సామాజిక స్పృహ లేని యువత, విద్యావంతులు, సంపన్న వర్గాలతోనే వ్యవస్థకు తీరని ద్రోహం.
స్వార్థంతో సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగులు, మరికొన్ని వర్గాలు.
సామాజిక బాధ్యతను గుర్తింప చేయని సిలబస్ కూడా వ్యవస్థకు హాని చేస్తున్నట్లే!
సమాజంలో చేతనత్వాన్ని కలిగించి, అచేతనంగా ఉన్న కొన్ని వర్గాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగించి, దోపిడీ పీడన వంచనకు గురవుతున్న మరికొన్ని వర్గాలను పోరాటానికి ఉద్యమాలకు సిద్ధం చేయవలసినటువంటి బాధ్యత నిజంగా ఈ సమాజంలో ఎదిగినటువంటి బుద్ధి జీవులు మేధావులు సామాజిక కార్యకర్తలు విద్యావంతులపై ఉన్నది . సామాజిక అంశాలైన అసమానతలు, అంతరాలు, కులము, మతము వంటి అంశాల కారణంగా వివక్షతకు గురి కావడంతో పాటు,రాజకీయ రంగాన్ని ప్రస్తావిస్తే పరిపాలనలో చట్టసభలలో రాజకీయ అధికారంలో వాటాకు దూరంగా వెలి వేయబడడం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకుంటాయి .కొన్ని ఆధిపత్య సంపన్న వర్గాలు ఈ రకంగా కొంతమంది వెనుకబడిన వర్గాల పైన దాస్తీకాలకు పాల్పడడం కారణoగా సామాజిక రాజకీయ అంతరాలు మరి పెరిగిపోతున్నాయి . వారసత్వం, వృత్తి ఉద్యోగ అవకాశాలు, చైతన్యం , మోసం చేయగలిగిన నేర్పు వంటి అనేక కారణాల వలన ఆర్థిక విషయాలలో అంతరాలు మరీ పెరగడానికి కారణం అవుతున్నాయి. ఒకవైపు రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ ,సౌబ్రాతృత్వం, చట్టపరమైన హక్కులను ప్రజలందరికీ కల్పించినప్పటికీ, అందులో కొన్ని సాచివేతకు గురైన వర్గాలకు ప్రత్యేక హక్కులను పొందుపరిచినప్పటికీ ఇప్పటికీ ఆ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఇప్పటికీ అనేకమంది విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు అక్షరాస్యులు కూడా ఈ దేశంలో పేదరికం ఉన్నది అంటే అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడం మరింత విచారకరం . తమ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని, తమ పిల్ల పాపలు కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఉద్యోగాలతో బలోపేతమై ఉన్న అంశాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని, తమ కుటుంబం ఎదిగినదని గర్వంగా చెప్పుకుంటున్నారు మరి నిజంగా సామాజిక ఎదుగుదల అంటే అదేనా ? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, అధికారులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వివిధ రంగాలకు చెందినటువంటి అధికారులు విద్యాభ్యాస కాలంలోనూ ఆ తర్వాత శిక్షణ వంటి అనేక సందర్భాలలో ఈ దేశ ప్రజల యొక్క కష్టార్జితాన్ని అనుభవించి ఆ తదనంతరం జీవితాంతం కూడా వారి శ్రమను వేతన రూపంలో తీసుకుంటున్న అనేక వర్గాలు సైతం పేదలను అభాగ్యులను శ్రమజీవులను ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధమున్న కార్మిక కర్షక వర్గాలను ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలా లేదు. మన చుట్టూ ఉన్న పేదవాళ్లను కనీసం మనుషులుగా చూడడానికి అక్షరాస్యులం బుద్ధి జీవులం అనుకునే మనం, విద్యావంతులం, ఉద్యోగం చేస్తున్న వాళ్ళంగా ఏనాడైనా సిద్ధపడినామా ? అనేక కారణాలతో పాటు ఈ వ్యవస్థ రెండు వర్గాలుగా చీలిపోవడానికి యువత, బుద్ధి జీవులు, విద్యావంతులు, సామాజిక స్పృహ లేని వాళ్ళు, స్వార్థపరులైనటువంటి ఉద్యోగులు, ఇతర సంపన్న వర్గాల వారు ప్రధాన కారణమని మనం అంగీకరించినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సామాజిక బాధ్యతతో సమ సమాజం వైపుగా కలలుగంటున్న మన ఆకాంక్షలను నిజం చేసుకునే క్రమంలో కనీసం మొదటి అడుగు అయినా వేయడానికి ఆస్కారం ఉంటుంది.
