కూటిలో రాయి తీయని వాడు ఏట్లో రాయితీస్తాడా ?  

Mar 2, 2024 - 20:47
Mar 10, 2024 - 01:04
 0  21

విమర్శలు మానుకొని ప్రతిపక్షపార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే మంచిది.

తొందరపాటును ప్రజలు గమనిస్తున్నారు.

ఇదే ధోరణి కొనసాగితే  పార్లమెంటు ఎన్నికల్లో బారాసా ఉనికి ప్రశ్నార్థకమే.

ప్రజా పాలనకు మద్దతిచ్చి విద్రోహులను ప్రశ్నించడం ప్రజల ప్రస్తుత కర్తవ్యం...

ప్రజా రంజకముగా పరిపాలన సాగించవలసినది పోయి  ప్రజా వ్యతిరేక విధానాలకు అలవాటు పడిన ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. దీనికి ప్రాంతాలు దేశాలు మినహాయింపు కాదు  వ్యక్తి ఒక ప్రాంతానికి చెందిన వాడు కావచ్చు కానీ  పాలకునిగా అతడు అవలంబించే విధానం  అన్ని ప్రాంతాలలోనూ అవలంబించడం పాలకులకు ఉన్నటువంటి లక్షణం . ఆ లక్షణాన్ని ప్రజలు ఎక్కడికి అక్కడ తిప్పి కొట్టి ఆకాంక్షలను అమలు చేయించుకోవడం  కోసం పోరాటానికై సిద్ధం కావాలి ఇది ప్రాంతాలకు అతీతంగా జరగాల్సిన జరుగుతున్న ప్రజల కర్తవ్యం.

ప్రజల ఆకాంక్షలు దీర్ఘకాలిక పోరాటం తర్వాత  2014  జూన్ రెండవ తేదీన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి  టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో  గత రెండు టర్ముల్గా  పాలన కొనసాగించిన విషయం తెలిసిందే . కానీ పదే పదే గత ప్రభుత్వాలంటూ విమర్శించి తమ కర్తవ్యాన్ని విస్మరించి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్  9న్నర ఏళ్ల పరిపాలన అంతా మొత్తం పెట్టుబడిదారులు, భూస్వాముల పక్షాన నిర్వహించి  సామాన్య ప్రజలకు ద్రోహం చేసిన సంగతి తెలిసిందే. ప్రకృతి గుట్టల విధ్వంసాన్ని ప్రోత్సహించి,  పని సంస్కృతిని  ఎదగకుండా చేసి, ఉచిథా ల పేరుతో హామీలను  ప్రలోభాలతో ప్రజలను  బానిసలుగా చేసిన విషయం తెలిసిందే. మద్యం దుకాణాల సంఖ్యను పెంచి  విపరీతమైన ఆదాయాన్ని సమకూర్చుకొని  యువతను నిర్వీర్యం చేసి  క్లబ్బులు పబ్బులు ఈవెంట్ల సంస్కృతిని పెంచి పోషించి....  ఇదే తెలంగాణ ఆకాంక్షల అమలు అని చెప్పిన తీరు  సిగ్గుచేటు కాదా!  కల్తీ ఆహార పదార్థాలు,  మత్తు పదార్థాలు, ధూమపానం  వంటి సంస్కృతిని పెంచి పోషించి  ప్రజలకు ద్రోహం తలపెట్టినందుకు స్పందించిన ప్రజానీకం గత ఎన్నికల్లో  మేధావులు బుద్ధి జీవుల సహకారంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చు కున్న విషయం  తెలిసిందే.
  ఎంతటి వాళ్ళైనా ప్రజా తీర్పును గౌరవించాలి కానీ అందుకు భిన్నంగా టిఆర్ఎస్ పార్టీ , మాజీ ముఖ్యమంత్రి,  కేటీఆర్, హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు  కొత్త ప్రభుత్వం అధికారానికి వచ్చిందో లేదో  ఆనాడు మొదలుపెట్టి ప్రతిరోజు విమర్శల వర్షం కురిపిస్తునేవున్నారు.

 కూటిలో రాయి తీయని వాడు ఎట్లో రాయితీస్తాడా అనే సామెత మనకు ఉండనే ఉన్నది. నిర్ణీతమైనటువంటి ఆకాంక్షలను అమలు చేయకుండా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి  ఉద్యోగాల భర్తీ చేయకుండా 30 లక్షల పైచిలుకు యువతకు ద్రోహం తలపెట్టి  పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన ప్రతి పరీక్ష  పేపర్ లీకేజీ తో  అపహాస్యం పాలైన విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచం నివ్వెరపోయే స్థాయిలో పరిపాలన చేస్తానని ఉద్యమకాలంలో ఇచ్చిన హామీ నెరవేరలేదంటే, బంగారు తెలంగాణ పేరుతో ప్రజల బ్రతుకులను ద్రోహం చేసినాడంటే  వీరిది ఏ పాటి చిత్తశుద్ధి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం కేసీఆర్ పాలనకు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్, దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి,   ప్రజా ద్రోహానికి తలపెట్టిన ఏ ప్రభుత్వానికైనా వర్తింప చేసుకోవాల్సిందే. ఇది పాలకుల యొక్క లక్షణం ఆ లక్షణాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రజా ఉద్యమాలకు ఉన్నది .

తొందరపాటు పనికిరాదు- అది పరాభవానికే  సూచన:-

  టిఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు  ఓపిక పట్టిన తర్వాత మాత్రమే ఇతర రాజకీయ పార్టీలు మేధావులు ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని విమర్శించిన విషయాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే మంచిది.    ఆనాటి రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో నిర్మాణాత్మక పాత్ర పోషించి సూచనలు చేసినారే తప్ప  ఇంత గడసరి  తనం ప్రదర్శించలేదు. తొందరపాటు, ఆవేశం, బెదిరింపు, అహంకారం  ఆనాడు ప్రతిపక్షాలలో మనం చూడలేదు. అంటే అధికారాన్ని కోల్పోయినందుకా ఈ ఆవేశం బెదిరింపు?  

ఈ దుష్ట ఆలోచనను ప్రజలు ప్రజాస్వామిక వాదులు గమనించాలి . అధికారం మా సొంతమని, అధికారంలో లేకుండా బ్రతకలేమని, అధికారంలో ఉన్న పార్టీని కూలదోస్తామని చేస్తున్న బీఆర్ఎస్ ప్రకటనలకు ప్రజలు స్పందించాలి. మేధావులు ఆలోచించాలి, బుద్ధి జీవులు తగిన నిర్ణయం తీసుకోవాలి,  టిఆర్ఎస్ పార్టీని ప్రజాక్షేత్రంలో నిలబెట్టి  దోషిగా తేల్చాలి . అంతేకాదు న్యాయవ్యవస్థ కూడా ఈ అతి  ఉత్సాహాన్ని అరికట్టడానికి  పాలన ప్రజల పక్షాన ప్రశాంతంగా కొనసాగడానికి జోక్యం చేసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైనదని ప్రజలు  భావిస్తున్న తరుణమిది.

టిఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించాలి :-

ఆవేశం ,ఆక్రోషం, ఆధిపత్యం, అహంకారం  ఏ రాజకీయ పార్టీకి పనికిరాదు.  ఇంతకాలం ఈ రాష్ట్రాన్ని పాలించిన టిఆర్ఎస్ పార్టీకి  ఈ లక్షణాలు ఉండడమంటే తన గోతిని తానే తవ్వుకోవడమే.  ఇప్పటికే ఓటమితో  అబాసపాలై వైఫల్యాలను అంగీకరించక, అవినీతి ఇతర  కుంభకోణాలలో చిక్కుకున్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు  తగిన సమయంలో తగిన శిక్షలు వేయడానికి కొత్త ప్రభుత్వం సిద్ధ మైన వేల  అందుకు సంబంధించి కాలేశ్వరం ప్రాజెక్టుతో పాటు ప్రతి  నిర్మాణం,  అవినీతి అధికారులు, ఇతర మాజీ ప్రజాప్రతినిధుల మీద సమగ్రమైన విచారణకు ఆదేశించడం జరిగింది.  ఆ న్యాయ విచారణ నిరంతరం కొనసాగాలి ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క హయాంలో జరిగిన పాలన  ఒక పెద్ద పాపాల పుట్ట .అధికారులు ప్రజాప్రతినిధుల భూకబ్జాలు కుంభకోణాలు  తవ్వి నాకొద్ది బయటపడుతూనే ఉన్నాయి. అన్నింటికీ గత ప్రభుత్వం బాధ్యత వహించాలి  తగిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలి  .గతంలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి    ఉన్న భవనాన్ని కూల్చివేసి  అదే మాదిరిగా అనేక ప్రభుత్వ కార్యాలయాలను నిర్మాణం పేరుతో కమిషన్ల కోసం  తీసుకున్న నిర్ణయాలు  కాలేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే తవ్వినా కొద్ది అవినీతి బయటపడే ఆస్కారం ఉన్నది.  ఈ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి  కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్  కు  ప్రాజెక్టులను అప్పజెప్పినట్టుగా లేనిపోని ఆరోపణలు కల్పిస్తూ  పొరపాటు జరిగిన  కాలేశ్వరం ప్రాజెక్టు గురించి మాత్రం పార్టీ గాని సీఎం మాజీ ముఖ్యమంత్రి  ఇతర మంత్రులు అంగీకరించకపోవడం కనీసం మాట్లాడకపోవడం  పైన ప్రజలు గమనిస్తున్నారు .శిక్ష అనుభవించక తప్పదు అని ప్రజలు శాపనార్థాలు కూడా పెడుతున్నారు ఇది గమనించాలి. ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్రలో సమగ్రమైన సూచనలతో పాటు సమయాన్ని ఇచ్చి తమ లోపాలను కూడా అంగీకరించి  కొత్త ప్రభుత్వం ఆర్థిక వనరులను సమీకరించుకునే సమయం ఇవ్వడం ద్వారా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి  సహకరించడం ప్రతిపక్ష పార్టీ యొక్క కనీస సంస్కారం.

ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి లేనిపోని ర్యాలీలు ప్రకటనలు ధర్నాలకు పాల్పడితే  క్షేత్రస్థాయిలో మీ గత కుట్రపూరిత పాలనను ప్రజలు ఎక్కడికక్కడ ఎండగడతారని గుర్తించడం చాలా అవసరం . .అవమానం పాలై , మరింత ఓటమి దిశగా, పార్టీ  దిక్కు తోచని స్థితికి చేరుకోక ముందే ప్రజలలో కనీసమైన విశ్వాసాన్ని  కాపాడుకోవాలంటే ఒక రాజకీయ పార్టీగా గత ప్రభుత్వ  ప్రతినిధిగా  చరిత్రలో కొనసాగాలంటే  కొత్త ప్రభుత్వానికి గౌరవంగా  సహకరించడం మద్దతీయడం  నేర్చుకోవాలి.  ఇదే ధోరణి కొనసాగితే  న్యాయ విచారణ వేగవంతమై  అవినీతిపరుల గుట్టు తొందరలోనే  బట్టబయలై  కారాగా రంలో ఊచలు లెక్కపెట్టే పరిస్థితి ఎంతో దూరంలో లేదని గుర్తిస్తే మంచిది. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన ప్రతి పైసా ప్రజలది గనుక ప్రజలు కచ్చితంగా  నిలదీస్తారు ఆ చర్య తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడితే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు అని బీఆర్ఎస్ గమనించాలి . కనీసం ఆరు మాసాల పాటు బెదిరింపులు  హామీల అమలు పైన తొందరపాటును  విరమించుకొని సంస్కారo గా వ్యవహరిస్తే మంచిది.

---  వడ్డేపల్లి మల్లేశం
(ఈ వ్యాసకర్తసామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333