ప్రజల డిమాండ్లను పరిష్కరించే సత్తా ఉన్న ప్రభుత్వం కేంద్రంలో రావాలి కావాలి

Apr 18, 2024 - 20:46
Jun 27, 2024 - 20:41
 0  14
ప్రజల డిమాండ్లను పరిష్కరించే సత్తా ఉన్న ప్రభుత్వం కేంద్రంలో రావాలి కావాలి

ప్రజా ఆకాంక్షలు ప్రయోజనాలు విస్మరిస్తే ప్రజా ప్రతిఘటన

తప్పదని గుర్తించి మంచిది.

రాజ్యాంగబద్ధ పాలన  అసమానతలు అంతరాలు లేని వ్యవస్థ

 నిర్బంధము లేని స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలి.

ఇవి లేకుండా మానవ అభివృద్ధి,  ప్రజల జీవన

 ప్రమాణాలను ఊహించలేము.

--- వడ్డేపల్లి మల్లేశం

స్వాతంత్ర అనంతర పరిస్థితులలో ప్రభుత్వాలు  ప్రజా కోణంలో ఆలోచించడమే కాకుండా రాసుకున్న రాజ్యాంగాన్ని కనీసం అమలు చేసే ప్రయత్నంలో  కొంత విజయవంతమైన విషయం కాదనలేము.  రాజభరణాలు రద్దు చేయడం,  బ్యాంకుల జాతీయ కరణ,  ఆర్థిక సంస్థలను కేంద్రం తన పరిధిలోకి తీసుకోవడం,  పంచవర్ష ప్రణాళికలు  అమలు చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళిక , భారీ పరిశ్రమలు వ్యవసాయ ప్రాధాన్యతతో పాటు  ప్రాజెక్టులను నిర్మించి తనదైన శైలిలో దేశాభివృద్ధిని ప్రజల జీవన ప్రమాణాలను  ఆశించిన సందర్భం మనకు కళ్ళ ముందు కనబడుతున్నది. కానీ ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాల యొక్క విధానాలు మారడం,  ప్రపంచీకరణ, సరళీకరణ,  ప్రైవేటీకరణ కారణంగా  పెత్తందారీ వ్యవస్థలు తెరమీదకి రావడం  బహుళ జాతి సంస్థలు అమెరికా సామ్రాజ్యవాద ధోరణి  కారణంగా  ప్రభుత్వాల సేవ నిర్ణయాధికారం క్రమంగా తగ్గి  పెట్టుబడిదారులకు వంత పాడే దయనీయ పరిస్థితులు దాపురించినవి.

 ఆ క్రమంలోనే రాజ్యాంగాన్ని పదేపదే మార్చాలని ఆలోచించడం,  రాజ్యాంగంలో లోపాలను వెతికే ప్రయత్నం చేయడం,  సొంత యజెండాను ముందు పెట్టుకొని పరిపాలించడానికి సిద్ధపడడం వంటి కు హనా రాజకీయ కుట్రలకు  తెరతే సినట్లయితే  .దాని కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు నాశనమై,  రాజ్యాంగబద్ధ సంస్థ  సంస్థలు ప్రభుత్వ  ఆధీనంలోకి వెళ్లి,  ప్రశ్నించే గొంతుకలు ప్రతిఘటించే శక్తులపైన ఉక్కు పాదం మోపడం క్రమంగా ఆరంభమై దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలకు గండి పడినది.  ఈ సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి,  ప్రజల ఆకాంక్షలకు  ప్రతిరూపంగా నిలబడగలిగే నూతన ప్రభుత్వ  అవసరం ఎంతైనా ఉన్నది. ఇంతకాలం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, యూపీఏ, ఎన్డీఏ కూటములు  ఈ దేశాన్ని బ్రష్టు పట్టించినవి  రాబోయే సవాళ్లను అధిగమించడానికి  2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఈ దేశాన్ని  పాలించడానికి సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలలో ఏ లాంటి పార్టీని ఆహ్వానిద్దాం? ఎ లాంటి ప్రభుత్వం కావాలి?  అనే చర్చ  సమగ్రంగా జరగాల్సిన అవసరం ఉంది. మన డిమాండ్లను ముందు పెట్టడం ద్వారా  ప్రభుత్వ అక్రమ నిరంకుశ నిర్బంధ విధానాలకు కళ్లెం వేసే ఆస్కారం ఉంటుంది.

---  కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో పురుడు పోసుకున్న సుమారు 300 ప్రభుత్వ రంగ సంస్థలు నామమాత్రం కాగా ఇటీవల కాలంలో అన్ని ప్రైవేటుపరమైన విషయాన్ని అంగీకరించవలసినదే.  రాబోయే ప్రభుత్వం తిరిగి ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించి ప్రైవేటీకరణను నిరోధించే చర్యలు చేపట్టి ప్రజలకు అన్ని అవకాశాలు కల్పించాలి.

---  ప్రణాళికలు బడ్జెట్లలో  కేటాయిస్తున్న డబ్బులు భారీగా కనిపించినప్పటికీ ఈ దేశ సామాన్య ప్రజానీకం వాటా అత్యల్పంగా ఉండడం విచారకరం  6 శాతం నిధులు మాత్రమే  85 శాతం ఉన్న పేద ప్రజానీకానికి వినియోగించుచున్నట్లు గణాంకాలు తెలియజేస్తుంటే సిగ్గుతో తలవంచవలసినదే కదా! ఈ విధానం మారాలి.

---  బడ్జెట్లో ప్రణాళికలలో సామాన్య ప్రజానీకాన్ని  పరిగణనలోకి తీసుకోకుండా పెట్టుబడిదారులను మాత్రమే  పరిగణిస్తున్న వింత ధోరణి మారాలి.

---  రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు పీఠికలోని సామ్యవాదం ఈ దేశంలో అసమానతలు అంతరాలను నిర్మూలించాలని  సంపద కొద్ది మంది చేతుల్లో పోగు పడకూడదని హెచ్చరిస్తుంటే కూడా  40 శాతం సంపద కేవలం 1 శాతం సంపన్న వర్గాల చేతిలో ఉందంటే అది ఇంతకాలం పాలించిన కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితమే కదా!  ఈ దుర్నీతికి కళ్లెం వేసి సమానత్వాన్ని సమసమాజాన్ని స్థాపించాలి  .

---గ్రామీణ  ఆదివాసి అరణ్య ప్రాంతాలను  నిర్లక్ష్యం చేస్తూ  బడ్జెట్లో ఎక్కువ నిధులను పట్టణ ప్రాంతాలకు కేటాయిస్తున్న వింత ధోరణి మారాలి.  పల్లెలే పట్టుకొమ్మలనే సాంప్రదాయాన్ని నిజం చేసే దిశగా గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖ వికాస అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టాలి.

--  అన్ని రాజకీయ పార్టీలు ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్న కారణంగా ముఖ్యంగా బీసీ వర్గాలు రాజ్యాధికారానికి దూరమవుతున్నారు  డబ్బున్న వాడికే రాజకీయం అనే సిద్ధాంతం కారణంగా  అనేక బీసీ వర్గాలు చట్టసభల గడప దాటడం లేదు.  దీన్ని నివారించడానికి  బీసీ జన గణన చేయడంతో పాటు 56%  బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించే చట్టాన్ని  అమలు చేయాలి.

---  హామీలు, వాగ్దానాలు, థాయిలాలు, ఉచితాల  పేరుతో ప్రజలను మభ్యపెట్టి బానిసలుగా తయారు చేసే దుష్ట సంస్కృతికి చరమగీతం పాడాలి.  మానవాభివృద్ధిని సాధించే క్రమంలో దారిద్రేక దిగువన గల వారిని పైకి తీసుకురావడం ద్వారా వలస కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టి  అత్యున్నత స్థాయిలో అన్ని కుటుంబాలు తమ అవసరాలను తీర్చుకోగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

---  ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా ఈ దేశ సంపదను మెజారిటీ ప్రజానీకానికి  అందించడం ద్వారా ఆర్థిక పరిస్థితులను  ఆదాయ మార్గాలను మెరుగుపరచి  ప్రజాస్వామ్యంలోనూ ఉత్పత్తిలోనూ మెజారిటీ ప్రజల వాటాను  స్వీకరించాలి.కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 30లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి.

--  వ్యవసాయ పారిశ్రామిక ఇతర రంగాలకు సంబంధించిన స్వావలంబనను సాధించే విధంగా దేశంలోని పరిశోధనా సంస్థలు శాస్త్రవేత్తలకు నిధులను కేటాయించి ప్రోత్సహించడం ద్వారా దిగుమతులను భారీగా తగ్గించాలి  .

