ఉదయం ప్రమాణస్వీకారం....సాయంత్రం రాజీనామా

Dec 22, 2025 - 21:46
 0  1095
ఉదయం ప్రమాణస్వీకారం....సాయంత్రం రాజీనామా

గుండాల 22 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామంలో ఉపసర్పంచ్ పదవికి సంబంధించిన అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉపసర్పంచ్ పదవికి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే రుస్తాపురం చంద్రు తన పదవికి రాజీనామా చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… సోమవారం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఉపసర్పంచ్‌గా ఎన్నికైన రుస్తాపురం చంద్రు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే ఆయన తన ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేస్తూ ఎంపీడీవోకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.తనపై ఎవరి ఒత్తిడి లేదని, పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నానని తను పేర్కొన్నట్లు ఎంపీడీవో విలేకరులకు తెలిపారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లోనే కాక గ్రామస్థుల మధ్య కూడా విస్తృత చర్చకు దారి తీసింది. బండ కొత్తపల్లి గ్రామంలో మొత్తం 10 వార్డులకు గాను 10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించగా, సర్పంచ్ పదవిని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మూడు రోజుల క్రితమే సర్పంచ్ ఎన్నిక పూర్తయినప్పటికీ, అధికారికంగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరగగా, అదే రోజున ఉపసర్పంచ్ రాజీనామా చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది.ఈ పరిణామాలతో గ్రామంలో మళ్లీ ఉపసర్పంచ్ ఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కమిషన్ నుంచి షెడ్యూల్ వెలువడిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి