ప్రజల ప్రయోజనాలు,ప్రజా ప్రమేయం లేకుండా సాగుతున్నది పాలన ఎలా అవుతుంది?
నల్లధనం జాడేది , దేశ సంపద కొందరికే బోజ్యం అయితే చూస్తూ ఊరుకుంటామా ?
సార్వత్రిక ఎన్నికల్లో సర్వత్ర చర్చ జరగాలి.
చేయి కాలినాక ఆకులు పట్టుకుంటే ఎలా ?
--- వడ్డేపల్లి మల్లేశం
మూడవసారి అవకాశం ఇస్తే భారతదేశ భవిష్యత్తుకు 1000 ఏళ్ల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని 2024, 2029 తో పాటు 2047 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తున్నామని ప్రధాని, బిజెపి ప్రకటించడంపై ప్రజలకు భరోసా కల్పించడానికా? లేక నమ్మించడానికా అనే చర్చ సర్వత్రా సాగుతున్నది. బిజెపికి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లను ప్రజలు కట్టబెడతారని తద్వారా ప్రజల ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్తామని చెబుతూనే రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత పేదరికం నిరుద్యోగం వంటి అంశాల పైన తీవ్రమైన కృషి చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పడం పాలనలోని డొల్లతనాన్ని చెప్పకనే చెబుతున్నది.మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ స్థానానికి చేరుకుంటుందని చెప్పడం అంటే ప్రజలను నమ్మించడమేనా అనే సందేహాలు రాక మానవు. ఇటీవల అంతర్జాతీయ నివేదికల ప్రకారంగా చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అంతరాలు అసమానతలు పేదరికo వివక్షతలను గమనించినట్లయితే ఒక్క ఉదాహరణ చాలు . 1 శాతం సంపన్న వర్గాల చేతిలో 40. 1 శాతం సంపద పోగుపడి ఉన్నది అంటే సమాజమే సిగ్గుతో తలవంచుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే ఆశ్చర్యం కలగక మానదు . 81 కోట్లకు పైగా పేద ప్రజలు ఈ దేశంలో రేషన్ బియ్యం కోసం ఎదురుచూస్తున్నారని 2028 వరకు పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్రం ఇటీవల 25 కోట్ల మంది పేదరికం నుండి విముక్తి చెందినట్లు ప్రకటించడం అంటే సందిద్ధం కాక మానదు. కరోనా సమయములో పౌష్టికాహార ప్రాధాన్యత విభిన్న వర్గాలు మేధావులు దేశ ప్రజలకు అవసరమని అందులో పేద వర్గాలకు పంపిణీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని నొక్కి చెప్పినప్పటికీ కేవలం రేషన్ బియ్యం తో సరిపెట్టడం ఏరకంగా పేద వర్గాలను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వం ఆలోచించుకోవాలి.
కొంత గతంలోకి వెళితే :-
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 300 ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మాణం చేసినట్లు తెలుస్తూ ఉంటే గత 10ఏళ్ల కాలంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం కావడాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రైల్వేలు , ఓడరేవులు, వివిధ పరిశ్రమలు, జీవిత బీమా వంటి అనేక సంస్థలు పేద ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రైవేట్ రంగంలో చేరిపోవాదంతో పేదవర్గాలపైన ఎ నలేని ఆర్థిక భారం పడే ప్రమాదం ఉన్నది. 2014లో 370 రూపాయలు గా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర 1100కు చేరుకుంటే 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు 110 కి ఎగబాకడాన్ని మనమందరం అనుభవించే ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురుదర గతంలో కంటే చాలా తగ్గినప్పటికీ ఈ పెరుగుదలకు కారణమేమిటి అని అనేకమంది ప్రశ్నించుకోవడమే తప్ప ఇంతకాలం చేయగలిగింది ఏమీ లేకపోగా పేద వర్గాలు తమ కొనుగోలు శక్తిని భారీగా కోల్పోయిన విషయాన్ని గమనించాలి . ప్రజల కనీస అవసరాలను తీర్చగలిగే స్థాయిని మానవాభివృద్ధి అని డాక్టర్ అమర్త్యసేను నిర్వచి స్తే ఆ కనీస అవసరాలను తీర్చుకోగలిగే స్థితిలోకి ఎన్ని కుటుంబాలు చేరుకున్నాయో ప్రభుత్వం తెలియ చేయాల్సిన అవసరం ఉంది . 15 శాతానికి పైగా ప్రస్తుతం దారిద్రరేఖ దిగువన ప్రజానీకం బిక్కుబిక్కుమంటూ ఉంటే 15 కోట్ల మంది వలస జీవులు ఈ దేశంలో పడుతున్న కష్టాలు కన్నీళ్లు ఇలాగే ఇంకా కొనసాగవలసిందేనా? ఇదేనా దేశాభివృద్ధికి వెయ్యేండ్ల ప్రణాళికకు నిదర్శనం ? ఇతర దేశాలలోని నల్లధనాన్ని తెచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు వే స్తామని సగర్వంగా ప్రకటించి చేసింది ఏమి లేకపోగా పెద్ద నోట్ల రద్దు తో ప్రజల కష్టాలు ఎండలో బారులు తీరి కార్చిన కన్నీరు మనందరికీ తెలిసిందే. 67 ఏళ్ల భారతదేశం యొక్క మొత్తం అప్పు 50 లక్షల కోట్లయితే గత ప్రస్తుత ప్రభుత్వ హయాములో 100 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసినప్పుడు ఈ ధనాన్ని ఏ వర్గాల కోసం ఖర్చు చేసినారో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉంటే సమాధానం దాటవేస్తే ఓట్లు ఎలా వేస్తారు అని విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరు ద్యోగం ఎనిమిది శాతానికి పెరిగితే విద్య వైద్య రంగాలలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వాటా నామ మాత్రంగా ఉంటే ఆ రంగాలు ఎలా అభివృద్ధి చెందుతాయి. అందువల్లనే ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి . దేశ ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మద్య నిషేధం కొనసాగుతుంటే దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి అమలు చేసే బాధ్యతను విస్మరించడం ఏరకంగా ప్రజలకు మేలు చేసినట్లు?. రాజకీయ రంగంలో డబ్బున్న వాళ్ళదే పాత్ర అయినప్పుడు, కొన్ని ఆదిత్య కులాలకే పరిమితమైన పరిస్థితులలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి
54 శాతం ఉన్న బీసీ వర్గాలు తమ వాటాకై డిమాండ్ చేస్తూ ఉంటే పట్టించుకోని ప్రధాని కేంద్రం కుల రాజకీయాలను ప్రోత్సహించినట్లు అవుతుందని పలకడం అంటే సు తి మెత్తగా ప్రజల ఆకాంక్షను తిరస్కరించడమే కదా! బీసీ వర్గానికి చెందిన ప్రధాని అని చెబుతూ బీసీ వర్గాలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా లేనప్పుడు సుమారు 70 కోట్ల బీసీ వర్గాలు ప్రభుత్వ తీరును ఎండ కట్టాల్సిన అవసరం ఎన్నికల సందర్భంగా ఎంతగానో ఉన్నది.
లౌకిక వాదం అనే పదం రాజ్యాంగ పీఠికలో మొదట్లో లేదని సవరణ ద్వారా వచ్చిందని దానిని తొలగిస్తామని ప్రకటించడం, 400 సీట్లు వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చుతామని అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఇతరులు చెప్పుకోవడం, ప్రస్తుత వైఫల్యాలకు రాజ్యాంగమే కారణమని చెప్పే ప్రయత్నం చేయడం అంటే రాజ్యాంగఫలాలను పేద ప్రజలకు దూరం చేసే కుట్రగా భావించాలి. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్నటువంటి రైతు ఉద్యమం పైన ఉక్కు పాదం మోపి అణచివేయడం ,గతంలో 750 మందిని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకోవడం ఏ విలువల కోసం? ప్రజల ఆకాంక్షలు, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన విషయాలు కానీ వాటిని విస్మరించి మతము , దేవాలయాలు, ప్రజల విశ్వాసాల పునాది మీద ప్రభుత్వాన్ని నడిపితే అభివృద్ధి ఎలా అవుతుందో ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. పన్ను ఎగవేతదారులు, నేరస్తులు, పెట్టుబడిదారులకు చేసిన రుణమాఫీ కారణంగా దేశ సంపద కొద్ది మందికీ మాత్రమే భోజ్యం అవుతుంటే ప్రతిఘటించడానికి పెద్ద అవకాశం ఎన్నికలే కదా! విద్యా, వైద్య0, సామాజిక న్యాయాన్ని ఈ దేశ ప్రజలకు ఉచితంగా అందిస్తానని ఏనాడు కూడా ఇంతవరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు అమలు చేయలేదు. అలాంటి హామీలు ఇచ్చి కార్యాచరణ ప్రకటించే పార్టీలకు, ప్రత్యామ్నాయ శక్తులకు ఓటు వేయడం ద్వారా విశ్వాసాల పునాదిపైన పనిచేసే ప్రభుత్వాలకు తగిన సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇంత స్పష్టమైన తేడా ఉన్నప్పటికీ ప్రజా జీవితాన్ని ప్రజా ప్రయోజనాలకు సంబంధం లేని అంశాలే పాలనగా నమ్మించే ప్రయత్నం చేయడాన్ని ప్రతిఘటించడమే ప్రస్తుత కర్తవ్యం .
(వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)