సంక్షోభంలో న్యాయవ్యవస్థ
దేశవ్యాప్తంగా లక్షల్లో అపరిస్కృత వ్యాజ్యాలు. విచారణ ఖైదీల పేరుతో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న అభాగ్యులు. సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవ సంవత్సరంలోనైనా సంస్కరణ, ప్రక్షాళన జరగకపోతే ఎలా ?. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణం కాగా ప్రజా చైతన్యంతో ఈ దుర్నీతిని అధిగమించాల్సి ఉంది
----వడ్డేపల్లి మల్లేశం
2024 జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టు ఆడిటోరియంలో సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాలను ప్రారంభిస్తూ ప్రధాని సులభతరంగా న్యాయం పొందడం దేశ ప్రజల హక్కు అని దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పాలకులు, న్యాయవ్యవస్థ పై ఉన్నదని సూచన చేసినప్పటికీ న్యాయం ఏరకంగా అందని ద్రాక్షగా మిగిలిపోయిందో ఈ దేశంలో పెండింగ్లో ఉన్న కేసులను బట్టి అంచనా వేయవచ్చు. గత 25 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు స్వర్ణోత్సవాల సందర్భంగా నాటి ప్రధాని వాజ్పేయి న్యాయవ్యవస్థ నత్తనడక సాగడం తగదని తక్షణమే న్యాయం సామాన్యుల ముంగిట నిలవాలని ఆకాంక్షించినప్పటికీ నేటికీ అమలు కాకపోవడం పాలకుల నిర్లక్ష్యం, నిధుల లేమి కూడా ప్రధాన కారణంగా తెలుస్తున్నది . సుప్రీంకోర్టులో 80 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉండగా, 25 హైకోర్టులలో కలిపి 50 లక్షల దాకా విచారణకు నోచుకోవడం లేదని , ఇక జిల్లా తాలూకా కోర్టులో వాటి సంఖ్య సుమారు 4.3కోట్లకు చేరిందని గణాంకాలు తెలియ చేస్తుంటే సమస్య మూలాలను వెతికినప్పుడు కంచె చేనుమేసినట్లుగా ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు. .దశాబ్దాల తరబడి కాలయాపన వల్ల కక్షి దారుల్లో ముఖ్యంగా పేదలు నిస్సహాయులై మరింత పేదరికంలోకి నెట్టివేయబడగా విచారణ ఖైదీల పేరుతో సంవత్సరాల తరబడిగా నిర్దోషులైనా శిక్షించబడడం అనేది ఈ దేశ న్యాయ వ్యవస్థలో కొనసాగుతున్న ఒక అపశృతిగా భావించాల్సిన అవసరం ఉంది. ఇక దిగువ స్థాయి న్యాయస్థానాల్లో 30 ఏళ్లకు పైబడి విచారణకు నోచుకోక పెండింగులో లక్షకు మించి ఉండగా జిల్లా తాలూకా స్థాయి కోర్టులో మంజూరైన 25 వేల న్యాయమూర్తుల కోసం ఉండాల్సిన గదులు, వసతులు, ప్రాథమిక సౌకర్యాలు అత్యంత దయచేసి లో ఉన్నట్టు సుప్రీంకోర్టు అంతర్భాగమైన పరిశోధనా ప్రణాళిక కేంద్ర నివేదిక చేసిన హెచ్చరిక మన పాలనలోని డొల్లతనం మాటల్లోని తీపితనాన్ని తెలియకనే తెలియజేస్తున్నది. హైకోర్టులలో 350 దిగువ కోర్టులలో 5300 వరకు న్యాయమూర్తుల ఖాళీలు పేరుకుపోయినప్పుడు కేసుల పరిష్కారo దశాబ్దాలు పట్టకపోతే ఏమవుతుంది.?
అపరిస్కృత వ్యాఖ్యాలు - మౌలిక కారణాలు- కీలక వ్యక్తుల చురకలు :-
దేశవ్యాప్తంగా కేసులు భారీ ఎత్తున పేరుకు పోవడానికి గల మౌలిక కారణాలను అన్వేషించకుండా, బాధ్యులను గుర్తించకుండా, కావాలని చేస్తున్న నేరస్తులను తొక్కి పెడుతున్న వారిని గుర్తించకుండా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేము .దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ కేసులలో 50 శాతం దాకా ప్రభుత్వాలే కక్షిదారులన్న వాస్తవాన్ని గుర్తించాలి. మాజీ సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రస్తావించిన ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం ఉమ్మడిగా ఆలోచిస్తే కానీ పరిష్కారం లభించదు . న్యాయ వ్యవస్థను కుంగ దీస్తున్న మౌలిక అంశాలపై భారత ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ చంద్ర చూడ్ చేసిన సూచనలను ప్రభుత్వం తన విధానపరమైన నిర్ణయాలతో పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సిబిఐ నమోదు చేసిన కేసులు ఇప్పటివరకు మూడు వేల సార్లకు పైగా వాయిదా పడ్డాయని ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యం ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న సంస్కృతికి నిదర్శనం కాదా? న్యాయ వ్యవస్థలో ఈ వాయిదాల పర్వాన్ని నిర్లక్ష్యాన్ని వివక్షతను ఎండగట్టాలని చీఫ్ జస్టిస్ చేసిన సూచనను సంబంధిత రంగాలు అమలు చేసినప్పుడే నేరస్తులకు శిక్ష పడి నిర్దోషిలకు విముక్తు లభిస్తుంది. ఈ రెండింటికి విఘాతం కలుగుతున్న వాయిదాల పరువాన్ని వెంటనే నిరోధించాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు తెలియచేస్తున్నాయి .
ఆచరించదగు కొన్ని సూచనలు:-
సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలని ప్రాంతీయ ప్రజల భాషల్లోకి అనువదించాలని కొన్ని సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఖాళీల భర్తీ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం ప్రధానమని ప్రధాని చేసిన సూచన తక్షణమే అమలుకు నోచుకోవాలి . ప్రభుత్వం న్యాయవ్యవస్థ అంతర్గత రంగాలు పరస్పరం సమన్వయంతో వ్య వ హారించినప్పుడు న్యాయ వివాదాలను పరిష్కరించవచ్చునని కాలయాపన తగ్గించవచ్చునని ప్రధాని చేసిన సూచన అమలుకు నోచుకుంటే మంచిది. ఇక న్యాయవ్యవస్థలో సెలవుల తగ్గింపు ప్రతిపాదన స్థాయిలోనే దశాబ్దాలు గడిచిపోతుంటే వివాదాల పరిష్కారం ఎలా పుంజుకుంటుంది అని ప్రస్తుత సిజెఐ చేసిన హెచ్చరికను అమలులోకి తీసుకురావాలి . అత్యవసర విభాగాలైన ఆసుపత్రి విద్యుత్ నీటి సరఫరా మాదిరిగా సెలవులకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా సేవలందించడానికి న్యాయవ్యవస్థ ఎందుకు వెనకాడుతున్నదని 2014లోనే జస్ట్ ఆర్ఎం లోథా వేసిన ప్రశ్నకు తగిన ఆచరణతో సమాధానం వెతకాలి . సెలవుల పేరుతో కోర్టులకు తాళాలు వేయకుండా అత్యవసరమైతే తప్ప న్యాయమూర్తులు సెలవులు తీసుకోకుండా సామాజిక బాధ్యతగా కేసుల పెండింగు పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ కృషి చేస్తే ప్రస్తుతం ఉన్న వేగానికి అదనంగా 26% పెండింగును తరిమికొట్టవచ్చని ఆనాటి విశ్లేషకులు అభిప్రాయ పడిన తీరు వజ్రోత్సవాల వేలనైనా ఆచరణకు నోచుకోవాలి. గతంలో లా కమిషన్ కూడా వ్యవస్థలో సెలవుల తగ్గింపు, పనిగంటల పెంపుదల, నిబద్ధత కారణంగా పెండింగ్ కేసులను భారీగా తగ్గించవచ్చునని చేసిన సూచన అమలు చేయడానికి కేంద్రం న్యాయవి భాగం పూనుకోవాలి. ఇప్పటికీ న్యాయమూర్తుల తీర్పుల విషయంలో రాజకీయ జోక్యం అంతర్భాగంగా కొనసాగుతున్నదని స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా మరింత పారదర్శక తీర్పులను అందించడానికి అవకాశం ఉంటుందని అప్పుడే ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం పెరుగుతుందని రాజకీయ న్యాయ నిపుణులు భావిస్తున్న విషయం కూడా అమలుకు నోచుకోవాలి.
మేడిపండు లాంటి మాటలు ప్రభుత్వాలు ఎన్ని మాట్లాడినా నిబద్ధత కొరవడి నిధుల విడుదల లో
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఆ మాటలకు అర్తం ఏమున్నది? ప్రజా చైతన్యం, ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల ఉద్యమకారుల పోరాటాలు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే నిస్సహాయులై నిర్దోషులైన వారికి విముక్తి లభిస్తుంది నిజమైన న్యాయమంటే అదే .
( వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రక్షితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)