ఉచిత విద్య వైద్యం మీద స్పృహ లేని రాజకీయ పార్టీల
దొంగాటకు పరాకాష్ట ఉచితాలు తాయిలాలు.ప్రజల జీవన ప్రమాణాల ఆలోచన లేని ప్రతిపక్షాల గగ్గోలు మరీ విడ్డూరం .
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి టిఆర్ఎస్ బిజెపి గుడ్డి విమర్శ.
విధాన నిర్ణయాలపై దృష్టి సారించడం పాలక,ప్రతిపక్షాల తక్షణ కర్తవ్యం .*
----వడ్డేపల్లి మల్లేషము
పాలకవర్గాలు ప్రజల ఆకాంక్షలు అవసరాలు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి అవకాశాలను చట్టబద్ధంగా ప్రజలకు చేర్చడానికి సేవకులుగా కొనసాగే ఆచారం గతంలో కొంత ఉండేది . అదే సందర్భంలో ప్రతిపక్షాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వాలను బలోపేతం చేయడం నిర్మాణాత్మక సూచనలతో ప్రజల హృదయాలను చూడడం అంతిమంగా పాలకులు, ప్రతిపక్షాలు కూడా ప్రజలకు సేవకులం అనే మాట కొంత వినబడేది. స్వాతంత్రం వచ్చిన రోజుల్లో తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రజల సంక్షేమం అభివృద్ధి పట్ల స్పష్టంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది అంతే స్థాయిలో వాళ్ళ పని విధానం కూడా ప్రజలకు సేవకులుగా కొనసాగాలి అనే ఆలోచన గా ఉండేది. కానీ దానికి భిన్నంగా ఇటీవల కాలంలో తెలంగాణ తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ ఆనాటి ముఖ్యమంత్రి ప్రజలు గెలవాలి ప్రజలకు సేవకులం అంటూ మాట్లాడి ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలను విస్మరించి పరిపాలన గాడి తప్పేలా కొనసాగించి తద్వారా ఆర్థిక అరాచకత్వానికి పాల్పడినట్లు అనేకమంది రాజకీయ సామాజిక విశ్లేషకులు చేస్తున్న విమర్శను మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇటీవల నవంబర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి " ప్రజలకు సేవకులం మేము శాసించే వాళ్ళం కాదు శాసనకర్తలం అసలే కాదు ఈ దేశంలోని ఏ రాష్ట్రముతో పోటీ కాదు ప్రపంచముతోనే పోటీ పడతాం" అని అనేక సందర్భాలలో నొక్కి చెప్పిన విషయాన్ని మనం గమనించాలి దృష్టిలో ఉంచుకోవాలి అంతేకాకుండా ప్రమాణ స్వీకారం రోజున అంతకు ముందు ధ్వంసం అయినటువంటి మానవ పౌర హక్కులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో ప్రజల ప్రాథమిక మానవ హక్కులు రక్షించబడతాయని ,నిర్బంధం అణచివేతకు తావు లేకుండా విభిన్న వర్గాల హక్కులను కాపాడుతామని నిరసన తెలిపే హక్కు ను గౌరవిస్తామని ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరిస్తామని చెప్పిన విషయం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
అయితే ప్రతిపక్షాలు పాలకపక్షాలు రెండు వర్గాలు కూడా ప్రజల కోసమే పని చేసినటువంటి సాంప్రదాయం గతంలో ఉంటే దానికి భిన్నంగా ప్రతిపక్షం పాలక పక్షాలు కూడా దాటవేసే ధోరణితో వ్యవహరించడం ఒకవైపు ఉంటే అంతకు మించిన స్థాయిలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టకుండా దారి మళ్లించేలా రాయితీల వైపు ప్రోత్సహించడం ,నిర్మాణాత్మక సూచనలు చేయకపోవడం, ప్రజల జీవన ప్రమాణాల మీద చర్చ చేయకపోవడం, ప్రజలకు ఇచ్చిన హామీల మీద గుడ్డిగా ఒత్తిడి చేయడంతోనే సరిపెట్టుకోవడం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనం గమనించవచ్చు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడా గత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలు అమలు కాకపోగా ఇటీవల జరిగినటువంటి జాతీయ సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజా ఎజెండా అంటూ లేకుండా కేవలం విశ్వాసాలు నమ్మకాలు, జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ బిజెపి ఇతర అనుబంధ కూటమి సభ్యులు ఎన్నికల లో ప్రచారం చేసుకొని గెలుపొందిన విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రతి చోట కూడా పాలకులు లేదా రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనమే తప్ప ప్రజల ప్రయోజనం అనేది విస్మరించబడుతున్న విషయాన్ని సూటిగా గ్రహిస్తే తప్ప ప్రజా పోరాటాలకు మరింత బలం చేకూరదు.
ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయాలి:-
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీలు రాయితీలను ఎట్లా అమలు చేస్తావు? ఎప్పుడు అమలు చేస్తావు. నిధులు ఎక్కడివి ? ఎందుకు అమలు చేయడం లేదు? రైతు రుణమాఫీ రైతు భరోసా ఇతర గ్యారెంటీలు అన్ని వెంటనే అమలు చేయాలని ఒత్తిడి చేయడం అంటే బిజెపి,టీఆర్ఎస్ తమ ప్రధానమైనటువంటి డిమాండ్ గా ఉండవలసిన విద్యా వైద్యాన్ని గాలికి వదిలి కేవలం రాయితీలతో మమ అనిపించుకోవడం బాధ్యతను విస్మరించడమే ,ఈ దేశ ప్రజల జీవన ప్రమాణాలను కాలరాయడమే అవుతుంది. " ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం, రాజ్యాంగబద్ధమైన హక్కులను ప్రజలకు సంక్రమింప చేయడం , ప్రతి వ్యక్తి నైపుణ్యానికి తగిన విధంగా పనులు కల్పించడం, వెట్టి చాకిరిని రద్దుచేసి సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించడం, భూస్వాములు పెట్టుబడిదారులకు ప్రభుత్వం వంతపాడి ప్రజాధనాన్ని కొల్లగొట్టడం మానుకున్నప్పుడు మాత్రమే ఈ దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి." కానీ పాలకులు ఆ వైపుగా ఎప్పుడు కన్నెత్తి చూడరు ప్రతిపక్షాలు కూడా పాలకులను ఆ వైపుగా ప్రశ్నించిన దాఖలాలు లేవు ఇక్కడ ఇరువర్గాలది పూర్తిగా బాధ్యతారాహిత్యమే. రైతులకు రుణమాఫీ రైతు భరోసా తర్వాత బోనస్ వంటి అంశాల మీదనే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది కానీ భూమిలేని నిరుపేదలు, చిరు వ్యాపారులు, అట్టడుగు వర్గాలు, పిడికెడు మెతుకులకు నోచని అభాగ్యుల గురించి మాత్రం ప్రతిపక్షాలు నోరు విప్పడం లేదు వాళ్ళందరూ ఆ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం అరకొర సంపాదనలో 60 నుంచి 70% విద్య వైద్య రంగాలకు ఖర్చు చేయడం వల్ల అనే సోయి రాజకీయ పార్టీలకు లేని కారణంగా, ప్రజల మౌలిక అవసరమైనటువంటి విద్యా వైద్యాన్ని గాలికి వదిలి రాయితీల వైపు మొగ్గు చూపడం అంటే ఎన్నికల్లో గెలవడానికి ఓట్లను దండుకోవడానికి రైతులను ఉపయోగించుకోవడమే అవుతుంది. "అనేక చోట్ల రైతులు కూడా రాయితీలు రుణమాఫీ బోనస్ ఏమీ అడగడం లేదు తమ పిల్లలు కూడా తమ కుటుంబాలు నష్టపోతున్న కారణంగానే అప్పుల పాలవుతున్నామని అనేక కౌలు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వీరందరికీ చేతినిండా పని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ప్రకటించినట్లయితే కచ్చితంగా విద్య వైద్యానికి చేసే చెల్లింపులు తగ్గి ఆర్థికంగా బలోపేతం అవుతామని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం రైతుల పక్షాన ఉన్నట్టు నటిస్తూ అందరికీ వర్తింపచేయాలని రేషన్ కార్డుతో సంబంధం లేదని ఎన్ని ఎకరాలు ఉన్నా రుణమాఫీ, రైతు భరోసా చెల్లించాలని రైతుల పక్షాన అతిగా మాట్లాడుతున్నారంటే కేవలం అది కుట్ర మాత్రమే తప్ప నిజమైనటువంటి ప్రేమ కాదు . నిజంగా ప్రతిపక్షాలకు పాలకపక్షాలకు ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల గురించి స్పష్టమైన అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ వర్గాలకు సంబంధించిన విధానాన్ని ఆ వర్గాల ప్రయోజనం కోసం ప్రకటించడం ద్వారా ఈ దేశ ప్రజలందరూ కష్టాలు కన్నీళ్లు లేకుండా హాయిగా బ్రతకడానికి మార్గo సుగము చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా కేవలం తాత్కాలిక ప్రయోజనాల మీద దృష్టి పెట్టడం వలన ఇప్పటికీ వలస జీవులు, దారి తెలియక పెదవర్గాలు, మానవాభివృద్ధికి దూరంగా ఉన్న వాళ్ళు కోటానుకోట్ల జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే రాజ్యాంగము ప్రసాదించినటువంటి ఉచిత విద్య వైద్యాన్ని చట్టబద్ధం చేయకపోవడం సిగ్గుచేటు కాదా ? తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ప్రభుత్వాలను విద్య వైద్యాన్ని ఉచితంగా అందించే విధంగా అది ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా డిమాండ్ చేయాలి. కొటారి సూచించిన విధంగా కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్రాలు 30% బడ్జెట్లో విద్యకు నిధులు కేటాయించాలని కామన్ స్కూల్ కై డిమాండ్ చేయాలి. ఇక ప్రభుత్వ వైద్యశాలలు నామమాత్రంగా కొనసాగుతుంటే ప్రైవేటు వైద్యశాలలు ఆకాశానికీ ఎదిగితే పేదలు దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు వైద్యశాలకు పోతూ ఉంటే స్పృహలేనటువంటి పాలకులు ప్రతిపక్షాలు ఆ విషయాలను విస్మరించి రైతుల వెంట పడడం అప్పులు చేయండి రుణమాఫీ చేస్తాము అనే నినాదాలు ఇవ్వడం బాధాకరం
ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షాలు అసెంబ్లీలో చర్చకు ఎక్కువ అవకాశాన్ని ఇవ్వడం ద్వారా యువజన విధానం, విద్యా విధానం, పారిశ్రామిక విధానం, వ్యవసాయ విధానం, అటవీ విధానం ,రవాణా విధానం, ఉపాధి అవకాశాల విధానం, ఉద్యోగ సౌకర్యాల రూపకల్పన వంటి అనేక విధానపరమైన అంశాల పైన చర్చించి దీర్ఘకాలికంగా అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మిగిలిపోవాలని కోరుకుందాం. ఆ చిత్తశుద్ధి ప్రభుత్వాని కంటే ఎక్కువగా ప్రతిపక్షాలకు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కానీ ప్రభుత్వాన్ని గందరగోళానికి గురిచేసి, ఎట్లా పరిపాలిస్తారో చూస్తామని, మీ ప్రభుత్వం అంతమవుతుందని మాటలతో సరిపెట్టి ప్రజల సంపదను పెట్టుబడిదారులు భూస్వాములకే కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు, పోరాటానికి సిద్ధపడతారు. దానికి తగిన మూల్యం పాలకులు లేదా ఇతర రాజకీయ పార్టీలు చెల్లించక తప్పదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల రుణమాఫీ చేసి పేద వర్గాల సంపదను కొల్లగొట్టిన విధానం పైన ప్రజలు అప్రమత్తమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటానికి సిద్ధం కావాల్సిందే "పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప" ఈ దేశంలో కొనసాగుతున్న వివక్షత , పెట్టుబడి దారి భూస్వామ్య విధానం సామాన్య ప్రజానీకం ఎదుగుదలకు అవరోధం. ఆ అవరోధాన్ని ప్రజలు ఉద్యమకారులు ఉక్కు పాదంతో అణచివేయాలి అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి సమానత్వం, అంతరాలు లేని వ్యవస్థ సాధ్యమవుతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )