ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణాలేమిటి?

Mar 8, 2025 - 11:38
 0  1

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణాలేమిటి?* ప్రజా చైతన్యం, వర్గ దృక్పథం వెళ్లి విరిసిన వేళ దోపిడీపై పోరాటమొక ఎత్తుగడ కాక తప్పదు.* ప్రభుత్వ రంగ పరిరక్షనే కీలకం.*

*************************************

-- వడ్డేపల్లి మల్లేశం 9014206412

---15...02...2025***********-------

రాజకీయ నాయకులకు అభద్రత పెరిగిన కొద్దీ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ప్రారంభమైనది. ఆదిపత్య వర్గాలు పార్టీలను అధికారాన్ని ధనాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకున్న కారణంగా మిగతా వర్గాలు ఆ పొలిమేరలకు కూడా రాకుండా చేయడం అనేది ప్రత్యర్థులకు కంటగింపుగా మారినది. ఆదిపత్య వర్గాలు ఎప్పటికీ తమ మాట నెగ్గుతుందని అధికారం కొనసాగుతుందని దానిని శాశ్వతం చేసుకోవడానికి పన్నుతున్న మాయోపాయాలు మెజారిటీ సామాజిక వర్గాల ప్రజలకు తెలియనివి కావు .కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఐక్యతలోని డొల్లతనాన్ని గమనించినటువంటి రెడ్లు వెలమ ఇతర ఆధిపత్య కులాలకు చెందిన వాళ్లు అధికారానికి దూరంగా బ్రతకలేరు అనేది నగ్న సత్యం. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో గత 202 3 నవంబర్లో జరిగిన ఎన్నికలలో ప్రజల ఆగ్రహానికి గురై ఓటమిపాలైన బి ఆర్ ఎస్ పార్టీ తిరిగి అధికారానికి రావడానికి పడరా ని పాట్లు పడుతూ ఉంటే గెలిచిన ప్రభుత్వాన్నికి శాపనార్థాలు పెడుతూ ప్రజల దృష్టిలో మెప్పును పొందడానికి ప్రయత్నించడం అది కేవలం అధికారం కోసమే తప్ప ప్రజల సమస్యల పరిష్కారం గురించి కాదు. అందుకే త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని గెలిచేది మేమేనని కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేయడం ఆదిపత్య వర్గాల యొక్క నిజస్వరూపాన్ని బయటపెడుతున్నది. ఈ విషయంలో మిగతా సామాజిక వర్గాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ క్రమంలో భాగమే బిఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగినాడు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని ఇచ్చిన ప్రధానమైన హామీని నెరవేర్చకపోగా మూడు ఎకరాల భూమితో పాటు అన్నింటిని వదిలి సామాన్యులను అన్ని రకాల అవకాశాలకు దూరంగా ఉంచి చట్టసభల్లో అధికారాన్ని నిండుగా సంపాదించుకోవడంతో పాటు తన కుటుంబంలోని వారందరికీ పదవులను కట్టబెట్టుకున్న తీరు తెలవదా? అలాంటి కుటుంబం నుండి వచ్చినటువంటి కవిత గారు ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాము లోపల బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడడం, ధర్నాలు చేయడం అంటే నేల విడిచి సాము చేయడమే. మెజారిటీ సామాన్య ప్రజల ప్రలోభాలకు గురి చేయడమేనని అర్థం చేసుకోవాలి. నిరభ్యంతరంగా నిబద్ధతతో మద్దతీస్తే అభ్యంతరం లేదు కానీ మీ పదవీకాలంలో చేయని పనిని కాంగ్రెస్ హయాంలో ఎందుకు చేయరని డిమాండ్ చేయడంలోనే డొల్లతనం, స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఇలాంటి ప్రమాదాలను మెజారిటీ వర్గాలు పసిగట్టాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.

              కడుపు నిండినా ఇంకా తృప్తి లేదా?

