ఎస్ఐఆర్ లో జోగులాంబ గద్వాల జిల్లా అద్భుత ప్రగతి.
21వ స్థానం నుంచి మూడవ స్థానానికి చేరువ.
జోగులాంబ గద్వాల 3ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఇటీవలి కాలంలో స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లడంతో జిల్లా ఎస్ఐఆర్ నివేదికలో విశేషమైన పురోగతిని సాధించినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వ్యవస్థలో ఉన్న లోపాలను సమగ్రంగా గుర్తించి, వాటిని వేగంగా సరిదిద్దే దిశగా జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో జిల్లా 21వ స్థానం నుంచి మూడవ స్థానానికి చేరుకున్నట్లు చెప్పారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేస్తున్న సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులపై పర్యవేక్షణ పెంచడంతో ఎస్ఐఆర్ 63 శాతం నుండి 74 శాతంకు పెరిగి భారీ మెరుగుదల నమోదు చేసిందన్నారు. ఫలితంగా జిల్లా 27.02.2026 నాటికి రాష్ట్రస్థాయిలో 21వ స్థానంలో ఉండగా, 31.03.2026 నాటికి 3వ స్థానానికి చేరుకుందన్నారు. ఇది తక్కువ సమయంలో సాధించిన విశేష విజయంగా కలెక్టర్ పేర్కొన్నారు. నిరంతర సమీక్షలు, సమయపాలనతో కూడిన కార్యాచరణ ఈ విజయానికి కీలకంగా నిలిచాయన్నారు. ప్రత్యేకంగా బూత్ స్థాయి అధికారులతో సమావేశాలు, మండల స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు, రాజకీయ ప్రతినిధులు మరియు సంబంధిత వర్గాలను భాగస్వామ్యం చేయడం ద్వారా సమన్వయాన్ని పెంచి, పారదర్శకతతో ముందుకెళ్లామన్నారు. తన దిశా నిర్దేశంలో మొత్తం పరిపాలనా బృందం సమష్టిగా కృషి చేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రస్తుత దృఢ నాయకత్వం, క్రమశిక్షణ, సమష్టి కృషి, సమన్వయం భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్నారు. రాబోయే ఎస్ఐఆర్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇదే విధమైన కట్టుదిట్టమైన కార్యాచరణ కొనసాగించాలని, త్వరలోనే మన జిల్లా ఎస్ఐఆర్ నివేదికలో మొదటి స్థానానికి చేరుకునేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు.