అమెరికా సామ్రాజ్యవాదం తుపాకి సంస్కృతిలోనూ  కనిపిస్తున్నది

Apr 18, 2024 - 20:38
Jun 27, 2024 - 20:41
 0  8
అమెరికా సామ్రాజ్యవాదం తుపాకి సంస్కృతిలోనూ  కనిపిస్తున్నది

విద్య ఉద్యోగం బతుకుజరువు కోసం అమెరికా వెళ్లిన విదేశీయులు  మృత్యువాత పడడం విషాదకరం .

తుపాకి సంస్కృతి రాజ్యాంగం కల్పించిన హక్కు అని  ప్రకటిస్తే  అమెరికాపై అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించాలి.

 పొరుగు వాళ్లతో పాటు స్వదేశీయులు కూడా చనిపోవడంపై సోయేoదుకు లేదు?

----  వడ్డేపల్లి మల్లేశం

అమెరికా సామ్రాజ్యవాద విష కౌగిలిలో నలిగి ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందుతున్న చెందని  దేశాలు  తమ అస్తిత్వాన్ని కోల్పోయిన  దాఖలాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఎన్నెన్నో . ఆత్మ రక్షణ కోసం ఆయుధాలను కలిగి ఉండడం అమెరికా పౌరులకు ఆ దేశ రాజ్యాంగం కల్పించిన వె సులుబాటు అని చెబుతున్నప్పటికీ  అంతే స్థాయిలో తు పాకుల నియంత్రణకు రాజ్యాంగాన్ని సవరించాలన్న డిమాండ్ అమెరికాలో చాలా కాలంగా ప్రజల నుండి వినిపిస్తున్నది.  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాకోబామా ప్రస్తుత అధ్యక్షులు జో బెయిడన్  కూడా పలు సందర్భాల్లో ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చకపోవడానికి ప్రధాన కారణం  రాజ్యాంగ సవరణ జరగకుండా, తుపాకుల నియంత్రణకు చర్యలు తీసుకోకుండా, ఆయుధ ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వం మీద చేస్తున్న ఒత్తిడి అని తెలుస్తుంది.

 ఏ దేశంలో నైనా పెట్టుబడిదారీ సంస్థల ఒత్తిడికి ప్రభుత్వాలు తలవంచినప్పుడు ఇలాంటి దుస్థితియే దాపురుస్తుంది అనేది నగ్నసత్యం .  ఈ వెసులుబాటు వల్ల కొందరు అమాయకులు ప్రాణాలు  గాలిలో కలిసిపోతుంటే మరికొందరు ఉన్మాదులుగా మారడం  ఈ సంస్కృతి సజీవంగా ఉండడానికి కారణం అవుతున్నదని అంచనాకు రావాలి.  ఈ దుచ్చర్యల కారణంగా అమెరికా పౌరులే కాదు భారతీయులు ఇతర దేశాల వాళ్లు కూడా వందల సంఖ్యలో మరణిస్తున్న  వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్న  18 ఏళ్లు నిండిన ఆదేశ పౌరులందరూ  తుపాకులను కొనుక్కోవడం  హక్కుగా మారడం వింత ధోరణి.  ఈ వింత ధోరణిని అరికట్టి ప్రశాంతతను తీసుకు  రావడానికి అంతర్జాతీయ సమాజము ఐక్యరాజ్యసమితి అనేక దేశాలు అమెరికా మీద ఒత్తిడి చేయవలసిన అవసరం చాలా ఉన్నది అప్పుడు మాత్రమే తలవంచక తప్పదేమో!.  సంపన్న దేశమై అధిక ఆదాయాలు కలిగినటువంటి కుటుంబాలు బాగా ఉన్నటువంటి అమెరికాను ఇతర సంపన్న దేశాలతో పోల్చినప్పుడు  తుపాకీతో జరిగే హత్యలు 26 రెట్లు, ఆత్మహత్యలు 12 రేట్లు అని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తుంటే  ఇతరులను హత్య చేయడము తమను తాము ఆత్మహత్య చేసుకోవడం  అలవాటుగా మారితే  ఈ దుష్ట సంస్కృతి ఎవరి ప్రయోజనం కోసం? ఏ ప్రజలను ఉద్ధరించడానికి కోసం? ఆలోచించుకోవాలి ఆ దేశం.

కొన్ని గణాంకాలు, ఉదాహరణలు :-

సహజంగా ఏ దేశంలోనైనా పుట్టినరోజుకు విలువైన వస్తువులు డ్రెస్సులు  ఇతరత్రా కొనుగోలు చేస్తారు కానీ అందుకు భిన్నంగా అమెరికాలో మాత్రం    18 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి ఒక్కరూ  పుట్టినరోజు సందర్భంగా  తుపాకులను కొనుగోలు చేయడం, వాటిని విచ్చలవినిగా  వినియోగించడం,  ప్రజల మీద ప్రయోగించడం, హింసకు పాల్పడడం ఆనవాయితీగా మారితే నాగరిక దేశమని గొప్పలు చెప్పుకుంటున్న అమెరికాకు ఇది తగునా ? 2020లో  టెక్సాస్ రాష్ట్రంలో  పుట్టినరోజు సందర్భంగా ఒక  18 ఏళ్ల యువకుడు తుపాకి  కొని  తన నాయనమ్మను కాల్చాడు, ఆ తర్వాత బడికి వెళ్లి పదేళ్ల పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపితే 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.  ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇది అక్కడ సాధారణంగా జరిగే హత్య నేర ప్రక్రియ.  

 అక్కడి లెక్కల ప్రకారం ప్రతి 200 మంది దగ్గర 120 తుపాకులు ఉన్నట్లు  గడచిన 50 ఏళ్లలో దాదాపు 15 లక్షల మంది ఆయుధాల  మో త కారణంగా చనిపోయినట్లు  తెలుస్తున్నది.  అంటే ప్రతిరోజు సగటున 110 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టుగా  2020 నుండి ఈ కాల్పుల ఘటనలు మరింత తీవ్రమైనట్లు గణాంకాలు తెలియజేస్తుంటే  స్వదేశీయులతో పాటు ముఖ్యంగా భారతీయులు ఇతర దేశాల వాళ్ళు  మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తున్న విషయం పైన  ఆ దేశ పాలకులు విచారం వ్యక్తం చేసినారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకో ని కారణంగా రాజ్యాంగం పైన నెపం నెట్టి తమ సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం చేయడం మరొకరకంగా సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణినీ ప్రపంచ దేశాల పైన రుద్దడమే అవుతుంది .

అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారంగా 2019లో 33,599 మంది, 2022లో 44,290 మంది, 2023లో 42,888 మంది తుపాకీ వల్ల  ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.  భారతదేశంలోని పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి  కూచిపూడి నాట్య కళాకారుడు  అమర్నాథ్ గోష్  అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేయడానికి వెళ్లిన సందర్భంలో  2024 ఫిబ్రవరిలో  తుపాకీతో గుర్తుతెలియని ఆగంతకులు  కాల్చి చంపడం  ఎంతోమంది గుర్తు తెలియకుండానే  భారతీయులు ముఖ్యంగా  దుండగుల కాల్పులలో చనిపోవడాన్ని గమనిస్తే  ఆ దేశం పైన ప్రపంచంలోని చాలా దేశాల యువత పెట్టుకున్న ఆశలకు  చరమగీతం పాడేలా ఆ దేశంలోని యువత ప్రవర్తించినప్పుడు  అంతర్జాతీయ సమాజం అమెరికాను  బహిష్కరించడం ద్వారా  తమ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇతర  ఎగుమతి దిగుమతులను కూడా ఆ దేశంతో  తెగ తెంపులు చేసుకోవడం వంటి కఠిన చర్యలకు పూనుకోవడం, అందుకు ఐక్యరాజ్యసమితి  మద్దతు పలికినట్లయితే మరింతగా ఆ దేశాన్ని ఏకాకిని చేసే అవకాశం ఉంటుంది.

 సాగినంత కాలం నా అంత వారు లేరందు రూ కానీ సాగకపోయిననాడు చతికిలబడిపోతారు.... అమెరికాకు జరగాల్సినటువంటి  పరాజయం ఆ రకంగా  రుచి చూపించవలసిన బాధ్యత ప్రపంచ దేశాల పైన ఉన్నది . సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ప్రపంచంలో ఏ దేశంలో లేని తుపాకీ సంస్కృతి తమ ఒక్కరికి  సొంతమని విర్రవీగే ఆ దేశ పాలకులు, ప్రజలు, యువతకు  కనువిప్పు కలిగేలా చేయవలసిన బాధ్యత ప్రపంచ దేశాలది,కావాలి   ప్రపంచ ప్రజానీకం ఆలోచన  అందరిదీ.  కారు చీకట్లో కాంతిరేఖ లాగా ఇటీవల న్యూయార్క్ అటార్నీ జనరల్  యువతకు ఒక ప్రకటన చేస్తూ" తుపాకీ అప్పగించండి గిఫ్ట్ కార్డు పొందండి" అనే నినాదంతో వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు అలా అక్కడి పౌరుల నుండి 3 వేలకు పైగా ఆయుధాలను స్వాధీన పరుచుకోవడం ద్వారా  కొంత ఆయుధాల సంస్కృతిని కట్టడి చేసిన మాట వాస్తవం. ఆ రకంగా  అమెరికాలోని అన్ని రాష్ట్రాలు ఎక్కడికక్కడ స్థానికంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా  రాజ్యాంగం కల్పించినట్లు చెప్పబడుతున్న హక్కుకు చెక్ పెట్టవచ్చు. అది స్థానిక  పౌర అధికారులు యంత్రాంగం యొక్క చిత్తశుద్ధి నిబద్ధత పైన ఆధారపడి వుంటుంది.అదే సమయంలో ముఖ్యంగా పెద్ద మొత్తంలో  అక్కడ నివసిస్తున్న భారతీయులు ఇతర దేశస్తులు  స్థానికులతో నిత్యం అప్రమత్తంగా ఉండాలి,  స్థానికులతో వాదనలు ఘర్షణలకు  థా వివ్వకపోవడమే మంచిది అని నిపుణులు  సూచించడం కూడా  మృత్యువాత పడకుండా ఉండడానికి కొంతవరకు పరిష్కారం.

 (ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత  హస్నా బాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333