కేంద్ర బడ్జెట్లో బీసీలకు రెండు లక్షల కోట్లు కేటాయించాలి
బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి
ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి అందుకు రెండు లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో పాత్రికేయుల తో మాట్లాడుతూ...
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దాని మిత్రపక్షాలు బీసీ ల పట్ల కక్ష సాధింపు ధోరణి అవలంబించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని దశాబ్దాల కాలంగా బీసీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ వారు పెడచెవిన పెడుతున్నారని, అలాగే కేంద్ర స్థాయిలో బీసీల సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి దేశంలోని అట్టడుగు స్థాయిలో ఉన్న బీసీలకు వారి అభివృద్ధి కొరకు నిధులు ఖర్చు చేయాలని ముఖ్యంగా సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించాలని వారి పిల్లలకు విద్య మరియు వైద్యం అందించేందుకు చొరవ చేయాలని, ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి జనగణనలో కులగణన చేపట్టేందుకు ముందుకు వచ్చిందని తక్షణమే ఆ ప్రక్రియను వేగవంతం చేసి దేశం లో ఏ కులం జనాభా ఎంత ఉందో అంతే దామాషా పద్ధతుల్లో విద్య వైద్యం రాజకీయ ఉపాధి ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించి రాజ్యాంగ ఫలాలు ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి అందే విధంగా ఏర్పాటు చేయాలని దేశంలో 3600 కులాలు ఉంటే ఇప్పటికీ 3550 కులాలు పార్లమెంటు గడప తొక్క లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు కావస్తున్న నేటికీ బీసీలు ఓబీసీలు అత్యంత దయనీయ స్థితిలో దారిద్ర రేఖకు దిగువ జీవిస్తున్నారని వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు