నేటి నుంచి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు
తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతు నేస్తం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని రైతు వేదికల్లో దృశ్యశ్రవణ (వీడియో కాన్ఫరెన్సింగ్) సేవలను 'రైతునేస్తం' పేరిట సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలు ఉన్నాయి. వీటిలో 'రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్‌ఫాం' ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా మొదటి విడత 110 కేంద్రాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ దీనికి పరికరాలు సమకూర్చింది. టీఫైబర్, బీఎస్‌ఎన్‌ఎల్‌లు కనెక్టివిటీ కేబుల్ నెట్‌వర్క్‌ను సమకూర్చాయి. వచ్చే ఉగాది నాటికి మిగిలిన అన్ని రైతువేదికల్లో ఈ వ్యవస్థను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాస్త్రవేత్తలు, అధికారులు, రైతుల మధ్య ప్రత్యక్ష, పరస్పర విషయ మార్పిడికి జూమ్, యూట్యూబ్ లైవ్ ద్వారా రైతువేదికలకు లింక్ చేస్తారని సీఎం రేవంత్ తెలిపారు. శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులతో క్షేత్రస్థాయి సమస్యలపై ముఖాముఖిగా చర్చిస్తారన్న ఆయన.. డిజిటల్ సేవలలో భాగంగా శాస్త్రవేత్తలు, నిపుణులు ఎల్లపుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. రైతు వేదికల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం రైతులకు నేరుగా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తారని వివరించారు.