*********************************

తెలంగాణ రాష్ట్ర శాసనసభను గణాంకాలతో సహా పరిశీలించినప్పుడు 2023 శాసనసభ ఎన్నికల నాడు గెలిచిన బీసీ ప్రజా ప్రతినిధుల సంఖ్య 19 కాగా వారి జనాభా 1 కోటి 86 లక్షలు .అదే 10 లక్షల 99 వేల 574 మంది ఉన్నటువంటి రెడ్డి జనాభా కు 43 మంది సభ్యులు ఎన్నికైనారు నిజంగా వారి జనాభా ప్రకారంగా ఉండవలసిన సంఖ్య 3---4 మాత్రమే. ఇక వెలమ కులానికి చెందినటువంటి వాళ్ళు 13 మంది శాసనసభ్యులు ఉంటే వారి జనాభా 1లక్ష 2006 మాత్రమే జనాభా దామాషాలో ఉండవలసినటువంటి సంఖ్య కేవలం 1 శాసనసభ్యుడు మాత్రమే. ప్రధానమైనటువంటి మూడు ఆధిపత్య కులాల జనాభాకు వచ్చిన సీట్లు ఉండవలసినటువంటి సంఖ్యను లెక్కించినప్పుడు బీసీ జనాభా ప్రకారంగా 62 మంది సభ్యులు ఉండాల్సిన అవసరం ఉంది కానీ దానికి బదులు 19 మంది మాత్రమే ఎన్నికైనారు అంటే అదంతా అగ్రవర్ణాల కుట్ర. తమ కులాలకు చెందిన వాళ్లకు మాత్రమే అభ్యర్థిత్వం కట్టబెట్టి బీసీ ఇతర వర్గాలకు చెందిన వాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ డబ్బులు లేవని గెలిచే అవకాశం లేదని కల్లబొల్లి కబుర్లతో వారికి టిక్కెట్ ఇవ్వకపోవడం అంటే ఆధిపత్య కులాల చేతిలో రాజకీయ పార్టీల నాయకత్వం ఉండడమే కదా! అందుకే ఈ కులాలు తమ రాజకీయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అనివార్యమైన పరిస్థితిలో మేమెంతో మాకు అంత వాటా రావాలి అందుకే చట్టసభల్లో ముఖ్యంగా పార్లమెంటులో బిల్లును ఆమోదించడం ద్వారా సుమారు 60 శాతం ఉన్న బీసీలకు 60 శాతం కేటాయించాలని డిమాండ్ చేయడం గత దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకుంటే ఇటీవల కాలంలో పెరిగిన చైతన్యం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఐక్యం చేస్తున్నది అనడంలో సందేహం లేదు. మరొకవైపు శక్తికి జనాభాకు మించి ఇప్పటికే ఆధిపత్యాన్ని చలాయిస్తూ సింహాసనాలు అధిరోహించినటువంటి అగ్రవర్ణాలు తమ పట్టును శాసనసభతో పాటు శాసనమండలిలో కూడా కొనసాగించాలి అని నెపంతో ప్రధానమైనటువంటి కాంగ్రెస్ బిజెపి పార్టీలు తమ అభ్యర్థులుగా రెడ్డి వర్గానికి చెందిన వాళ్లను ఎంపిక చేసుకొని తమ అక్క సును వెల్ల తీసుకుంటున్నాయంటే బీసీ ఇతర వర్గాలకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అదే బాధ, ఆవేశం, ఆందోళన నుండి పెరిగిన కసి చైతన్యం తమ వర్గాలను గెలిపించుకోవడానికి నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన భూమికగా పనిచేస్తున్నది.

 మరొకవైపు రాష్ట్ర, జాతీయ స్థాయి బీసీ సంఘాలు వరంగల్ ఖమ్మం నలగొండ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ ఎమ్మెల్సీ తో పాటు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గాను బీసీ సభ్యులు పోటీ చేస్తున్న సందర్భంలో ఎందరు ఉంటే అందరికీ ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాలని మన ఓట్లు మన వర్గాల సభ్యులకే వేసుకోవడం ద్వారా మన సత్తా చూపి అగ్రవర్ణాల సభ్యులను ఓడించాలని ఇచ్చిన పిలుపు ఇటీవల కాలంలో పెద్ద చర్చకు దారితీస్తున్నది. అదే సందర్భంలో విద్యా వ్యాపారులు ముఖ్యంగా ఏ కులంలో ఉన్నా కూడా వాళ్లకు ప్రాధాన్యతను ఇవ్వకుండా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్లు, నైతిక విలువలకు కట్టుబడిన వాళ్లు అదే మాదిరిగా నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థి 19 సంవత్సరాల సుదీర్ఘమైన సర్వీస్ను కూడా పక్కనపెట్టి రావడానికి సిద్ధపడుతున్న పులి ప్రసన్న హరికృష్ణ గారిని ప్రధానంగా బీసీ సంఘాలు మద్దతు ఇవ్వడం అభినందనీయం. ఇదే సందర్భంలో పెట్టుబడుదారులు విద్యా వ్యాపారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యమకారులు సామాజిక వేత్తలకు మాత్రమే ఎంపిక చేసే విధంగా అటు బీసీ ఇతర కుల సంఘాలతో పాటు పట్టభద్రులు, ఉపాధ్యాయులు, సామాజికవేత్తలు, కవులు కళాకారులు,మేధావులు అందరూ కూడా ఆలోచించి సమాజము వర్గ సమాజముగా చీలిపోయి ఆధిపత్యాన్ని కొనసాగించడానికి పోటీ బడుతున్న నేపథ్యంలో ఆధిపత్యాన్ని ధిక్కరించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం అనుభవించినది చాలు ఇకపైన క్రింది నుండి పై స్థాయి వరకు ఎస్సీలు ఎస్టీ మైనారిటీ దళితులు ఆదివాసీలకు వారి దామాషాలో అగ్ర తాంబూలం కట్టబెట్టడం ద్వారా మన ప్రాంతాన్ని మనమే ఏలుకుందాం మన వాటాను మనం సాధించుకుందాం మనమెంతో మనమంతా అనుభవించడం అనే విధంగా చైతన్యం కావాల్సిన అవసరం సమయం కూడా ఆసన్నమైనది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలలో ఈ చైతన్యాన్ని ఓటు రూపంలో వినియోగించుకొని ఆధిపత్య కులాలను ఓడించడం ద్వారా మన శక్తిని ప్రదర్శించినట్లయితే రాబోయే సాధారణ ఎన్నికల్లో విజయం మనదే రాజ్యం మనదే. టిక్కెట్లు ఇచ్చే పార్టీల నాయకత్వం కూడా మన చేతిలోనే ఉంటుంది అప్పుడు మనమెంతో మనకంత అనేది సులభంగా సాధ్యమవుతుంది. అందుకోసమే ఆధిపత్య వర్గాలు ఎంతైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అంతకు మించిన స్థాయిలో మిగతా సామాజిక వర్గాలు మించిన స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ద్వారా ఒక్క ఓటును కూడా వృధా చేయకుండా మన బానిసత్వానికి ఇంతకాలం మనకు జరిగిన నష్టానికి బాధ్యులైనటువంటి ప్రత్యర్థుల పైన తగిన సమయంలో వేటు పడాల్సిందే.ఆ ఆలోచన, పౌరుషం, చైతన్యం, అధికారకాంక్ష మనలో రగిలి సెగలాగా ఎదిగి చైతన్య కాంతులు వెదజల్లాలి. ఈ మూడు స్థానాలలోనూ మనం అధికారాన్ని చేజేక్కించుకోవాలి అప్పుడే మన వైపు ఈ సమాజం చూస్తుంది. టికెట్ల కోసం ఇకనుండి అన్ని వర్గాలు మన వైపే చూస్తారు ఆ సమయం ఆసన్నమైనది జాగ్రత్త! అయినప్పటికీ ఏదో రకంగా మనలను మోసగించడానికి మాయోపాయాలు మారువేశాలలో వస్తారు సుమా! "ఆదమరిచి ఉంటే మోసపోతారు అలుపెరగకుండా పనిచేస్తే ఆకాశానికి ఎదుగుతారు ".

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333