---పర్యావరణ పరిరక్షణ పరిరక్షించే దిశలో  కఠిన చర్యలు చేపట్టడంతో పాటు ప్లాస్టిక్ నిర్మూలనకు కార్యాచరణ ప్రకటించాలి.  సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతోపాటు రసానిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని  తగ్గించి భూసారాన్ని పరిరక్షించి పంటల ఉత్పత్తిని భారీగా పెంచడం ద్వారా  ఉత్పత్తిలో స్వావలoబ న సాధించాలి .--- యూపీఏ హయాంలో పురుడు పోసుకున్న దేశద్రోహ చట్టాన్ని  ఎన్డీఏ హయాములో చట్టసభల్లో ప్రకటించిన విధంగా అర్బన్ నక్సలైట్లు ఉగ్రవాదులు అనే పేరుతో  ప్రశ్నించే ప్రకటించే వాళ్లను నిర్బంధం అణచివేతలకు గురి చేస్తున్న  నల్ల చట్టాలను వెంటనే  నిర్మూలించి ప్రజాస్వామిక విలువలు పౌర హక్కులను పరిరక్షించాలి.

---విద్య వైద్యం సామాజిక న్యాయాన్ని ఈ దేశ ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన స్థాయిలో అందించగలిగే  ఉత్కృష్ట స్థితిలోకి దేశాన్ని తీసుకువెళ్లాలి.కొఠారి నివేదిక మేరకు కేంద్రం 10,రాష్ట్రాలు30శాతం విద్యారంగానికి కేటాయించాలి.కామాన్స్కూల్ అమలుద్వారా సమానత్వాన్ని సాధించాలి.

---  మద్యం, మత్తు పదార్థాలు,  క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, అశ్లీల శృంగారం,  అర్ధనగ్న ప్రదర్శనలు, సామాజిక రుగ్మతలను పెంచి పోషించే  అరాచకమైనటువంటి చట్టబద్ధమైన విధానాలను నిషేధించి  ప్రజల సర్వతోముఖ వికాసానికి విజ్ఞానం,  సృజనాత్మకతను పెంపొందించే నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా  కృషి కొనసాగాలి . శాస్త్రీయ విద్యను ప్రవేశపెట్టడంతోపాటు  పదేపదే రాజ్యాంగాన్ని మార్చడానికి సిద్ధమని చేసే ప్రకటనలు మానుకోవాలి.

--  రాజ్యాంగాన్ని కనీసం 50 శాతం అమలు చేయడానికి పూనుకున్నా ఈ దేశం యొక్క పరిస్థితులు చాలా గొప్పగా ఉండేవి. పాలకుల యొక్క నిర్లక్ష్యం  దుర్మార్గ మనస్తత్వం కారణంగా కొన్ని వర్గాలకు వత్తాసు పాడడం వలన ఈ దుస్థితి దాపురించినది. ఇదే సందర్భంలో తమదైన  ఎజెండాను అమలు చేయడానికి రాజ్యాంగాన్ని పదేపదే మార్చడానికి సిద్ధమని ప్రకటించదాన్ని ప్రజలు వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు.  ప్రజల ఆమోదం లేకుండా ఈ రాజ్యాంగాన్ని మార్చే అధికారం పాలకులకు లేదని గుర్తించడం అవసరం .

-- సుమారు 50 శాతానికి పైగా ఉన్నటువంటి యువత ఆధారంగా స్పష్టమైన యువజన విధానాన్ని ప్రకటించి ఈ దేశాభివృద్ధిలో ఉత్పత్తిలో సంపదలో క్రియాశీలక భాగస్వాములుగా  తీర్చిదిద్దవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది.

ఆకలి తీర్చుకోవడం ఎంత ముఖ్యమో ఆత్మస్థైర్యం కూడా అంతే ముఖ్యం ఈ దేశంలో ప్రజల ఆత్మగౌరవాన్ని పాలకులు నిరంతరం తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భాలు కోకొల్ల లు . ఆకలితో అలమటించడానికి సిద్ధపడతారు కానీ ప్రజాస్వామ్యాన్ని  అపహాస్యం చేస్తే ఈ దేశ ప్రజలు సహించరు అనే చేదు వాస్తవాన్ని పాలకులు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో  పైన పేర్కొన్న ప్రజల సమస్యలు డిమాండ్లు ఆకాంక్షలను తీర్చగలిగే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అదే సందర్భంలో  ఆ వైపుగా కృషి జరగకపోతే ప్రతిఘటనకు కూడా సిద్ధంగా ఉంటారని హెచ్చరించడం ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333