సామాజిక స్పృహ లేని యువత, విద్యావంతులు, సంపన్న వర్గాలు :-
పెట్టుబడిదారులు భూస్వాములు ఈ దేశ సంపద కేంద్రీకరించబడిన అనేక సంపన్న వర్గాల వారు సామాజిక స్పృహకు దూరంగా పీడన ఆధిపత్యానికి ప్రతినిధులుగా అక్రమార్జన భూ కబ్జాలు సంపదను పోగు చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్న సందర్భంలో రాజకీయ రంగం కూడా మరొక్క ప్రధానమైన అవకాశంగా పరిణమించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమాజం యొక్క సంపద ద్వారానే అన్ని వర్గాల వారు రూపుదిద్దుకొని ఎదిగి స్వార్థంతో తమ వ్యక్తిగత అవకాశాల కోసం మాత్రమే పాకులాడుతూ తమను పెంచి పెద్ద చేసిన సమాజాన్ని వదిలిపెట్టి సామాజిక బాధ్యతను విస్మరిస్తున్న కారణంగా ఈ వ్యవస్థకు తీరని ద్రోహం జరుగుతున్నది . అసమానతలు అంతరాలు మరి పెరిగిపోగా దోపిడీ పీడన వంచన కొన్ని వర్గాలకు వారసత్వంగా వచ్చిందో ఏమో అనే అనుమానం కలగక మానదు . మానవుడు సంఘజీవి అని గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ ఏనాడో హెచ్చరిస్తే మానవ సమాజ గమనానికి ఒక ఆధారంగా ఆదర్శంగా పనిచేయవలసిన ఈ నినాదాన్ని మానవ సమాజం ఖాతరు చేయకపోవడం వలన కొన్ని వర్గాలు తమ సుఖమే కోరుకోవడం వలన ఉన్నత వర్గాలు పేదవర్గాలు అనే అగాధం ఏర్పడి వర్గ సంఘర్షణకు నిత్య పోరాటానికి ఈ సమాజం బలికావలసి వస్తున్నది.
ఇక స్వార్థంతో ఉద్యోగులు ఆర్థికంగా ఎదిగిన మరికొన్ని వర్గాలు సమాజం పట్ల నిర్లక్ష్యంతో మొక్కుబడి బాధ్యతలను నిర్వహించి చేసే ఉద్యోగ క్రమంలో కూడా తోటి మనిషికి వీలైన మేరకు సహకరించాలనే స్పృహ లేకుండా పీడించడం, లంచాలకు ఎగబడడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో కొంతైనా చిత్తశుద్ధిని కరపరచకపోవడం మరిన్ని అంతరాలు పెరగడానికి, కొన్ని వర్గాలు చీకటిలోనే మగ్గడానికి, పేదరికం విచ్చలవిడిగా పెరగడానికి ప్రత్యక్షంగా కారణం. పరోక్షంగా ఈ అసమానతలు దోపిడియే చైతన్యముతో అక్రమార్కుల భరతం పట్టడానికి ప్రజా ఉద్యమాల రూపo లో పోరాట స్ఫూర్తి సమాజంలో పెరగడానికి దోహదపడుతున్నది. ఆకలితో మలమల మాడుతూ నిలువ నీడ లేక శరీరం పైన గుడ్డలు లేక చాలీచాలని జీవితాన్ని కొనసాగిస్తూ కొందరు జీవిస్తే అన్నపు రాశులు గుట్టల్లా పేరుకుపోయిన సంపద మరొకవైపు పేదరికాన్ని వెక్కిరిస్తూ ఉంటే ఆలోచన వివేకంతో తోటి మనిషిని సాటి మనిషిగా ఎందుకు చూడలేకపోతున్నాము? ఇతరుల ఎదుగుదలను ఎందుకు కోరుకోలేకపోతున్నాము? అని మనం ఎవరికీ వారిమి ప్రశ్నించుకోవలసిన అవసరం చాలా ఉన్నది. .ఉన్నత పట్టాలు, ఉద్యోగాలు, భవనాలు, ఆస్తులు, బంగారుగుట్టలు మనిషికి ఏ కోశాన కూడా కొలమానాలు కావు. మానవతా విలువలు, నీతి నిజాయితీ, సమదృష్టి ,నిబద్ధత, అంకితభావం, సంస్కారం, సజీవ సంబంధాల పట్ల ఆకాంక్ష , సామాజిక ఎదుగుదల పట్ల బాధ్యత ,మరింత ఉన్నతమైన సమాజం కోసం పోరాటం ఎదురుచూపు అన్వేషణ ఆరాటం మాత్రమే మనిషిని మనిషిగా నిలబెడతాయి. ఈ విలువల కోసం బ్రతుకుదామా? పట్టువలువలు బంగార0 సంపద కోసం పోరాడదామా? ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనదే. "అద్దాల మేడలు రంగుల గోడలు మాత్రమే అభివృద్ధి కాదు నైతిక అభివృద్ధి ఏ దేశాభివృద్ధి" అని హెచ్చరించిన గాంధీ మాటల్లో ఏమైనా అర్థముంటే మానవత్వం నీలోపల ఉంటే ఆ వైపుగా ఆలోచించు! అంతరాలు అసమానతలు పీడనా దోపిడీ వివక్షత లేని మానవాభివృద్ధి కనీసం గానైనా ప్రజలకు సాధ్యం చేయగలిగిన స్థితి కోసం నీ వంతుగా బాధ్యత నిర్వహించు! ఆరాటపడు! పాకులాడు ! బీద సాధలను దోపిడికి గురవుతున్న వర్గాలను పట్టించుకో.! ఆ క్షణమైనా నీవు మనిషిగా గుర్తించబడతావు లేకుంటే మరమనిషి గా నే మిగిలిపోతావు.
మానవ విలువల కోసం ప్రత్యేక సిలబస్ :-
పట్టాల కోసం, తిరిగి బోధించడానికి మాత్రమే ఉపయోగపడుతున్న సిలబస్ లో మానవ విలువలను అంతర్భాగం చేయగలిగిన కృషి లేకపోవడం విచారకరం. చరిత్ర, సంస్కృతి ,సాంప్రదాయాలు, మానవతా విలువలు, మానవ సంబంధాలు, నైతిక విలువలు, శ్రమైక జీవన ఆరాధన, ప్రజాస్వాంక విలువల పట్ల గౌరవం, మానవ హక్కుల పట్ల అపారమైన ప్రేమ, మనిషిని మనిషిగా చూడగలిగే సంస్కారం వంటి అంశాలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశాలను ప్రాథమిక తరగతుల నుండి స్నాతకొత్త ర స్థాయి వరకు కూడా ఏదో ఒక రూపంలో అందించగలిగినప్పుడు మాత్రమే మనిషిలో మహోన్నతున్ని ,ఉద్యమకారులను చైతన్య శీలులను, ప్రేమ తత్వాన్ని సమాజం నిండా చూడడానికి ఆస్కారం ఉంటుంది . వృత్తిపరమైన కోర్సులలో ముఖ్యంగా ఇలాంటి సిలబస్ను ప్రవేశపెట్టడం ద్వారా యంత్రాలుగా మిగిలిపోతున్న వారిలో ఆలోచన రగిలించడానికి , ప్రశ్నించడానికి, ఉద్యమాల వైపు సామాజిక మార్పుకు చేసే పోరాటాలకు ప్రజలను సంసిద్ధం చేయడానికి అదే సందర్భంలో శాంతితో కూడిన సుఖవంతమైన జీవితం గడపగలిగె వ్యక్తులను తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. .ఆలోచన పరులు ఇ న్ని రకాల బాధ్యతలు మోయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో విద్యావంతులు మేధావులు ఉద్యోగులు సంపన్న వర్గాలు యువత వంటి వేరు వేరు వర్గాలకు చెందిన మనం ఏ మేరకు మన బాధ్యతలను నిర్వహిస్తున్నాము ? ఎ oత మేరకు విస్మరిస్తున్నాము? అని ప్రశ్నించుకొని మనకు మనమే పదునుపెట్టుకొని బాధ్యతారాహిత్యాన్ని ప్రక్షాళన చేసుకుని ముందుకెళ్లడం మన తక్షణ కర్తవ్యం.
---వడ్డేపల్లి మల్లేశం (సామాజిక వ్యాసం)
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)