్పుకొని అధికారానికి వచ్చిన తొలి రోజులోనే ఉద్యమ పార్టీ కాదు సాంప్రదాయ పార్టీ మాత్రమే అని  సన్నగా జారుకుని ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి  రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టినారు. ఆర్థికంగా దివాలా తీయించి నేటి  పాలకులకు పరిపాలన చేయడానికి  వెసులుబాటు లేకుండా చేయడమే కాకుండా  ఎలా చేస్తారు? నిధులు ఎక్కడ తె స్తారు? ఎట్లా సాధ్యం ?చేయకపోతే ఊరుకుంటామా? వెంట పడతాం అంటూ విపరీతమైనటువంటి  అనాగరిక మాటలు మాట్లాడుతున్నటువంటి బారాస పార్టీ  ప్రభుత్వo పై జరుగుతున్న విస్తృత పరిశీలన తనిఖీల అనంతరం  దోషుల నిగ్గు తేల్చాలి . కటకటాలకు తోయాలి, కోట్లాది రూపాయలను  ప్రభుత్వ ఖాతాకు జమ చేయించాలి .ఎందుకంటే అది అంతా ప్రజల సొమ్ము! తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఆ కుటుంబానికి మాత్రమే కాదు అది తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష . తెలంగాణ తమ సొంతమే అని తమ కుటుంబానికి మాత్రమే వర్తింపచేసుకుని తమ వల్లనే తెలంగాణ సాధించినామని చెప్పుకోవడం  పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.  ఇంక ఏమాత్రం కూడా తెలంగాణ సాధకులము అని చెప్పుకున్నా  ప్రజలు సహించే స్థితిలో లేరని గుర్తించి   ప్రజల్లో భాగమై పనిచేసినా మని  అంగీకరిస్తే మంచిది. అయినా చేసిన తప్పులు,  చట్టం నిర్దేశించే నేరాలు,  ప్రజలు వేసిన ఓటమి శిక్షను  నిరంతరం ఆ పార్టీ భరించవలసిందే. అప్పుడు గాని రాజకీయ పార్టీలకు గుణపాఠం రాదు. ఇది ఏ పార్టీకైనా  జరగాల్సినటువంటి  పరిణామమే.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333