తమ మనుగడకు మూలమైన భాషను  రాజ్యాంగం గుర్తించాలని  చేసిన పోరాటమే  మాతృభాషా దినోత్సవానికి దారితీసింది

Feb 22, 2024 - 15:34
Mar 1, 2024 - 18:06
 0  1
తమ మనుగడకు మూలమైన భాషను  రాజ్యాంగం గుర్తించాలని  చేసిన పోరాటమే  మాతృభాషా దినోత్సవానికి దారితీసింది

 బెంగాల్ ప్రజల  బెంగాలీ భాషను  పార్లమెంటు గుర్తించాలని చేసిన పోరాటం,  జరిగిన బలిదానాలు  భాష కోసం జరిగిన మహోద్యమం. మనుగడ కోసం పోరాటం  అనివార్యమని , ఆత్మగౌరవాన్ని  కొనసాగించాలని చెప్పేదే  ఈ పోరాటం ఉనికి కోసం భవిష్యత్తు పోరాటాలకు  నాంది కావాలి.*

---  వడ్డేపల్లి మల్లేశం


---21...02...2024
ప్రాంతాలు తమ అస్తిత్వానికి నిదర్శనమైన భాష మనుగడకు  పట్టు పట్టడం కనీసమైన ధర్మం.  అలాగే ఆధిపత్య ప్రాంతాల నుండి  కొన్ని ప్రాంతాలు  స్వేచ్ఛను కోరుతాయి , దేశాలు స్వాతంత్రాన్ని ఆకాంక్షిస్తాయి , అదే సందర్భంలో సామ్రాజ్యవాద ధోరణికి  అడ్డుకట్ట వేయడానికి  దేశాలు కూటములు  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కూడా నిరసన ప్రకటించవలసిన అవసరం ఉన్నది.  ఈ క్రమంలోనే  బంగ్లాదేశీయుల మాతృభాష అయిన బెంగాలీ భాషను  పాకిస్తాన్ పార్లమెంటు   గుర్తించాలని ఆమోదించాలని చేసిన పోరాటం  హింస  తత్ పరిణామాల మధ్య  పోరాటం ద్వారా నైనా పార్లమెంటును ఒప్పించిన బంగ్లాదేశీయుల  విజయగాథ పర్యవసానమే  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇది తరతరాలకు  జాతులకు, భాష ఉద్యమాలకు,  స్వేచ్ఛ స్వాతంత్రాలకు, ఆత్మగౌరవానికి ప్రత్యేకగా నిలుస్తుందని  చెప్పడంలో సందేహం లేదు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాలని 1999 ఫి బ్రవరీ21 తేదీన యునెస్కో ప్రకటించింది  ఆ ప్రకటన మేరకు 2000 సంవత్సరం నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి 21వ తేదీన  మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్  ప్రకటిస్తూ ప్రపంచం ముందు  లక్ష్యాన్ని నిర్ధారించడాన్ని మనం గమనించాలి.  అయితే మాతృభాషా దినోత్సవానికి ఉన్న పెద్ద చరిత్రలో  ప్రపంచంలోని చిన్న పెద్ద భాషలన్నిటిని రక్షించుకోవాలని,  భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని విశిష్టతను  కాపాడుకోవడం ద్వారానే మనం జీవవైవిద్యాన్ని కాపాడుకోగలమని,  భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే క్రమంలో భాషలను గౌరవించుకోవడం కనీస బాధ్యత అని నొక్కిచెప్పడాన్ని   హర్షించవలసి ఉన్నది. 
     

 కొంత పోరాట చరిత్రలోకి వెళితే  :-

1947లో భారతదేశం పాకిస్తాన్   రెండు దేశాలుగా విభజన జరిగినప్పుడు  పాకిస్తాన్ కూడా తిరిగి రెండు భౌగోళిక విభాగాలుగా ఏర్పడింది . ఒకటి  తూర్పు పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాము రెండవది పశ్చిమ పాకిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్ పేరుతో కొనసాగుతున్నది . సంస్కృతిలోనూ, వినియోగిస్తున్న భాషలోనూ,  కలిగి ఉన్న భావజాలంలోనూ భిన్నమైన సంస్కృతి ఉన్న కారణంగా  రెండు ప్రాంతాలు వేరువేరుగా ఉన్నప్పటికీ    తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ లోని  మెజారిటీ ప్రజలు  బెంగాలీ లేదా బంగ్లా భాషను ఎక్కువగా  మాట్లాడేవారు . 1948లో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం రెండు ప్రాంతాలకు కలిపి  ఉర్దూను  పాకిస్తాన్ జాతీయ భాషగా ప్రకటించడంతోపాటు  మెజారిటీ ప్రజల భాష ఆయన బెంగాలీకి ప్రాధాన్యత కల్పించలేదు . అప్పుడు బెంగాలీ  భాష మాట్లాడే ప్రజలు  ఉర్దూ తో పాటు బెంగాలీ భాషను కూడా జాతీయ భాషలలో ఒకటిగా  పాకిస్తాన్ రాజ్యాంగం ఆమోదించాలని  చేసిన డిమాండ్ను  తూర్పు పాకిస్తాన్ కు చెందిన వీరేంద్రనాథ్ దత్త 1948 ఫిబ్రవరి 23న పాకిస్థాన్ రాజ్యాంగ సభలో  లేవనెత్తి  ప్రభుత్వాన్ని ఆలోచింపజేశారు.  అదే సమయంలో తూర్పు పాకిస్తాన్ ప్రజలు  తమ డిమాండ్ సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు ఉద్యమాలతో హోరెత్తించారు.  ఈ ఉద్యమాన్ని అనచి వేయడానికి  పాకిస్తాన్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించడంతోపాటు ర్యాలీలు ధర్నాలు వంటి పోరాట కార్యక్రమాలను నిషేధించినది.  అనాదిగా విశ్వవిద్యాలయ విద్యార్థులు పోషిస్తున్న పాత్ర కీలకమని రుజువు చేసే క్రమంలో ఆనాడు కూడా డాకా విశ్వవిద్యాలయం లోని విద్యార్థులు సాధారణ ప్రజల సహకారంతో  భారీ ర్యాలీలు సభలు సమావేశాలు చర్చలను కొనసాగించి ప్రభుత్వాన్ని గడగడలాడించినారు.  ఓపిక  నశించిపోయిన పాకిస్తాన్ ప్రభుత్వము 1952 ఫిబ్రవరి 21వ తేదీన ర్యాలీలో పాల్గొన్న వారిపైన పోలీసు కాలుపులకు ఆదేశించగా  ఈ కాల్పుల్లో సలాం ,బర్కాట్, రఫీక్ , జబ్బార్,  షఫీయార్ వంటి వీరులు మరణించగా  వందలాది మంది ఉద్యమకారులు గాయపడ్డారు.  భాషా చరిత్రలో ప్రపంచంలోనే  మనుగడ కోసం చేసిన పోరాటాలలో అరుదైన సంఘటన,  మాతృభాష కోసం ప్రాణాలను అర్పించడం  పాకిస్తాన్ ప్రభుత్వం దమనకాండ విధించడాన్నీ  ఆనాటి ప్రపంచం సీరియస్ గా పరిగనించింది . పోలీసుల యొక్క దాడికి నిరసనగా ముస్లిం లీగ్   పార్లమెంటరీ  పార్టీకి రాజీనామా చేయడంతో  దేశవ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి పడింది.  తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని భావించినటువంటి పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం  దిగివచ్చి 1954 మే 8 వ తేదీన పాకిస్తాన్ రాజ్యాంగ సభలో  బెంగాలీ భాషను రాష్ట్ర భాషలలో ఒకటిగా ఆమోదిస్తున్నట్టుగా ప్రకటించినది.  1956 లో పాకిస్థాన్ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 214లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్ రాష్ట్ర భాషలుగా  గుర్తించడంతో ఈ ఉద్యమానికి తె రపడింది.  భారతదేశం యొక్క సహకారంతో  పాకిస్తాన్ యొక్క  పీడననుండి 19 71 లో బంగ్లాదేశ్ స్వతంత్రం పొందిన తర్వాత బంగ్లాదేశ్ ఏకైక రాష్ట్ర భాషగా బెంగాలీ గుర్తించడం  అరుదైన సంఘటన.  బంగ్లా  ప్రాంతీయ భాషా ఉద్యమం  మానవ పరిణామ క్రమంలో భాషా సాంస్కృతిక హక్కులను కాపాడుకునే పోరాటాన్ని  గుర్తించిన ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునిస్కో  ఫిబ్రవరి 21న  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గా ప్రకటించింది.  భాషల ఉనికి  జాతుల గౌరవానికి  ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు  ఈ దినోత్సవాన్ని సూచికగా భావించవచ్చు .


    అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా


ప్రపంచంలోనీ ప్రతి భాషా సాంస్కృతిక ఉద్యమ ప్రేమికులు  తమ మాతృభాషలను గౌరవించడం  చరిత్ర పోరాటక్రమాలను నెమరు వేసుకోవడంతో పాటు  ఆ పునాది మీద అంతర్జాతీయ భాషలను కూడా అభ్యసించడానికి ఉత్సుకత చూపడం ద్వారా  రోజురోజుకు పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి   నేటి తరం  ప్రాపంచిక  జ్ఞానాన్ని భాషల ఉన్నత్యాన్ని గుర్తించవలసి ఉంటుంది. . ఇప్పటికీ ప్రపంచంలోని  చైనా  జర్మనీ ఇతర అనేక దేశాలు కూడా  సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిన తమ తమ మాతృభాషల ద్వారానే విజ్ఞానాన్ని పెంపొదించుకుంటున్న చైతన్యాన్ని కూడా మనం గమనించవలసి ఉంటుంది. అంటే మాతృభాష ద్వారానే ప్రపంచంలోని ఏ ఇతర భాషలైన పూర్తిగా ఆకలింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దీని అర్థం .అందుకే కాబోలు ఆనాడు బెంగాలీ ప్రజలు బెంగాల్ భాష కోసం  ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది  చరిత్రలో నిలిచిపోవడం  అభినందనీయం.  సంఘటనలు,  అంశాలు తాత్కాలికం కావచ్చు, కానీ  చేసిన పోరాటాలు, ఉద్యమ స్ఫూర్తి ,ఉద్యమ లక్ష్యాలు  చిరకాలం నిలిచి ఉంటాయని గుర్తించడం మనందరి యొక్క కర్తవ్యం కావాలి.


(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటుపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333